కావేరీ నది జన్మస్థలం, అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాల సందర్శన జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.  ఈ ప్రదేశాన్ని స్కాట్లండ్‌ ఆఫ్‌ ఇం‌డియా (Scotland of India) అని కూడా అంటారు. ఇక్కడి ‘కూర్గు’  ప్రాంతం (Coorg) ప్రకృతి అందాలకు నిలయం.

హైదరాబాద్‌ ‌నుండి బెంగళూరుకు గంటన్నర విమాన ప్రయాణం. ఉదయమే బయలుదేరి బెంగుళూరు చేరుకున్నాం. దాదాపు 280 కి.మీ. దూరంలో ‘మడికేరి’ (ఇక్కడే కూర్గు ఉంది) చేరడానికి ఏడు గంటలైంది. అయితే మా రిసార్ట్ (‌వసతి గృహం) మడికేరి నుండి 25 కి.మీ. దూరం. తోటలు, పర్వతాల మధ్య ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది.

మరునాడు (రెండవ రోజు) కూర్గు ప్రాంత యాత్రా స్థలాలను చూడడానికి బయలుదేరాం. మార్గమంతా కాఫీ తోటలు, ఏలకుల తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలే. ఎక్కడ చూసినా అద్భుత దృశ్యాలే. ఎన్నో ఫోటోలు తీసుకున్నాం. 45 నిమిషాలు ప్రయాణం చేసి ‘తల కావేరి’ చేరుకున్నాం. ‘కావేరీ’ నది జన్మస్థలమిది. ధారలుగా ప్రారంభమైన ‘కావేరీ’తో ‘కన్యక, సుజ్యోతి అనే రెండు చిన్న నదులు కలిసి ‘నదీ’ రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ ప్రదేశాన్ని ‘భగమండల’మని పిలుస్తారు. అత్యంత రమణీయ ప్రదేశమిది. పక్కనే వేయి సంవత్సరాల నాటి ‘భృగండీశ్వరాలయ’మున్నది. ఈ మూడింటిని తప్పకుండా చూడాలి. ఇవి ఇక్కడి విశేష దర్శనీయ స్థలాలు. దాదాపు రెండు గంటలపాటు ఈ రమణీయ ప్రదేశంలో గడిపి, ‘మడికేరి’ పట్టణంలో ప్రభుత్వం వారి సిల్క్ ఎం‌పోరియంలో షాపింగ్‌ ‌చేశాం.

భోజనం తర్వాత మధ్యాహ్నం ‘మడికేరి’ పట్టణ పరిసరాలలోని ‘అబ్బే జలపాతాలు’ (Abbey Falls), రాజాసీట్‌ (Raja Seat) వద్ద గడిపాం. ఇక్కడ రెండు వందల సంవత్సరాల నాటి ఓంకారేశ్వర మందిరం దర్శించుకుని సాయంత్రానికల్లా మా రిస్టార్‌ ‌చేరుకున్నాం. అలనాటి మనదేశ సైన్యాధిపతులు జనరల్‌ ‌కరియప్ప, తిమ్మప్పలు…ఈ ప్రాంతానికి చెందినవారే.

మరునాడు ఉదయం (మూడో రోజు) ‘హున్సూర్‌’ ‌కాబిన్‌ ‌డ్యామ్‌ ‌మార్గంగా 230 కి.మీ. ప్రయాణం చేసి (ఈ మార్గమంతా కర్ణాటక గ్రామీణ ప్రాంతం)  సాయంత్రం ‘బండిపూర్‌’ (‌Bandipur) చేరుకున్నాం. ఇక్కడ ‘రిసార్ట్’ అడవిలో ఉంది. ఆ రోజు సాయంత్రం బండిపూర్‌ ‌రిసార్ట్‌లోని ప్రకృతి అందాలను వీక్షించాం.

మరునాడు (నాల్గవ రోజు) ఉదయమే బయలుదేరి ‘మదుమలై అడవుల గుండా, మైసమ్‌గుడి మార్గంగా ఘాట్‌రోడ్‌లో 50 కి.మీ. దూరంలోని ‘ఊటి’కి (ఉదకమండలం) బయలుదేరాం. ఈ అభయారణ్యంలో జింకలు, బైసన్‌లు, పురివిప్పిన నెమళ్లు, ఏనుగులు, అడవిపందులు.. ఎన్నో రకాల జీవాలను చూశాం. ఇవన్నీ గుంపులు, గుంపులుగా సంచరిస్తూ కన్పించాయి. రెండు గంటలపాటు ఈ అడవుల మార్గంగా, ఘాట్‌రోడ్‌లో ప్రయాణం చేసి ఊటి (తమిళనాడు) చేరుకున్నాం. దాదాపు 43 సంవత్సరాల తర్వాత మేం ‘ఊటి’ (ఉదకమండలం) మరోసారి రావటం… ఆనాటి ప్రకృతి సంపద ‘ఈనాడు’ తగ్గినట్లు అనిపించింది. ఇక్కడ 1840 నాటి బొటానికల్‌ ‌గార్డెన్స్ (‌Botanical Gardens)లో గంటకు పైగా తిరిగాం. ఇందులోని ఇటాలియన్‌ ‌గార్డెన్స్, ‌గ్లాస్‌ ‌హౌజ్‌ (Glass House) గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎన్నో రకాల వృక్షాలు, ఫల, పుష్పజాతుల మొక్కలు మనకు కనువిందు చేస్తాయి. ఇక్కడ ‘టిబెటియన్‌ ‌మార్కెట్‌’‌లో సరసమైన ధరలో ఊలు వస్త్రాలు లభిస్తాయి. ఇక్కడ నుంచి ‘ఊటి’లోని ఎత్తైన్న ‘దొడ్డబెట్ట’ (Dodda Betta)లో గంటకు పైగా గడిపాం. ఇక్కడ నుంచి ‘ఊటి’ నగర దర్శనం చేసుకోవచ్చు. అంతటి ఎత్తైన ప్రదేశమిది. తిరుగు ప్రయాణంలో దగ్గర్లోని ‘టీ ఫ్యాక్టరీ’లో రకరకాలైన ‘టీ’ పొళ్లను కొన్నాం. నీలగిరి పర్వత సానువుల్లో టీ ప్లాంటేషన్‌ (Tea Plantation) చూడదగ్గ విశేషం. తర్వాత ‘ఊటి’ సరస్సులో కొంతసేపు గడిపి మళ్లీ ‘బండిపూర్‌’‌కు తిరుగు ప్రయాణమయ్యాం. ఆ రాత్రికి మా బస ‘బండిపూర్‌’‌లోని అటవీప్రాంత రిసార్ట్‌లో (Forest Resorts). ఆ మరునాడు (అయిదవ రోజు) ఉదయాన్నే ‘బండిపూర్‌’ అభయారణ్య సందర్శనానికి ‘జీపు’లో బయలుదేరాం. ఒకప్పుడు ‘పులులకు’ (Tiger) ప్రసిద్ధిగాంచిన ఈ అడవుల్లో, నేడు అటవీ సంపద వినాశనం వలన దాదాపు అవి కనుమరుగై పోతున్నాయి. అందువల్ల కేవలం ఒకటి, రెండు ప్రదేశాల్లో పులి అడుగులు ఉన్నట్లు గుర్తించినా, పులులు మాత్రం కనపడలేదు. ఈ రోజుల్లో ఎప్పుడో, ఎక్కడో, ఒక్కోసారి పులులు కనిపిస్తాయే తప్ప, దాదాపు అవి లేనట్లేనని ఇక్కడివారు చెబుతారు. గంటకు పైగా అడవిలో తిరిగి జింకలు, నెమళ్లు, బైసన్‌, అడవిపందులను మాత్రమే చూడగలిగాం. తర్వాత రిసార్ట్ ‌చేరుకుని 11 గంటల ప్రాంతంలో ‘బండిపూర్‌’ అటవీ ప్రాంతాన్ని వదిలి మైసూరు మార్గంగా బెంగళూర్‌ ‌ప్రయాణమయ్యాం.

80 కి.మీ. మార్గం – రెండు గంటల ప్రయాణం తర్వాత ‘మైసూరు’ చేరుకున్నాం. మార్గంలో చాముండేశ్వరీ హిల్స్‌లో ‘దేవీ’ దర్శనం చేసుకున్నాం. పురాతన ఆలయమిది. ఎత్తైన కొండపై ఉన్నందున, రమణీయ దృశ్యాలను చూడవచ్చు. భోజనానంతరం ‘మైసూరు మహారాజావారి ప్యాలెస్‌’‌లో గంటన్నరపాటు గడిపాం. మైసూరు రాజావారి సంస్థానంలో ఆనాటి చారిత్రాత్మక చిత్రాలు నాటి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు తెలుపుతున్నాయి. విజయదశమి (దసరా) పర్వదినాల్లో అద్భుతంగా ఉత్సవాలు జరిగేది ఇక్కడే. సాయంత్రం ‘కావేరీ’ నదీ తీరంలోని అతి పురాతన, చారిత్రాత్మక ‘శ్రీరంగపట్టణం’లో శ్రీరంగనాథస్వామి వారి ఆలయం చేరుకున్నాం. ఇది ఆనాటి శిల్పకళా చాతుర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వామివారి విగ్రహం భక్తులకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఈ గుడిలోనే శ్రీ నారసింహా, లక్ష్మీదేవి ఆలయాలున్నాయి. అతి విశాలమైన ఆలయ ప్రాంగణం ఆవల నదీ తీరంలో ‘సూర్యాస్తమయ దృశ్యం’ అద్భుతంగా ఉంటుంది. గంటకు పైగా ఈ ఆలయంలో గడిపి, తిరుగు ప్రయాణలో ‘టిప్పూసుల్తాన్‌’ ‌సమాధులను చూశాం. ఆంగ్లేయులను ఎదిరించిన రాజులలో ‘టిప్పు ఒకరని చెబుతారు. రాత్రికి బెంగళూరులో మా బస. మరునాడు (ఆరవరోజు – చివరిరోజు యాత్ర) బెంగుళూరులోని ప్రసిద్ధమైన ‘లాల్‌బాగ్‌’ ‌గార్డెన్స్‌కు వెళ్లాం. ఈ స్థలంలో ఎన్నో రకాల చెట్లు ఫల, పుష్పజాతులకు సంబంధించిన మొక్కలు, పూలు, వనాలు, గ్లాస్‌హౌజ్‌ ఉన్నాయి. తర్వాత ‘జయనగర్‌’‌లో షాపింగ్‌ ‌పూర్తిచేసుకొని సాయంత్రం వాయుమార్గంగా గంటన్నర ప్రయాణించి హైదరాబాద్‌ ‌చేరుకొన్నాం. ‘కావేరీ’ నదీ జన్మస్థలమైన ‘కూర్గు’ ప్రాంతం నుండి మొదలై నదీ పరివాహక ప్రదేశమైన శ్రీరంగనాథ పట్నం దాకా సాగిన మా యాత్ర ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది.

By editor

Twitter
Instagram