పరాధీనత పరిహార్యం

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

మానవజన్మ ఉన్నతం, ఉత్తమమైందని అంటారు. అయితే అందరూ దీనిని సార్థకం చేసుకుంటున్నారా? భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను అర్థవంతంగా వినియోగించుకుంటున్నా(రా)మా? అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే తేలిపోతుందంటారు పెద్దలు. శక్తియుక్తులను విస్మరించి వ్యవహరించే వారు కొందరైతే స్వశక్తిని విడిచి, మరచి పరాధీనులై జీవించేవారు మరికొందరు. మొదటిదాని కంటే రెండవ లక్షణం అత్యంత అవమానకరమంటారు విజ్ఞులు. తాను కష్టిస్తూ అవసరాన్ని బట్టి ఇతరులు సాయాన్ని పొందడం ఫ•ర్వాలేదు కానీ పరాన్నభుక్కు జీవితం దుర్భరమంటారు. ఎలాంటి వ్యాపకం, పనీపాటు లేకపోవడమే సుఖమనుకోవడం పొరపాటు. కష్టించే వాడిదే సంతోషం అని అలాంటి వారికి తెలియదు. కష్టపడకుండానే సుఖాలు దక్కాలనుకునే వారు స్వార్జితంలోని ఆనందాన్ని, సంతృప్తిని గుర్తించలేరు. మానవ ప్రయత్నం లేకుండా, ఒళ్లు వంచకుండా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడడం వ్యక్తిత్వ హననం లాంటిదే. పరులపై ఆధారపడకుండా జీవించడం, విజయాలు సాధించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించకపోతే వ్యక్తిగతంగానే కాకుండా వ్యవస్థాగతంగా కూడా నిరుపుయోగంగా మిగిలిపోతారని చెబుతారు.

‘ఉత్తమం స్వార్జితం విత్తమ్‌/‌మధ్యమం పితురార్జితమ్‌/అథమం భాత్రి విత్తంచ/ స్త్రీ విత్తమథమాధమమ్‌’… ‌స్వార్జిత ధనంతో జీవయాత్ర సాగించడం ఉత్తమం. పితురార్జితంతో గడపడం మధ్యమం. సోదరుల సంపాదనపై బతకడం అథమస్థితి. స్త్రీల సంపాదనపై జీవించడం అత్యంత దయనీయం అని సారాంశం. అయితే మారుతున్న కాలంలో సంసారం వెళ్లదీయడానికి స్త్రీపురుషులు కష్టపడడం అనివార్యం కనుక స్త్రీ సంపాదనపై ఆధారపడడాన్ని తప్పు పట్టనవసరంలేదు. అయితే సంపాదించే పురుషుడికే ఈ మినహాయింపు వర్తిస్తుంది.

‘శ్రమయేవ జయతే’ వాక్యం అన్ని రంగాలకు అన్వయిస్తుంది. అది విద్య కావచ్చు, ఆర్జన కావచ్చు. ఏ మాత్రం శ్రమించకుండా ఫలితాలను ఆశించడం క్షమార్హం కాని నేరమని అంటారు. ఉబుసుపోని కబుర్లతో, కోటలు దాటే మాటలు, అనవసర వివాదాలు, కాలక్షేపంతో ఒరిగేదేమి ఉండదు. స్వతంత్రంగా జీవించాలనుకునే వారు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూ కార్యసాధకులవు తారంటూ.. ‘ఒకచోట నేలపై, మరొకప్పుడు పూలపాన్పుపై పరుంటాడు. ఒకచోట కేవలం కూరలు తినిబతుకుతాడు. మరోచోట మంచి భోజనం తినగలుగుతాడు. ఒకసారి బొంత (గొంగళి), ఇంకొంక చోట మంచి వస్త్రం ధరించగలుగుతాడు’ అని భర్తృహరి వివరించారు. లక్ష్యసాధనే తప్ప తీసుకునే ఆహారం, ధరించే వస్త్ర భేదం పట్టదు. ఏమి చేసినా, ఏమి సాధించినా స్వయంకృషి పట్ల సంతృప్తే ప్రధానం. ‘తరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నప్పుడు కష్టించవలసిన అవసరం ఏమిటి?’ అన్న ప్రశ్న కూడా ఎదురవుతుంటుంది. ఐశ్వర్యం పోగుపడిన మాట వాస్తవం కావచ్చు. అది పూర్వుల నుంచి వారసత్వంగా సంక్రమించిందే తప్ప అతని కష్టార్జితం కాదని మరువకూడడు. ఒకతరం ఈ వైఖరి తరువాతి తరాలకు పాకితే? ‘కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే’ అనే నానుడి, ‘తాతల తండ్రుల ఆర్జన తింటూ/జల్సాగా నువు తిరగకురా/ కండలు కరగక కష్టం చేసి/తలవంచక జీవించుమురా’ అనే ప్రబోధగీతం ఉండనే ఉంది. ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను విధిగా ఆచరించడం మానవ ధర్మమని పెద్దలు చెబుతారు. అందులోనూ కష్టించవలసిన ధర్మం (ఆర్జన) ఇమిడి ఉంది. పైగా సమాజం నుంచి అనేకం పొందుతున్నప్పుడు సమాజానికి ఏమిస్తున్నాం? అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ‘ధనం మూలం ఇదం జగత్‌’ అన్నారు. మానవ మనుగడకు డబ్బు ముఖ్యమని తెలిసిందే. అంత•మాత్రాన డబ్బే ప్రధానం కాకూడదు. అలా అని ఎంతటి శ్రీమంతు డైనా తన ధర్మం మరువకూడదని, ధనం విషయంలో తనకు లోటు లేకపోయినప్పటికీ ఉన్నదానిని మదుపుపెట్టి అలా వచ్చిన దానితో దైవకార్యాలు, ధర్మకార్యాలు నిర్వహించేందుకు వీలుంటుందని పెద్దలు చెబుతారు.

‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్నారు పెద్దలు. ఇక్కడ ‘పురుష’ అంటే కేవలం మగవారేనని, ‘ఉద్యోగం’ అంటే ప్రభుత్వ కొలువే అని అర్థం కాదు. ‘పురుష’ శబ్దం స్త్రీపురుషులకూ వర్తిస్తుంది. ‘పురఃశేతే పురుషః’…శరీరమనే పురంలో శయనించే ఆత్మ అని భావం. ఆత్మకు లింగభేదం లేదు. పనిచేయడం, స్వతంత్రంగా బతికే యత్నం మనిషి కర్తవ్యమని సారాంశం. ప్రకృతి  రుతుధర్మాన్ని పాటిస్తూ తన పని తాను చేసుకుపోతున్నప్పుడు, దాని మీద ఆధారపడిన మనిషి దానిని ఎందుకు పాటించలేకపోతున్నాడన్నది తరతరాల ప్రశ్న.

ఆత్మన్యూనతే..

పరాధీనత్వానికి ఆత్మన్యూనతా భావం కూడా ఒక కారణమని చెబుతారు. ఎంతోమంది తమలోని శక్తిని గుర్తించక తమ వల్ల ఏమీ కాదని, ఇతరుల సహాయం లేకుండా ఏమీ చేయలేమని భావిస్తుంటారు. తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారే తప్ప తామూ సృజనాత్మకంగా ఆలోచించగలమని, ఏదైనా సాధించగలమని భావించకలేకపోతారు. ప్రయత్నం లేకుండా అలాంటి నిర్ణయానికి రావడం సరికా దంటారు విజ్ఞులు. ‘నా జీవితం ఇంతే. నేను దురదృష్టవంతుడిని. నా జాతకం ఇంతే..’ లాంటి నిరాశాభావనలు తిరోగమనానికి సంకేతాలు. నిత్యశంకితుడిగా నిలిచిపోవడమే నిజమైన పరాజయం. నిరాశ నిస్పృహలను ఆవలకు నెట్టి అనుకూల దృక్ఫథాన్ని అన్వేషించగలగాలి.

‘అయోగ్యః పురుషో నాస్తి’ అన్నట్లు లోకంలో అయోగ్యుడనే వారు ఉండనే ఉండరు. సమాజంలోని ప్రతి వ్యక్తి ప్రయోజకుడే. అన్ని విషయాలు అందరికి తెలియాలని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలోనో, కళలోనో, వృత్తిలోనో ప్రవేశం కలిగి ఉంటారు. అందుకే మొదట తమలోని శక్తియుక్తులను గుర్తించగలగాలి. అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. స్వశక్తిని నమ్ముకోవాలి. దానిపైనే ఆధారపడాలి. సామర్థ్యం గలవారికి కార్యభార• మేమిటి (కోహి భారః సమర్థానాం?)? తనలోని ప్రత్యేకతలను గుర్తించకుండా పరుల మీద ఆధారపడాలనుకోవడం అర్థరహితం. కొందరికి కష్టించాలనే ఉద్దేశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నించక విధినే విశ్వసిస్తుంటారు. జయాపజయాలు దైవధీనం అనుకునే ముందు మానవ ప్రయత్నం ముఖ్యం కదా? మన వంతు కృషి లేకుండా ఫలితాన్ని దైవానికి ఆపాదించడం ఎంత సబబు? శ్రమకు దాసుడైన వాడు విజయానికి యజమాని అవుతాడని అర్యోక్తి. మృగరాజుకైనా కడుపు నింపుకునేందుకు వేట అవసరం.

ఉద్యమేనా హి సిద్ధ్యన్తి, కార్యాణి న మనోరథైః ।

న హి సుప్తస్య సింహస్య, ప్రవిశన్తి ముఖే మృగాః।।

కోరికలు ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటి సాధనకు కృషి అవసరం. నిద్రించే సింహం నోటిలోకి జంతువులు తమంత తాముగా చేరవు కదా!? ‘ప్రయత్నం నీది. సహాయం నాది’ అని, ‘కర్తవ్యం నీవంతు.. కాపాడుట నావంతు’ అని భగవంతుడే చెప్పాడు. మానవ ప్రయత్నం లేకుండా దైవాన్ని, అదృష్టాన్ని నమ్మితే ప్రయోజనం ఏముంటుంది? ‘గుమ్మడికాయంత కృషికి ఆవగింజత అదృష్టం తోడు కావాలి’ అంటారు పెద్దలు. ఆ సామెతను తిప్పి చెబితే ‘పరాధీనత్వమే’ అవుతుంది. ‘పాలముంచినా నీట ముంచినా భారం నీదే దేవా’ అనే ధోరణి ఆ వ్యక్తి బలహీనతకు నిదర్శనంగా చెబుతారు. పాండవుల కృషికి కృష్ణభగవానుడు అండగా నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని, తోచిన హితవు చెబుతానని అర్జునుడికి ముందుగానే షరతు పెట్టాడు. అలా అని ఊరుకో లేదు. అడుగడుగునా ఆదుకుంటూ వచ్చాడు. అంటే పాండవుల పరిశ్రమకు కాపు కాచాడు.

ప్రచారంలో ఉన్న వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి అనుభవాన్ని స్మరించుకుంటే.. ఆయన ఒకసారి చక్కటి వస్త్రధారణతో అత్తవారింటికి బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న బండి దారిలో బురదలో కూరుకుపోయింది. దానిని బయటికి లాగేందుకు బండి తోలే వ్యక్తి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సాయం కోరదామంటే పరిసరాల్లో ఎవరూ లేరు. రాముడే దిక్కు అనుకొన్న త్యాగరాజు ‘బాల కనకమయచేల సుజనపరిపాల శ్రీరమాలోల…’ అని అర్ధించారు. అదే సమయంలో అటుగా వస్తున్న వ్యక్తిని చూచిన ఆయన ‘బండి గట్టెక్కేందుకు సాయం పట్టండి’ అని కోరారు. బండి దిగి ఆ పని మీరే చేసుకోవచ్చు కదా? అని అడిగిన బాటసారి ప్రశ్నకు ‘ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. బండి దిగితే దుస్తులు పంకిలమవుతాయి’ అని త్యాగారాజు బదులిచ్చారట. ‘నీ దుస్తుల మాట సరే! మరి నావీ విలువైన వస్త్రాలే. పైగా ఇవి పాడైతే మా ఇల్లాలు ఊరుకోదు. నీవే జాగ్రత్తగా బండి దిగి ప్రయత్నించు. నేనూ ఒక చెయ్యి వేస్తాను’ అని సమాధానమివ్వడంతో త్యాగయ్యకు తప్పలేదు. శక్తిని కూడదీసుకుని బండి చక్రాన్ని నెట్టగా, బండి ఎడ్ల పక్కన నిలిచిన ఆ బాటసారి వాటి మూపురాలు, గంగడోలు నిమిరడంతో అవి ఒక్క ఉదుటన కదలి బండి దారికి వచ్చింది. ‘ప్రయత్నం నీది. సహకారం మాత్రమే నాది’ అంటూ నాలుగు అడుగులు వేసి మాయ మయ్యాడట ఆ వ్యక్తి. బంగారు ధోవతి (కనకమయ చేల) ధరించి వచ్చిన ఆ పురుషుడు పరమపురుషుడు శ్రీరామచంద్రుడని అప్పుడు తెలిసిందట త్యాగయ్యకు. మనిషి ఒక్క అడుగు ముందుకు వేస్తే దైవం పది అడుగులు వేయిస్తాడనేందుకు ఇది ఉదాహరణ. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభిస్తే దైవానుగ్రహంతో సత్ఫలితాలు సిద్ధిస్తాయని భావం.

‘శ్రేయాన్‌ ‌స్వధర్మో విగుణః/పరధర్మాత్‌ ‌స్వనుష్ఠితాత్‌/‌స్వధర్మే నిధనం శ్రేయః/పరోధర్మో భయావహః’.. చక్కగా అమరిన పరధర్మం కంటే గుణం లేనిదైనా స్వధర్మమే మేలని, స్వధర్మం శ్రేయస్కరమని, పరధర్మం భయోత్పాదకమన్న భగవద్గీత బోధన బట్టి పరాధీనత్వం కూడదని భావించాలి. సొంత కష్టంలో ఉండే ఆనందం ఆయాచితంగా, అనైతికంగా, అనాయాసంగా పొందడంలో ఉండదు. పరాధీనరాహిత్యం, స్వయంకృషి వ్యక్తిత్వాన్ని పెంచి, గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపచేస్తాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram