దేశాన్ని అమ్ముకు తినేసే బుద్ధి కాంగ్రెస్‌ ‌పార్టీ సొంతం. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మొదటే చెప్పింది. ఇప్పటిదాకా 22 కోట్ల మందికి అందించింది కూడా. తాము గొంతు చించుకోవడం వల్లనే కేంద్రం ఉచిత వ్యాక్సిన్‌ ‌నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పడం విపక్షాల చిల్లర రాజకీయం. ఈ క్రీడలో అగ్రభాగాన ఉన్నవారు రాహుల్‌ ‌గాంధీ. కానీ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఏం జరుగుతోంది? రాహుల్‌ ‌కళ్లుండి చూడలేకపోతున్నారా? లేక చెవులు ఉండి వినలేకపోతున్నారా? రాష్ట్ర వివాదాస్పద ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌వ్యాక్సిన్‌లను నడి బజార్లో అమ్మకానికి పెట్టేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారు.

18 నుంచి 44 ఏళ్ల వయసున్నవారికి అందించే ఉద్దేశంతో ఆ రాష్ట్రం కోవాక్జిన్‌ ‌వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. కానీ మధ్యలో అమోఘమైన ఆలోచన వచ్చి ఆ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించకుండా, కొంతభాగం ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మేసింది. ఒక్క డోస్‌ ‌మీద రూ. 660/- లాభం కూడా వేసుకుంది. ఇందుకు ఘనత వహించిన అమరీందర్‌ ‌ప్రభుత్వం చెప్పిన కారణం ఈ దశాబ్దపు తమాషా. ప్రైవేటు యాజమాన్యాలను కూడా కొవిడ్‌ ‌నిరోధక చర్యల కోసం ప్రోత్సహించడానికే వ్యాక్సిన్లు విక్రయించిందట.అయితే బీజేపీ, అకాలీదళ్‌, ఆప్‌ ‌వంటి పార్టీలన్నీ ధ్వజమెత్తడంతో జూన్‌ 4‌న గతిలేక, తీవ్ర నిరాశతో వ్యాక్సిన్‌ ‌వ్యాపారానికి స్వస్తి పలికింది.

చూడబోతే అమరీందర్‌లో మంచి వ్యాపారవేత్త గుణాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. అయితే ఆయన వ్యాపారం ప్రారంభించిన సందర్భమే బావుండలేదు. అందుకే ఇలా బేరం బెడిసింది. పంజాబ్‌ ‌ప్రభుత్వం తాజాగా డోసు రూ.400 వంతున 40,000 డోసులు కొనుగోలు చేసింది. వాటిని ఒక్కొక్క డోసు రూ.1,060 వంతున కార్పొరేట్‌ ఆసుపత్రులకు విక్రయించింది. అంటే రూ.660 లాభం. కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాలని అమరీందర్‌ ఆశయం కాదు. పైగా వాటిపై ఇంకొక రూ. 500 లాభం కూడా కలుపుకుని రూ.1,560లకి అమ్ముకొనే వెసులుబాటు ఉదారంగా కల్పించారు. ప్రైవేటు ఆసుపత్రుల వాళ్లు ‘వ్యాక్సినేషన్‌ ‌సీఎస్‌ఆర్‌ ‌ఫండ్‌’ అనే పేరుతో ప్రారంభించిన బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బు జమచేయాలి.

బీజేపీ, అకాలీదళ్‌, ఆప్‌, ‌కేంద్ర మంత్రులు విమర్శలకు దిగడం, ఆఖరికి అమరీందర్‌ ‌పార్టీ వారు కూడా ఇదేం దగుల్బాజీతనం అంటూ చీల్చి చెండా డడంతో పంజాబ్‌ ‌వ్యాక్సిన్‌ ‌పంపిణీ అధికారి వికాస్‌ ‌గార్గ్, ‘18-44 ఏళ్ల వారికి ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా ఇవ్వాలనుకున్న వ్యాక్సిన్‌ ‌కార్యక్రమాన్ని విరమించుకోవడమైనది’ అని చాటింపు వేయించ వలసి వచ్చింది. అయినప్పటికి ఒకసారి ఒప్పందం అయ్యాక కార్పొరేట్‌ ఆసుపత్రులు మాట వినాలని ఏముంది? అందుకే ఇంకొక ప్రకటన కూడా వచ్చింది. ‘ప్రైవేటు ఆసుపత్రుల వారు తమ దగ్గర మిగిలి ఉన్న వ్యాక్సిన్‌ ‌డోసులను వెంటనే తిరిగి అప్పగించాలి. మీ డబ్బు మీకు తిరిగి చెల్లించగలం’ అని ప్రభుత్వం ఆదేశించవలసి వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రుల వాళ్లకి అమరీందర్‌ ‌బాగా నిరాశ కలిగించారు. పాపం, ఆయనా నిరాశ పడ్డారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 42,000 డోసులు సరఫరా చేసింది. ఇందులో ఆ ఆసుపత్రులు అమ్ముకున్న డోసులు కేవలం 600. రాష్ట్ర ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి (ఆరోగ్యం) హసన్‌లాల్‌ ‌స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఇంతకీ తమ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి వ్యాక్సిన్‌ను ప్రజలకు రూ.1,560లకు విక్రయించడానికి రాహుల్‌ ఆమోదించినట్టేనా? ఇంతవరకు ఎందుకు నోరు ఎత్త లేదు? ఇది మధ్య దళారీల కక్కుర్తి కంటే తీసి పోతుందా?

ముఖ్యమంత్రి అమరీందర్‌నీ, ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ ‌సిద్ధును బీజేపీ, ఆప్‌, అకాలీదళ్‌ ‌చీల్చి చెండాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి, ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి వ్యాక్సిన్‌ అమ్ముకుని జేబులు నింపుకోవాలని అనుకున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అనిల్‌ ‌సరీన్‌ ‌బాహాటంగానే దుమ్ము దులిపారు. ఒక పక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజల ప్రాణాలను రక్షించ డానికి ఉచితంగా వ్యాక్సిన్‌ అం‌దిస్తూ ఉంటే, మరొక పక్క పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వ్యాక్సిన్‌ ‌పక్రియను లాభార్జన మార్గంగా మలుచుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు. అయితే ఆరోగ్యమంత్రి చెబుతున్నట్టు ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మిన వ్యాక్సిన్లు 42,000 కాదనీ, 80,000 అని సరీన్‌ ‌మాటలను బట్టి తెలుస్తున్నది. కానీ ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ అడిగితే అక్కడ మాత్రం లేవనే సమాధానం వస్తున్నదని సరీన్‌ ఆరోపించారు. ప్రాణా పాయ స్థితిలో ఉన్న కొవిడ్‌ ‌బాధితుల కోసం కేంద్రం పంపించిన 809 వెంటిలేటర్లను కూడా పంజాబ్‌ ‌ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించుకోలేదని సరీన్‌ ‌చెప్పారు. అయితే ఈ అమ్మకాల సంగతి తనకేమీ తెలియనట్టు ఆరోగ్యమంత్రి ఈ వ్యవహారం మీద దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్పడం ఈ ఉదంతంలో కొసమెరుపు. వాస్తవం ఏమిటంటే పంజాబ్‌లో వ్యాక్సిన్‌ ‌కొరత కేవలం కృత్రిమం. అది కాంగ్రెస్‌ ‌పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సృష్టించిన కొరత. ఇలాంటి కొరతనే కాంగ్రెస్‌ ‌పార్టీ, నాయకులు దేశంలో పలుచోట్ల సృషించినమాట వాస్తవం. పంజాబ్‌లో అయినా కాంగ్రెస్‌ అం‌తర్గత కుమ్ములాటలతో అతలాకుతల మవుతున్నది కాబట్టి ఇది బయటపడింది.

ఇవేకాదు, ఈ ఉదంతంలో కొన్ని ఇతరత్రా కొసమెరుపులు కూడా ఉన్నాయి. సాక్షాత్తు తమ ప్రభుత్వం వ్యాక్సిన్‌తో వ్యాపారం చేయాలనుకుని పట్టుబడిపోయిన సంగతి పక్కన పెట్టి, కాంగ్రెస్‌ ‌నేతలు మాకు తక్కువ వ్యాక్సిన్లు సరఫరా చేశారని ఎదురుదాడికి దిగారు. ఇంకా, వ్యాక్సిన్‌కు ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఏమిటి అంటూ నిగ్గదీసే ప్రయత్నం కూడా వారు చేశారు. నిజమే, ఇంకొన్ని వ్యాక్సిన్‌లు పంపి ఉంటే ఇంకా ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉండేది. అంతేనా! తమ రాష్ట్రానికి చెడిపోయిన వెంటిలేటర్లు పంపినందుకు కేంద్రమే తక్షణం క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నాయకుడు జైవీర్‌ ‌షేర్గిల్‌ అడ్డగోలు వాదన లేవదీశారు. పైగా నీతులు చెప్పడానికీ, వాటిని ఆచరించడానికీ మధ్య వ్యత్యాసం ఏమిటో బీజేపీ గమనించాలని కూడా షేర్గిల్‌ ‌సుద్దులు చెప్పారు. దండిగా లాభాలు గడించడానికే అమరీందర్‌ ‌ప్రభుత్వం వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుందని అకాలీదళ్‌ ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పింది. పంజాబ్‌లో మత్తుమందుల దందాను నిరోధించడంలో అమరీందర్‌ ‌విఫలమయ్యారని, ఆయన అసమర్ధుడని అదే పార్టీ నాయకుడు, మాజీమంత్రి నవజోత్‌ ‌సిద్ధు గత కొంత కాలంగా దుమ్మెత్తి పోస్తున్నారు. మరి, అమరీందర్‌ ‌సింగ్‌ను హెచ్చరించే దమ్ము రాహుల్‌కు ఉందా? కానీ నవజోత్‌ ‌సిద్ధు పట్టు వీడడం లేదు. ఈ సందట్లో కొవిడ్‌ ‌తన ప్రతాపం చూపిస్తున్నది. ఒక ఆరోగ్య సమస్యను పరిష్కరించడం అంటే రైతుల పేరుతో దళారీలను రెచ్చగొట్టినంత సులువు కాదు.

మొత్తం నలభయ్‌ ‌పంజాబ్‌ ‌వైద్య సంస్థలు వ్యాక్సిన్లు కొనుగోలు చేశాయి. అందులో మ్యాక్స్ ‌హెల్త్ ‌కేర్‌ అనే సంస్థ 30,000 వ్యాక్సిన్లు కొనేసింది. ఇది మళ్లీ ఇతర సంస్థలకు సరఫరా చేయాలని అనుకుంది. చిన్నాపెద్దా సంస్థల వారు వంద నుంచి వేయి వరకు వ్యాక్సిన్లు తీసుకున్నారు. అధిక మొత్తంలో టీకా కొనుగోలు చేసిన వాటిలో మ్యాక్స్ ‌హెల్త్‌కేర్‌, ‌ఫోర్టిస్‌ అనే రెండు సంస్థలు సహా మొత్తం తొమ్మిది ఉన్నాయి. ఈ అక్రమ దందా బయటపడిన వెంటనే కేంద్ర మంత్రి జవడేకర్‌ ‌స్పందించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1.40 లక్షల డోసులు, ఒక్కొక్కటి రూ.400లకు కొనుగోలు చేసిందని, అందులో కొంత లాభార్జన కోసం 20 ప్రైవేటు ఆరోగ్య సంస్థలకు అమ్ముకుందన్న వార్తలు వచ్చాయని ఆయన ఆరోపించారు. కేంద్రం 22 కోట్ల వ్యాక్సిన్‌ ‌డోసులను ఇంతవరకు ఉచితంగా అందించిన సంగతి గుర్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. అంతర్గత కుమ్ములాటల పరిష్కారానికి ప్రస్తుతం పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌శాఖ మొత్తం ఢిల్లీ పంచాయతీలో పాల్గొన్నదని, ఆ రాష్ట్రంలో కొవిడ్‌ ‌నివారణ చర్యలు ఎవరు చూస్తున్నారని జవడేకర్‌ ‌ప్రశ్నించారు. ఇవన్నీ చూసైనా, రాహుల్‌ ‌గాంధీ ఇతరులకు నీతులు చెప్పే, ఉపన్యాసాలు దంచే పని మానుకుని సొంత పార్టీలోని అవినీతిని క్షాళన చేస్తే మంచిది. తమ మీది బురద కడుక్కుంటే ఇంకా బావుంటుంది.

By editor

Twitter
Instagram