– బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

‘‘అమ్మా! పర్వతతనయా! నీ హృదయం నుండి సారస్వత మయమైన క్షీర సాగరం స్తన్యంగా ప్రవహిస్తున్నదని ఊహిస్తున్నాను. దయతో నీవిచ్చిన స్తన్యాన్ని పానం చేసి కుమారస్వామి గొప్ప కవిగా విరాజిల్లాడు’’ అని ఆదిశంకరులు ‘సాందర్యలహరి’లో జగన్మాతను ప్రస్తుతిస్తూ పలికారు. జ్ఞానశక్తిని తన స్తన్యంగా ప్రదానం చేసే శ్రీమాత, జ్ఞాన సంబంధుని కూడా అనుగ్రహించిందని ఐతిహ్యం.

విశ్వమే లలితాదేవి స్వరూపంగా దర్శిస్తూ సూర్యచంద్రులే తన వక్షస్థలంగా, జగతిని పోషిస్తున్నది అని ఆగమాలు చెప్పిన సత్యాన్ని (సూర్యచంద్రౌస్తనౌ దేవ్యాః) కూడా తన స్తుతిలో ప్రస్తావించారు.

అన్న – ప్రాణశక్తులను ప్రపంచానికి అందించే సూర్యచంద్రులిద్దరూ విశ్వమాత స్తనములుగా, జీవులందరూ శిశువులుగా ఋషులు సంభావించిన అద్భుత దర్శనం… ఈ ‘తల్లిపాల వారోత్సవాల’ వేళ ఒక్కసారి స్మరించాలి. ఇంతటి సమున్నత భావాన్ని ప్రతిష్ఠించిన ప్రాచీన భారతీయ ఆర్ష సంస్కృతి ఔనత్యానికి అంజలించాలి.

ప్రాచీన వాఙ్మయంలో ఒక కథను చెప్తారు:

పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఒక ఋషి బాలకుడు, అరణ్యంలో ఋషుల నడుమ పెరిగాక, ఒకప్పుడు ఒక ఇంటిముందు భిక్షార్ధమై నిలబడతాడు. ఆ ఇంటి గృహలక్ష్మి భిక్షను వేయడానికి వచ్చినప్పుడు, ఆమె వక్షఃస్థలాన్ని చూసి- ‘‘అమ్మా! అవి ఏమిటి?’’ అని అడుగుతాడు.

ఆ ప్రశ్నలో అమాయకత్వం, నిష్కపటుత్వం ఉందని తెలుసుకున్న ఆ తల్లి చిరునవ్వుతో… ‘‘పుట్టిన నా పిల్లవాడి కోసం భగవంతుడు ఇందులో ఆహారాగ్ని సిద్ధంచేశాడు’’ అని సమాధానమిస్తుంది. ఆ మాటతో -అందరినీ పోషించే ఈశ్వరశక్తి జీవుల కోసం ఎలా పోషణ శక్తిని సిద్ధం చేస్తుందో గ్రహించిన బాలకునికి, భగవత్కారుణ్యం అవగతమవుతుంది.

మానవునికి శైశవంలో పోషణ శక్తినీ, పుష్టినీ అందించే ఆహారం, మాతృస్తన్యంగా భగవంతుని కృపారూపమైన ప్రకృతి ఏర్పరచిందని ఈ గాధలో ఆంతర్యం.

కేవలం ఆకలి తీర్చడమే కాక, శిశువు ప్రతి అవయవం ఎదుగుదలకీ, ఆయుర్వ•ృద్ధికీ మాతృక్షీరమే అమృతంగా పనిచేస్తుంది. అలాంటి అమృతాన్ని శిశువుకి అందించకపోతే సంపూర్ణమైన ఎదుగుదల అసాధ్యం.

ఈశ్వర నిర్దేశితమైన ఈ అమృతాన్ని అందివ్వకుండా, డబ్బాపాలతో పిల్లల్ని పెంచడం ఒక విధంగా విషంతో పోషించడమే. విద్యాధికులు, విద్యా విహీనులు కూడా ఈ పొరపాటు చేయడం విచారకరం.

ఆరోగ్య కారణాల రీత్యా కన్నతల్లికి పాలు ఇవ్వలేని, పాలులేని స్థితి ఏర్పడితే, మరోతల్లి ఆ పిల్లవాడిని తన పాలతో పోషించడం నాటికాలంలో ఉండేది.

అలాంటిది ఇవ్వగలిగి కూడా కన్నతల్లులు తమ స్తన్యాన్ని పిల్లలకు ఇవ్వకపోవడం ప్రకృతి విరుద్ధమే.

ఆయుర్వేద శాస్త్రాలలో మాతృక్షీరంలో ఉన్న ఔషధ విలువలు వివరించబడ్డాయి.

ప్రకృతిని దేవతగా భావించి, ఆ పరదేవతా క్షీరం జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పురాణ వాఙ్మయం చెప్పడంలో భావం – బుద్ధిశక్తిని పెంచే ఔషధం మాతృక్షీరమే అని స్పష్టం చేయడమే. క్షీరదాలైన జంతుజాలంలో కూడా ఈ పక్రియ స్వాభావికంగా కనబడుతుంది. ఆ జంతువులను గమనించినా మాతృక్షీర ప్రాధాన్యం అవగతమవుతుంది. నాగరికత పెరిగాక కృత్రిమత్వం పెంచుకుంటూ, దానినే అభ్యుదయంగా భావించే ఆధునికత కారణంగా బలహీన మానవజాతి భావితరాలుగా ఏర్పడుతోంది.

ఆయుర్వేదవేత్త, మహోపాసకులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మగారు స్త్రీల ఆరోగ్య సౌభాగ్యాలకు వైద్యోపదేశాలనందిస్తూ ‘‘పుత్రవతీ హితోపదేశములు’’ అని పద్యరూప రచన చేశారు. అందులో కొన్ని ముఖ్య పద్యాలు నేటి మాతృమూర్తులు జ్ఞప్తిలో ఉంచుకో వలసినవి:

‘‘అమృతమే జుమ్ము చంటిపాలర్భకులకు;

భాగ్యహీనుని తల్లికే పాలకొఱత-’’

తన పిల్లలు భాగ్యహీనులు కాకుండా, తల్లి మాతృక్షీరాన్ని అందించాలి. తల్లిపాలు ఇవ్వకపోవడమే ‘‘ఎల్ల శిశురోగములకిదే హేతువరయ- కనుక పాలుండగ జూచికొను మా తల్లి!’’ అన్నారు. తల్లి తన స్తన్య సమృద్ధికై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహర నియమాలు కూడా ఆయుర్వేదం చెబుతోంది.

తల్లికి ఏదైనా అనారోగ్యం కలిగితే దాది పాలో, ఆవు పాలో ఇవ్వాలి. ఆ దాది కూడా ఆరోగ్యవంతురాలై, ‘పథ్యభోజిని’గా ఉండాలి. మళ్లీ తన ఆరోగ్యం బాగు పడ్డాకనే కన్నతల్లి శిశువుకి పాలివ్వాలి.

శిశువుకి ముఖ్య ఆహారం తన శరీరం ద్వారానే ఏర్పడుతోంది కనుక, తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి. అదీ ‘కన్నబిడ్డల కోసం’ అని మరువరాదు.

‘‘నీ హిత విహార భోజన నియమములను

వెల్తి లేనన్నినాళ్లు నీ బిడ్డ కూడ

బలము గోల్పోక నిక్కచ్చి పడకయుండు

గాన విడబోకు జాగరూకతను, తల్లి!

ఇన్నిసారులు రాతిరి, ఇన్నిసార్లు

పగలనుచు లెక్కగా తల్లి! పాలు పెట్టు

ఏడ్చినపుడెల్ల గుడిపితివేని, హాని-

కరము; వాయువు చేరును గడుపునందు’’

….అంటూ ప్రాచీన భారతీయ వైద్య విషయాలను ఎన్నిటినో పేర్కొన్నారు. ఇటువంటి శాశ్వత రోగ సూత్రాలను అందించిన మన భారతీయ వైద్య విజ్ఞానాన్ని సంగ్రహించి వ్యాపింపజేయాలి. యుగాల నుండే సంపూర్ణ విజ్ఞానంతో తల్లీ-పిల్లల సంక్షేమానికి ఎన్నో విషయాలను బోధించే భారతీయ వైద్యం ‘చంటిపాల’ గురించి చెప్పిన అద్భుతాంశాలు, నియమాలు-ఈ వారోత్స వంలో ప్రపంచానికి తెలియపరచాలి.

About Author

By editor

Twitter
Instagram