పశ్చిమ బెంగాల్‌ ‌విధానసభ ఎన్నికలు 21 మార్చి నుండి 29 ఏప్రిల్‌ ‌మధ్య 8 విడతలుగా నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటిం చింది. 294 స్థానాలకు గాను ఇద్దరు అభ్యర్థుల మృతి కారణంగా 292 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. షెడ్యూలు ప్రకటించిన తర్వాత కొవిడ్‌ ‌రెండోదశ విజృంభించడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఎన్నికల పక్రియ ముగిసి, మే 2న లెక్కింపు పూర్తయ్యేసరికి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ (‌టీఎంసీ) 47.9% ఓట్లతో 213 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 38.1% ఓట్లతో 77 స్థానాల్లో గెలిచి, రెండవ స్థానంలో నిలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి, మరొకచోట రాష్ట్రీయ సెక్యులర్‌ ‌ముస్లిం పార్టీ అభ్యర్థి గెలిచారు.

 మూడవసారి పరిపాలించమని ప్రజలు టీఎంసీకి అత్యధిక మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. ఇంతలోనే ప్రజాస్వామ్యం తలదించుకునేలా బెంగాల్‌ అం‌తటా టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు హత్యలు, హత్యాప్రయత్నాలు, గృహాలు, దుకాణాల దోపిడీ, తగులబెట్టడం, ధ్వంసం చేయడం ప్రారంభించారు. వాళ్ల అరాచకత్వం, ఘోర కృత్యాలకు బలహీనంగా ఉన్న ఆ రాష్ట్ర పాలనా వ్యవస్థ కూడా తోడయింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగమంతా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుండిపోయింది. దీంతో దుండగులు రోజుల తరబడి ప్రతిపక్షాల కార్యకర్తలు, మద్దతుదారులు, వారి పిల్లలు, మహిళలతో పాటు ఎస్‌సీలను క్ష్యంగా చేసుకొని పాశవిక దాడులు సాగించారు.

నేరాలలో రికార్డు

 దారితప్పిన పశ్చిమ బెంగాల్‌ ‌పాలనా వ్యవస్థ నిత్యం వార్తల్లో కనిపిస్తుంది. కేంద్ర నేర పరిశోధనా సంస్థ నివేదిక కూడా ఇదే చెబుతున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలే. మహిళలపై అత్యాచారాలు చూస్తే- 2016లో 32, 513. 2017లో 30,992. 2018లో 30,394 కేసులు నమోదయ్యాయి. అత్యాచార నేరాల శాతాన్ని లెక్కిస్తే భారతదేశంలో 8వ స్థానం పశ్చిమబెంగాల్‌దే. అలాగే హత్యలలో 4వ స్థానంలో ఉంది. 2016 సంవత్సరంలో 2044, 2017లో 2001, 2018లో 1933 హత్యలు నమోదయ్యాయి. 18 సంవత్సరాలలోపు పిల్లల అపహరణల కేసులలోను ఆ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉంది. 2018 సంవత్సరంలో 16,027 మంది పిల్లలు అపహరణకు గురైనట్లు కేసులు నమోదయ్యాయి. ఇదంతా చూస్తే పశ్చిమ బెంగాల్‌లో నేరాల పట్ల, నేరగాళ్ల పట్ల కఠిన చర్యలు ఏమీ లేవని తేటతెల్లమవుతున్నది.

రాజకీయ హత్య

బెంగాల్‌కు రాజకీయ హత్యలు కొత్త కాదు. 50 సంవత్సరాల చరిత్రను గమనిస్తే ఒకటీ రెండూ కాదు, వేలాది రాజకీయ హింసలు, హత్యలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఏ హత్య తీరును పరిశీలించినా గడిచిన కొన్ని సంవత్సరాలలో మానవత్వం ఎన్నిసార్లు మంటగలిసిందో అర్ధం అవుతుంది. 1970 సంవత్సరంలో కాంగ్రెస్‌ ‌మద్దతుదారులైన ఇద్దరు అన్నదమ్ములను తల్లి సమక్షంలోనే సీపీఎం కార్యకర్తలు క్రూరంగా చంపడంతో సరిపెట్టుకోకుండా, వారి రక్తం కలిపిన అన్నాన్ని ఆ తల్లితో బలవంతంగా తినిపించారు. ఈ హత్యలో పాల్గొన్న వినయ్‌కుమార్‌ ‌నిరుపమసేన్‌, అనిల్‌ ‌బోస్‌లను మార్క్సిస్టులు మంత్రి పదవులతో సత్కరించారు.

పాలన కమ్యూనిస్టు చేతిలోకి రాగానే ప్రభుత్వ ప్రోత్సాహంతో రాజకీయ హత్యలు హద్దులు దాటాయి. 1997లో ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ ‌భట్టాచార్య నివేదించిన ప్రకారంగా 1977 నుండి 1997 మధ్యకాలంలో 27,000 రాజకీయ హత్యలు జరిగాయి. 2010 సంవత్సరంలో కమ్యూనిస్టుల వారపత్రిక ‘మెయిన్‌‌స్ట్రీమ్‌’ ఇం‌కా ఆశ్చర్యమైన కథనాన్ని బయటపెట్టింది. 1977- 2009 మధ్యకాలంలో 55,000 రాజకీయ హత్యలు జరిగాయని ఆ పత్రిక నమోదు చేసింది.

ముప్పైయ్యేడు సంవత్సరాల కమ్యూనిస్టు పాలనను అంతం చేస్తూ 2011లో మమత నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఇక పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టుల రాజకీయ హత్యలు, రాజకీయ ప్రేరిత హింస తొలగిపోయి శాంతి నెలకొంటుందని ప్రజలందరూ ఆశించారు. అయితే అదొక భ్రమగానే మిగిలిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి మారారు. కాని అంతకుముందు నుండి వస్తున్న క్రమం మాత్రం మునుపటివలే యథేచ్ఛగా కొనసాగింది. ఆమె ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి హోంశాఖ బాధ్యతను మమతాయే నిర్వహిస్తున్నారు. గడిచిన దశాబ్దంగా పాలనాపరమైన లోపాలను సరిచేయడానికి కచ్చితమైన ప్రయత్నమేమీ చేయలేదు. రాజకీయ హత్యల్లో నేడు పశ్చిమ బెంగాల్‌కు దేశంలో మొదటిస్థానం దాని పరిణామమే. అది రాష్ట్ర గౌరవాన్ని భంగపరిచింది. కేంద్ర నేర పరిశోధనా సంస్థ వెబ్‌సైట్లో లభిస్తున్న సమాచారం ప్రకారం 2018లో దేశం అంతటా 62 రాజకీయ హత్యలు జరగ్గా, అందులో అత్యధికంగా 12 హత్యలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఇది అధికారికమైన రికార్డు. అలా హత్యకు గురైన వారిసంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు.

2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింస

పశ్చిమబెంగాల్‌ ‌తొలి మహిళా ముఖ్యమంత్రిగా మమత మే 2011లో ప్రమాణస్వీకారం చేశారు. 2016లో మరొకసారి పరిపాలించే అవకాశం పొందగా అది 2021 సంవత్సరంతో ముగిసింది. పెద్ద ఎత్తున హింస, అరాచకత్వంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి మే 2, 2021న ఫలితాలు వచ్చాయి. ఫలితాలు రావడం ప్రారంభం అయినప్పటి నుండి టీఎంసీ మెజారిటి సాధిస్తూనే వచ్చింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రతిపక్షాలకు చెందిన, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల మీద దాడులు, ఆ పార్టీ కార్యాలయాలను తగులబ్టెడం ఆరంభించారు. అలా ప్రారంభమైన ఆ హింస అనేక రోజుల పాటు 148 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగింది. మారుమూల గ్రామాలలోని పోలింగ్‌ ‌బూత్‌ ‌స్థాయి కార్యకర్తలను హింసించడం, ఇళ్ల• తగులబెట్టడం, కుటుంబ సభ్యులను చంపడం, మహిళలను బలత్కారం చేయడంతో యథేచ్ఛగా సాగాయి. ఆ రాత్రి అంతిమ ఫలితం వచ్చేటప్పటికి టీఎంసీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత బలం లభించింది. అయినప్పటికి మమత నందిగామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనేందుకు టీఎంసీ కార్యకర్తలు సువేందు మీద హత్యాయత్నం చేశారు. ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, వేల సంఖ్యలో జరిగాయి. బీజేపీ సేకరించిన వివరాల ప్రకారం 6,983. వాటి వర్గీకరణ కింది పటంలో చూడవచ్చు.

ఈ వేలాది సంఘటనల వెనుక లక్ష్యం బీజేపీ మద్దతుదారులను భయబ్రాంతులకు గురిచేయడమేనని అర్ధమవుతున్నది. 24 మందిని క్రూరంగా హత్య చేశారు. అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. సంపద లూటీ, దహనాలు మామూలే. టీఎంసీ గూండాలు 2000 మంది బీజేపీ కార్యకర్తలను, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొన్నారు.

హిందువుల ధార్మిక స్థలాలపైన దాడిచేయడం మరొక విశేషం. అరాచకశక్తులు సాగించిన ఈ నీచమైన చర్యలపై ఎటువంటి విచారణ జరగడం లేదు. ఒకవేళ విచారణ నిష్పక్షపాతంగా జరిగితే ఇలాంటి వందలాది ఘటనలు వెలుగు చూస్తాయి. అయినప్పటికీ కొన్ని బయటపడ్డాయి. అలాంటి వాటిలో ఒకటి పూర్వ మిడ్నాపూర్‌ ‌జిల్లా నందిగామ్‌ ‌విధానసభ నియోజవర్గ పరిధిలోని రామమందిర దగ్ధకాండ.

ఎన్నికల అనంతరం చోటు చేసుకొన్న ఈ భయానక పరిణామాలకు బలైన కుటుంబాలు తమ మీద జరిగిన దాడి గురించి, దాడి చేసిన వారి గురించి చెప్పడానికి భయపడుతున్నారు. దాడి చేసిన వారిని గుర్తు పట్టగలిగినా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదు. ఫిర్యాదు చేస్తే చంపేస్తారని భయం. ఈ స్థితిలో స్థానిక పాలనా యంత్రాంగం కూడా సహకరించడంలేదు. అన్ని విధాలా నష్టపోయి భయంతో ఉన్న వీరికి మమత కూడ ఎటువంటి సహాయం, న్యాయం అందించే ప్రయత్నం చేయలేదు. దానికి కారణం 6,983 సంఘటనలలో దోషులు కేవలం టీఎంసీ వారే.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు టీఎంసీ గూండాల చేతిలో హింసకు గురయ్యారు. చంపేస్తామని టీఎంసీ వాళ్లు బెదిరించడంతో బాధితులంతా ఇళ్లు, వాకిళ్లు వదిలి శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి సుమారు 191 శరణార్థి శిబిరాల్లో 6,779 మంది ఉన్నారు. అక్కడ సరైన సదుపాయాలు లేవు. వీరిని సురక్షితంగా తమ ఇళ్లకు పంపేందుకు స్థానిక పాలనాయంత్రాంగం శ్రద్ధ చూపడం లేదు.

దాదాపు ప్రతి చోట టీఎంసీ గూండాలు పోలీసుల సమక్షంలోనే లూటీ చేశారు. దగ్ధకాండ సాగించారు, ప్రత్యర్థులను చావబాదారు. ఎక్కడా పోలీసులు నిలువరించిన దాఖలా లేదు. సోషల్‌ ‌మీడియాలో అలాంటి వీడియోలు, ఫోటోలు వైరల్‌ అయ్యాయి. దీనిని బట్టి స్థానిక పాలనాయంత్రాంగం సహాయంతో అధికార పార్టీయే ఇదంతా చేసిందని స్పష్టమవుతున్నది. కొన్నిచోట్ల సాహసించి ఈ హత్యలతో సంబంధం ఉన్న టీఎంసీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. అయినప్పటికీ పోలీసులు చాలా మృత దేహాలకు పోస్టుమార్టం చేయించలేదు. నేరగాళ్ల మీద నేరుగా కేసులు నమోదు చేయలేదు.

టీఎంసీ గెలుపు ఖాయమైన తరువాత రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి మరళీధరన్‌పై హత్యాప్రయత్నం చేసేంతవరకు వాళ్లు పెట్రేగిపోయారు. కేంద్రమంత్రి మే 6వ తేదీన పశ్చిమబెంగాల్‌ ‌పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ హత్యా ప్రయత్నాన్ని అధికారిక ట్విటర్‌ ‌ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తూ, ‘పశ్చిమ మిడ్నాపూర్‌లో టీఎంసీ గూండాలు నా కాన్వాయ్‌ ‌మీద దాడి జరిపారు. కారు అద్దాలు పగులగొట్టారు. నా పర్యటన మధ్యలో ఆపేశారు’ అని పేర్కొన్నారు.

బాధితులకు న్యాయం అందించే ప్రయత్నాలు

జరిగిన హింసపై నివేదికను సమర్పించాల్సిందిగా మే 7వ తేదీన కలకత్తా హైకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఉదయశంకర్‌ ‌చటోపాధ్యాయ వంటి ప్రముఖ అడ్వకేట్ల ద్వారా హైకోర్టులో వేసిన పిటిషన్‌లో, ‘ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారాయి’ అని పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేశ్‌ ‌బిందల్‌, ‌జస్టిస్‌ ఐ.‌సి. ముఖర్జీ, హరీశ్‌ ‌టండన్‌, ‌సౌమేన్‌ ‌సేన్‌, ‌సుబ్రత్‌ ‌తాలూక్‌దార్‌ ‌లతో కూడిన ఆ ధర్మాసనం పరిపాలనా వ్యవస్థ పనితీరుల గురించి కూడా వెంటనే అఫిడవిట్‌ ‌సమర్పించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతటితో ఆగకుండా హింస చోటు చేసుకున్న స్థలాలు, అక్కడ హింసను నియంత్రించడానికి తీసుకొన్న చర్యల గురించి కూడ అఫిడవిట్‌లో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ ‌జనరల్‌ను ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వమే ఈ హింసకు కారణమని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పెద్దఎత్తున హింస జరిగిన మాట నిజమేనని కనీసం కోర్టు దృష్టికైనా వచ్చింది. మే 10వ తేదీన ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో ‘భవిష్యత్‌లో ఇలాంటి హింస జరుగ నివ్వం’ అని పేర్కొన్నది. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లు, జాతీయ మహిళా కమిషన్‌, ‌జాతీయ ఎస్‌సి కమిషన్‌ల దగ్గర బాధితులందరు ఫిర్యాదు చేసుకోవచ్చునని మే 18న రెండో విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది.

 పశ్చిమబెంగాల్‌ ‌హింసపై స్వయంగా స్పందిస్తూ జస్టిస్‌ ‌వినీత్‌ ‌శరణ్‌, ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌. ‌గవాయ్‌‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం మే 18న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. బీజేపీ కార్యకర్తలు అవిజిత్‌ ‌సర్కార్‌, ‌హరేన్‌ అధికారిల హత్య అనంతరం వారి కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రధాని, హోంమంత్రి, గవర్నర్‌ ఆవేదన

హింస జరిగిన 48 గంటల్లోనే ప్రధానమంత్రి గవర్నర్‌కు ఫోన్‌ ‌చేసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితుల గురించి వాకబు చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్‌ ‌ట్టిటర్‌ ‌ద్వారా తెలియచేస్తూ ‘ప్రధానమంత్రి ఫోన్‌ ‌చేశారు. ఇక్కడి శాంతిభద్రతల దుస్థితిపై బాధను వ్యక్తం చేశారు. ఇక్కడ యథేచ్ఛగా సాగుతున్న హింస, హత్యలకు సంబంధించి వారికి తెలిపాను. పరిస్థితులు చక్కదిద్దాలని ప్రధాని సూచించారు’ అని పేర్కొన్నారు.

దీని తరువాత మే 7న కేంద్ర హోంశాఖ 24 పరగణ జిల్లా డైమండ్‌ ‌హార్బర్‌ ‌ప్రాంతంలో జరిగిన హింసాకాండ గురించి వాస్తవాలు సేకరించడానికి నలుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పరిచారు. దీనిని స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన పెద్ద హింసాకాండగా గవర్నర్‌ ‌వర్ణిస్తూ, ‘ప్రజలు మతం మార్చుకోవడానికి కూడ సిద్ధమయ్యారు. అంటే ఎంతగా ప్రజలు భయ భ్రాంతులయ్యారో’ అని అన్నారు. హింస జరిగిన ప్రాంతాలను గవర్నర్‌ ‌సందర్శించి, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొన్నారు. ఆ సందర్భంగా టీఎంసీ వాళ్లు నల్ల జెండాలు ప్రదర్శించారు. అంతేకాదు దిన్‌హటా ప్రాంతానికి వెళ్లినప్పుడు, ‘గవర్నర్‌ ‌వెనక్కి వెళ్లిపోండి!’ అంటూ నినాదాలు చేశారు. కలతచెందిన గవర్నర్‌ ‌కారు దిగి వచ్చి ‘నినాదాలిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

మానవహక్కుల, ఎస్‌సి, మహిళా కమిషన్‌లు

అనేక వార్తా పత్రికలలో వచ్చిన సమాచారం ఆధారంగా స్వయంగా జాతీయ మానవహక్కుల కమిషన్‌ ‌స్పందిస్తూ బాధితుల మానవ హక్కులను స్థానిక జిల్లా పాలనా యంత్రాంగం, పోలీసులు కాపాడలేకపోయారని చెప్పింది. వెంటనే బృందాన్ని ఏర్పాటుచేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని డీఐజీని ఆదేశించింది.

జాతీయ మహిళా కమిషన్‌ ‌కూడా ఘటనలపై విచారణ జరిపించాలని కోరింది. నేరగాళ్ల మీద చర్యలు చేపట్టాలని కమిషన్‌ అధ్యక్షురాలు రేఖాశర్మ డీజీపీకి లేఖ రాశారు. బాధితులను కలుసుకొని వాస్తవ పరిస్థితులు అంచనా వేసేందుకు మహిళా కమిషన్‌ ‌బృందం మే 5, 6 తేదీల్లో హింస జరిగిన స్థలాలలో పర్యటించింది. ఈ పర్యటనల్లో అనేకమంది మహిళలు అత్యాచారానికి గురైనారని, కొందరిని బలాత్కారం చేస్తామని భయపెట్టిన సంగతి తెలిశాయి. ఎందరో తల్లులు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం కోల్పోయి, తమ పిల్ల్లలను రాష్ట్రం దాటి బయటకు పంపాలనుకుంటున్న సంగతి కూడా కమిషన్‌కు తెలిసింది. శరణార్థి శిబిరాల్లో ఉంటున్న మహిళలు తమ ఇక్కట్లు చెప్పుకున్నారు. తమని కొట్టి, హింసించారని, ఇళ్లకు అగ్గి పెట్టారని చెబుతూ.. తాము తలదాచుకొన్న శిబిరాల్లోను కనీస అవసరాలు లేవని, చికిత్స, భోజనం, తాగునీరు సరిపడా లేవని చెప్పడంతో మహిళా కమిషన్‌ ‌విస్తుపోయింది.

ఎస్సీలను కూడా టీఎంసీ గూండాలు లక్ష్యంగా చేసుకున్నారు. పరిస్థితులను అంచనా వేసేందుకు జాతీయ ఎస్సీ కమిషన్‌ అధ్యక్షులు విజయ సాంప్లా నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో రెండురోజులు పర్యటించింది. తర్వాత సాంప్లా మాట్లాడుతూ ‘1947లో జరిగిన అత్యంత బాధాకరమైన, భీతిని గొలిపే సంఘటనలు వృద్ధుల ద్వారా వినే వాళ్లం. ఫోటోలు చూశాం… ఇప్పుడు స్వయంగా పూర్వ వర్ధమాన్‌ ‌జిల్లా, మిల్కీ పాడా గ్రామంలో పర్యటించినపుడు ఒకే వరుసలో ఉన్న 12 దుకాణాలను దోచుకొని, ధ్వంసం చేయడం కనిపించింది. దక్షిణ పరగణ జిల్లాలోని నాబాగాం, నబాసన్‌ ‌గ్రామాల్లో బాధితులైన షెడ్యూల్డ్ ‌కులాల వారు ఇళ్లు వదిలిపెట్టి పారిపోయారు. దోషులు బహిరంగంగా తిరుగుతున్నారు. వెయ్యిమంది స్వయంగా రాత పూర్వకంగా కమిషన్‌కు ఫి•ర్యాదులు అందించారు. దీని ఆధారంగా త్వరలో నివేదిక తయారుచేసి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి అందచేస్తామ’ని సాంప్లా అన్నారు.

By editor

Twitter
Instagram