ప్రపంచాన్నే కాదు, భారత్‌ను కూడా కొవిడ్‌ 19 ‌భయం వీడలేదు. ఇప్పటి వరకు రెండుదశలలో ఆ మహమ్మారి మానవాళిని కుంగదీసింది. మూడోదశ దాదాపు తథ్యమన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైద్య చరిత్ర చెబుతున్నదీ  ఇదే. మూడోదశను చవి చూస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. భారత్‌లోనూ రెండోదశ ముగింపునకు వస్తున్న సమయంలో మూడోదశ గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం- ఇది పిల్లల మీద ప్రతాపం చూపిస్తుందన్న అంచనాలు. కానీ ఎక్కువ అధ్యయనాలు వెల్లడించిన వాస్తవాలను బట్టి చూస్తే పిల్లల మీద మూడోదశ ప్రభావం తక్కువే. ఇది సంతోషించదగ్గ విషయం.

కరోనా మొదటిదశ తీవ్రంగాను, రెండోదశ అతితీవ్రంగాను ఉంటుందని వైద్య చరిత్ర చెప్పినట్టే జరిగింది. మూడోదశలో తీవ్రత తక్కువేనని మొదట నిపుణులు భావించారు. తాజాగా వస్తున్న అంచనాలను బట్టి మూడోదశ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందనే కొందరి అభిప్రాయం. మొదటిదశ కరోనా పెద్దలను, రెండోదశ యువతరాన్ని బలి తీసుకోగా, మూడోదశ పసివారి మీద పంజా విసిరే అవకాశం ఉందన్న భయాలు మొదలయినాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేసులలో కొంత తగ్గుదల (భారత్‌ ‌సహా) కనిపిస్తున్నా ఈ మహమ్మారి సద్దుమణిగిందని ఏ దేశమైనా భావిస్తే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదని  జూన్‌ 1‌న జరిగిన 74వ ప్రపంచ హెల్త్ అసెంబ్లీ ముగింపు సమావేశం తీవ్రంగానే హెచ్చరించింది. అందుకే ఈ సంవత్సరం సెప్టెంబర్‌ ‌మాసాంతానికి ప్రతి దేశంలోను 30 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్‌ ‌జరిగేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధ్నామ్‌ ‌గెబ్రెయెసస్‌ ఈ ‌సమావేశం నుంచి పిలుపునిచ్చారు. రెండోదశ తగ్గుముఖం పట్టడం చూసి దేశాలు ఊపిరి పీల్చుకోరాదన్నదే ఆయన అసలు ఉద్దేశం. మూడోదశను ఎదుర్కొంటున్న దేశాలలో బ్రిటన్‌ ఉం‌ది. జూన్‌ 21 ‌నుంచి కొవిడ్‌ ‌నిబంధనలను ఎత్తివేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వాయిదా వేయడం మంచిదని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు.

భారత్‌లో రెండోదశ కరోనా దాదాపు 108 రోజులు వేధించగా, తాజాగా మూడోదశ మాత్రం ఇంచుమించు 98 రోజులు కొనసాగే అవకాశం ఉందని భారతీయ స్టేట్‌ ‌బ్యాంక్‌ ఈ ‌జూన్‌ 1‌న విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. అయితే ఆరోగ్యరంగంలో మౌలిక వసతులు వృద్ధి చేసుకుని సీరియస్‌ ‌కేసులు తగ్గించుకోవడంతో, వ్యాక్సినేషన్‌ ‌పక్రియతో ఈ ప్రమాదాన్ని అధిగమించవచ్చునని కూడా ఆ నివేదిక వెల్లడించింది. పరిస్థితి చేయిదాటి పోయే స్థితి వరకు కేసులు రానివ్వకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ఆ తీవ్రతను తగ్గించవచ్చు. అంటే కావలసినంత మెడికల్‌ ఆక్సిజన్‌, ఇం‌టెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్లలో తగినన్ని పడకలు అందుబాటులోకి తేవడం వంటి ఏర్పాట్లు చేసు కోవాలి. దీనితో మరణాల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ముందు జాగ్రత్త చర్యలతో మరణాల సంఖ్యను 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి. మూడోదశ 18 ఏళ్ల లోపు పిల్లల మీద అధిక ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు కాబట్టి  ఆ వయసు వారి వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో 12-18 ఏళ్ల మధ్య వయసు పిల్లలు 15 నుంచి 17 కోట్లు ఉంటారు. కాబట్టి వీరికి అవసరమైన టీకాలు సేకరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్‌బీఐ ఎకోర్యాప్‌ ‌నివేదిక తెలిపింది. ఇంతకీ మూడోదశ ఆరంభమవుతుందన్న అంచనా వేళ దేశంలో ఆరోగ్య మౌలిక వ్యవస్థ సామర్ధ్యం ఎలా ఉంది? దేశంలో దాదాపు 90,000 ఐసీయు పడకలు ఉన్నాయి. ఇవన్నీ పెద్దలకు ఉద్దేశించినవి. పిల్లలకు రెండువేల వరకు మాత్రమే ఉన్నాయి. ఇవి చాలవని నిపుణులు చెబుతున్నారు. కాగా, మూడోదశ, అది చేసే నష్టం గురించిన అంచనాల నడుమ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పది రాష్ట్రాలకు చెందిన జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. యువ తరంలో కరోనా వ్యాప్తి, దాని వేగం గురించి పూర్తి సమాచారం కోరారు.

మూడోదశ 18 ఏళ్ల లోపు వయసున్న వారి మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా, కొన్ని అధ్యయనాలను బట్టి రెండోదశ కరోనా పిల్లలకు సోకిన దాఖలాలు తక్కువ. అలాగే మరణాలు కూడా లెక్కించదగిన స్థాయిలో లేవు. అంటే కరోనా పిల్లలకు సోకదా? అయితే వైరస్‌ ‌రూపం మార్చుకుంటే మూడోదశలో పిల్లల పరిస్థితి ఏమిటి అన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఇటీవలనే లాన్సెట్‌ ఏడుదేశాలలో జరిపిన అధ్యయనం ప్రకారం పదిలక్షల మంది బాలలకు కరోనా సోకితే, ఇద్దరు మాత్రమే కన్నుమూశారు. ఈ అధ్యయనానికి ఊతమిస్తున్నట్టు ఉంది ఇజ్రాయెల్‌ ‌జరిపిన అధ్యయనం. దీని ప్రకారం, తొమ్మిదేళ్ల వయసు లోపు ఉన్న బాలలతో అసలు వైరస్‌ ‌వ్యాపించదని తేలింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఢిల్లీ) సంచాలకులు డాక్టర్‌ ‌గులేరియా కూడా పిల్లలకు కొవిడ్‌ ‌సోకిన దాఖలాలు లేవనే చెబుతున్నారు. ఒకవేళ వారు ఆ వైరస్‌కు గురైనా పరిమితంగానే వారి మీద ప్రభావం చూపుతుందని ఆయన చెబుతున్నారు.ఇక్కడ  రెండోదశ కరోనా బి.1.617 రకం, ఇతర స్ట్రెయిన్లతో కలగలసి ఏర్పడింది. మొదటిదశతో పోల్చుకుంటే రెండోదశ బాలలను కొంతవరకు బాధపెట్టిందని కొన్ని వాస్తవాలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో 16000 మంది బాలలు ఇటీవలనే ఈ వైరస్‌ ‌బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ‌జిల్లాలో కూడా 9,928 మంది బాలలలో మే మాసంలో కరోనా పాజిటివ్‌ ‌కనిపిం చింది. కానీ వీళ్లలో 95 శాతం మందికి ఆ లక్షణా లేవీ బయటపడలేదు. కాబట్టి ప్రమాదం లేదని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అయినా మూడోదశ గురించి దేశంలో కలత నెలకొంది. దీనికి తోడు మూడోదశను అనుభవించిన ఇంగ్లండ్‌ ఉదాహరణ కూడా కనిపిస్తున్నది. ఇంగ్లండ్‌లో ఒక దశను మించి మరొక దశ ప్రాణాంతకంగా పరిణమించాయి. మూడోదశలో ఉండగా, మొన్న జనవరిలో అక్కడ ఒకేరోజు మూడు లక్షల కేసులు నమోదైనాయి. అందుకే మూడోదశకు సంబంధించి ఇదొక పాఠంగా భారత్‌ ‌స్వీకరించాలని నిపుణుల అభిప్రాయం. అయితే బ్రెజిల్‌, అమెరికా ఉదాహరణలు కలవర పెట్టేవే. బ్రెజిల్‌లో 2200 మంది పదేళ్ల లోపు పిల్లలు కొవిడ్‌తో మరణించారు. అక్కడి కొవిడ్‌ ‌మరణాలలో ఇది 0.5 శాతం. అమెరికాలో ఐదేళ్ల లోపు పిల్లలు 113 మంది చనిపోయారు.ఈ అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవడం అవసరం. ఇదే సమయంలో మరొక వాస్తవం కూడా గమనించాలి. బ్రెజిల్‌లో పిల్లల మరణాలు కొంచెం ఎక్కువ.

మూడోదశను ఎదుర్కొనడానికి కరోనా వారియర్స్‌కు ప్రత్యేక శిక్షణ కావాలి. ఇండియన్‌ అకాడెమి ఆఫ్‌ ‌పిడియాట్రిక్స్‌లో 30,000 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వివిధ శాఖలలో ఉన్నారు. అంటే దేశం నలుమూలలా వీరు విస్తరించి ఉన్నారు. కొత్తగా మిలటరీ డాక్టర్లు, ఆయుష్‌ ‌డాక్టర్లు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు తర్ఫీదు ఇవ్వాలి. వీరు దేశంలో పోలియో వ్యాక్సిన్‌ ‌కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చరిత్ర కలిగినవారే కూడా.

మూడోదశ కరోనాను ఎదుర్కొనడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు సన్నాహాలు ప్రారంభించాయి. ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి నడుం బిగించాయి. ఈసారి దృష్టంతా చిన్నారులు కేంద్రంగా ఉంది. పడకల సంఖ్యను పెంచడంతో పాటు, 12 ఏళ్ల వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆక్సిజన్‌ ‌ప్లాంట్లను నెలకొల్పడం, పరీక్షా కేంద్రాలను పెంచడం, ప్రయోగశాలల సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. 12 ఏళ్ల లోపు వయసు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల లోపు వయసు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇస్తున్నట్టు గోవా వెల్లడించింది.చాలా రాష్ట్రాలు పిల్లల వైద్యం కోసం ఐసీయులను విస్తరిస్తున్నాయి. మహారాష్ట్ర అయితే ఒక్క ముంబైలోనే ప్రస్తుతం 600 మాత్రమే ఉన్న పిల్లల కొవిడ్‌ ‌పడకలను 2300కు పెంచుతున్నది. ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే సేవలు అందిస్తున్న డీఆర్‌డీఓ పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. పరిస్థితిని ఎదుర్కొనడానికి పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల్‌‌ప్రదేశ్‌, ‌గోవా, ఉత్తరాఖండ్‌  ‌ప్రత్యేక బృందాలను, టాస్క్‌ఫోర్స్‌లను నియమించాయి.  ఉత్తరాఖండ్‌ ఈ ‌విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నది. అక్కడి జనాభాలో 43 శాతం బాలలే. మోదీ చెప్పినట్టు కరోనాను మనం గెలుస్తాం. మూడోదశ ఇందుకు మినహాయింపు కాదు.

By editor

Twitter
Instagram