నేతాజి – 5

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

1943 జూలై 2.

మూడేళ్ళ కింద సరిగ్గా ఇదే తేదీన బ్రిటిష్‌ ‌ప్రభుత్వం సుభాస్‌ ‌చంద్రబోస్‌ను తప్పుడు కేసులో ఇరికించి కోల్‌కతాలో ఖైదు చేసింది. భారతీయులలో కెల్లా ప్రమాదకారి అయిన ఆ మనిషి తమకు ముప్పు తేకుండా కనీసం రెండో ప్రపంచ యుద్ధం ముగిసేంత వరకూ జైల్లోనే బంధించి ఉంచాలని ఇంగ్లిషు మారాజుల ప్లాను. అది కాస్తా పల్టీ కొట్టింది. సర్కారు కంట్లో కారం కొట్టి, దేశం నుంచి తప్పించుకుపోయిన అగ్గిపిడుగు తెల్లదొరలు నిర్ఘాంతపోయేలా సింగపూర్‌ ‌విమానాశ్రయంలో ఠీవిగా అడుగుపెట్టాడు.

మూడేళ్ళ పాటు స్కార్లెట్‌ ‌పింపర్నల్‌లా పేరు మార్చి, వేషం మార్చి బ్రిటిషు ప్రభువులను ముప్ప తిప్పలు పెట్టినవాడు ఇవాళ అజ్ఞాతవాసాన్ని విడిచిపెట్టి సుభాస్‌ ‌చంద్రబోస్‌ అన్న అసలుపేరుతోనే లైట్‌ ‌కలర్‌ ‌సూట్లో మహారాజులా విమానం దిగాడు. ఒంటరిగా కాదు, అధికార పరివార సమేతంగా. తూర్పు ఆసియాలో భారతీయుల పోరాట పతాకాన్ని అంతదాకా నిలబెట్టిన వృద్ధ నాయకుడు రాస్‌బిహారీ బోస్‌, ‌జపాన్‌ ‌ప్రభుత్వంలో ఇండియా వ్యవహారాల నిపుణుడు, దుబాసీ, వ్యక్తిగత సహాయకుడు (ఎ.డి.సి.) నేతాజీ వెంట ఉన్నారు.

సింగపూర్‌ ఎన్నో శతాబ్దాలు భారతీయ సంస్కృతి విలసిల్లిన దీవి. ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయి. భారతదేశంతో ఆత్మీయ అనుబంధం కలిగిన సింగపూర్‌ అసలు పేరు సింహపురం. బ్రిటిష్‌ ఆధిపత్యం కిందికి వచ్చాక సింగపూర్‌ ‌మీద పరిపాలన నియంత్రణ అంతా 1867 వరకూ కోల్‌కతా నుంచే జరిగేది. ఆ తరవాత పరిపాలనపై కంట్రోలు లండన్‌కు మారింది. సింగపూర్‌ ‌జనాభాలో 10 శాతం మంది భారతీయ సంతతి. తూర్పు ఆసియా లోని ప్రవాస భారతీయులు మాతృదేశ విముక్తికోసం పావు శతాబ్దంగా సాగిస్తున్న పోరాటానికి ప్రధాన కేంద్రస్థానం సింగపూర్‌. ఇం‌డియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌స్థానికశాఖ అక్కడ చురుకుగా పనిచేస్తున్నది.

సింగపూర్‌ ‌నేతాజీకి కొత్త కానీ సింగపూర్‌లోని భారతీయులకు నేతాజీ కొత్త కాదు. ఒక సింగపూర్‌ అనే ఏమిటి, మొత్తం తూర్పు ఆసియాలోని ప్రవాస భారతీయులు గుండెల్లో గుడికట్టి నేతాజీని చిరకాలంగా పూజిస్తున్నారు. తూర్పు ఆసియాలోని ప్రతి భారతీయుడి ఇంట్లో, కార్యాలయాలలో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌చిత్రపటం తప్పక ఉంటుంది. రావాలే గాని-వస్తే ఎవరూ వదులుకోని ఐసిఎస్‌ ‌కొలువును దేశంకోసం కాలదన్ని, స్వాతంత్య్ర సమరంలోకి దూకిననాటి నుంచీ ఆ ధీరుడి పోకడను ప్రవాసులు గమనిస్తున్నారు. మహాత్ముడిని సైతం ధిక్కరించి, బహిరంగ ఎన్నికలో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాగలగటానికి ముందూ, కుళ్ళుబోతులతో వేగలేక అదే పదవిని తృణప్రాయంగా వదిలేసిన తరవాత కూడా అతడి త్యాగాన్ని, ధైర్యాన్ని, దార్శనిక దృక్పథాన్ని వారు వేనోళ్ళ కొనియాడుతున్నారు.

గృహ నిర్బంధం నుంచి ఆశ్చర్యకరంగా మాయమైన నాయకుడు ఏమయ్యాడో తెలియక ఏడాదికి పైగా ఆందోళనపడ్డ ప్రవాసులకు 1942 మార్చిలో బాంగ్‌కాక్‌లో జరిగిన ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ఆరంభ సభకు జర్మనీ నుంచి సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌రేడియో ద్వారా ఇచ్చిన ఉత్తేజకర సందేశంతో గొప్ప ఉత్సాహం వచ్చింది. దేశం విడిచిపోకుండా తనను బ్రిటిష్‌ ‌మహాసామ్రాజ్యం ఆపలేకపోయినట్టే – సముద్రాలు దాటి తూర్పు ఆసియా చేరి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనకుండా తనను అడ్డుకోవటం ఎవరి తరమూ కాదని అభిమాన నాయకుడు చెప్పిన మాట ప్రవాస భారతీయులకు పరమానందం కలిగించింది. జపాన్‌ను ఒప్పించి బోస్‌ను వెంటనే పిలిపించాలని ఇండిపెండెన్స్ ‌లీగ్‌ ‌నాయకుల మీద స్థానికులు గట్టి ఒత్తిడి తెచ్చారు. అయినా అదిగో ఇదుగో అనటమే తప్ప ఆయన వచ్చే జాడ కానరాకపోవటంతో ఏడాదికి పైగా వేచి చూసిచూసి జనం ఆశ వదులుకున్నారు. అలాంటి స్థితిలో కిందటి నెల (1943 జూన్‌లో) టోక్యో నుంచి రేడియోలో సుభాస్‌బాబు గొంతు విని తూర్పు ఆసియాలోని భారతీయులకు ప్రాణం లేచి వచ్చింది. చిరకాలంగా ఎదురుచూస్తున్న ఆరాధ్య నాయకుడు ఎప్పుడెప్పుడు తమ మధ్యకు వచ్చి స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిస్తాడా అని అందరూ ఊపిరి ఉగ్గబట్టుకుని వేచి ఉన్నారు.

జూలై 2న నేతాజీ సింగపూర్‌కి రాబోతున్నారని విని ఉదయం నుంచే అభిమానులు వేలసంఖ్యలో విమానాశ్రయం ముందు గుమికూడారు. ఏ సమయానికి వస్తారనేది ఐ.ఎన్‌.ఎ. ఉన్నతాధికారులు, పుర ప్రముఖులు కొద్దిమందికే తెలుసు. మధ్యాహ్నం విమానం దిగిన నేతాజీని ప్రజల జయజయధ్వానాల మధ్య ఐ.ఎన్‌.ఎ. ‌కమాండర్లు జె.కె.భోంస్లే, మహమ్మద్‌ ‌జమాన్‌ ‌కియానీ నేతాజీ, ఇండిపెండెన్స్ ‌లీగ్‌ ‌స్థానిక నాయకులు రిసీవ్‌ ‌చేసుకున్నారు. ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ (ఐ.ఎన్‌.ఎ.) ‌సైనికులు మిలిటరీ లాంఛనాలతో గౌరవవందనం చేశారు. అభిమాన నాయకుడి రాకతో సింగపూర్‌ ‌వాసులలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భారతీయులు, మలయన్లు, జపానీయులు ఆయనను చూసేందుకు అధికార నివాసం దగ్గర విరగబడ్డారు. నిటారుగా నిలబడి ఠీవిగా తలెత్తి మైమరపించే చిరునవ్వులు చిందించే నేతాజీని చూశాక ఎట్టకేలకు తమకు ఒక సరైన నాయకుడు దొరికాడన్న భరోసా ప్రవాసులకు పెరిగింది.

మరునాడంతా ఇండిపెండెన్స్ ‌లీగ్‌ (ఐఐఎల్‌) ‌ముఖ్య నాయకులతో, ఐఎన్‌ఎ ‌కమాండర్లతో వివరంగా మాట్లాడి ఎవరు, ఏమిటి, ఎలా పనిచేస్తున్నారన్నది నేతాజీ తెలుసుకున్నాడు. ఆయనకు మిలిటరీ వ్యవహారాలు కొత్త. జీవితమంతా రాజకీయాలలో గడిపిన సివిలియన్‌. అయినా మిలిటరీ వ్యవస్థ, దాని పని విధానాల పట్ల తలపండిన ఏ సైన్యాధికారికీ తీసిపోని రీతిలో నేతాజీకున్న పరిణత అవగాహన, సైనికపరమైన సూక్ష్మ విషయాల పట్ల కూడా ఆయన కనపరచే శ్రద్ధ సీనియర్‌ ‌కమాండర్లను ఆశ్చర్యపరచింది. ఆయన నాయకత్వ ప్రజ్ఞ మీద మొదటిరోజే వారికి గురి కుదిరింది.

జూలై 4న అప్పట్లో సింగపూర్‌లో కెల్లా అతిపెద్దదైన కేతే బిల్డింగ్‌ ‌హాల్‌లో ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌జనరల్‌ అసెంబ్లీ కొలువు తీరింది. తూర్పు ఆసియాలోని అన్ని దేశాలనుంచి వచ్చిన ప్రతినిధులతో ఆ హాల్‌ ‌కిక్కిరిసింది. ఆగ్నేయాసియా లోని లీగ్‌ ‌శాఖల అధ్యక్షులు వేదికమీద కూచున్నారు. వృద్ధ నాయకుడు రాస్‌బిహారీ బోస్‌ ‌వెంట భారతీయ సాంప్రదాయక దుస్తుల్లో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌హాల్‌లో అడుగుపెట్టగానే సభికులందరూ లేచి నిలబడి ‘‘సుభాస్‌ ‌బాబూకీ జై’’ అంటూ దిక్కులదిరేలా నినదించారు.

రాస్‌బిహారీ బోస్‌ ‌సామాన్యుడు కాదు. పావు శతాబ్దానికి పైగా తూర్పు ఆసియాలో బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి పక్కలో బల్లెమైన విప్లవవీరుడు. మునుపటి చురుకు, బిగువు పోయి వయోభారం వల్ల ఇప్పుడు మెల్లిగా కాస్త వొంగి నడుస్తున్నాడు. తన శక్తి ఉడిగిందని గ్రహించి, శక్తులు నిండిన నేతాజీకి ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌నాయకత్వాన్ని అప్పచెప్పాలని ఆయన చాలా కాలంగా తహతహ లాడుతున్నాడు. తమ కోరికను మన్నించి ప్రాణాలతో పందెం వేసి నేతాజీ ఎట్టకేలకు జపాన్‌ ‌చేరాడన్న కబురు తెలియగానే రెక్కలు కట్టుకుని టోక్యోలో వాలాడు. మీకో మంచి బహుమతి తేబోతున్నానని సహచరులకు చెప్పి మరీ వెళ్ళాడు. ‘నిలువెత్తు బహుమతి’ని ఇప్పుడు సగర్వంగా వెంటబెట్టుకుని వచ్చాడు.

వందేమాతరం గీతాలాపన తరవాత సభా కార్యక్రమం. ప్రధానాంశం నాయకత్వం మార్పు. వృద్ధ నాయకుడు రాస్‌బిహారీ బోస్‌ ఐఐఎల్‌ అధ్యక్ష పదవికి రాజీనామాను ప్రకటించి, కొత్త అధినేతగా సుభాస్‌ ‌బోస్‌ను నామినేట్‌ ‌చేశాడు. తన సర్వాధికారాలనూ యువ నేతాజీకి సంతోషంగా బదలాయించాడు. ‘‘ఇదుగో ఇతడే మీరు ఎదురుచూస్తున్న గొప్ప బహుమతి. ఇకపై సుభాస్‌ ‌చంద్రబోసే మీ అధ్యక్షుడు. భారత స్వాతంత్య్రం కోసం మనం చేస్తున్న పోరాటానికి నాయకుడు. ఆసియాకే వెలుగు అయిన ఈ మహానాయకుడు ఇకపై మిమ్మల్ని సమర్థంగా నడిపిస్తాడు. ఘన విజయం సాధిస్తాడు’’ అని సభాసదుల హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.

ఆనాడు ఐదు వేల మంది ఐఐఎల్‌ ‌ప్రతినిధుల సమక్షంలో నాయకత్వం మార్పు కేవలం ఒక లాంఛనం. రాస్‌బిహారీ బోస్‌ ఆధికారికంగా ప్రకటించటానికి ముందే సుభాస్‌ ‌చంద్రబోసే తమను నడిపించగలిగిన సమర్థుడని అందరూ డిసైడయ్యారు. తన నాయకత్వం కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రవాస భారతీయులు పరవశించి వింటూండగా సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌స్వాతంత్య్ర సాయుధ సమరానికి అద్భుతమైన పథ నిర్దేశం చేశాడు. ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమంతో భారతదేశం అహింస నుంచి సాయుధ ప్రతిఘటనకు మళ్లింది. దేశంలో ప్రజా పోరాటానికి దేశం వెలుపలి నుంచి జపాన్‌ ‌సహాయంతో సాయుధ సమరం తోడైతే బ్రిటిష్‌ ‌సామ్రాజ్యాన్ని నేలకరిపించవచ్చు. జపాన్‌ ‌మనల్ని మోసం చేస్తుందనీ, నేను జపాన్‌ ‌చేతుల్లో కీలుబొమ్మననీ మన శత్రువులు ప్రచారం చేస్తున్నారు. మహా బ్రిటిష్‌ ‌సామ్రాజ్యమే ఎన్నేళ్ళు ఎన్నివిధాల ప్రయత్నించినా నన్ను లొంగ తీసుకోలేకపోయింది. అలాంటిది నేను జపాన్‌ ‌వారికి లొంగుతానా? మనం ఎవరినీ నమ్మేదిలేదు. ఎవరికీ తలవంచేది లేదు.’’ అని నేతాజీ ఘంటాపథంగా చాటుతుంటే ఆయన పోరాట చరిత్ర తెలిసిన సభికులు దిక్కులు మారుమోగేలా చప్పట్లు కొట్టారు.

 ‘‘అంతిమ విజయం మనదే. అయినా శత్రువు బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. మన శత్రువు శక్తిమంతుడే కాదు. మహా క్రూరుడు, దుర్మార్గుడు కూడా. మనం ఎన్నో అడ్డంకులు దాటాలి. ఎన్నో ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలకు, నష్టాలకు సిద్ధపడి మాతృదేశ విముక్తి కోసం పోరాడాలి.’’ అంటూ నేతాజీ చేసిన గంభీర ప్రసంగం ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకుంది.

మొదట్లో ఏమీ లేకున్నా స్వశక్తితో, పట్టుదలతో ఎన్నో సాధించిన మనిషిని పాశ్చాత్య ప్రపంచం కీర్తిస్తుంది. అన్నీ ఉండీ ఆదర్శం కోసం అన్నిటినీ త్యాగం చేసిన మనీషిని భారతీయ సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌జీవితంలో చేసినవన్నీ త్యాగాలే. అందరూ అంగలార్చే ఐ.సి.ఎస్‌. ‌కొలువును దేశం కోసం మొదటే వదులుకున్నాడు. భారతమాత సేవ కోసం కుటుంబ జీవితాన్ని వదిలేసుకున్నాడు. పదవీభోగం కంటే జాతి హితం ముఖ్యమని ఎంచి, వీరోచితంగా గెలుచుకున్న జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానాన్ని త్యాగం చేశాడు. జర్మనీలో ప్రభుత్వం సమకూర్చిన రాజభోగాలను స్వచ్ఛందంగా వదిలేసుకుని ప్రాణాలను లెక్కచేయక మహా సాహసికంగా సముద్రాలు దాటి స్వాతంత్య్ర సమరం కోసం ఇప్పుడు తమ మధ్యకు వచ్చాడు. మాతృదేశ విముక్తి కోసం అన్ని సుఖాలనూ వదులుకున్న మహనీయుడని తెలుసు కాబట్టే ఆ రోజు కేతే హాల్‌లో ఉపవిష్టులైన వేలాది ప్రవాసులు నేతాజీకి మనసారా ఘన నీరాజనాలనిచ్చారు.

స్వాతంత్య్ర సాధనకు సుభాస్‌ ‌బోస్‌ ‌వేసిన బృహత్‌ ‌ప్రణాళిక మొత్తానికీ జపాన్‌ ‌సైనిక సహాయం కీలకం. భారత రంగానికి సంబంధించి జపాన్‌ ‌సేనల ఏ కదలికనయినా కంట్రోల్‌ ‌చేసేది దక్షిణాది సుప్రీం కమాండు. దానికి కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌పేరు జనరల్‌ ‌తెరౌచి. అతడి హెడ్‌ ‌క్వార్టర్స్ ‌సింగపూరే. అతడితో సత్సంబంధాలు ఉండటం మంచిది కనుక ఐఐఎల్‌ ‌మహాసభ ముగిసిన వెంటనే రాస్‌బిహారీ బోస్‌తో కలిసివెళ్లి ఆ సైన్యాధికారిని నేతాజీ కలిశాడు.

తెరౌచి సామాన్యుడు కాదు. గతంలో జపాన్‌కు వార్‌ ‌మినిస్టర్‌గా పనిచేసినవాడు. ప్రధానమంత్రి కాదగినవాడని చాలామంది భావించేవారు. దేశాధినేత జనరల్‌ ‌టోజోతో సమాన ఫాయాలో మాట్లాడగలిగినవాడు. రాస్‌బిహారీ ఒకరికొకరిని పరిచయం చేయగానే సుభాస్‌ ‌బోస్‌, ‌జనరల్‌ ‌తెరౌచీలు జర్మన్‌ ‌భాషలో చాలాసేపు మాట్లాడు కున్నారు. ప్రపంచ వ్యవహారాల మీద గట్టి పట్టు ఉన్న తెరౌచీకి సుభాస్‌ ‌చాలా నచ్చాడు. తొలి కలయిక లోనే వారి మధ్య నెలకొన్న మైత్రీబంధం ఎన్నో సమస్యలనూ సవాళ్ళనూ తట్టుకుని ప్రపంచ యుద్ధ విషాదాంతం వరకూ పటిష్టంగా నిలిచింది.

మరునాడు 1943 జూలై 5. నేతాజీ స్వయంగా చెప్పినట్టు ఆయన జీవితంలో కెల్లా గర్వించదగిన రోజు. భారత మాట దాస్యవిముక్తి కోసం ‘ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌’ ఆవిర్భావాన్ని ఆయన లోకమంతటికీ సగర్వంగా చాటిన రోజు. తాను చిరకాలంగా కలగంటున్న జాతీయ సైన్యాన్ని ఆయన కళ్ళారా చూసి గౌరవ సైనిక వందనం అందుకున్న రోజు.

సింగపూర్‌లోని 45 వేల భారత సైనికుల కమాండ్‌ ‌బాధ్యతను సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌స్వీకరించే సమయానికి ఐ.ఎన్‌.ఎ.‌ది మూడవ అవతారం. 1942 ఫిబ్రవరి నుంచి డిసెంబర్‌ ‌వరకూ కెప్టెన్‌ (‌తరవాత జనరల్‌) ‌మోహన్‌ ‌సింగ్‌ ఆధిపత్యం. అతడు భంగపడి చెరసాల పాలయ్యాక 1943 నుంచీ లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌జగన్నాథరావు పెత్తనం. ఇద్దరిలోనూ నాయకత్వ ప్రజ్ఞ మృగ్యం. బ్రిటిష్‌ ‌కొలువులో అవమానకరమైన జాతి వివక్ష వల్ల, జపాన్‌ ‌వారి చెరలో పడితే ఏ గతి పడుతుందోనన్న భయం చేత జపాన్‌ అం‌డతో తయారైన ఐ.ఎన్‌.ఎ.‌లో ఆపద్ధర్మంగా చేరిన భారత సైనికుల్లో చాలామందికి అసమర్థ నాయకుల నిర్వాకాలతో అనుమానాలు పెరిగాయి. నీరసం వచ్చింది. సుభాస్‌ ‌చంద్రబోస్‌ అనేవాడు తమకు కొత్త నాయకుడుగా రాబోతున్నాడని విని, కొత్త కీలుబొమ్మను పట్టుకొస్తున్నారనీ, అతడూ జపాన్‌ ‌తొత్తు అయ్యే ఉంటాడనీ శంకించిన సైనికులూ ఉన్నారు. బోస్‌ ఎలాంటివాడో ఎరిగిన వారిలో కూడా కొందరికి ప్రపంచయుద్ధ కాలంలో వేల మైళ్ళ దూరంనుంచి ఖండాలు దాటి నిజంగా ఆయన తమ మధ్యకు రాగలడంటే నమ్మ బుద్ధి కాలేదు. తమను మాయ చేయటానికి జపాన్‌ ‌వాళ్ళు బోస్‌ను పోలిన నకిలీ శాల్తీని పట్టుకొచ్చి బూటకపు నాటకం ఆడిస్తున్నా రని కొంతమంది అనుమానించారు. జీవితాంతం రాజకీయాలే తప్ప మిలిటరీ అనుభవం ఏ కోశానా లేని ఆసామీ యుద్ధరంగంలో సైనికులను ఎలా నడిపిస్తాడని పెదవి విరిచిన ఆఫీసర్లూ ఉన్నారు.

ఇలా రకరకాల సందేహాలూ అపోహలూ ముసురుకున్న సైనికులకు కూడా ముచ్చటైన మిలిటరీ యూనిఫాంలో ఖాకీ ట్యూనిక్‌, ‌ఫోరేజ్‌ ‌కాప్‌, ‌మోకాళ్ళ వరకూ నల్లని బూట్లు ధరించి గంభీరంగా చకచక వచ్చిన నేతాజీని చూడగానే గౌరవభావం కలిగింది. ఆర్భాటం లేకుండా సాదా పదాలతో, సూటిగా హృదయాలను తాకేలా ఉద్వేగంతో, ఉత్సాహంతో ఆయన ఇచ్చిన సందేశం విన్నాక సందేహాలు పటాపంచలయ్యాయి. ఆలకించిన ప్రతివాడూ నేతాజీకి వీరాభిమాని అయ్యాడు. అదే మొదటి సమాగమం కాబట్టి తన సైనికుల మదిలో నేతాజీ చెరగని ముద్ర వేయాలనుకున్నాడు. సింగపూర్‌ ‌మునిసిపల్‌ ‌బిల్డింగ్‌ ‌ప్రాంగణంలో సైనిక కవాతులో పాల్గొని, నిటారుగా నిలబడి, కమాండింగ్‌ ‌స్వరంలో పరిపూర్ణ ఆత్మ విశ్వాసంతో ఉత్తేజకరంగా ఆనాడు చేసిన ఉద్బోధ నేతాజీ తన జీవితంలో చేసిన గొప్ప ప్రసంగాలలో ఎన్నదగ్గది.

భారతదేశం స్వాతంత్య్రం సాధించటానికి మిగతా అన్ని విధాలా పరిస్థితి పరిపక్వమైంది. కొరవడినదల్లా విముక్తి సేన ఒక్కటే. అమెరికాలో జార్జ్ ‌వాషింగ్టన్‌ ‌సొంత సైన్యం ఉంది కాబట్టే పోరాడి స్వాతంత్య్రం సాధించాడు. సాయుధ సేన వెంట ఉన్నది కాబట్టే గారిబాల్డి ఇటలీని విముక్తిపరచ గలిగాడు. ముందుకొచ్చి భారత జాతీయ సైన్యాన్ని మీ చేతులతో ఏర్పరచగలగటం మీరు గర్వించదగ్గ అపురూప గౌరవం. భారత విమోచన సైన్యం ఆవిర్భవించిందని యావత్ప్రపంచానికీ ప్రకటించ గలగటం ఈ రోజు నాకు దక్కిన మహదావకాశం. స్వాతంత్య్ర మార్గంలో ఆఖరి అడ్డంకిని దాటి అద్భుత ప్రస్థానానికి అగ్రగాములయినందుకు జాతీయ సైనికులారా! గర్వించండి!

 1939లో జర్మనీ మీద ఫ్రాన్స్ ‌యుద్ధం ప్రకటించినప్పుడు ప్రతి జర్మన్‌ ‌సైనికుడి నోటా వినిపించిన మాట ‘పారిస్‌ ‌పద పద’ అని! 1941 చివరిలో జపాన్‌ ‌సైనికులు ‘సింగపూర్‌! ‌సింగపూర్‌’ అని ఘోషిస్తూ ఈ నగరం మీదికి దండెత్తారు. అదే విధంగా కామ్రేడ్స్! ‌మై సోల్జర్స్! ‌మీకు ఇస్తున్నాను ఇదుగో ఈ రణ నినాదం- ‘చలో దిల్లీ’!

ఈ స్వాతంత్య్ర యుద్ధం అయ్యేసరికి ఎంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారో తెలియదు. కాని చివరికి మనమే గెలుస్తామని మాత్రం చెప్పగలను. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి ఇంకో వల్లకాడు లాంటి దిల్లీ ఎర్రకోటలో మన వీరసైనికులు విజయోత్సవ కవాతు చేసేంతవరకూ మన సంకల్పం పూర్తి కాదు.

మీ ముందు రెండు కర్తవ్యాలున్నాయి. సాయుధ బలంతో రక్తాన్ని చిందించి మీరు స్వాతంత్య్రం గెలవాలి. భారత్‌ ‌స్వతంత్రదేశమైన తరవాత స్వేచ్ఛా భారతానికి శాశ్వత సైన్యాన్ని మీరు సమకూర్చాలి. చరిత్రలో మళ్ళీ ఇంకెప్పుడూ స్వాతంత్య్రాన్ని కోల్పోని విధంగా జాతీయ రక్షణను పటిష్ఠపరచాలి.

బానిసత్వంలోని జనానికి విమోచన సేనలో మొదటి సైనికుడు కావటాన్ని మించిన గౌరవం, గర్వం మరొకటి ఉండదు. ఈ గౌరవం వెంబడే పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. చీకటిలో, వెలుతురులో, కష్టంలో, సంతోషంలో, బాధలో గెలుపులో నేను మీ తోడుగా ఉంటాను.’’

“For the present, I can offer you nothing except hunger, thirst, privation, forced marches and death.
But if you follow me in life and in death, I shall lead you to victory and freedom. It does not matter who among us will live to see India free. It is enough that India shall be free and that we shall give our all to make her free. May God now bless our army and grant us victory in the coming fight. Inquilab zindabad! Azad Hind zindabad!”

(ప్రస్తుతానికి నేను మీకు ఇవ్వగలిగింది ఏమీ లేదు- ఆకలి, దప్పిక, ఇక్కట్లు, ఎడతెగని నడక, మృత్యువు తప్ప! కానీ బతుకులో చావులో మీరు నా వెంట ఉంటే నేను మిమ్మల్ని స్వాతంత్య్రం, విజయం చెంతకు నడిపిస్తాను. ఇండియా స్వాతంత్య్రాన్ని మనలో ఎందరం కళ్ళజూస్తామన్నది ప్రధానం కాదు. ఇండియా స్వాతంత్య్రం పొందితే చాలు. దేవుడు మన సైన్యాన్ని దీవించి రేపటి పోరులో మనకు విజయం ప్రసాదించు గాక! ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌! ఆజాద్‌ ‌హింద్‌ ‌జిందాబాద్‌!)

[Netaji Subhas Chandra Bose From Kabul to Battle of Imphal, H.N Pandit, pp. 173-178]

మండే ఎండలో నేతాజీ అద్భుత ఉద్బోధను విన్న వారందరికీ ఒళ్ళు పులకరించింది. తమ ఎదుట నిలిచినవాడు అంతర్జాతీయ స్థాయి రాజనీతిజ్ఞుడు, దార్శనికుడైన మహావ్యక్తి అన్న నమ్మకం కుదిరింది. తాము చిరకాలంగా కోరుకుంటున్న నాయకుడు, ప్రియమైన నేతాజీ ఎట్టకేలకు తమకు దొరికాడన్న ఆనందంతో స్వాతంత్య్ర సైనికుల ఉత్సాహం ఉరకలేసింది. వారిలో అంతర్నిహితంగా ఉన్న దేశభక్తిని, సెంటిమెంట్లను వ్యక్తపరచటానికి సమర్థుడైన నాయకుడు దొరికాడు. నేతాజీ సందేశం విన్న వారు మంత్రముగ్ధులయ్యారంటే ఆ మహిమ మాటలలో కాదు- వాటిని అన్న మనిషి నిజాయితీలో ఉంది. ఆదర్శం కోసం జీవించే, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసే, నీతిమంతుడైన మహా నాయకుడు కాబట్టి ఆయన పలికిన ప్రతి పలుకూ ప్రతివారినీ కదిలించింది. ఆయన మాటే మంత్రమై లక్షలమందిని మహోన్నత త్యాగాలకూ అద్భుత పరాక్రమానికీ పురికొల్పింది.

సైనిక వందన స్వీకారం కార్యక్రమానికి జనరల్‌ ‌తెరౌచి కూడా హాజరై భారత సైనికులమీద నేతాజీ ప్రసంగం ప్రసరించిన ప్రగాఢ ప్రభావాన్ని స్వయంగా గమనించాడు. మరునాడు జపాన్‌ ‌ప్రధానమంత్రి జనరల్‌ ‌టోజో వేరే పని మీద సింగపూర్‌ ‌వచ్చాడు. ఆ సందర్భంలో కిందటి రోజు కార్యక్రమం గురించి, నేతాజీ నాయకత్వ ప్రజ్ఞ, ఆయన భారత సైనికులకు ఇచ్చిన అద్భుత స్ఫూర్తి గురించి జనరల్‌ ‌తెరౌచి ప్రధానమంత్రికి చాలా గొప్పగా చెప్పాడు. వ్యక్తిగత సౌఖ్యాలకు వెంపర్లాడకుండా, విలాసాలకు పోకుండా నేతాజీ ఎంత సాదాసీదాగా జీవిస్తాడో సైనిక అధికారులు చెప్పగా విని టోజో చాలా సంతోషించాడు. టోక్యోలో మొదటిసారి చూసినప్పుడే- ఆయన గొప్ప వ్యక్తి, మహా నాయకుడు అని తనకు అర్థమయిందని జనరల్‌ ‌తెరౌచితో అన్నాడు. మర్యాదపూర్వకంగా బోస్‌ ‌తనను కలిసినప్పుడు ఆయన అడిగిన కోర్కెలు, పెట్టిన షరతులు అన్నిటికీ టోజో అంగీకరించాడు. బోస్‌కు అన్ని విధాలా సహకరించమని తన అధికారులకు చెప్పాడు. అంతేకాదు. ‘మీరు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్నారు కదా? దానికి మాకు అభ్యంతరం లేదు. మా తోడ్పాటు మీకు ఉంటుంది. ముందుకెళ్ళండి’ అని భరోసా ఇచ్చాడు.

నిజంగా అది పెద్ద వరం. జపాన్‌ ‌చేరాక సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌నాయకత్వ దక్షతకు తొలి విజయం. కాని ప్రధానమంత్రి టోజో వచ్చి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చేదాకా నేతాజీ వేచి ఉండలేదు. తన దేశ స్వాతంత్య్రం విషయంలో స్వతంత్రంగా వ్యవహరించటమే తప్ప ఒకరి అనుమతి కోసం ఎదురుచూసే తత్త్వం కాదు ఆయనది. స్వరాజ్యం కోసం పోరాడుతున్న శక్తులన్నిటినీ సమీకరించి, ఏకోన్ముఖంగా పోరాడటానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌నాయకత్వ స్వీకారోత్సవంలో అప్పటికి రెండు రోజుల కిందటే ఎలుగెత్తి లోకానికి చాటాడు. దటీజ్‌ ‌నేతాజీ!

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram