మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడ కూడదంటారు. శవాలతో శత్రుత్వం సరికాదంటారు. భారతీయమైన విశ్వాసమిది. కాబట్టి మన మధ్యలేని వారి గురించి చెడుగా రాయకూడదు కూడా. కానీ అన్ని విలువలు వదిలిపెట్టేసి, శవ రాజకీయాలే ధ్యేయంగా కొందరు సాగిస్తున్న విశృంఖల, నిర్హేతుక వ్యాఖ్యానాలను బట్టి అలాంటి ఒక విషయం చర్చించక తప్పడం లేదు. మరొక అంశం కూడా బాధ్యత, సంస్కారం కల పౌరులు నోరు విప్పక తప్పని స్థితి కల్పిస్తున్నది. యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి, ఐక్య రాజ్యసమితి మానవహక్కుల రక్షకుడు ఈ శవ రాజకీయాల కూటమికి వంత పాడారు. ఇది ముమ్మాటికి అభ్యంతరకరం. సార్వభౌమాధికారం మీద దాడి. వాళ్లు రాజకీయానికి ఉపయోగించుకుంటున్న ఆ మృతదేహం ఎంతటి విధ్వంసకర శక్త్తిదో ఇక వెల్లడించక తప్పదు. క్రైస్తవం మాటున భారత ఐక్యతను సిలువెక్కించడానికి ఎంతకాలంగా వేచి ఉన్నాడో గుర్తు చేయక తప్పదు. ఇదంతా స్టానిస్లాస్‌ ‌లుర్డ్‌స్వామి లేదా స్టాన్‌స్వామి శవాన్ని అడ్డం పెట్టుకుని భారతీయత మీద సాగిస్తున్న నీచమైన ప్రచారం గురించే. జీవించి ఉండగా ఆయన విధ్వంసం కోసం ఉవ్విళ్లూరారు. ఇప్పుడు ఆయన మృతదేహాన్ని విధ్వంసానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌తదితర బీజేపీయేతర పక్షాలు వెనుక ఉండి హడావిడి చేస్తున్నాయి.

84 ఏళ్ల ఈ వృద్ధ కేథలిక్‌ ‌మత గురువు, అలాగే మావోయిస్టు స్టాన్‌స్వామి జూలై 5, సోమవారం చనిపోయారు. ఆయన బెయిల్‌ ‌కోసం తపించి తపించి ప్రభుత్వ కస్టడీలో నిస్సహాయంగా చనిపోయాడని వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. కాలమిస్టులు, కవులు రెచ్చిపోయి నివాళి స్తోత్రాలు అందుకున్నారు. రోమన్‌ ‌కేథలిక్కుల ఆసుపత్రిలో, అక్కడి వైద్యుల సేవలోనే ఆయన చనిపోయిన వాస్తవాన్ని దాచి పెడుతున్నారు. నిజానికి ఆ గోలంతా స్టాన్‌స్వామి గురించి కానే కాదు. ఆ సంతాప సందేశకులలో ఎంతమందికి ఆయన గురించి తెలుసో కూడా చెప్పలేం. తల్లి కుక్క మొరిగితే పిల్లకుక్కలు అందుకునే చందమే అదంతా. అవన్నీ బీజేపీ ప్రభుత్వాన్నీ, ప్రధాని నరేంద్ర మోదీనీ దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా దేశం నెత్తిన రుద్దాలనుకున్న కుళ్లు రాజకీయ అభిప్రాయాలు. కొందరు మినహా సామాజిక మాధ్యమాలను ఎక్కువ మంది మొసలి కన్నీళ్లతో ఖరాబు చేశారు. అయితే వాస్తవాలు ఏమిటి? ఒక ప్రఖ్యాత ఇంగ్లిష్‌ ‌చానెల్‌ ‌వెబ్‌సైట్‌ ఇచ్చిన వాస్తవాలనే చర్చిద్దాం. ఇవి కేంద్ర సమాచార, ప్రసారశాఖ సలహాదారు, ప్రముఖ జర్నలిస్ట్ ‌కంచన్‌ ‌గుప్తా ఇచ్చినవి.

స్టాన్‌స్వామి మృతికి మూడు కారణాలు వెతికి పట్టారు అభిమానులు. అవి- అస్వస్థులుగా ఉన్నా ఆయనకు బెయిల్‌ ‌నిరాకరించారు. తగిన వైద్యం అందించలేదు. ఉగ్రవాదం కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ మూడు కారణాలు కూడా పచ్చి అబద్ధాలే కాకుండా, ప్రజలను పెడతోవ పట్టించేవే నని ఆ వ్యాసం నిష్కర్షగా చెప్పింది. భారత ప్రభుత్వం మీద బురదజల్లడమే ధ్యేయంగా నిజాలను ఘోరంగా వక్రీకరించారని కూడా కుండబద్దలు కొట్టింది. ఇంకొక పరోక్ష ఆరోపణ కేథలిక్‌ ‌మతగురువు కాబట్టే ఆయన మీద భారత ప్రభుత్వం కక్ష కట్టిందట. ఇది ఇంకా పరమనీచమైన ఆరోపణ మాత్రమే. భీమా కొరెగావ్‌ ‌కుట్ర కేసులో అన్ని వర్గాల వారు ఉన్నారు. స్టాన్‌ ‌స్వామిని మాత్రమే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకోలేదు. తాను ఏనాడూ భీమా కొరెగావ్‌ ‌వెళ్లనే లేదని, కేసులలో ఇరికించారనీ, తాను మావోయిజాన్ని వ్యతిరేకిస్తాననీ స్టాన్‌స్వామి చెప్పినట్టు కొన్ని నివాళులలో కనిపించింది. దీనిని దేశం నమ్ముతుందనే వాళ్ల నమ్మకం కాబోలు! నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ‌స్టాన్‌స్వామి మీద చేసిన ఆరోపణ-ఆయన నిషిద్ధ మావోయిస్టు పార్టీతో కలసి దేశంలో కల్లోలం సృష్టించడానికి కుట్ర పన్నారు. ఎలాంటి ఆరోపణలతో న్యాయస్థానం ఆయన మీద విచారణ చేపట్టిందో పరిశీలించాలి. ఆ కోర్టులకు కూడా స్టాన్‌స్వామి అభిమానులు దురుద్దేశాలు అంటకడతారు. కానీ న్యాయవ్యవస్థను గౌరవించేవారంతా ఆ క్రమాన్ని పట్టించుకోవాలి.

డిసెంబర్‌ 31, 2017‌న పుణేలోని శనివార్‌ ‌వాడలో కబీర్‌ ‌కళామంచ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌సభ్యులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసాలన్నీ భారతీయుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, హింసకు పాల్పడేందుకు ఉద్దేశించినవేనని ఆరోపిస్తూ విశ్‌రామ్‌బాగ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో జనవరి 8, 2018న కేసు నమోదయింది. ఆ ఉపన్యాసాల తరువాత రాష్ట్రంలో హింస చెలరేగి ఆస్తిప్రాణ నష్టాలు జరిగాయి కూడా. తరువాత జరిగిన దర్యాప్తులో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌సభ్యులకూ, మావోయిస్టులకూ సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి బయటపడింది. దీనితో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏ ‌దర్యాప్తునకు ఆదేశించింది. అలా జనవరి 24, 2020న భీమా కొరెగావ్‌ ‌కేసు ఉనికిలోకి వచ్చింది. స్టాన్‌స్వామికీ, మావోయిస్టులకూ మధ్య బంధం చాలా గాఢమైనదేనని కూడా తవ్వేకొద్దీ బయటపడింది. పెర్‌సెక్యుటెడ్‌ ‌ప్రిజనర్స్ ‌సాలిడారిటీ కమిటీకి (అక్రమ నిర్బంధ ఖైదీల సంఘీభావ సంఘం) కన్వీనర్‌ ‌స్టాన్‌స్వామి. ఇది మావోయిస్టుల సంస్థ. ఇలాంటి గట్టి ఆధారాలతోనే అక్టోబర్‌ 8, 2020‌న స్టాన్‌స్వామిని రాంచీలో అరెస్టు చేశారు.

ఆ అరెస్టు కూడా ఆయన న్యాయవాది పీటర్‌ ‌మార్గిన్‌ ‌సమక్షంలోనే జరిగింది. అరెస్టుకు కారణాలు, సంబంధిత చట్టాలు కూడా తెలియచేశారు. అరెస్టు తరువాత, కోర్టులో ప్రవేశపెట్టే ముందు కూడా వైద్య పరీక్షలు జరిగాయి. సెక్షన్‌ 54 ‌ప్రకారం డాక్టర్‌ అన్ని పరీక్షలు చేసి, ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్టు సర్టిఫికెట్‌ ఇచ్చారు. జుడిషియల్‌ ‌కస్టడీకి తీసుకునే ముందు కూడా వైద్య పరీక్షలు జరిపారు. రాంచీ నుంచి ముంబైకి తరలించినప్పుడు ఆయన వయసు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ రికార్డులలో ఉన్నాయి. ఎన్‌ఐఏ ‌స్టాన్‌స్వామి కస్టడీ కోరలేదని, కావాలని జైల్లోనే ఉంచారని కొందరి ఆరోపణ. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకోలేదు. అంటే అంత బరితెగించి రాజ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారాయన. అక్టోబర్‌ 9, 2020‌న ముంబైలో ఎన్‌ఐఏ ‌ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా దర్యాప్తు అధికారులు అనుచితంగా ప్రవర్తించారని స్టాన్‌స్వామి ఫిర్యాదు చేయలేదు. చార్జిషీట్‌ను పరిశీలించిన తరువాత కోర్టు ముంబైలోనే తలోజా కేంద్ర కారాగారానికి పంపమని ఆదేశించింది. అక్కడ కూడా ఆయన వయసును బట్టి ఆసుపత్రి జైలులోనే ప్రత్యేక సెల్‌ ఇచ్చారు. వైద్యాధికారి సలహా మేరకు ఇద్దరు సహాయకులను ఉంచారు. చక్రా కుర్చీ, వాకర్‌, ‌నడక కర్ర, సిప్పర్‌, ‌మగ్‌, ‌కమ్మోడ్‌ ‌చైర్‌, ఆయన వినికిడి యంత్రం కోసం సెల్‌ ‌బ్యాటరీలు, దంత వైద్యం అందించారు. ఇవేమీ ఇవ్వలేదని సామాజిక మాధ్యమ వీరుల ఆరోపణ. మానసిక వైద్య నిపుణుడితో మాట్లాడేందుకు, టెలిమెడిసిన్‌ ‌తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా ఆయనకు వైద్యం అందలేదని చెప్పడం నీచం కాదా?

కొవిడ్‌ అనంతర సమస్యలతో బాధపడుతున్న తనకు బెయిల్‌ ఇవ్వాలని స్టాన్‌స్వామి ముంబై హైకోర్టులో మే 21, 2021న దరఖాస్తు చేసుకున్నారు. ఆ కోర్టు నిరాకరించింది. మే 23న ఎన్‌ఐఏ ‌ప్రత్యేక కోర్టు కూడా తిరస్కరించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం జేజే హాస్పిటల్‌ ‌డాక్టర్ల బృందం ఇచ్చిన నివేదిక అధారంగా అదే ఆసుపత్రిలో చేర్చాలని సూచించింది. చిత్రం ఏమిటంటే, ఈ ప్రతిపాదనను స్టాన్‌స్వామి నిరాకరించి, బాంద్రాలో ఉన్న హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేర్చాలని కోరారు. ఆయన క్రైస్తవేతర వైద్యులను, ఆసుపత్రులను నమ్మలేదని అర్ధమవుతుంది. ఆ మేరకే హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేరేందుకే కోర్టు అనుమతించింది. ఇది కేథలిక్‌ ఉర్సులీన్‌ ‌సిస్టర్స్ ‌నిర్వహిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (ఈ ‌విషయాలన్నీ కాలమిస్టులు, సామాజిక మాధ్యమ వీరులు దాచిపెడుతున్నారు). జూలై ఆరు వరకు అక్కడే వైద్య సదుపాయం కల్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ జూన్‌ 3‌న ఆయనకు ఆ హోలీ హాస్పిటల్‌లోనే గుండెపోటు వచ్చింది. ఐదున ఆయన గుండెపోటుతో చనిపోయా రని అక్కడి డాక్టర్‌ ఇయాన్‌ ‌డిసౌజా ప్రకటించారు. స్టాన్‌స్వామి న్యాయవాది కూడా ఇదే కోర్టులో చెప్పారు. ఇవేవీ నిరాకరించలేని వాస్తవాలు. కాబట్టి ఆయన వైద్యం అందక చనిపోయారని ఎవరు ఆరోపించినా అది నీచాతినీచమైన అబద్ధం. అంతిమ క్షణాలలో ఆయనకు వైద్యం అందించినది ఆయన కోరుకున్న హోలీ ఆసుపత్రి. పైగా ఆ వయసు వారికి గుండెపోటు రావడం సర్వసాధారణం.

స్టాన్‌స్వామి మీద ఉగ్రవాదం ఆరోపణలు అసత్యమని చెబుతున్న మాట కూడా పచ్చి దురుద్దేశంతో కూడినదే. భారత న్యాయ చట్టాల ప్రకారమే, నిర్దిష్ట ఆరోపణల మేరకే కేసులు పెట్టారు. క్రైస్తవం మాటున ఆదివాసీల హక్కులంటూ, మానవహక్కులంటూ ఎన్ని నేరాలకు పాల్పడినా, సార్వభౌమాధికారాన్ని సవాలు చేయాలనుకున్నా కూడా అలాంటి వారిని తప్పు పట్టడం పాపమని సామాజిక మాధ్యమ అంధుల విశ్వాసం కాబోలు! కానీ చట్టం అందుకు ఒప్పుకోదు. స్టాన్‌స్వామిని కారాగారంలో వేధించారన్న ఆరోపణ కూడా పెద్ద అబద్ధం. ఆయనకు బెయిల్‌ ఇవ్వాలా వద్దా అన్నది కోర్టుల పరిధిలోనిది. మన చట్టాల ప్రకారం వయసును బట్టి, విశ్వాసాలను బట్టి, కులం, మతం ఆధారంగా మినహాయింపులు ఇచ్చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్‌ ‌మంజూరు చేసే పద్ధతి ఏదీ లేదు. మావోయిస్టులతో ఆయనకు ఉన్న సంబంధాలను బట్టి హింసామార్గంలోనే ఆయన ఉన్నారని తేలుతుంది. కేవలం సానుభూతిపరుడు కూడా కాదు, స్వయంగా సంబంధాలు ఉన్నవారు. జార్ఖండ్‌లో పతల్‌గాడి ఉద్యమం ప్రారంభించి నందుకు గతంలోను ఈయన మీద కేసులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే గిరిజన హక్కుల పేరుతో ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నదే నిజమని ఎన్‌ఐఏ ‌నమ్ముతోంది. ఇక ఎల్గార్‌ ‌పరిషత్‌ అం‌టే రాజ్యం మీద యుద్ధం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ప్రయోగాలు చేసే సంస్థ. అలాగే పట్టణ, నగర ప్రాంతాలలో మావోయిజంను విస్తరించడానికి పనిచేసే సంస్థ.

ఈ దేశంలో క్రైస్తవ బోధకుల దేశద్రోహ కార్యకలాపాలు కొత్తకాదు. సేవ పేరుతో, విద్య పేరుతో ఆంగ్ల పాలకుల కాలం నుంచి ఇదే జరుగు తోంది. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ కాలంలో కూడా మత బోధకులను ఇవే ఆరోపణలతో దేశం నుంచి బహిష్కరించిన సంగతి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ చట్టాలు బీజేపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి తెచ్చినవి కావు. ఈ గుడ్డి సామాజిక మాద్యమ యోధులు మరొక విషయం తెలుసుకోవాలి. ఏడుదశాబ్దాల నుంచి ఈ దేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక స్పెయిన్‌ ‌కేథలిక్‌ ‌మత బోధకుడు ఉన్నారు. ఆయనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చింది. ఇంకా చిత్రం, 2012లో పౌరసత్వం కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తిరస్కరించింది. బహుశా ఆయన నిస్వార్థ సేవకే పరిమితమై ఉండాలి. ఇది సోనియా బృందానికి ఎలా నచ్చుతుంది?

ఈ అంధ మేధావులు గమనించవలసిన మరొక అంశం- స్టాన్‌స్వామి సభ్యుడిగా ఉన్న మావోయిస్టు/నక్సల్‌ ‌సంస్థ గడచిన రెండు దశాబ్దాలలో 3,600 మంది సాధారణ పౌరులను, 2,616 భద్రతా బలగాలను చంపింది. ఈ దృష్ట్యా క్రీస్తు చెప్పిన శాంతి సందేశాన్ని స్టాన్‌స్వామి విశ్వసించారని ఎవరైనా ఎలా చెప్పగలరు? ఇక పేలుళ్లు, ఇన్‌ఫ్మార్ల పేరుతో పేదలు, గిరిజనలపై మావోయిస్టులు సాగించిన దారుణాలకు లెక్కేలేదు. ఈ దేశంలో మానవహక్కులు కేవలం మావోయిస్టులకు, ముస్లిం మతోన్మాదులకు, భారత రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసేవారికేనా అన్న ప్రశ్న స్టాన్‌స్వామి మరణం దరిమిలా మరొకసారి వేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. నిజానికి తెచ్చారు. అలాగే మానవ హక్కులకు హిందువులు అనర్హులని వీరంతా భావిస్తున్నారనడానికి సమీప గతంలోని కొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు. పాల్ఘార్‌ ‌వద్ద ఇద్దరు హిందూ సాధువులను, కారు డ్రైవర్‌తో సహా అంత కిరాతకంగా చంపేస్తే ఈ సామాజిక మాధ్యమ వదరుబోతులు ఎందుకు నోరెత్తలేదు? ఇప్పటికైనా చెబుతారా! ఇలాంటివి ఎన్నో! ఇక్కడ మానవహక్కులు అంటే కసబ్‌లకీ, బుర్హాన్‌వానీలకీ, స్టాన్‌స్వాములకే వర్తిస్తాయా!

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram