టోక్యోలో టోజోతో..

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

సబాంగ్‌ ‌రేవులో అడుగు పెడుతూనే నేతాజీకి ప్లెజంట్‌ ‌సర్ప్రైజ్‌! ‌జపాన్‌ ‌ప్రభుత్వం తరఫున సాదర స్వాగతం అంటూ కలనల్‌ ‌యమామోతో ఎదురొచ్చాడు. అతడు బెర్లిన్‌లో జపాన్‌ ‌రాయబార కార్యాలయంలో మిలిటరీ అధికారిగా బోస్‌కు బాగా పరిచయం. బోస్‌ అం‌టే అతడికి మహా ఇష్టం.

బోస్‌తో సమన్వయానికి తెలిసినవాడైతే మేలని తలచి ప్రభుత్వం యమామోతోను తూర్పుకు పిలిపించింది. ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ (ఐ.ఎన్‌.ఎ.)‌కూ జపాన్‌ ‌ప్రభుత్వానికీ అనుసంధా నంగా కొత్తగా ఏర్పరచిన హికారీ కికాన్‌ ‌బాధ్యత అతడికి అప్పగించింది. పాత మిత్రుడిని చూసి నేతాజీ సంతోషపడ్డాడు. సుదీర్ఘ సముద్ర ప్రయాణం వల్ల బాగా అలసిపోయి ఉంటారు. ముందు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోండి – అన్నాడు యమామోతో. ఎప్పుడెప్పుడు పనిలోకి దిగుదామా అని ఆత్రంగా ఉన్న నేతాజీ ‘‘అదేమీ అక్కర్లేదు. నేను రెడీ’’ అన్నాడు. జపాన్‌ ‌వాడు వినయపూర్వకంగా ముందుకు వొంగి, ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు.

వెంటనే బయలుదేరడానికి బోస్‌ ‌సిద్ధంగా ఉన్నా అతడిని వెంటనే రిసీవ్‌ ‌చేసుకోవటానికి టోక్యో సిద్ధంగా లేదు. విశ్రాంతి మిష మీద ఐదు రోజుల పాటు అతడిని సబాంగ్‌లోనే ఉంచారు. ఆ తరవాత ఐదు అంచెల మీద నేతాజీని టోక్యో చేర్చటానికి ఇంకో ఐదు రోజులు పట్టింది. పెనాంగ్‌, ‌సైగాన్‌, ‌మనిలా, తైపే, హేమమత్సులలో ఒక్కొక్కరాత్రి బసచేస్తే గానీ ఆడంగు చేరలేదు. ఎందుకిన్ని మజిలీలు అని అడిగితే ఎకాఎకి ఫ్లయిటుకు లాంగ్‌ ‌రేంజి మిలిటరీ విమానం అందుబాటులో లేనందున అంచెలవారీ ప్రయాణం తప్పనిసరి అన్నారు. భద్రత నిమిత్తం బోస్‌ ఉనికిని గోప్యంగా ఉంచారు. సబ్మెరైన్‌లలో లాగే జపాన్‌ ‌విమానాలలోనూ బోస్‌ ‌మత్సుడా అనే జపనీస్‌ ‌మారు పేరుతో వ్యవహరించాడు.

కోల్‌కతాలో మాయమైనప్పటినుంచి కాబుల్‌ ‌దాకా ఇన్సూరెన్స్ ఉద్యోగి జియా ఉద్దీన్‌! ‌బెర్లిన్‌ ‌చేరి జర్మనీలో ఉన్నంతకాలమూ అతడు ఇటాలియన్‌ ‌దౌత్యాధికారి ఆర్లాండో మజోట్టా! ఇప్పుడు జపాన్‌లో మత్సుడా!! అదే పేరుతో 1943 మే 16న టోక్యోలో అడుగు పెట్టాడు. అత్యంత ప్రముఖులైన ప్రభుత్వ అతిథులు బస చేసే ఇంపీరియల్‌ ‌హోటల్‌ అతడి విడిది. మారుపేరుతో ఉన్నందున తమ ప్రియతమ నేతాజీ తూర్పుకు వచ్చిన సంగతే చాలా రోజులవరకూ ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌, ఐఎన్‌ఎ ‌ముఖ్యులకు కూడా తెలియదు-పట్టుబట్టి అతడిని రప్పించిన ఒక్క రాస్‌ ‌బిహారీ బోస్‌కు తప్ప!

టోక్యోలో జపాన్‌ ‌మిలిటరీ అధికారులు అతిథి మర్యాదలైతే బాగానే చేశారు కానీ అసలైన ప్రధాని దర్శనం మాత్రం త్వరలో దొరికే సూచనలు కనిపించలేదు. పంపించటానికి జర్మనీ, వెళ్ళటానికి నేతాజీ సిద్ధంగా ఉన్నా అతడిని పిలిపించటానికి ఉత్సుకత చూపక దాదాపుగా సంవత్సరం పాటు తాత్సారం చేసినట్టే ఎట్టకేలకు అతడు టోక్యో చేరుకున్నాకా జపాన్‌ ‌ప్రధానమంత్రి జనరల్‌ ‌టోజో పట్టీ పట్టనట్టు వ్యవహరించాడు. దానికి అనేక కారణాలు. అసలే అతడికి ఐ.ఎన్‌.ఎ. అన్నా, భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న నాయకులన్నా పెద్ద సదభిప్రాయం లేదు. మోహన్‌సింగ్‌తో గొడవల తరవాత ఆ చికాకు ఇంకా ఎక్కువయింది. ‘చంద్రబోస్‌’ ‌గురించి బెర్లిన్‌ ‌నుంచి అందిన రిపోర్టులను బట్టి అతడు తాము ఆడించినట్టల్లా ఆడే కీలుబొమ్మ కాదని టోజోకు అర్థమైంది. అదీ కాక అప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం, భారతీయులతో అవసరాలు టోజోకు టాప్‌ ‌ప్రయారిటీ విషయమేమీ కాదు. అసలే అతడు పీకల లోతున సమస్యలలో మునిగి ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్ధంలో అక్షకూటమికి వరసగా అన్నీ పరాజయాలే. నేల మీద అప్పటిదాకా ఎదురులేని జపాన్‌ ‌జైత్రయాత్రకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పసిఫిక్‌ ‌యుద్ధంలో అమెరికా దూకుడుకు అక్షరాజ్యాలు గింగరాలు తిరుగుతున్నాయి. ఎడతెగని యుద్ధంవల్ల జపాన్‌ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయింది. నిత్యావసరాలకు కటకట ఎంత తీవ్రమంటే, పోషణకు తెరువులేక టోక్యో జూలో జంతువులన్నిటినీ చంపెయ్యాలనుకుంటున్నారు.

ఇలా ఆసక్తి లేక కొంత, ముసిరిన సమస్యలవల్ల కొంత అయి, నేతాజీకి ఎన్నిసార్లు అపాయింటు మెంటు కోసం ప్రయత్నించినా ప్రధానమంత్రిగారు చాలా బిజీగా ఉన్నారు. ఎవరినీ కలవలేరు – అన్న సమాధానమే వచ్చింది. ప్రాణాలకు తెగించి, మూడునెలలపాటు ప్రమాద భరిత ప్రయాణం చేసి చచ్చీచెడీ టోక్యో వస్తే అక్కడ అసామీకి దర్శనం ఇవ్వటానికే వారాలు తిరిగినా తీరిక దొరకలేదు. అక్కడికీ యమామోతో తన పలుకుబడినంతా వినియోగించి అపాయింటుమెంటు కోసం ప్రయత్నిం చాడు. ఎంతకీ పని కాకపోయేసరికి విసుగెత్తి, తనను సమన్వయ బాధ్యతనుంచి తప్పించమంటూ ఒక దశలో కాడికింద పారేయ్యబోయాడు.

ఆ సమయాన నేతాజీ స్థానంలో మరొకరు ఉంటే యమామోతో లాగే నిస్పృహ చెందేవారే. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌గొప్ప కార్యసాధకుడు. యధార్థ స్థితిని మదింపు చేసి వ్యూహాత్మకంగా కదలటంలో అందెవేసిన చేయి. జర్మనీలో హిట్లర్‌ ‌లాగా, ఇటలీలో ముస్సోలినీ లాగా జపాన్‌కు టోజో తిరుగులేని నియంత కాడు. అసలు నిర్ణాయక శక్తి మిలిటరీ. దానిపై అధికారం చెలాయించే సమానులలో టోజో ప్రథముడు మాత్రమే. మిలిటరీ వ్యవస్థ ఐచ్ఛిక సహకారం ఉన్నప్పుడే అతడు ఏమైనా చేయగలడు. టోజోను మాత్రం ఆకట్టుకున్నా, మిగతా ప్రభుత్వ ముఖ్యులు ప్రతికూలంగా ఉంటే ఏ పనీ సాఫీగా సాగదు. కాబట్టి ప్రధానమంత్రి తనను ఎంతకీ కలవలేదే అని గింజుకోకుండా, దొరికిన మూడు వారాల పైచిలుకు ఖాళీ సమయాన్ని పాలక వ్యవస్థలో తన పలుకుబడిని పెంచుకునేందుకు నేతాజీ చక్కగా వినియోగించుకున్నాడు. ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ ‌స్టాఫ్‌, ‌విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, త్రివిధ బలగాల అతిముఖ్య అధికారులతో వరసగా జరిపిన సమావేశాల పర్యవసానంగా వారందరికీ నేతాజీ అంటే గురి కుదిరింది. అతడికి మద్దతు ఇవ్వటం జపాన్‌కే మంచిదన్న అభిప్రాయం వారికి కలిగింది. నేతాజీ విశిష్ట వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయనతో కొద్దిసేపు మాట్లాడితేనే ‘‘నాకు ఉత్సాహం పెరిగింది. నా నెత్తురు మరిగింది. నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి.’’ అని బర్మా ఏరియా ఆర్మీకి చీఫ్‌ ఆఫ్‌ ‌స్టాఫ్‌ అయిన జనరల్‌ ‌కతకురా తరవాత కాలంలో గుర్తు చేసుకున్నాడు. అంతగా కదిలించాడు కాబట్టే సైన్యాధిపతి, విదేశాంగ మంత్రి నేతాజీ అడగ కుండానే చొరవ తీసుకుని జనరల్‌ ‌టోజోకు నచ్చచెప్పి అపాయింటుమెంటు ఇప్పించారు.

విశేషం ఏమిటంటే అంతలా బిర్రబిగిసి, మూడు వారాల పాటు వెయిట్‌ ‌చేయించిన జపాన్‌ ‌దేశాధినేత కూడా 1943 జూన్‌ 10‌న నేతాజీని కలిసి మాట్లాడగానే ముగ్ధుడయ్యాడు. ఆగ్నేయాసియాలో ఇండియన్లను తమ ప్రయోజనాలకు అడ్డంగా వాడుకోవాలే తప్ప వారి స్వాతంత్య్ర పోరాటాన్ని పెద్దగా సపోర్టు చేయకూడదు. ఐ.ఎన్‌.ఎ. ‌నాయక త్వాన్ని స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ప్రజానాయకుడికి అసలే అప్పగించకూడదు అని అప్పటిదాకా ఉన్న టోజో వైఖరి నేతాజీని కలిశాక మౌలికంగా మారింది. నేతాజీ విశిష్ట వ్యక్తిత్వం ఇటలీ నియంత ముస్సోలినీ లాగే జపాన్‌ అధినేత టోజోనూ సూదంటురాయిలా ఆకట్టుకుంది.

ఇండియా మీదికి జపాన్‌ ‌తన సేనలను పంపించి యుద్ధం చేయించి తమకు తేరగా స్వాతంత్య్రం ఇప్పించాలని భారతీయులు కోరుతున్నారని అప్పటిదాకా టోజోకు దురభిప్రాయం ఉండేది. నేతాజీని కలిశాక అది పోయింది. బోలెడు డబ్బు ఖర్చుపెట్టి, ఎందరో సైనికులను బలిపెట్టి మా యుద్ధాన్ని మీరు చేసిపెట్టనక్కరలేదు. భారత గడ్డ మీద మేము కాలు పెట్టగలిగేంతవరకూ మీ మిలిటరీ తోడుగా ఉంటే చాలు. ఆ తరవాత గెరిల్లా పోరాట దళాలను దేశంలోకి పంపించి మా యుద్ధం మేం చేస్తాం. మా రక్తాన్నే మేం చిందిస్తాం. మా స్వాతంత్య్రం మేం సాధించుకుంటాం- అని నేతాజీ సిన్సియర్‌గా చెప్పటంతో టోజోకు అతడిమీద గురి కుదిరింది. జీవితమంతా బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంతో రాజీలేకుండా పోరాడిన ట్రాక్‌ ‌రికార్డు, ప్రాణాలకు తెగించి చేసిన ప్రమాదభరిత సాహసాలు నేతాజీ మాటలకు విశ్వసనీయత పెంచాయి. దానికి తోడు భారత దేశంలో గాంధీ తరవాత అంతటి ప్రజాదరణ కలిగిన మహానాయకుడిగా నేతాజీ ఔన్నత్యం టోజోకు తెలుసు. అంతటివాడు మాట తప్పి ద్రోహం చేస్తాడన్న భయానికి ఆస్కారమే లేదు. పైగా నేతాజీని కలవటానికి ముందే అతడి గుణగణాలను మెచ్చుకుంటూ… నమ్మదగినవాడు, మనం దగ్గరికి చేర్చుకోదగ్గ వాడు, మనకు అక్కరకొచ్చేవాడు అంటూ విదేశాంగ మంత్రి శిగెమిత్సు, సైన్యాధిపతి సుగియామలు చేసిన బ్రీఫింగ్‌ ‌కూడా టోజో మీద పనిచేసింది. దాంతో తొలి కలయికలోనే నేతాజీ అతడికి తెగ నచ్చాడు. ఇండియన్ల మీద మునుపటి చులకనభావాన్ని, అనుమానాలనూ పక్కన పెట్టి అతడికి కోరిన సహాయం చేయటానికి సుముఖు డయ్యాడు. అయితే మాట ఇచ్చేముందు తన సహచరుల అభిప్రాయం కూడా తెలుసుకోవటం మంచిదని టోజో తలచాడు. దర్శనమే ఇవ్వకుండా అంతకుమునుపు నెలరోజులు ఠలాయించిన దేశాధినేత వైఖరి ఎంతలా మారిపొయిందంటే నాలుగురోజుల తరవాత మళ్ళీ కలుద్దామని తనంత తానే నేతాజీని కోరాడు.

అనుకున్నట్టే జూన్‌ 14‌న అత్యున్నత స్థాయిలో విస్తృత సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రి శిగెమిత్సుతో పాటు సైన్యాధిపతి సుగియామ, మరికొందరు ఉన్నతాధికారులు కూడా అందులో పాల్గొన్నారు. ముఖ్యంగా శిగెమిత్సు విజ్ఞత మీద ప్రధానమంత్రికి మహా గురి. బృహత్తర తూర్పు ఆసియా సమష్టి పురోభివృద్ధికి తాను వేసిన ప్రణాళికను జనరల్‌ ‌టోజో ఆ సమావేశంలో గొప్పగా వివరించాడు. ఇండియా స్వతంత్ర దేశం అయితేకానీ తమ ప్రణాళిక విజయవంతం కాదని నొక్కిచెప్పాడు. వీలయితే ఇండియాను ఆక్రమించాలని తమకు ఎప్పటినుంచో ఉన్న దురుద్దేశాన్ని కప్పిపుచ్చి నేతాజీని బుట్టలో వేయాలని చూశాడు. నేతాజీ మౌనంగా విన్నాడు. ఏ వ్యాఖ్యా చేయలేదు. తనకు మాట్లాడే వంతు వచ్చినప్పుడు రెండు సూటి ప్రశ్నలు వేశాడు. ఇండియా స్వాతంత్య్రం పొందటానికి సహాయపడేందుకు జపాన్‌ ‌సిద్ధంగా ఉందా అన్నది మొదటి ప్రశ్న. ఆ సహాయానికి షరతులు, ముందరి కాళ్ళకు బందాలు ఉంటాయా అన్నది రెండో ప్రశ్న. ఇండియన్‌ ఆర్మీ యుద్ధం చేస్తూ బయటినుంచి ఇండియా లోపలికి చొచ్చుకు వెళ్లి ప్రజల తోడ్పాటుతో దేశాన్ని బ్రిటిష్‌ ఆ‌క్రమణ నుంచి విముక్తి చేయాలన్నది నేతాజీ చిరకాల ప్రణాళిక. జపాన్‌ ‌తన సైనిక ఆపరేషన్లను ఇండియా లోపలికి విస్తరిస్తే కానీ భారత విమోచన సైన్యానికి ఆ అవకాశం రాదు. తీరా దేశం లోపలికి అడుగుపెట్టాక జపానే ఇండియా ఆక్రమణకు పాల్పడ చూస్తే కొరివితో తల గోక్కున్నట్టు అవుతుంది. కాబట్టి టోక్యో ఆంతర్యమేమిటో ముందే తేల్చుకోవాలని నేతాజీ ఉద్దేశం.

నిజానికి ఇండియా మీదికి దండెత్తటానికి జపాన్‌ అప్పటికే సన్నాహాలు చేస్తున్నది. కాని ఆ సంగతి బయటపెట్టటానికి టోజో సందేహించాడు. ఎందుకంటే -సైనిక దాడి ఎప్పుడన్నది ఇంకా నిర్ణయం కాలేదు. దాని గురించి ముందే చెప్పటం మంచిది కాదు. అందుకని తన సహచరులతో సంప్రదించ కుండా తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని టోజో మొదటి ప్రశ్నకు బదులిచ్చాడు. అది సమంజసమే కాబట్టి నేతాజీ దానిపై ఇంకా సాగ తీయలేదు. ఇండియా సరిహద్దులో దాడికి జపాన్‌ ‌సిద్ధమవుతున్నట్టు సైన్యాధిపతి సుగియామ అంతకుముందే నేతాజీ చెవిన వేశాడు కూడా.

అతి ముఖ్యమైనది రెండో ప్రశ్న. భారత స్వాతంత్య్రానికి తాము చేసే సహాయం వెనుక వేరే మతలబులు, షరతులు ఏవీ ఉండవని టోజో స్పష్టం చేశాడు. అంతేకాదు, నేతాజీ తలపెట్టిన కార్యాచరణకు మనస్ఫూర్తిగా సర్వవిధాల సహాయపడతామని ప్రధాన మంత్రి మాట ఇచ్చాడు కూడా. నేతాజీ వ్యక్తిత్వానికి జపాన్‌ అధినేత ఎంత ముగ్ధుడయ్యాడంటే ఏ అధికార హోదా లేని నేతాజీని రెండురోజుల్లో జరగనున్న జపాన్‌ ‌పార్లమెంటు అసాధారణ సమావేశానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించాడు. ‘‘ఈయన చాలా గొప్పవాడు. ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీని కమాండ్‌ ‌చేయటానికి అన్ని విధాల తగినవాడు’’ అని మీటింగు అయ్యాక ఫారిన్‌ ‌మినిస్టర్‌ ‌శిగేమిత్సుతో అన్నాడు టోజో. ‘‘బోస్‌ ‌సిన్సియారిటీ ఆయన ముఖ కవళికల్లో, ప్రతి కదలికలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆయన మాటలు విన్నవారెవరూ చలించకుండా ఉండలేరు.’’ అని తరవాత శిగేమిత్సు గుర్తుచేసుకున్నాడు.

1943 జూన్‌ 16‌న బృహత్తర తూర్పు ఆసియా సమష్టి పురోభివృద్ధి ప్రణాళికను చర్చించటానికి జపాన్‌ ‌పార్లమెంటు ప్రత్యేకంగా కొలువుతీరింది. దానికి సంబంధించిన విధాన ప్రకటనను చేస్తూ ప్రధానమంత్రి టోజో నేతాజీని సూటిగా చూస్తూ, ప్రధానంగా ఆయననే ఉద్దేశించి ఇండియా గురించి ఈ మాటలన్నాడు- ‘‘ఇండియా ఇంకా బ్రిటిష్‌ అణచివేత కింద మగ్గుతున్నందుకు మనం బాధపడుతున్నాం. ఆ దేశ స్వాతంత్య్ర పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. భారత స్వాతంత్య్రం కోసం సాధ్యమైన ప్రతి సహాయాన్నీ చేయటానికి మనం కృతనిశ్చయంతో ఉన్నాం.’’ ఇండియా లోపలి మిలిటరీ ఆపరేషన్లకు జపాన్‌ ‌సహాయపడుతుందా అని అంతకుముందు నేతాజీ వేసిన ప్రశ్నకు ఆ విధంగా జవాబు దొరికింది. ఇండియా విమోచనకు సాయపడతామని అంత స్పష్టమైన కమిట్మెంటును అప్పటిదాకా ఏ దేశం నుంచీ గాంధీజీ సహా ఏ భారత నాయకుడూ రాబట్టలేక పోయాడు.

సాధ్యమైన ప్రతి సహాయాన్నీ చేస్తామని ప్రధానమంత్రే పార్లమెంటు వేదికపై హామీ ఇచ్చాక నేతాజీకి అజ్ఞాతవాసం అవసరం తీరింది. మెత్సుడా అనే మారుపేరును వదిలి మూడురోజుల తరవాత టోక్యోలో తన అసలుపేరుతోనే సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్ ‌పెట్టాడు. 60 పత్రికల ప్రతినిధులు, అనేక దేశాల దౌత్య ప్రతినిధులు హాజరైన నాటి సమావేశంలో టోజో ఇండియాకు ఇచ్చిన హామీ ప్రాముఖ్యాన్ని నేతాజీ నొక్కిచెప్పాడు. ‘‘భారత స్వాతంత్య్ర ఉద్యమం ఇకపై సాయుధ పోరాటంగా మారుతుంది. యుద్ధంలో అక్షరాజ్యాల కూటమి గెలుస్తుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి తీరుతుంది.’’ అని ఎలుగెత్తి చాటాడు. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌జపాన్‌ ‌చేరిన సంగతి ప్రపంచానికి అప్పుడే తెలిసింది. అదేరోజు నేతాజీ భారత ప్రజలను ఉద్దేశించి రేడియోలో మాట్లాడాడు. ‘‘మిత్రులారా! సమయం వచ్చినప్పుడు నేను, ఇంకా ఎంతోమంది మీ పక్కన నిలబడి పోరాటం సాగిస్తామని ఇంతకుముందు చెప్పాను. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. నేను భారత సరిహద్దుకు ఎంతో దూరంలో లేను. 1941 జనవరిలో నేను దేశం దాటి పోకుండా ఏ శక్తీ అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు కూడా మన జాతీయ పోరాటం చివరి దశలో పాల్గొనటానికి నేను సరిహద్దు దాటి రాకుండా భూమి మీద ఏ శక్తీ అడ్డుకోజాలదు.’’ అన్న ప్రియతమ నేతాజీ సింహగర్జనకు యావద్భారతం పులకరించిపోయింది.

‘‘జనరల్‌ ‌టోజో భారత స్వాతంత్య్రానికి బాసటగా గొప్ప ప్రకటన చేశాడు. మన స్వాతంత్య్ర పోరాటానికి జపాన్‌ ‌ప్రభుత్వం నుంచి సకలవిధాలా సహాయపడటానికి ఆయన కంకణబద్ధుడయ్యాడు. మన విషయంలో ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు’’ అంటూ జూన్‌ 21, 24 ‌తేదీల్లో రేడియో ప్రసంగాలలో నేతాజీ ఉద్ఘాటించాడు. ఇంతలా నొక్కిచెప్పింది టోజో వరానికి మురిసి కాదు. జపాన్‌ ‌పార్లమెంటులో చేసిన బస నుంచి టోజో వెనక్కిపోకుండా కట్టడి చేయటానికి! జర్మనీలో హిట్లర్‌ ‌మీద లాగే జపాన్‌లో టోజో మీదా నేతాజీకి భ్రమలేవీ లేవు. బ్రిటన్‌ను రక్షించుకోవటానికి దయ్యాలతోనైనా కరచాలనం చేస్తానని ప్రకటించి, బోల్షెవిక్కుల ఘోరఘాతుకాలను మరచి చర్చిల్‌ ‌స్టాలిన్‌తో చేతులు కలిపినట్టే బోస్‌ ‌తన దేశ స్వాతంత్య్రం కోసం హిట్లర్‌, ‌టోజోల సహాయం తీసుకున్నాడు.

నేతాజీ వ్యూహం ప్రకారం భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్‌ ‌సేనలపై సాయుధ యుద్ధం జరిగి తీరాలి. అందులో ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌ముందుండి వీరోచితంగా పోరాడాలి. బ్రిటిష్‌ ‌కొలువులో ఉన్న భారత సేనల విధేయత మీద అది బలమైన ప్రభావం చూపాలి. స్వాతంత్య్ర సైనికుల శౌర్యం, త్యాగం ప్రజలను కదిలించాలి. ఇది సాధ్యమైనంత త్వరగా జరగాలి. ఆలస్యం అయితే యుద్ధంలో వరస పరాజయాలతో జపాన్‌ ‌మిలిటరీ స్థితి నానాటికీ బలహీనపడుతుంది. ఇప్పటికే జపాన్‌ ‌పాలకవర్గంలో ఇండియాపై సైనిక చర్యను వ్యతిరేకిస్తున్న శక్తులు పరిస్థితి ఇంకా అధ్వాన్నమైతే దాన్ని అసలే పడనివ్వవు. ఇండియాపై దాడి జపాన్‌ ‌కంటే భారత విముక్తికి ఎక్కువ అవసరం. అందుకే ఆ దాడిని తనకు ప్రతిష్టాత్మకంగా టోజో పరిగణించేలా చేయాలని నేతాజీ తహతహలాడారు.

సర్వవిధాల సహాయపడతామన్న హామీని టోక్యోనుంచి రాబట్టాక సమయం వృథా చేయకుండా కార్యరంగంలోకి దూకదలిచాడు. సింగపూర్‌, ‌మలయా, ఇతర ఆగ్నేయాసియా దేశాలు యుద్ధ సన్నాహాలకు ఆయన ఎంచుకున్న కార్యక్షేత్రం. టోక్యోలో మిగిలిన చివరి పని సింగపూర్‌ ‌కేంద్రంగా ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటుకు జపాన్‌ ‌గవర్నమెంటును ఒప్పించటం. దానికి సూత్రరీత్యా అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఆధికారిక నిర్ణయాన్ని ఆలోచించి తెలియపరుస్తామని బోస్‌కు ప్రభుత్వం సమాధాన మిచ్చింది. 40 రోజుల టోక్యో మజిలీకి ముగింపుగా జపాన్‌ ‌ప్రజలకు శుభాకాంక్షలు చెపుతూ రేడియో ప్రసంగాన్ని రికార్డు చేసి నేతాజీ సింగపూర్‌కు విమానం ఎక్కాడు. ఆయన వెళ్ళిన మరునాడు ఆ ప్రసంగం ప్రసారమయింది.

 మిగతా వచ్చేవారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram