‘నభూమి నజలంచైవ/నతేజో నచవాయువః/నచబ్రహ్మ, నచ విష్ణుః/నచరుద్రశ్చ తారకః/సర్వశూన్య నిరాలంభో/స్వయం భూ విశ్వకర్మణః’ (భూమి, నీరు, అగ్ని, వాయువు, త్రిమూర్తులు, సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండా సర్వ శూన్య సమయంలో విశ్వకర్మ తనను తాను సృష్టించుకున్నాడు) అని పరమేశ్వరుడి వాక్కు. ‘సర్వదేవతలు సర్వలోకాల సర్వజ్ఞులైన త్రిమూర్తులను ఆరాధిస్తుండగా ఆ మూర్తిత్రయంలో ఒకరైన మీరు ఎవరి గురించి ధ్యానిస్తున్నారు?’ అని ఏకాగ్రచిత్తుడైన పరమేశ్వరుడిని తనయుడు కుమారస్వామి ప్రశ్నించగా తండ్రి ఇచ్చిన వివరణ ఇది.

పురుషసూక్తంలో విరాట్‌ ‌పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. సద్యోజత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము అనే పంచముఖీంద్రుడైన విశ్వకర్మను రుగ్వేద, కృష్ణ, శుక్ల యజుర్వేదాలు సృష్టికర్తగా, అధర్వణ వేదం ఆహార ప్రదాతగా, శ్రీమత్‌ ‌మహాభారతం వేయికళల అధినేతగా పేర్కొన్నాయి. ఆయన అష్టావసువులలో ఒకరైన ప్రభావసు కుమారుడు. తల్లి యోగసిద్ధి. పురాణ కథల్లో అనేకచోట్ల విశ్వకర్మ విశిష్టత విదితమవుతుంది. సర్వదిక్కులను పరికించగల శక్తిమంతుడు కనుకనే రుగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించిందని చెబుతారు. అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు (నిర్మాణ) శాస్త్ర స్థాపకుడు (గాడ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్), ‌వాస్తు పురుషుడు. ‘విశ్వకర్మా సహంస్రాంశౌ’ అని ప్రమాణం. తొలినాళ్లలో విశ్వకర్మను ‘ఆదిబ్రహ్మ’ అని వ్యహరించేవారు.

విశ్వకర్మ దుష్టశిక్షణ కోసం దేవతలకు శక్తిమంతమైన ఆయుధాలతో పాటు, వారికీ, భూపాలురకు రాజప్రసాదాలు నిర్మించి ఇచ్చాడు. ఐతిహ్యం ప్రకారం సూర్యపత్ని అయిన తన పుత్రిక సంజ్ఞ భర్త తేజస్సుకు తట్టుకోలేకపోవడంతో సూర్యుని సానబట్టాడట. అలా రాలిన చూర్ణంతోనే చక్రాయుధం తయారుచేసి శ్రీహరికి కానుకగా సమర్పించుకున్నాడట. ఇంద్రుడికి విజయం అనే ధనస్సు, యోగాగ్నితో దహించుకుపోయిన ముని దధీచి ఎముకలతో వజ్రాయుధాన్ని రూపొందించాడు. శివునికి త్రిశూలాన్నీ, ఆదిశక్తికి గండ్రగొడ్డలిని, త్రిపురాసుర సంహారంలో శివుడికి రథాన్ని తయారు చేశాడు. పుష్పకవిమానాన్ని రూపొందిం చాడు. యమవరుణులకు సభామందిరాలను, దేవతల కోసం స్వర్గం, త్రేతాయుగంలో స్వర్ణలంకను, ద్వాపరంలో ద్వారక, హస్తినాపురం, ఇందప్రస్థం తీర్చిదిద్దాడు. అసురులకు స్వర్ణ, రజత, కాంస్యాలతో మూడు నగరాలను (త్రిపురాలు) నిర్మించి ఇచ్చాడు. శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపానికి శస్త్రచికిత్స నిపుణుడు విశ్వకర్మగానే చెబుతారు. తలలేని శ్రీ మహావిష్ణువుకు గుర్రం తలను అతికించగా ఆయన హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించాడని, హిందూ ఆలయాలపై ఎగిరే ధ్వజ రూపకర్త విశ్వకర్మేనని పురాణాలు చెబుతున్నాయి. ఆయన అంశతో జన్మించిన వారు, వారసులు కూడా వాస్తులో విశేష ప్రతిభ కనబరిచారు.

త్రేతాయుగంలో సుగ్రీవుని కొలువులోని నలుడు ఈయన కుమారుడే. రామరావణ యుద్ధ సమయంలో నలుడి పర్యవేక్షణ లోనే సేతువు నిర్మితమైందని రామాయణం చెబుతోంది. ఇతడు వాస్తుశిల్పే కాక వీరుడు కూడా. ఆ సంగ్రామంలో పాల్గొన్నాడు. పాండవుల రాజసూయయాగం సందర్భంగా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు మయుడు నిర్మించిన రాజప్రాసాదం పురాణప్రసిద్ధం. అద్భుత, విలాస కట్టడాలకు ‘మయసభ’ ఉపమానంగా నిలిచిపోయింది. పూరీక్షేత్రంలోని జగన్నాథ, సుభద్ర, బలభద్ర విగ్రహాల సృష్టికర్త విశ్వకర్మ వారసులేనని చెబుతారు. ఈ సామాజికవర్గంలో ఆవిర్భవించిన శ్రీమద్విరాట్‌ ‌పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కులవృత్తి (కమ్మరం) నిర్వహిస్తూనే ‘కాలజ్ఞానం’ బోధనతో జగద్విఖ్యాతులయ్యారు. అత్యంత గహనమైన ఆధ్యాత్మిక, యోగ విద్యా రహస్యాలను పామరులకు సయితం బోధపడేలా తత్వాలు చెప్పారు. ఆయన పరమశివుని అవతారాంశ అని భక్తుల విశ్వాసం.

సర్వలోక పాలన కోసం విశ్వకర్మ తన అంశతో పంచబ్రహ్మలు మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞాదిలను, వారి సతులుగా ఆది, పరా, ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులను సృష్టించారని ఐతిహ్యం. వారి అంశలుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, సూర్యులను, వారి సతులుగా వాణీ, లక్ష్మి, ఉమ, శచీ, సంజ్ఞా దేవతా మూర్తులును సృష్టించి లోకపాలన బాధ్యతలు అప్పగించారని కథనం. పంచబ్రహ్మల ద్వారానే శాస్త్రం, వృత్తులు నిర్దేశితమయ్యాయి. ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ:’ (మానవ గుణములు, వారు అవలంబించే వృత్తులను బట్టి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాలుగా విభజించినట్లు) అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తరహాలోనే విశ్వకర్మ సంతతి మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞాది అనే పంచ గోత్రీకులుగా కమ్మరి, వడ్రంగి, కంచరి, స్థపతి, స్వర్ణశిల్పులుగా ఆవిర్భవించి సేవలు అందిస్తున్నారు. మానవజీవన వికాసానికి విశ్వకర్మీయుల కులవృత్తులు ప్రధానంగా దోహదపడేవి, పడుతున్నాయి. వాస్తుశిల్పులు వంశపారంపర్యంగా కఠోరశిక్షణ, తపశ్శక్తితో సాంకేతిక పరిజ్ఞానం పొంది ఎన్నో ఆలయాలు, అద్భుత కట్టడాలను ఆవిష్కరించారు. నిర్మాణరంగంలో భరతఖండాన్ని ప్రపంచ దేశాలలో సగర్వంగా నిలిపిన శాస్త్రజ్ఞులుగా మన్ననలు అందుకుంటున్నారు. ఈ వృత్తులు ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దాలుగా విజ్ఞులు చెబుతారు. వీరిని ‘శిల్పి, శిల్పులు’ అనడంలో పరిమిత అర్థం గోచరిస్తుందని, ‘శిల్పకారుడు’ అంటే ఏదో లోహాన్ని చెక్కడమనే అర్థం కాదని, ఎలాంటిదైనా తయారు చేయగల నేర్పరులనే విస్తృతార్థం కలిగి ఉందని ఆయా వృత్తుల వారు చెబుతారు. ఆలయాల నిర్మాణం నుంచి విగ్రహాల తయారీ, ప్రతిష్ట వరకు వీరి పాత్ర కీలకం. ఆలయాలలో వీరి ప్రమేయం లేకుండా దైవకార్యాలు సాగవని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. గ్రామాలలోని దేవాలయాలలో కల్యాణోత్సవాలు సందర్భంగా మేళతాళాలతో స్వర్ణకారుల ఇళ్లకు వెళ్లి అమ్మవారి మెట్టెలు, మంగళసూత్రాలు సేకరించే పక్రియ నేటికీ కొనసాగుతోంది. వీరు వంశానుగత స్ఫూర్తితోనే ‘వాస్తు కన్సల్టెంట్‌’ ‌పేరుతో సేవలందిస్తున్నారు. వీరు కులవృత్తులతో పాటు జ్యోతిష్యం, పౌరోహిత్యం, విద్య, వైద్యం లాంటి వివిధ రంగాలలోనూ రాణిస్తున్నారు.

మానవజన్మకు పూర్వం.. అప్సరస ఘృతాచిని, విశ్వకర్మ పరస్పరం కారాణాంతరాల వల్ల శపించుకోవడంతో మరుజన్మలో ప్రయాగలో జన్మించారు. ఇద్దరూ ఒకసారి తటస్థ పడినప్పుడు పూర్వ జన్మవృత్తాంతం తెలుసుకొని ఒక్కటయ్యారు. అలా జన్మించినవారే విశ్వబ్రాహ్మణులని ఐతిహ్యం. విశ్వకర్మ వంశీయులు వాస్తుశాస్త్ర ప్రవర్తకులు. మనిషికి ప్రధాన అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూరడంలో వీరి భూమిక కీలకమైనది. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు రాకపూర్వం బండ్లు, నాగళ్లు, కొడవళ్లు లాంటి పనిముట్ల తయారీలో ఊపిరి సలపకుండా ఉండేవారు. అందులోనూ మనదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కావడంతో వారి అవసరం ఎంతో ఉండేది. ఏరువాక సమయంలో వారితోనే నాగళ్లకు పూజలు చేయించి సత్కరించడాన్ని బట్టి వారికి గల గౌరవం తెలుస్తుంది. నేటికీ నిర్మాణ రంగంలోనూ వారి ప్రాధాన్యం కొనసాగుతూ ఉన్నప్పటికి ‘కాలజ్ఞాని’ వీరబ్రహ్మేంద స్వామి ప్రవచించినట్లు కులవృత్తులు వెనుకబడుతున్నాయి. మారుతున్న కాలంతో పాటు వ్యాపారయుగంలో సామాజికవర్గానికి, వృత్తికి సంబంధం లేనట్లనిపిస్తోంది. కులవృత్తి గిట్టుబాటు కాని స్థితిలో చాలా వరకు కార్పొరేట్‌ ‌సంస్థల అధీనంలో ఒప్పంద/పొరుగుసేవల కార్మికులుగా మనుగడ సాగించవలసివస్తోంది.

విశ్వకర్మ జయంతి ఏ ఒక్క సామాజికవర్గానికో సంబంధించిన పండుగ కాదు. అన్ని వృత్తులవారికి పనిలో నైపుణ్యం ప్రధానమే కనుక కులవృత్తిదారులు అందరికీ పండుగే. తమ తమ వృత్తులకు సంబంధించిన పరికరాలు సరిగా పని చేయాలని అన్ని వర్గాలవారు కోరుకుంటూ వాటికి పూజాదికాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. వాటిలోనూ పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాల అంతస్తులలో ఈ పూజ నిర్వహించి గాలిపటాలు ఎగురువేస్తారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే ఆయుధ పూజకు, విశ్వకర్మ జయంతి పూజకు కొంత పోలిక కనిపిస్తుంది. తాము చేయబోయే యుద్ధాలలో విజయం సాధించాలని పూర్వకాలంలో రాజులు దసరా సందర్భంగా ఆయుధపూజ చేసేవారు. పనులు సజావుగా సాగాలని కోరుతూ ఈ కాలంలోనూ వివిధ వృత్తులవారు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram