ప్రధాని నరేంద్రమోదీ మంత్రివర్గ విస్తరణలో మనకు కనిపిస్తున్నదేమిటి? రాజకీయ నిపుణత అంటారు కొందరు. మరో మూడేళ్లలో (2024) జరిగే పార్లమెంట్‌ ఎన్నికల కోసమని చెబుతారు మరికొంతమంది. ప్రాంతీయ సమతౌల్యం, సామాజిక వర్గాల నేపథ్యం, మరీ ముఖ్యంగా అమాత్యుల మునుపటి పనితీరు ఆధారాలని మరెందరో విశ్లేషిస్తున్నారు. పాలనాపరంగా మరింత పట్టు సాధించడం, తనదైన ప్రత్యేక ముద్ర కొనసాగిస్తూనే సరికొత్త నేతృత్వానికి బాటలు వేయడం ఆయన లక్ష్యాలని తేల్చి చెబుతున్నవారూ ఎందరెందరో. ఎవరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా ఈ తాజా కూర్పులో అత్యున్నతంగా వెల్లివిరుస్తోందేమిటో తెలుసా? వనితాశక్తి. కేబినెట్‌ ‌హోదాలో మునుపటి ఇద్దరు, సహాయ మంత్రులుగా తొమ్మిదిమంది. మొత్తం సంఖ్య పదకొండు. వారందరి గురించీ ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం!

నిర్మలా సీతారామన్‌ : ఆర్థిక, కార్పొరేట్‌ ‌వ్యవహారాలంటే ఈమె ముందుగా మన మదిలో నిలుస్తారు. అంతర్జాతీయ అధ్యయనం, సమాచార సమీకరణ పూర్వానుభవంతో విశిష్టురాలు. మునుపు రక్షణ మంత్రిత్వశాఖ సమర్థ నిర్వహణతో యశస్సు గడించిన దీక్షాదక్షురాలు. రాసే ప్రతిమాట, మాట్లాడే ప్రతీ వాక్యంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రస్తుత వయసు 61 ఏళ్లు. అత్యంత శక్తిమంత వనితలుగా నిరుడు ప్రకటితమైన వందమంది జాబితాలో స్థానం సంపాదించారు. చేపట్టిన ఏ పనిలోనైనా విజయ సాధన పరిపాటి ఈమెకు.

స్మృతి ఇరానీ: అంచెలంచెల ఎదుగుదల, నిర్భయంగా భావవ్యక్తీకరణ ఈమె సహజ స్వభావం. మానవ వనరులశాఖ అనుభవ నేపథ్యంలో ప్రస్తుతం స్వీకరించిన మహిళా సంక్షేమంలోనూ సొంత ముద్ర కనబరుస్తారన్నదే అనేకుల ప్రగాఢ నమ్మిక. మధ్యతరగతి కుటుంబంలో జననం వల్ల సామాన్యుల కష్టసుఖాలన్నీ పూర్తిగా తెలుసు. భారతీయ జనతా పార్టీ మహిళా విభాగ నేతగా ఇదివరకే పనిచేశారు కాబట్టి, క్షేత్ర స్థాయి వాస్తవాలన్నీ అవగతం. అంతేకాక, ‘మార్పు కోరదాం’ పేరుతో గతంలో స్వచ్ఛంద సంస్థనూ నిర్వహించారు. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే స్త్రీజన పురోగతి సాధ్యమవుతుందని త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తారు. సమాచార, ప్రసారశాఖల నిర్వాహకత్వమూ అనుభవమైనందున స్త్రీలోకం పైన తనకంటూ ప్రత్యేకమైన దృక్పథం మెండు. తెరముందు, వెనకా వ్యవహారశైలి పైన సంపూర్ణ అవగాహన ఉన్నవారీమె.

మీనాక్షి లేఖి: మంత్రివర్గంలోకి కొత్తగా ప్రవేశించిన ఏడుగురు అతివల్లో ఒకరు. విదేశీ స్థితిగతుల మీద ఎంత పట్టు ఉందో, దేశ సాంస్కృతిక రంగాభివృద్ధిపై అంత పట్టుదల నిండిన వ్యక్తి. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థినిగా ఉన్నప్పుడు భారతీయ సంస్కృతీ ప్రాచుర్యానికి అహరహం శ్రమించారు. విలువలకు విఘాతం కలిగిందని అనుకున్నప్పుడు సూటిగా ధాటిగా బాధ్యులను నిలదీశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నవారు కనుక సంబంధిత అంశంపైన సూటిగా మాట్లాడగలరు. ప్రెస్‌ ‌కౌన్సిల్‌లో కీలక బాధ్యత వహించిన వారవడంతో, ఎక్కడ ఏ దశలోనూ తడబాటూ ఉండదు. సామాజిక క్రియాశీలిగా, హక్కుల పరిరక్షణ తీరు తెలిసిన వనితారత్నంగా వన్నె గడించారు. తాను నమ్మిన వాటిని టీవీ చర్చా వేదికల్లో ఢంకా బజాయించి చెప్పగల ధీర.

సాధ్వీ నిరంజన్‌ ‌జ్యోతి: వినియోగ వ్యవహారాలనే కాక పూజాపంపిణీ వ్యవస్థ బాగుదలకు పగ్గాలు చేపట్టిన నాయిక. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేష్‌పుర్‌ ‌నియోజకవర్గ జన ప్రతినిధి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవారు కావడంతో, ఆయా పరిస్థితులన్నీ తెలిసి ఉన్నవే. క్షేత్ర పర్యటనలను ఎంతగానో ఇష్టపడే ఈ అమాత్యురాలి వయసు 54 సంవత్సరాలు. పదిహేడో లోక్‌సభ సభ్యురాలిగా తానేమిటో ఇప్పటికే నిరూపించారు. ఇంతకు మునుపు అంచనాల కమిటీ, సామాజిక న్యాయ సాధన సంఘాలకు ప్రాతినిధ్యం వహించారు. పేదబాలికలకు చేదోడువాదోడుగా నిలవాలన్న ధ్యేయాన్ని కొన్నేళ్లుగా ఆచరించి చూపు తున్నారు. సమస్యకు పరిష్కారం సత్వర చర్చలేనన్నది తన నిశ్చితాభిప్రాయం.

అనుప్రియా పటేల్‌ : ‌పరిశ్రమలు, వాణిజ్య రంగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల కిందట మిర్జాపుర్‌ ‌స్థానం నుంచి గెలిచారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న పరిణత మనస్కు రాలు. మంత్రిగా పిన్న వయస్కురాలు (40 ఏళ్లు). గతంలో ఆరోగ్యశాఖ విధులు నిర్వహించినవారు. విశేషించి, బోధకురాలుగా పురస్కారాలెన్నో అందు కున్నారు. ఇప్పుడీ బాధ్యతల నిర్వాహకత్వం భాగ స్వామినైనందుకు మహదానందంగా ఉందన్నారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ ‌కోర్సును ఛత్రపతి సాహూజీ మహరాజ్‌ ‌విశ్వవిద్యాలయం నుంచి పొంది ఉండటం మరొక విలక్షణత.

శోభ కరంద్లాజే : కర్ణాటక ప్రాంతీయ చరిత్ర క్షుణ్ణంగా తెలిసి ఉన్నవారంటే,  మూలకారణం ఈమె ఉడిపి చిక్‌మంగళూరు నియోజవర్గానికి చెందినవారై ఉండటం. మైసూరు సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా సోషల్‌ ‌వర్క్‌లో మాస్టరు డిగ్రీ చేశారు. అలాగే మంగళూరు వర్సిటీ నుంచి కూడా అనంతర విద్య అభ్యసించారు. ప్రస్తుతం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రివర్యులు. వయసు 54 ఏళ్లు. కార్యకర్తలందరూ గౌరవాభిమానా లతో ‘శోభక్కా’ అని పిలుస్తుంటారు. సదా చిరునవ్వుతో తమ అభిమతాలు నెరవేరుస్తారని చెబుతుంటారు. ప్రస్తుత బాధ్యతలనూ శోభ అదే రీతిలో నిర్వర్తిస్తారని అంతా ఆశించవచ్చు.

దర్శన విక్రం జర్దోస్‌ : ‌గుజరాత్‌లోని సూరత్‌ ‌నుంచి లోక్‌సభకు ఎన్నికైన నాయకురాలు. తానిప్పుడు రైల్వే, జౌళి శాఖలకు సహాయమంత్రి. పార్టీ పరంగా మునుపు ఉపాధ్యక్ష బాధ్యతలు వహించారు. అంతేకాక వివిధ స్థాయీ సంఘాలు, సంప్రదింపుల కమిటీల సభ్యురాలిగానూ పనిచేశారు. 60 ఏళ్ల వయసు. ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నారు. అప్పట్లో స్థానిక నగర పాలక సంస్థ కార్పొరేటర్‌, ఆ ‌రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి సభ్యుల్లో ఒకరు. కంప్యూటర్‌ ‌కోర్సునూ అభ్యసించి ఆ రంగంలో సైతం నిపుణత పొందారు. జాతీయ మహిళా మోర్చాకూ ప్రధాన కార్యదర్శి పదవికీ రాణింపు తెచ్చారు. గత ఎన్నికల్లో ఓట్ల పరంగా రికార్డు సృష్టించారు.

రేణుకాసింగ్‌ ‌సరుతా: గిరిజన వ్యవహారాలు చూసే ఈ మంత్రి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతం. 57 ఏళ్ల వయస్కురాలు. భర్త నరేంద్రసింగ్‌. ‌సర్జువా ప్రదేశంలోని రామానుజనగర్‌లో నివాసం. రేణుక జనపద పంచాయతీ మొదలు సమాజ సంక్షేమ బోర్డు, ఆదివాసీ అభివృద్ధి ప్రాధికార సంస్థ, మరెన్నో చోట్ల విధులు నిర్వహించి తానేమిటో చాటుకున్నారు. అలనాడు రాజకీయంగా కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్చుకొని ముందుకు కొనసాగారు. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. గ్రామీణుల జనజీవితా లతో మమేకమవుతూనే వస్తున్నారీ మహిళా నేత.

అన్నపూర్ణాదేవి: కేంద్ర విద్యాశాఖకు సహాయమంత్రి. ఝార్ఖండ్‌ ‌వాస్తవ్యురాలు. వయసు 51 సంవత్సరాలు, కొడెర్మ ఎంపీగా అక్కడివారి ఆదరాభిమానాలు సంపాదించారు. వనితా సాధికారత, ఇంధన వనరుల వినియోగం, ఇతర సంఘాల ప్రతినిధిగా అపార అనుభవం గడించారు. తండ్రి దారాప్రసన్న, తల్లి రేవతి. సొంత ఊరు దుంకా పరిసరాల్లోని అజ్మేరి. భర్త దివంగతులవ డంతో, తన ముగ్గురు పిల్లలకీ అన్నీ తానై విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారీమె. రాంచీ వర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ‌చేశారు. తొలి నుంచీ సామాజిక సేవా కార్యకర్తగా అనుపమాన సేవలందిస్తున్నారు. పార్టీలో జాతీయ ఉపాధ్యక్ష పదవిని మునుపే అలంకరించారు.

ప్రతిమా భౌమిక్‌: ‌త్రిపురవాసి. సామాజిక న్యాయం, సాధికారత శాఖకు మంత్రి. రాజకీయ ప్రవేశానికి ముందు ఈమె మహిళా రైతు. 52 సంవత్సరాల వయస్కురాలు. నియోజకవర్గ ప్రజలంతా ‘ప్రతిమా దీ’ అంటూ ఎంతగానో గౌరవిస్తుంటారు. ఇటువంటి నేతలు కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశించడం పార్టీ ప్రముఖుడు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌చెప్పినట్లు – ‘చరిత్రాత్మకం’. ఇది వనితామణుల స్వరాన్ని మరింత గట్టిగా దేశమంతా వినిపించేట్లు చేస్తుంది. వారి నేతృత్వంలోనే అభివృద్ధి సాధనకు ముమ్మరంగా దోహదపడుతుంది. ప్రతిమ అగర్తలాలో సైన్స్ ‌కోర్సు చదువుకున్నారు. తండ్రి దేవేంద్రకుమార్‌. ‌మాతృమూర్తి పేరు కణన్‌. ‌మొదటి నుంచీ సామాజిక సేవ అంటే అనురక్తి చూపేవారు ప్రతిమ. సోనంపురా సబ్‌ ‌డివిజన్‌లోని స్వగ్రామంలో ఎందరికో ఎన్ని విధాలుగానో ఉపకరించారు. అందుకే వారంతా ‘దీదీ’ అని పిలుస్తుంటారు.

భారతి ప్రవీణ్‌పవార్‌: ‌మహారాష్ట్రకు చెందిన ఈ అతివ కేంద్రంలో ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. ఈమెకు 42 సంవత్సరాలు. నాసిక్‌ ‌వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ ‌పట్టా అందుకున్నారు. రాజకీయా ల్లోకి చేరాక నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వశాఖ సంప్రదింపుల సంఘానికి సభ్యురాలు కావడాన్ని ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నానంటున్నారు. దిందొరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్‌ ‌భారతి తొలుత నాసిక్‌ ‌జిల్లా పరిషత్‌ ‌సభ్యురాలిగా పనిచేశారు. అప్పట్లోనే పోషకాహారం, మంచినీటి సరఫరా వంటి అంశాల్లో కార్యశీలిగా నిలిచారు. రెండేళ్ల నాడు ఉత్తమ మహిళా పార్లమెంటేరియన్లలో ఒకరయ్యారు. నాసిక్‌ ‌నుంచి ఒక మహిళ కేంద్రమంత్రి కావడం అదే ప్రథమం.

వనితల క్రియాశీలత

ఏ దేశానికైనా ఆర్థికమే వెన్నుదన్ను. మహిళలు, శిశువుల సంక్షేమమే అన్నింటి కన్నా ప్రధానం. ఆహారం, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి కీలక శాఖలు. వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు ఉన్న ప్రాముఖ్యం ఎనలేనిది. వ్యవసాయం, రైతుల యోగ క్షేమాలకు సమధిక ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటుంది. రైల్వేలు, అలాగే జౌళి వ్యవహారాలు తమ వంతు పాత్ర నిర్వర్తిస్తూనే ఉంటాయి. విదేశీ అంశాలు, సాంస్కృతిక విలువల పరిరక్షణకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. ప్రత్యేకించి విద్య, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు రంగాలు ఉండనే ఉన్నాయి. సామాజిక న్యాయం, సాధికారతలకు సంబంధించి నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు ఇంకెన్నెన్నో. గిరిజన పురోగమనానికి నిధుల కేటాయింపు, కార్యాచరణ విస్తరణ ఎంతైనా అవసరమే. వీటన్నిటినీ పరిగణించినప్పుడు, అందునా మహిళామణులకే నిర్వహణ విధులు అప్పగించినప్పుడు దేశాభ్యుదయం సులభ సాధ్యమే. సర్వసహజంగా మంత్రి అన్నా, అమాత్యా అని సంబోధించినా అందులో అపార గౌరవమే ధ్వనిస్తుంటుంది. బుద్ధిబలంతో వ్యవహ రించడం, సలహా సంప్రదింపులు సాగించడం, ఆలోచన – ఆచరణల నడుమ వారధిగా ఉండటం అంతరార్థాలు. వీటికి సార్ధకత సమకూర్చేలా శాఖలను పడతులకు అప్పగించడమే మోదీ మార్కు పరిపాలన. మంత్రివర్గాన్ని ప్రక్షాళించడం, కొందరికి ఉద్వాసన, ఇంకొందరికి పదోన్నతి.. ఈ క్రియాశీలత అంతా అంతర్భాగాలు. పలు తరహాల అంచనాలు; మాటలు – చేతల సమగ్ర పరిశీలనలు, పరిణామాల ఊహసోపాల తర్వాతే ఈ భారీ పక్రియ ముగిసిందన్నది సుస్పష్టం. కేంద్ర క్యాబినెట్‌లోకి ఆ హోదాలో ఇద్దరినే (నిర్మలా సీతారామన్‌, ‌స్మృతి ఇరానీ) తప్ప వినూత్నంగా తరుణులెవ్వరినీ చేర్చుకోలేదు. మరోవైపు మంత్రిమండలిలోకి చేర్చుకున్న వారిలో అంతా కలిసి 18 మంది ఇదివరలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో అమాత్యులుగా అనుభవజ్ఞులు. పాతిక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఇలా మార్పుచేర్పులు జరిపారన్న మాట. ఇందులో ముదితలకు అధికార పట్టాభిషేకం విస్తరింపచేయడ మన్నది వందనీయం, అభినందనీయం.

  • జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram