పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగానే దేశంలో జరిగిన రగడ అంతా ఇంతా కాదు. కానీ ఆ అల్లరంతా కపట నాటకం. భారతీయత మీద దాడి. అప్పుడు అస్సాంలో జరిగిన ఘటనలు ప్రత్యేకమైనవి. ఆ గొడవలకూ, అయినా హిందుత్వ బలపడడానికి పెద్ద నేపథ్యం ఉంది. ఆ వాస్తవాలు చెప్పడం అవసరమని మేధావులు భావిస్తున్నారు. ‘సిటిజన్‌షిప్‌ డిబేట్‌ ఓవర్‌ ఎన్‌ఆర్‌సీ, సీఏఏ: అస్సాం అండ్‌ ది పాలిటిక్స్‌ ఆఫ్‌ హిస్టరీ’ (ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై పౌరసత్వ చర్చ: అస్సాం చరిత్ర గురించి రాజకీయాలు) గ్రంథం అలాంటిదే. ప్రొఫెసర్‌ నాని మహంత రాసిన ఈ పుస్తకాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ ఇటీవల గౌహతిలో ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరణోత్సవం, పుస్తక సారాంశం గురించి ఇక్కడ ఇస్తున్నాం.

లౌకికవాదం, ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వాన్ని తమ సంస్కృతిలో భాగం చేసుకున్న భారత ప్రజలకు ఇతర దేశాల నుంచి సమ్మిళిత తత్త్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్‌ భాగవత్‌ పునరుద్ఘాటించారు. గౌహతిలోని శ్రీమంత శంకర్‌దేవ్‌ కళాక్షేత్రంలో జరిగిన ‘సిటిజన్‌షిప్‌ డిబేట్‌ ఓవర్‌ ఎన్‌ఆర్‌సీ, సీఏఏ: అస్సాం అండ్‌ ది పాలిటిక్స్‌ ఆఫ్‌ హిస్టరీ’ (ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై పౌరసత్వ చర్చ: అస్సాం చరిత్ర గురించి రాజకీయాలు) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎంతో ఘనత కలిగిన జాతికి చెందిన పౌరులు వసుధైక కుటుంబకమ్‌ సూత్రాన్ని వేలాది సంవత్సరాలుగా అనుసరిస్తున్నారని గుర్తు చేశారు. ఆచరణలోనూ, వ్యక్తిత్వంలోనూ మన రాజ్యాంగకర్తలు ఉదారవాదులు, లౌకికవాదులని డాక్టర్‌ భాగవత్‌ తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై నెలకొన్న వివాదాలను ప్రస్తావిస్తూ, సామాన్య ప్రజలను విశ్వాసంలోకి తీసుకోని నేతల సమూహం భారత్‌ను రెండుగా చేసిందని ఆయన అన్నారు. వారు ఒక ఐక్యతా భారత్‌ను ఆకాంక్షించినప్పటికీ, అనేక మంది తమను తాము పాకిస్తాన్‌ జాతీయులుగా భావించడంతో, వారి కలలు కల్లలైపోయాయని డాక్టర్‌ భాగవత్‌ తెలిపారు. విభజన అనంతరం మైనారిటీల సమస్యలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కానీ పాకిస్తాన్‌ అలా చేయలేదు. దాంతో లక్షలాది హిందూ, సిక్కు, జైన కుటుంబాలు వారి పూర్వీకుల ప్రాంతాలను విడిచిపెట్టి భారత్‌లోకి ప్రవేశించారని ఆయన చెప్పారు. అలాంటి శరణార్థులకు సీఏఏ నియమ నిబంధనలు అండగా ఉంటాయని, వాటి కారణంగా భారతీయు ముస్లిములకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భరోసా ఇచ్చారు.


అస్సామీల జాతీయతా పునాది బలమైనది

“Citizenship Debate over NRC & CAA—Assam and the Politics of History” సీఏఏపై పౌరసత్వ చర్చ – అస్సాం రాజకీయాల చరిత్ర) పుస్తకంలో ప్రధానాంశాలు

19వ శతాబ్దం నుంచి అస్సామీలలో జాతీయతను అన్వేషించాలన్న ఒక తపన ఉన్నది. అయితే 19వ శతాబ్దం నుంచే వారి చరిత్ర, జాతీయతలను వెతికే పని సరికాదు. ఒక సంక్లిష్ట, బహుళత్వాన్ని సంతరించుకున్న సమూహంగా వారి వృద్ధి ప్రక్రియ వెయ్యి సంవత్సరాలకు పూర్వమే మొదలైంది. కాలక్రమంలో, భారతీయ నాగరికతా చట్రంలో అస్సాం భాగమైపోయింది. ప్రాగ్జ్యోతిష్‌పురం, కామరూపగా పేరొందిన పురాతన రాజ్యానికి అనుసంధానమైన చరిత్రకు ఒక కొనసాగింపు అస్సాం. అంతేకాక భారత ప్రధాన భూభాగంలో సింధు-గంగా మైదానాలు నుంచి తరలి వస్తున్న ప్రజలతో, హిమాలయ పర్వతపాదాలు, పట్‌కాయి దిగువ పర్వతాల గుండా దిగివస్తున్న టిబెటో-బర్మన్‌ సముదాయాలతో జన సంచారంతో కూడుకున్న ఒక అద్వితీయమైన మిశ్రమంగా అస్సాం విలసిల్లుతున్నది. శంకరదేవుని భక్తి ఉద్యమం, అస్సాం స్థానిక సంస్కృతుల మేలు కలయికగా అస్సామీల జాతీయత ఉందని ఈ పుస్తకం చెబుతోంది.

వేర్వేరు గిరిజన సమూహాలతో మిశ్రమమైన అస్సామీల జాతీయత తాలూకు పునాది అత్యంత పటిష్టమైనదని నిర్ద్వంద్వంగా చెప్పారు రచయిత, ప్రొఫెసర్‌ నాని మహంత. రాష్ట్రంలో ‘వలసదారు కేంద్రిత’ రాజకీయాలు అంతకంతకు పెరిగిపోతున్న తరుణంలో ఒక చెక్కుచెదరని ఆధారాన్ని అది పదిలపరుచుకున్నది. కాలక్రమంలో విస్తృతమైన వలసలతో కొత్త అంశాలు జత కూడుతూ వస్తున్నాయని చెప్పాల్సిన పనిలేదు. అలాంటి శరణార్థులు/వలసదారులు లేదా తూర్పు బెంగాల్‌కు చెందిన ముస్లింలు సైతం ఈ జాతీయతలో భాగమైపోయారు. వీరినే ఈబీవోఎమ్‌, పొమువా, భటియవోర్‌, అభిభాసి ముస్లింలని కూడా పిలుస్తారు. అయినప్పటికీ అలాంటి ఈబీవోఎమ్‌లు, వారి వంశీకుల చేరికతో అస్సామీల జాతీయత రూపకల్పన వైరుధ్యాలు, వివాదాల మధ్య జరిగింది. అయితే అస్సామీల జాతీయత తాలూకు ఆధారాన్ని సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నం జరిగినప్పుడు తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. తూర్పు బెంగాల్‌ నుంచి భారీ ఎత్తున వలసలు సాగుతున్న దశలో అలాంటి ఒక ప్రక్రియ మొదలైంది. స్వతంత్య్రోద్యమ కాలంలో అస్సామీల మూలతత్త్వానికి సవాలు ఎదురైంది. వలసవాద పాలనా కాలంలో అస్సాంలో స్వరాజ్య పోరాటాన్ని మించిన సంగ్రామం చోటు చేసుకుంది. 13వ శతాబ్దంలో శంకరదేవ, మాధవ్‌దేవల నేతృత్వంలో ప్రారంభమైన భక్తి ఉద్యమం, సుకఫ ఏలుబడి నుంచి వికసిస్తూ వస్తున్న తనదైన ఆత్మ గౌరవ, సాంస్కృతిక భూమిక పరిరక్షణ కోసం అస్సామీల నాయకత్వం పోరాడిరది. తూర్పు బెంగాల్‌లో మైమెన్‌సింగ్‌ జిల్లా నుంచి భారీగా వలసలు, ముస్లిమ్‌లీగ్‌ రాజకీయాల ద్వారా అస్సామీల మూలతత్త్వంలో ఒక మౌలికమైన చొరబాటు జరిగింది.
అస్సాంలో అమల్లోకి వచ్చిన ఎన్‌ఆర్‌సీకి లోబడి చరిత్రాత్మకమైన, న్యాయపరమైన, రాజకీయపరమైన పూర్వోత్తర సంబంధాన్ని పరిశీలించడానికి ఎన్‌ఆర్‌సీపై పుస్తకంలోని ఈ అధ్యాయం ప్రయత్నిం చింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్‌ఆర్‌సీ రూపకల్పన, అమలు జరిగాయి. అస్సాంలో ముస్లిమ్‌ లీగ్‌ ప్రభుత్వాల చొరవతో 1930లలో మొదలైన జనసంఖ్యాసంబంధిత మార్పు తాలూకు ఒక చారిత్రక ప్రక్రియకు అది ముగింపు పలికింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశీస్సులతో హిందూత్వకరణకు ఒక ఉపకరణంగా ఎన్‌ఆర్‌సీపై ముద్ర వేస్తున్న ఒక భావనకు విరుద్ధంగా, ఎన్‌ఆర్‌ఎసీ అమల్లోకి రావడంలో ఒక చారిత్రాక పూర్వోత్తర సంబంధాన్ని వీక్షించడానికి ఈ అధ్యాయం ప్రయత్నించింది. ఎన్‌ఆర్‌సీ భావన, పరిణామ క్రమం, స్పష్టీకరణ, అమలు ప్రక్రియలో ప్రధానంగా పాలు పంచుకున్నవారిని పరికించింది. స్వతంత్రం, విభజనతో అస్సాంలో తలెత్తిన మతపరమైన అల్లర్ల ఫలితంగా అప్పటి తూర్పు పాకిస్తాన్‌ ప్రస్తుత బంగ్లాదేశ్‌ నుంచి శరణార్థులు, ఇతర వలసదారులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి ప్రవేశించారు. వలసదారుల సంఖ్య 1,50,000 నుంచి 2,00,000 మధ్య ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం మొదట నివేదించింది. కానీ అనంతరం ఆ సంఖ్య దాదాపు 5 లక్షలు అనే ఒక అంచనాకు వచ్చింది. భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు, దేశంలో వివాదానికి కీలకమైన 2019 నాటి పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చిన మార్పులను ఈ అధ్యాయం సంక్షిప్తంగా ప్రస్తావించింది.

కమల్‌ సిద్దిఖీ అభివృద్ధి చేసిన డాక్యుమెంటరీ పౌరసత్వం తాలూకు సారం సహాయంతో హిందూ శరణార్థుల గురించి చర్చించిన అధ్యాయం అక్రమ వలసదారులు వారి పౌరసత్వానికి చట్టబద్ధత కోసం వాడుకున్న వేర్వేరు అక్రమ మార్గాలను ప్రతిబింబించ డానికి ప్రయత్నించింది. హిందూ శరణార్థుల పట్ల భారత విధానపరమైన ప్రాధాన్యం సైతం అస్సాం మీద తనదైన ప్రభావాన్ని చూపింది. ఐఐఈఏ-1950 లాంటి పార్లమెంటరీ చట్టాలు హిందూ శరణార్థులకు పునరావాసాన్నీ, న్యాయపరమైన రక్షణనూ సమకూర్చాయి. అస్సాంలో బాధిత హిందువులకు పౌరసత్వం, ప్రశ్నార్థకమైన అక్రమ వలసలపై అసెంబ్లీలో జరిగిన చర్చల లోతులను సైతం ఈ అధ్యాయం స్పృశించింది. పౌరసత్వంపై అసెంబ్లీలో చర్చలు, అస్సాంకు సంబంధించి 1950 నాటి అక్రమ వలస బహిష్కరణ చట్టం మీద చర్చలు భారత్‌లో పౌరసత్వ అభిభాషణకు సైద్ధాంతిక ప్రాతిపదికను సమకూర్చాయి. శాసనపరమైన అంశాలతో కూడిన ఈ రెండిరటిని పరిగణనలోకి తీసుకోకుండా పౌరసత్వంపై జరిపే చర్చ అసంపూర్ణంగా మిగిలిపోతుంది. తూర్పు పాకిస్తాన్‌ నుంచి వచ్చిన నిరాశ్రయ హిందూ శరణార్థుల ప్రయోజనాలకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో అస్సాం ప్రతినిధులు మద్దతు ఇచ్చిన వైనం, ‘అవాంఛనీయమైన వలసదారులకు’ అవే ప్రయోజనాలను నిరాక రించడంలో వారి నిబద్థతకు సంబంధించిన విషయపరమైన అధ్యయనాన్ని ఆ అధ్యాయం సమగ్రంగా సమకూర్చింది.

అస్సాంలో శరణార్థుల అంశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును 5వ అధ్యాయం ప్రధానంగా చర్చిస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిపాదిత పర్మిట్‌ సిస్టమ్‌ తూర్పు బెంగాల్‌ నుంచి నిర్దేశిత పరిస్థితుల్లో నిర్దేశిత సమూహానికి చెందిన ప్రజలు అస్సాంకు రావడానికి అనుమతించాలని ఆకాంక్షించింది. తూర్పు పాకిస్తాన్‌ లోని వారి స్వస్థలాల్లో పౌర కల్లోలాలకు కారణమైన వారిగా అక్కడి అధికారులు ముద్రవేసి పంపించిన నిరాశ్రయుల పట్ల ఆ పర్మిట్‌ సిస్టమ్‌ ఉదారంగా వ్యవహరించింది. అస్సాంలో శరణార్థులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంలో చట్టాలు, ఇతర పాలనాపరమైన అంశాల చొరవపై కూడా ఈ అధ్యాయం ఒక సమగ్ర అధ్యయనం అందించింది. దస్తావేజుల్లోని సమాచారం సహాయంతో ‘ముస్లిం నిరాశ్రయులకు’ ఏ విధంగా పునరావాసం కల్పించిందీ ఈ అధ్యాయం వివరిస్తున్నది.

అస్సామీలు జాతీయత రూపకల్పన ప్రక్రియలో తూర్పు బెంగాల్‌కు చెందిన ముస్లింలకు (ఈబీవోఎమ్‌) చోటు దక్కడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వరాజ్యం సిద్ధించిన అనంతర కాలంలో ముస్లిం రాజకీయాలు ఎలా పెచ్చరిల్లాయి? వలసవాద రాజకీయాలకు అవి ఏ రకంగా భిన్నమైనవి? విస్తృతమైన అస్సామీల అస్తిత్వానికి అనుగుణంగా అస్సాంలో ముస్లిం రాజకీయాలు ఎలా రూపాంతరం చెందాయి? అలాంటి సమీకరణం లేదా సమైక్యతా ప్రక్రియ ఏదేనీ విభిన్నతకు కారణమైందా? అస్సాంలోని ముస్లింలు గ్లోబల్‌ ఇస్లామిక్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నారా? అస్సామీల అస్తిత్వంతో ముస్లిం అస్తిత్వం ఏ మేరకు విలీనమైంది? ఈబీవోఎమ్‌ రాజకీయాలు నేటి అస్సాంలో ఎలాంటి సవాళ్లను విసురుతున్నాయి? అస్సామీల జాతీయత, ఈబీవోఎమ్‌ రాజకీయాల మధ్య ఏదేనీ అంతరం ఉన్న పక్షంలో దానిని పూడ్చటం ఎలా? ఈ అధ్యాయం ప్రాథమికంగా అస్సాం ప్రజల అస్తిత్వ అంశాలకు ఈబీవోఎమ్‌ ఎలా స్పందిస్తుందనే దాన్ని ప్రస్తావిస్తున్నది. ఆ క్రమంలో ముస్లిం రాజకీయాల్లో యూఎమ్‌ఎఫ్‌, ఏఐయూడీఎఫ్‌ దశను అలాగే అస్సాం రాజకీయాల్లో జమియత్‌ పోషించిన పాత్రను ఈ అధ్యాయం లోతుగా ప్రస్తావిస్తున్నది. అస్సాం ఆందోళన ద్వారా ఈబీవోఎమ్‌ సంతరించుకున్న సమీకరణం, స్థల ప్రాప్తజ్ఞత, పోటీతత్త్వం పట్ల ఈ అధ్యాయం వెలిబుచ్చిన ప్రధాన ప్రస్తావనల్లో ఒకటిగా ఉంది. ఈబీవోఎమ్‌ ఊతంగా, అస్సామీ హిందువులు, ముస్లింల మధ్య అతి పెద్ద అగాధాన్ని అస్సాం ఆందోళన సృష్టించింది. ఈ అధ్యాయం ఈబీవోఎమ్‌తో పాటుగా స్థానిక ముస్లింల పాత్రను సైతం దర్యాప్తు చేసింది. స్థానిక ముస్లింలు తమ అస్తిత్వాన్ని ఈబీవోఎమ్‌తో ఏ మేరకు పోల్చుకున్నారు? ‘మియా కవిత్వం’, ‘మియాతనం’ ద్వారా ముస్లిం అస్తిత్వాన్ని నమ్మబలకుతున్న వైనం, తదితర అంశాలపై ప్రస్తుతం అస్సామీ సమాజాన్ని ఆవరించిన ఒక చర్చను ఈ అధ్యాయం ప్రస్తావిస్తున్నది. అస్సామీలపై జాత్యాహంకారులు, విదేశీయతా విముఖులు, విద్వేషకారులు, మతతత్త్వం కలిగినవారు, సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారు. హంతకులు అని ముద్ర వేయడానికి కొందరు నియో మియా మేధావులు చేస్తున్న ప్రయత్నంతో ఆ అధ్యాయం విభేదిస్తున్నది. అస్సామీలు మియా ప్రజలకు శత్రువులు కారని వాదిస్తున్నది. వారి (మియా ప్రజలు) శత్రువులు వారిలోనే ఉన్నారు. నయా మియా మేధావులు అస్సామీలను నిందించడానికి బదులుగా అస్సామీ జాతీయతకు ఒక అభద్రతా భావన వెనుక కారణాలపై ఆత్మ శోధన సాగించాలి. మియా ప్రజలను వెనుక నిలుపదల చేయడానికి దారి తీసిన అంశాలపైనా వారు ఆత్మ శోధన చేపట్టాలి. రాష్ట్రంలో చోర్‌-ఛపోరి ముస్లింల నడుమ వాస్తవిక శాస్త్రీయ లౌకికవాద విద్యా వ్యాప్తిని ముల్లాలు, మతబార్‌లు, ప్రైవేటు మదర్సాల తాలూకు సంప్రదాయ అధికార నిర్మాణం ఏ విధంగా అడ్డుకుంటున్నదీ ఈ అధ్యాయం వివరిస్తున్నది.

-అను: మహేష్‌ ధూళిపాళ్ల

By editor

Twitter
Instagram