-ఎం.వి.ఆర్‌. శాస్త్రి

స్వతంత్ర భారత ప్రభుత్వం ఎన్నడు ఏర్పడినాంది?

1947 ఆగస్టు 15.

స్వతంత్ర భారత ప్రభుత్వ తొలి ప్రధాని ఎవరు?

జవహర్లాల్‌ నెహ్రూ!

– అని మనం అనుకుంటున్నాం. మన పిల్లలకు చెపుతున్నాం. బళ్ళో కూడా వాళ్లకు అదే బోధిస్తున్నారు.

నిజానికి ఈ ఆన్సర్లు శుద్ధ తప్పు. స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం 1943 అక్టోబర్‌ 21న సింగపూర్‌లో ఆవిర్భవించింది. దాని అధినేత నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌.

ఏదో వట్టిగా ‘గవర్నమెంటు’ అని బోర్డు కట్టటం కాదు. అది అన్ని హంగులూ ఉన్న పూర్తిస్థాయి ప్రభుత్వమే. దానికి ఒక మంత్రిమండలి, సొంతంగా సాయుధ సైన్యం, సొంత బ్యాంకు ఉండేవి. ఎనిమిది ప్రపంచ దేశాలు ఆ ప్రభుత్వాన్ని గుర్తించి రాయబారులను ఇచ్చి పుచ్చుకున్నాయి. సుమారుగా రెండేళ్ల పాటు ఆ ప్రభుత్వం చక్కగా పనిచేసింది.

ఆ సంగతి రెండు తరాల కిందటి వరకూ మన దేశంలో అందరికీ తెలుసు. తమ ఆరాధ్య నాయకుడు నేతాజీ నడిపిన ఆజాద్‌ హింద్‌ గవర్నమెంటును తలచుకుంటేనే భారతీయులకు ఒళ్ళు పులకరించేది. పకడ్బందీ పథకం ప్రకారం జరిగిన స్లో పాయిజనింగు వల్ల జాతికి జాతే ఉజ్వల గతాన్ని మరచిపోయింది. అసలు చరిత్ర మరుగున పడిరది.

జపాన్‌ ప్రధాని టోజో 1943 జూలై 6న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖత తెలిపిన వెంటనే నేతాజీ అదే మహద్భాగ్యమనుకుని ఎగిరి గంతేయలేదు. హుటాహుటిన ప్రభుత్వాన్ని ప్రకటించనూ లేదు. కావలసిన సాయుధ అంగబలం, అర్థబలం లేకుండా కేవలం విదేశీ రాజ్యం మద్దతును నమ్ముకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది విదేశీయుల చేతిలో కీలుబొమ్మే అవుతుందని నేతాజీకి తెలుసు. జీవిత లక్ష్యమైన భారత స్వాతంత్య్రం సాధించేందుకు తన షరతుల మీద విదేశీ సహాయం తీసుకోవటమే తప్ప దానికోసం తన స్వాతంత్య్రాన్ని విదేశీయులకు కుదువ పెట్టే ఉద్దేశం నేతాజీకి ఎంత మాత్రమూ లేదు. అవతలి వాడు నాజీ హిట్లరే గానీ, ఫాసిస్టు ముస్సోలినీయే గానీ, జపానీ టోజోయే గానీ సుభాస్‌ చంద్రబోస్‌ ఎక్కడైనా, ఎన్నడైనా సర్వ స్వతంత్రంగా సింహం లాగే మెసిలాడు. నిద్రాహారాలు మాని నిర్విరామంగా తిరిగి అవసరమైన బలగాన్నీ నిధులనూ సమకూర్చుకున్నాకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆయత్తమయ్యాడు.

1943 జూలై 9న సింగపూర్‌లో కుండపోత వానలో 60 వేల మందితో జరిగిన గొప్ప ర్యాలీతో మొదలుపెట్టి నేతాజీ మలయా, థాయిలాండ్‌, ఇండో-చైనా, బర్మాలలో సుడిగాలిలా తిరిగాడు. వెళ్ళిన చోటల్లా స్వాతంత్య్ర సమరానికి ప్రవాస భారతీయు లను సమీకరించాడు. ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ శాఖలు లేనిచోట్ల ప్రారంభించాడు. అప్పటికే ఉన్నవాటిని పటిష్ఠపరిచాడు. సైన్యానికి రిక్రూట్మెంట్‌ సెంటర్లను ప్రారంభించి, విమోచన సేనలో చేరమని పౌరులను ఉద్బోధించాడు. చేరినవారికి శిక్షణ కేంద్రాలు పెట్టించాడు. సైన్యానికి సహాయంగా వాలంటీర్లను చేర్చుకున్నాడు. తాను నడపబోయే ప్రభుత్వంలో పనిచేయటానికి ప్రతిభావంతులను గుర్తించి ఎంపిక చేసుకున్నాడు. స్వాతంత్య్ర సేనకు జపాన్‌ వారితో సమన్వయం, సహకారం చాలా అవసరం కాబట్టి తాను వెళ్ళిన చోట్ల స్థానిక జపాన్‌ సైన్యాధికారులను కలిసి, పరిచయాలు చేసుకుని సుహృద్భావ సంబంధాలు పెంచుకున్నాడు. అదే సమయంలో సైన్యం పునర్వ్యవస్థీకరణ మీదా దృష్టి పెట్టాడు. పెట్టబోయే ప్రభుత్వానికి వ్యవస్థ ఎలా ఉండాలన్నదానిపైనా సమాలోచనలు చేశాడు. ఆ సమయాన సుభాస్‌ చంద్రబోస్‌కు లైజాన్‌ ఆఫీసరుగా వెంట ఉన్న కునిజుక అనంతరకాలంలో రాసిన Rainbow Across India Ocean గ్రంథంలో ఒక మారు బోస్‌తో పర్యటన అనుభవాన్ని ఇలా వర్ణించాడు:

‘‘బోస్‌ మామూలు రాజకీయ నాయకుడు కాదు. ఆయనకేదో దివ్యశక్తి ఉంది. 24 గంటల్లో ఒక్క క్షణం కూడా తనకోసం కేటాయించేవాడు కాదు. నిద్రించే రెండు మూడు గంటలు తప్ప ప్రతి నిమిషం భారత స్వాతంత్య్రం కోసమే ఆయన పాటుపడేవాడు. ఆయనకున్న దేశభక్తి, కర్తవ్యదీక్ష చూసి నేను ముగ్ధుడినయ్యేవాడిని.

ఒకసారి సింగపూర్‌ నుంచి పెనాంగ్‌కు విమాన ప్రయాణంలో నేను ఆయన వెంట ఉన్నాను. అంటే సింగపూర్లో ఎక్కి పెనాంగ్‌లో దిగామనుకునేరు! ఆ ట్రిప్‌లో మాటిమాటికీ ఆపుతూ విమానాన్ని టాక్సీ లాగా వాడారు. అసలే మండువేసవి. విమానంలో ప్రయాణమే కాలే పెనం మీద కూచున్నట్టు ఉంటుంది. నేలకు దిగి తిరగటమంటే నేరుగా పొయ్యిలో పడటమే! మా షెడ్యూలు ఎంత టైటు అంటే మాకు కూడా కాస్త రెస్టు అవసరమన్న ఆలోచనే దాన్ని తయారు చేసినవారికి లేదు. ప్రతిచోటా ఉదయం వెళ్ళటం వెళ్ళటమే అక్కడి జపనీస్‌ మిలిటరీ కమాండు అధికారులతో స్థానిక సమస్యల మీద చర్చలు. అక్కడినుంచి కారులో స్థానిక ఐఎన్‌ఎ క్యాంపుకు. మిలిటరీ సమీక్ష తరవాత ఆఫీసర్లతో సమావేశం. అది తెమలకుండానే పదేపదే ఫోన్‌ మోగేది- జపాన్‌ మిలిటరీ కమాండర్‌ లంచ్‌ టేబిల్‌ దగ్గర మీ కోసం వేచి ఉన్నాడంటూ! హుటాహుటిన అక్కడికి చేరాక టేబిల్‌ స్పీచి.
భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం 3 దాటేది. అక్కడినుంచి ఎకాఎకి పట్టణంలోని సెంట్రల్‌ ప్లాజాకు. అక్కడ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ (ఐఐఎల్‌) సభలో స్థానిక భారతీయులను ఉద్దేశించి ఉర్రూతలూగించే ప్రసంగం. చివరిలో – తనకు వేసిన పూలమాలలను బోస్‌ వేలానికి పెడితే ఒక్కో దండకూ పదివేలు, ఇరవై వేల డాలర్లు చెల్లించి అభిమానులు ఎగబడి కొనేవారు. అదికాక తమ దగ్గరున్న డబ్బు ఆయన చేతికి అందివ్వటానికి జనం బారులు తీరేవారు. అక్కడినుంచి బోస్‌ ఐఐఎల్‌ లోకల్‌ ఆఫీసుకు చేరి అక్కడి నాయకులతో మాట్లాడి స్థానిక గొడవలు సర్దుబాటు చేసేవాడు. అవన్నీ తేలేసరికి రాత్రి అయ్యేది. అంతలో మిలిటరీ అడ్మినిస్ట్రేటర్ల నుంచి డిన్నర్‌కు పిలుపు. మళ్ళీ టేబిల్‌ స్పీచ్‌. జపనీస్‌ సైన్యాధికారులతో యుద్ధ సమీకరణ వ్యూహాల గురించి మంతనాలు. అటునుంచి లోకల్‌ రేడియో స్టేషనుకు. దేశ దేశాల భారతీయుల ఒళ్ళు పులకరించేలా ఉత్తేజకర ప్రసంగం. అంతా అయి విడిదికి చేరేసరికి అర్ధరాత్రి దాటేది. మళ్ళీ అక్కడ పగలు కలవలేక పోయిన అభిమానులు, కార్యార్థులు నాయకుడి రాక కోసం గుంపులుగా నిలబడి ఎదురు చూస్తుండే వారు. అందరితో మాట్లాడి పక్కమీదికి చేరేసరికి 3 అయ్యేది. మళ్ళీ తెల్లవారగానే తరువాయి మజిలీకి ఉరుకులు పరుగులు.

ఇలా సుడిగాలి తిరుగుళ్ళతో కొద్దిరోజులకే నేను ఈడిగల పడ్డాను. నా జీర్ణశక్తి దెబ్బతిన్నది. కాని ఆశ్చర్యం! బోస్‌ మాత్రం ఎన్నడు, ఏ వేళ చూసినా హుషారుగా ఉండేవాడు. రోజులు గడిచేకొద్దీ ఆయనకు నీరసం లేకపోగా ఉత్సాహం ఇనుమడిరచేది.

మచ్చుకు ఒక సంగతి. సెంట్రల్‌ మలయాలో తంజోంగ్‌ రంపుతన్‌ అని ఒక ఊరు. అక్కడ ఐఎన్‌ఎలో చేరిన వాలంటీర్లకు శిక్షణ కేంద్రం ఉన్నది. అక్కడికి మేము చేరేసరికి రాత్రి 7-30 అయింది. అదే రాత్రి 8-30కి అక్కడికి 20 మైళ్ళ దూరంలోని ఐపోలో బోస్‌ గౌరవార్థం జపాన్‌ సైన్యాధికారి డిన్నర్‌ పార్టీ పెట్టాడు. గతుకుల బాటపై అక్కడికి చేరటానికే గంట పడుతుంది. టైం బొత్తిగా లేదు. మేము వెళ్లేసరికి ఆ క్యాంపులో ఇరవై మంది దిగువస్థాయి అధికారులు మాత్రమే ఉన్నారు. బోస్‌ వారు ఒక్కొక్కరితో కరచాలనం చేశాడు. ఒకసారి నా వైపు చూసి ‘‘కనిజుకా! వీళ్ళు వాలంటీర్లను దేశభక్త సైనికులుగా మలిచే పెద్ద పనిలో ఉన్నారు. వీళ్ళతో నేను తీరుబడిగా మాట్లాడాలి’’ అని వారితో సంభాషించసాగాడు.

నాకేమో అవతల జపనీస్‌ ఉన్నత సైన్యాధికారులు మా కోసం కాచుకు కూచున్నారని కంగారు. అక్కడికీ రెండుమూడుసార్లు సైగ చేశాను. బోస్‌ పట్టించుకో లేదు. 8-30 కూడా అయింది. డిన్నర్‌ పార్టీ సంగతి మళ్ళీ గుర్తుచేశాను. బోస్‌ అనిష్టంగా మాటలు ఆపి కదిలాడు. యమస్పీడుగా ఐపో చేరాం. అక్కడ కార్యక్రమం అంతా ముగించి మా విడిదికి చేరేసరికి అర్ధరాత్రి 1-30 అయింది. బట్టలు మార్చుకుని పక్కమీద వాలానోలేదో తలుపు తట్టిన చప్పుడు. లేచి చూస్తే ఆర్దర్లీ. బోస్‌ గారు వెంటనే రమ్మంటున్నారని కబురు. ఉసూరుమంటూ వెళ్ళాను. ‘‘ఆ క్యాంపులో వాళ్ళతో నేను అసలు గంటన్నర మాట్లాడాలనుకు న్నాను. మధ్యలోనే వచ్చాము కదా? మళ్ళీ అక్కడికి వెళ్లి మిగిలింది మాట్లాడదాం. ఏర్పాట్లు చేయి’’ అని నాయకుడి ఆజ్ఞ!

నాకు మతిపోయింది. ‘‘అయ్యా, అక్కడికి వెళ్లి రావటానికి రెండుగంటలు పడుతుంది. మనం ఉదయం 7-30 కల్లా పెనాంగ్‌ బయలుదేరాలి. అక్కడా ఊపిరి సలపని కార్యక్రమం. ఏదీ మార్చటానికి వీల్లేదు. సమయం సరిపోదు’’ అన్నాను. ‘‘దానికేమి? మామూలుగా 6 గంటలకు కాకుండా రెండుగంటలు ముందుగా మనం 4కే లేస్తే సరిపోతుందిలే’’ అని తేలిగ్గా చెప్పాడు బోస్‌. అప్పటికే 2 కావస్తున్నది! నేను నా గదికి తిరిగివెళ్ళి స్థానిక అధికారులను నిద్రలేపి మాట్లాడి కావలసిన ఏర్పాట్లు చేశాను. సరిగ్గా 4 గంటలకల్లా మేము క్యాంపుకు బయలుదేరాం!’’

[Quoted in Netaji : From Kabul to Battle of Imphal, H.N.Pandit, pp 185-188]

వెళ్ళిన చోటల్లా ప్రియతమ నేతాజీ పట్ల స్థానిక భారతీయులు మేరలేని ప్రేమ, అభిమానం, ఆరాధనాభావం చూపించేవారు. ఆయన పలికే ప్రతి పలుకునూ మంత్రముగ్ధుల్లా వినేవారు. మహిళలు తమ ఒంటి మీదున్న నగలను, బంగారు గాజులు, దిద్దులు, ఉంగరాలు ఒలిచి ఆయనచేతిలో ఆనందంగా పెట్టేవారు. తమ సర్వస్వం ఆయనకు సమర్పించి స్వాతంత్య్ర సమరంలో సైనికులుగా చేరాలని తహతహలాడేవారు.

కరో సబ్‌ నిఛావర్‌
బనో సబ్‌ ఫకీర్‌

(ఉన్నదంతా త్యాగం చెయ్యండి. దేశం కోసం బిచ్చగాళ్ళు కండి.)

ఇదీ తన దేశ వాసులకు నేతాజీ చేసిన ఉద్బోధ. ప్రపంచంలో అంతకుముందు బహుశా ఏ నాయకుడూ అలాంటి పిలుపు ఇచ్చి ఉండడు. మీ సర్వస్వాన్నీ నాకు దోచి ఇవ్వమని ఒక నేత జనాన్ని అడగటమే వింత అనుకుంటే అంతకంటే ఆశ్చర్యం దానికి ఆ జనాలు స్పందించిన తీరు. తమకున్నదంతా ఊడ్చి దేశ స్వాతంత్య్రంకోసం అర్పించటానికి దేశాంతరాల్లోని సామాన్యప్రజలు అంత ఉత్సాహంతో పోటీలు పడటం బహుశా ప్రపంచ చరిత్రలోనే అపూర్వం.

ఆగ్నేయాసియాలో సుభాస్‌ చంద్రబోస్‌ చేపట్టిన నిధి సేకరణ ఉద్యమానికి విరాళాలు వెల్లువెత్తాయి. కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు తమ సంపద మొత్తాన్ని నేతాజీకి సమర్పించి భారత జాతీయ సైన్యంలో వాలంటీర్లుగా చేరిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి అడుక్కు తినేవాళ్ళు కూడా జీవితకాలంలో తాము దాచుకున్నదంతా తమ ఆరాధ్యనాయకుడికి ఆనందంగా అర్పించారు. ఆ సమయాన బోస్‌ వెంట ఉన్న ఐఎన్‌ఎ సైన్యాధికారి మేజర్‌ జనరల్‌ ఎ.సి. చటర్జీ India’s Struggle for Freedom గ్రంథంలో రాసిన ఈ వాక్యాలు మామూలు మనుషుల్లో నేతాజీ దట్టించిన స్వాతంత్య్ర కాంక్ష, త్యాగనిరతి ఎంత అమోఘమో సూచిస్తాయి:

‘‘ఆ రోజుల్లో ప్రవాస భారతీయ సమాజంలో ఉప్పొంగిన ఉత్సాహం, దేశభక్తి ఉద్వేగం అద్భుతమని చెప్పాలి. నేతాజీ రాకతో వాతావరణం మొత్తం మారిపోయింది. సాధారణ పేదలు చేసిన త్యాగాలు మరీ విలక్షణం. ఎన్నో కుటుంబాలు తమకు ఉన్నదంతా సమర్పించి, తండ్రులు, తల్లులు, కొడుకులు, కూతుళ్ళు స్వాతంత్య్ర ఉద్యమంలో చేరిపోయారు. యు.పి., బిహార్‌లకు చెందిన యాదవులైతే ఒక్కొక్కటీ వేల డాలర్లు విలువచేసే పాడి పశువులన్నిటినీ సంగ్రామానికి సమర్పించుకుని ఐఎన్‌ఎ శ్రేణుల్లో చేరారు. జలాన్‌ బజార్‌ స్టేడియం సభలో నేతాజీకి వేసిన పూలమాలను వేలం వేస్తే 5 లక్షల డాలర్లు పెట్టి ఒక దేశ భక్తుడు కొనుక్కున్నాడు.

ఈ సందర్భంలోదే ఒక ముచ్చట. నేతాజీ చేతికి విరాళాలను స్వయంగా అందివ్వటానికి వరసల్లో బారులు తీరిన వారిలో ఒక సామాన్యుడిని నేను పలకరించాను. అతడి దగ్గర మొత్తం 200 డాలర్లు ఉన్నాయట. అందులో వంద డాలర్లు కిందటి సభలో ఇచ్చేశాడట. మిగిలింది కూడా ఇవాళ ఇచ్చెయ్యాలని పించిందట. ఇది కాక నీ దగ్గర ఎంత ఉంది అని అడిగితే ఇంతకు మించి ఏమీలేదు.. అన్నాడు. అలాంటప్పుడు అత్యవసరాలకు 20 డాలర్లయినా చేతిలో ఉంచుకోరాదా అన్నాను. అతడు ఆలోచించి సరే అన్నాడు. 80 డాలర్లు నేతాజీకి సమర్పించాడు. కాసేపటికి చూస్తే అతడు మళ్ళీ చేంతాడంత లైనులో చివర నిలబడ్డాడు. ఏమిటయ్యా అంటే ‘‘ఏమో సాబ్‌ నాకు మనసొప్పటం లేదు. ఆయన మన కోసం అంత కష్ట పడుతూంటే నా దగ్గరున్నదానిలో కొంత దాచేసుకోవటం తప్పనిపిస్తున్నది. నా తిప్పలు నేను పడతాను. మళ్లీ వెళ్లి ఈ ఇరవై డాలర్లు కూడా ఆయన చేతిలో పెడితే గాని నాకు స్థిమితం ఉండదు. నేతాజీ కోసం ఉన్నదంతా ఇచ్చానన్న తృప్తి నాకు కావాలి.’’ అన్నాడు. అన్నట్టే చేశాడు. వేదిక దిగి వచ్చాక అతడి మొహం ఎంత వెలిగిపోయిందో చెప్పలేను. ఇలాంటి ఉదంతాలు ఆరోజుల్లో ఆగ్నేయాసియాలో చాలా విన్నాను.’’

[India’s Struggle for Freedom, Maj. Gen. A.C.CHATTERJEE, pp. 108-109 ]

ఇలాంటిదే ఇంకో ముచ్చట- షా నవాజ్‌ ఖాన్‌ కళ్ళారా చూసి రికార్డు చేసింది:

‘‘సింగపూర్లో పెద్ద సభలో మాట్లాడాక విరాళాల కోసం నేతాజీ విజ్ఞప్తి చేశాడు. వేలమంది బారులు తీరారు. తమ వంతు వచ్చినప్పుడు ఎవరికి చేతనైనంత పెద్దమొత్తాలు నాయకుడి చేతికి అందిస్తున్నారు. క్యూ లైనులో ఒక పేదరాలు నాకు కనిపించింది. కూలీ పని చేసుకుని బతికేదిలా ఉంది. ఒంటిమీద బట్టలు చాలా చోట్ల చిరిగి ఉన్నాయి. ఆమె వేదిక మీదికి వెళితే అంత దరిద్రంలో ఉన్నది ఏమి ఇవ్వగలదా అని అందరూ ఆశ్చర్యంతో చూశారు. ఆమె బిడియపడుతూ 3 రూపాయిలు నేతాజీ చేతిలో పెట్టి ‘‘నేను ఇవ్వగలిగింది ఇంతే. తీసుకోండి’’ అంది. నేతాజీ ఒక్క క్షణం తటపటాయించి, చేయి చాపి ఆ డబ్బు తీసుకున్నాడు. ఆయన కళ్ళవెంట నీళ్ళు జలజల రాలాయి. తరవాత నేను ఆ విషయం నేతాజీ దగ్గర కదిపాను. అంత దరిద్రంలో ఉన్న మనిషి దగ్గర కూడా మీరు డబ్బు ఎలా తీసుకున్నారు? అంటే ఆయన చెప్పింది:

‘నిజమే. ఆమె దగ్గర ఉన్న సంపద అంతా ఆ మూడు రూపాయలే. అది కూడా నేను తీసుకుంటే పాపం ఆమె చాలా అవస్థ పడుతుంది. కానీ తాను కడుపు మాడ్చుకున్నా సరే తన దేశ స్వాతంత్య్రం కోసం ఉన్నదంతా ఇచ్చేయ్యాలనుకుంది. ఆమె మీద జాలితో నేను వద్దు అంటే ఆమె బాధ పడుతుంది. డబ్బుగల వాళ్ళు ఇచ్చే పెద్దమొత్తాలు మాత్రమే నేను తీసుకుంటానేమో అని నొచ్చుకుంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా పుచ్చుకున్నా. కోటీశ్వరులు ఇచ్చే లక్షలకన్నా ఆ పేదరాలు ఇచ్చిన మూడు రూపాయలకే నా దృష్టిలో ఎక్కువ విలువ’’

[ INA AND ITS NETAJEE, Maj.Gen. Shah Nawaj Khan, p.x]

1942లో మొట్టమొదట ఐఎన్‌ఎను ప్రారంభించినప్పుడు దానిలో చేరిన సైనికుల సంఖ్య 16 వేలు. కెప్టెన్‌ మోహన్‌ సింగ్‌ నిష్క్రమించిన సమయానికి అది సగానికి పడిపోయింది. శ్రుతి, గతి సరిగాలేని ఆ తిరుగుబాటు సైన్యంలో ఉండటం కంటే యుద్ధ ఖైదీలుగా కొనసాగటం మేలని 8 వేల మంది సైనికులు తలచారు. అలా దఫాలవారీగా వెళ్ళిపోయిన వారికి నేతాజీ రంగంలోకి వచ్చాక మనసు మారింది. ఆయన స్ఫూర్తి దాయక నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరటానికి యుద్ధ ఖైదీలుగా జపాన్‌ చేతికి చిక్కిన భారత సైనికులు, సివిలియన్లు అత్యాసక్తి చూపారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేర్చుకోవటానికి రిక్రూట్‌మెంటు మొదలెట్టగానే ప్రవాస భారతీయులు నియామక కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మూగారు. తెగ రద్దీ వల్ల కొన్నిచోట్ల కొట్లాటలు కూడా అయ్యాయి. మలయాలో పుట్టి జన్మలో భారతదేశం చూడని వారు కూడా భారత స్వాతంత్య్ర సైనికులు కావాలని తహతహలాడారు.

నేతాజీ ముందు అనుకున్నది మూడు లక్షల మందిని జాతీయ సైన్యంలోకి తీసుకోవాలని. కాని జపాన్‌ ప్రభుత్వం 30 వేలమందికి మాత్రమే ఆయుధాలు, యాభైవేల మందికే రేషన్లు సమకూర్చ గలమని చెప్పింది. దాంతో పూర్వం భారత సైన్యంలో పనిచేసిన వారిలో నుంచి, సివిలియన్‌ అభ్యర్థులనుంచి జాతీయ సేన లోకి ముప్ఫై వేలమందిని, సివిలియన్‌ వాలంటీర్లను ఇరవై వేలమందిని మాత్రమే తీసుకున్నారు. వారిలో అత్యధికులు దక్షిణ భారతానికి చెందినవారు. కొత్తగా చేరిన వారికి సింగపూర్‌, కౌలాలంపూర్‌ వంటి అనేక కేంద్రాల్లో సైనిక శిక్షణ ముమ్మరంగా సాగింది. నేతాజీ శిక్షణ శిబిరాలకు తరచుగా వెళ్లి, బారక్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి, వారికి పెట్టే తిండిని తానూ రుచి చూసి, శిక్షితుల యోగక్షేమాలు కనుక్కునేవాడు. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడిపి వారికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూండేవాడు. ఆయుధ ప్రయోగంలో, సైనిక చర్యల్లో కఠోర శిక్షణను ఇప్పించటంతో బాటు, దేశంకోసం ప్రాణాన్ని అర్పించే తెగువనూ, స్వాతంత్య్రం కోసం ఏ త్యాగానికీ ఎంతటి కష్టానికీ వెనుకాడని సాహస ప్రవృత్తినీ వారికి అలవరిచి, దేశభక్తిని నూరిపోసి తనకు కావలసిన సైన్యాన్ని దగ్గరుండి కడు నేర్పుతో తయారుచేసుకున్నాడు.

సుభాస్‌ చంద్రబోస్‌ భయంకరమైన ఆశావాది. భూమి బద్దలు కానీ ఆకాశం తలకిందులు కానీ అతడు ఓటమిని అంగీకరించడు. అనివార్యమైన పరాజయాన్ని అద్భుత విజయంగా మలచుకుంటూ ఆశయసిద్ధి కోసం అప్రతిహతంగా ముందుకు సాగక మానడు. జపాన్‌ మూర్ఖ పాలకులకు మతి అనేది ఉండి, బోస్‌ హితవును ఆలకించి 1942లోనే ఆయనను తూర్పుకు రానిచ్చి సైనికంగా సహకరించి ఉంటే అప్పుడున్న అనుకూల అంతర్జాతీయ పరిస్థితులను తెలివిగా ఉపయోగించుకుని బ్రిటిష్‌ ఇండియాపైకి దండెత్తి మాతృదేశానికి అవలీలగా స్వాతంత్య్రం సాధించగలిగేవాడు. జపాన్‌కూ సర్వనాశనాన్ని తప్పించగలిగేవాడు. అల్పబుద్ధితో అవివేక పోకడలతో టోక్యో ప్రభువులు విలువైన ఏడాది కాలాన్ని వృథా చేయటంతో ప్రపంచ యుద్ధంలో బలాబలాలు మౌలికంగా మారాయి. మిత్రరాజ్యాలు తెప్పరిల్లి పుంజుకున్నాయి. అక్షకూటమికి ఓటమి దగ్గరపడిరది. పసిఫిక్‌ నౌకా యుద్ధంలో జపాన్‌ వరస పరాభవాలతో ఆగ్నేయాసియాలోని రాజ్యాల వైఖరీ మారింది. ఎటూ తప్పదని తేలిన బ్రిటన్‌ అమెరికాల దిగ్విజయం వల్ల తాము చిక్కున పడకుండా ఉండాలంటే జపాన్‌కు మెల్లిగా దూరం జరగటం మేలన్న ధోరణి ఇండో చైనా, ఇండోనీసియా, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, బర్మా వాసుల్లో మొదలైంది. అంతదాకా ఎదురులేని జపాన్‌ ధాటికి దడిచి టోక్యోకు అణగి మణగి ఉన్న చిన్న దేశాలు మెల్లిగా తల ఎగరవేయ సాగాయి. జపాన్‌ పనుపున కొత్తగా రంగంలోకి వచ్చిన సుభాస్‌ బోస్‌ పట్లా అవి అంటీ ముట్టనట్టు వ్యవహరించడం మొదలైంది.

ఆ సంగతి సింగపూర్‌ చేరిన మూడు వారాలకే బోస్‌కు అర్థమయింది. బర్మా స్వాతంత్య్ర ఉత్సవాల్లో పాల్గొనటానికి ఆయన జూలై 20న బాంగ్‌కాక్‌ మీదుగా రంగూన్‌ వెళ్ళటానికి ప్రత్యేక ఆహ్వానం మీద బయలుదేరాడు. బోస్‌ను ఎక్కడ కలవవలసి వస్తుందోనని థాయిలాండ్‌ ప్రధానమంత్రి సరిగ్గా ఆయన బాంగ్‌కాక్‌ వెళ్ళే సమయానికి ఊళ్ళో ఉండకుండా మొగం చాటేశాడు. అది కావాలని చేసిన పని అని అక్కడి అధికారుల వరస చూశాక బోస్‌కు సులభంగానే అర్థమయింది. ఆయన వారిని మించిన ఘటికుడు. ఇండో బర్మా సరిహద్దుకు సేనలను బాంగ్‌కాక్‌ మీదుగా తరలించటానికీ, అవసరమైన సామగ్రిని మధ్యలో కొనుగోలు చేయటానికీ థాయి ప్రభుత్వ సహకారం తనకు చాలా అవసరం. బాంగ్‌కాక్‌లో ఆగిన కొద్ది కాలంలో ఏమి చేశాడో ఎలా సాధించాడో తెలియదు. బోస్‌ పట్ల అక్కడి ప్రభుత్వం మెత్తపడిరది. తిరుగు ప్రయాణంలో మళ్ళీ వచ్చేసరికి థాయిలాండ్‌ ప్రధాని ఆయన కోసం కాచుకుని ఉన్నాడు. కోరిన సహాయమల్లా ఇష్టంగా చేశాడు.

1943 జూలై 29న రంగూన్‌ (ఇప్పుడు దాన్ని యాంగోన్‌ అంటున్నారు) చేరినప్పుడూ ఇంచుమించు అదే పరిస్థితి. అసలు బర్మా (ఇప్పటి మయాన్మార్‌)కు స్వాతంత్య్రమే ఒక ఫార్సు. ఆ దేశం మీద పట్టు వదులుకోవటం జపాన్‌కు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. యుద్ధంలో చుక్కెదురు కాకుండా ఉంటే అసలు బర్మాకు స్వాతంత్య్రం ఆలోచనే తలపెట్టేది కాదు. బ్రిటిషు వాళ్ళను వెళ్ళగొట్టటానికి మాతో చేతులు కలపండి. వాళ్ళు పోగానే మీకు స్వాతంత్య్రం ఇస్తామని యుద్ధానికి ముందు ఆంగ్‌ సాన్‌ నాయకత్వంలోని బర్మా ఇండిపెండెన్స్‌ ఆర్మీతో టోక్యో ఒప్పందం కుదుర్చుకున్నది. అక్కర తీరగానే ఆంగ్‌ సాన్‌తో ఒప్పందాన్ని తుంగలో తొక్కి బర్మాను తేరగా ఆక్రమించింది. ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్‌ పక్షం బలం పుంజుకుని అమెరికా అండతో బర్మాను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి తరుముకొస్తూండటంతో ఆ బెడదను ఎదుర్కోవటానికి జపాన్‌కు మళ్ళీ బర్మా వాళ్ళ మద్దతు కావలసి వచ్చింది. అందుకని ఇదుగో మీకు స్వతంత్రం ఇస్తున్నామని పైకి ప్రకటించింది. ఆగస్టు 1న ఆర్భాటంగా అధికారపు బదిలీ అయితే చేసినట్టు నటించింది. అంతా ఉత్తిదే; అసలు అధికారాలన్నీ ఇకముందూ మా చేతుల్లోనే ఉంటాయని తన సైన్యాధికారుల చేత కొత్త ప్రధాని డాక్టర్‌ బామా లోపాయకారీగా చెప్పించింది.

ఈ గొడవలన్నీ సుభాస్‌ బోస్‌కు తెలుసు. అయినా భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా అవేవీ గమనించనట్టే ఉన్నాడు. స్వాతంత్య్ర వేడుకల్లో చేసిన ప్రసంగంలో జపాన్‌ మంచితనాన్ని మెచ్చుకున్నాడు. ‘19వ శతాబ్దంలో బర్మాను బ్రిటన్‌ ఆక్రమించటానికి ఇండియా మీద దాని ఆధిపత్యం ఉపయోగపడిరది. అలాగే ఈ 20వ శతాబ్దంలో బ్రిటిష్‌ ఆక్రమణ నుంచి ఇండియాను విముక్తి చేయటానికి భారత స్వాతంత్య్ర సేనలకు బర్మా విమోచన ఉపయోగపడుతుంది’ అని హర్ష ధ్వానాల మధ్య నేతాజీ ప్రకటించాడు.

ఆ సమయాన జపానే కాదు, భారతీయులన్నా బర్మా వారికి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే బర్మాలో ప్రతి రంగంలోనూ భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది. ఆగ్నేయాసియాలో సంపన్న భారతీయుల ప్రమేయం ఉన్న ఆజాద్‌ హింద్‌ కార్యకలాపాలకు చోటు ఇస్తే ఏమి తంటానో అన్న భయం బర్మా నాయకులకు ఉన్నది. సుభాస్‌ బోస్‌ రంగూన్లో ఉన్న కొద్దిరోజుల్లోనే అవి అకారణ భయాలని తన విశిష్ట వ్యక్తిత్వంతో బర్మా ప్రభుత్వానికి నమ్మకం కలిగించగలిగాడు. ఇండియాపై తాను తలపెట్టిన సైనిక చర్యలకు సర్వవిధాల సహాయపడగలమని కొత్త ప్రధాని బామా నుంచి హామీని పొందాడు. అంతేకాదు, మిలిటరీ ఆపరేషన్లను భారత సరిహద్దుకు దగ్గరలో ఉండి నడిపించటానికి వీలుగా తాను ఏర్పరచబోయే స్వతంత్ర భారత ప్రభుత్వానికి హెడ్‌ క్వార్టర్స్‌ను రంగూన్లో పెట్టుకోవటానికీ ప్రధానమంత్రి నుంచి అనుమతి పొందాడు. దానికి జపాన్‌ అడ్డుపడే ప్రమాదం లేకుండా బర్మా ఏరియా ఆర్మీకి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ అయిన జపనీస్‌ జనరల్‌ కవాబేనీ లైనులో పెట్టాడు. కలిసిన కాసేపట్లోనే నేతాజీ ఆ సైన్యాధికారికి ఎంత నచ్చాడంటే- టోక్యో ఆలోచనలు, సైనిక వ్యూహాల గురించి అతి ముఖ్యమైన సమాచారాన్ని బోస్‌తో జనాంతికంగా పంచుకున్నాడు.

అలా- అటు జపాన్‌ సైన్యంతోనూ ఇటు బర్మా పాలకులతోనూ లైన్‌ క్లియర్‌ చేసుకుని అన్ని ఏర్పాట్లూ ముందస్తుగా చేసుకున్నాకే, కావలసిన అంగబలాన్నీ అర్థబలాన్నీ సమృద్ధిగా సమకూర్చుకున్నాకే నేతాజీ స్వతంత్ర భారత తొలి ప్రభుత్వానికి చరిత్రాత్మక రీతిలో తెర లేపాడు.

మిగతా వచ్చేవారం

By editor

Twitter
Instagram