ఏప్రిల్‌ 21 శ్రీ‌రామనవమి

ఆదర్శజీవనానికి, భారతీయ సంస్కృతికి ఉజ్జ్వలమైన జ్ఞానశిఖ శ్రీమద్రామకథ. చతుర్వేద సారంగా భావించే రామాయణం ఎన్నో కలాలను, గళాలను పునీతం చేసింది. ఎంతపాడుకున్నా అంతులేని కావ్యం. ఎన్నిమార్లు విన్నా, ఎందరు రాసినా నవ్యాతి నవ్యం శ్రీమద్రామాయణం. రామాయణం జరిగిందా?పుక్కిటి పురాణమా? కల్పితమా? అనే చర్చోపచర్చల కంటే అందులోని మానవీయ విలువలను గ్రహించగలడమే ప్రధాన మంటారు పెద్దలు. ‘రామ+అయనం’ అంటే ‘రాముని మార్గం’ అని అర్థం. ఎదురైన సమస్యలను రాముడు ఎలా అధిగమించాడో తెలుసుకుని అనుసరించ గలిగేదని పెద్దలు చెబుతారు.


కారణజన్ముడైన వాల్మీకి రామయాణాన్ని అత్యంత రమణీయంగానే కాక, మానవులందరికీ అనుసరణీయంగా రాశారు. ఆయన వర్ణించిన రాముని గుణాలు మహోన్నతాలు. మానవజాతికి ఆదర్శాలు. రాముడు సత్యసంధుడు, ధర్మజ్ఞుడు, జ్ఞానసంపన్నుడు, కృతజ్ఞుడు, ప్రజాహితరతుడు, యశస్వి, స్థిరచిత్తుడు, సమదర్శనుడు, సమతామూర్తి, త్యాగశీలి. ఈ సర్వగుణాభి రాముని ఈ మహాకావ్యం ప్రపంచంలోని అన్ని భాషలలోకి అనువాదమైంది. తెలుగులో అనేక మంది కవులు, రచయితలు అనువదించారు. స్వతంత్ర కావ్యాలు రాశారు, రాస్తూనే ఉన్నారు. రామచరితంపై ఇన్ని గ్రంథాలు వెలువడిన తరువాత ఇంకా రాయడం అవసరమా? అనే సందేహాలకు అనేకులు వివరణలు ఇచ్చారు. అలాంటి వారిలో ఒకరు కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ సత్య నారాయణ, తాము రామాయణ రచన చేయడానికి కారణాన్ని ‘మరల నిదేల రామాయణం బన్న ఈ ప్రపంచమెల్ల నెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్న దెపుడును, తనరుచి బ్రతుకులు తనవికాన, చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదికాన, తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన’ అని వివరించారు.

చతుర్వేదాలను దశరథ తనయులతో అభివర్ణిస్తారు. ‘రుగ్వేద యజుర్వేదాలు యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన మంత్రరాజములు కనుక విశ్వామిత్రుడు యాగసంరక్షణార్థం రామలక్ష్మణులను వెంట తీసుకువెళ్లారు. శ్రీరాముని వనవాసకాలంలో భరతుడు రామనామం గానంతో గడిపి•నందున ఆయన సామవేద స్వరూపుడు. యజ్ఞయాగాది పవిత్ర కార్యస్థలాల వద్దకు దుష్టశక్తులు చేరకుండా అధర్వణవేద స్వరూపుడు శత్రుఘ్నడు సంరక్షిస్తాడు’ అని నలుగురు సోదరులను నాలుగు వేదాలతో హృద్యంగా పోల్చిచెబుతారు ఆధ్యాత్మికవాదులు.

‘మర్యాద’ రాముడు

రాముడు సాక్షాత్తు చక్రవర్తే. అయినా ఎదురుగా ఎవరు వస్తున్నా తానే ముందుగా పక్కకు జరిగేవాడు. ఎంత చిన్నవారినైనా ముందుగా పలకరించేవాడు. (పూర్వ భాషీచ రాఘవ).రామచంద్రుడు జీవితంలో ఏ ప్రాణిని అవమానించి ఎరుగడని, ఎవరినీ తూలనాడిన సందర్భంలేదని వాల్మీకి వర్ణించారు. శత్రువులోని ఉన్నతిని మెచ్చుకుంటాడు. రావణుని మొదటిసారి చూచినప్పుడు ‘అహో దీప్త మహాతేజా రావణో రాక్షసేశ్వరః’ అని ఆతని తేజస్సంపదను వర్ణించాడు. ‘సీతాపహరణకు పాల్పడకపోతే దేవలోకానికి కూడా ప్రభువు అయ్యేవాడేమో అనుకున్నాడు. కొందరిలో దయాగుణం, మరికొందరిలో వీరత్వం, ఇంకొందరిలో జ్ఞానం-ఇలా ఒక్కొక్కక్కరిలో ఒక్కొక్క గుణం ఉండవచ్చు. కానీ సత్యం, ధర్మం, దయ, క్షమ, ఓరిమి, వినయం, ఔదార్యం, అభిమానం ఎన్నో సుగుణాల రాశి రామభద్రుడు. అందుకే ఆయన ‘సుగుణాభి రాముడు’గా వినుతికెక్కారు.

రాముడి ప్రజాభిమానం

రాముడు ఒక ఉపాసనగా రాజ్యపాలన చేశాడని వాల్మీకి అంటారు. ఆయన అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్న మనసంతా రాజ్యంలోని ప్రజలపైనే. సోదరుడు భరతుడు అడవికి వచ్చినప్పుడు కన్నవారి క్షేమంతో పాటు రాజ్యపాలన గురించే ఆరా తీశాడు. పాలన గురించి జాగ్రత్తలు చెప్పాడు. ‘ప్రజలపై అనవసర పన్నుల భారం మోపడంలేదు కదా? అపరాధులకు మారే అవకాశం ఇస్తున్నావా? లేక తీవ్రంగా దండిస్తున్నావా?దొంగతనం చేసి పట్టుబడిన వారిని, చోరీసొత్తులో వాటా ఇస్తానన్న వారిని సహించకూడదు. భృత్యం మీదే ఆధారపడే ఉద్యోగులకు, సైనికులకు సకాలంలో పారితోషికాలు అందుతున్నాయా? స్తోత్రపఠనం చేసేవారు, చాడీలు చెప్పేవారి పట్ల దూరం పాటిస్తూ, అప్రమత్తంగా ఉంటున్నావా?’ అని ఆరా తీశారు. ‘మంత్రాలోచనలు అర్థరాత్రి సమయంలోనే చేయాలి. ఒకరే ఆలోచన చేయకూడదు. అలా అని ఎక్కువ మందికి అవకాశం కల్పించకూడదు. చేసిన పనులను సామంతులకు ఎరుక పరచాలి. చేయ వలసిన వాటిని ముందుగా వెల్లడించరాదు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేవడం ద్వారా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విషయవాంఛలతో డబ్బు, సమయం వృథా చేయరాదు. ధర్మం వీడకూడదు. చతుర్విధ పురుషార్థాలలో మొదటి మూడింటిని సక్రమంగా పాటించాలి. ఉదయంవేళ ధర్మకార్యాలు చేయాలి. మధ్యాహ్నం ధనం సంపాదించాలి. రాత్రిపూట సంసార జీవితం సాగించాలి. దీనివల్ల ఆనందం కలుగుతుంది. ఆదాయ వ్యయాల మధ్య సమతూకం పాటించాలి. అపాత్రదానాలు వద్దు. ప్రభువు బుద్ధిమంతుడై ధర్మబద్ధంగా పాలించాలి. అప్పుడే స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి’ అని హితవు పలికాడు. కనుకనే రాముడిని వాల్మీకి ‘సర్వ శాస్త్రార్థతత్వ్తజ్ఞ’అని అన్నారు.

రాముడిలోని ఉదాత్తమానవీయతను ఆవిష్కరిం చారు వాల్మీకి. రామలక్ష్మణులు ఆడగకముందే విశ్వామిత్రుడు వారికి దివ్యాస్త్రాలు ప్రసాదించగా, వాటి ప్రయోగ ఉపసంహారాలను అడిగి మరీ తెలుసుకున్నాడు రాముడు. నాటి నుంచి నేటి దాకా అవలంబించే భద్రతా వ్యూహంలో పాటించవలసిన సున్నిత అంశం రాముడి మాటల్లో దాగి ఉంది. తమతమ దేశాల రక్షణకోసం మారణాయుధాలను సమకూర్చుకోవడంతో పాటు, ప్రమాదకరమైన వాటిని నియంత్రించగల, ఉపసంహరించగల ఉపాయాలు కూడా అవసరమని రాముడి నాటి సందేహనివృత్తి నేటి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.

సమతామూర్తి

నాగరీకుడి నుంచి ఆటవికుడు, ఉడత నుంచి జటాయవు, సామాన్య వీరుని నుంచి మహాయోధుడి వరకు ఒకే భావన. అదే సమత. ఆయనకు తండ్రి దశరథుడు ఎంతో శత్రువు దశకంఠుడు అంతే. ఆపదలో ఉన్నవాడు, శరణాగతి కోరినవాడు పగవాడైనా అభయానికి అర్హుడన్నది రామతత్త్వం. రావణుడు శరణుకోరినా కాదనను అంటాడు. ‘మిత్రభావంతో ఆశ్రయించిన వారిని ఎన్నటికి కాదనను’ (మిత్రభావేన సంప్రాప్తం సత్యజేయం కథంచన….) అంటారు శ్రీరామచంద్రుడు. రావణుడు తనకు శత్రువైనా ఆతనికి విభీషణుడితో అంతిమ సంస్కారం నిర్వహింపచేశాడు.

‘మరణాన్తాని వైరాణి నివృత్తం నః ప్రయోజనమ్‌!

‌క్రియతా మస్య సంస్కారో మమా ప్యేష యథా తవ!! (వైరం మరణం వరకే. ఇప్పుడు అతడు నీకు ఎలానో నాకూ అంత. మీ అన్న మహాపండితుడు, వేదవేత్త. నా పట్ల అపరాధం చేశాడు. అయినా అసువులు బాశాడు. సంస్కారాలు జరిపించు) అని వాల్మీకి మౌని ఉదాత్తుడైన నాయకుని ప్రవర్తనను తెలిపారు.

రామరాజ్యం అంటే…!

వాల్మీకి రామరాజ్యం గురించి వర్ణించిన ప్రకారం- రాజు ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల నిత్యారోగ్యం వర్థిల్లేది. పెద్దలు సజీవులుగా ఉండగా పిన్నలు కాలం చేసేవారు కాదు. శోక రహితులై, ఆరోగ్యభాగ్యాలతో జీవించేవారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాల భయం లేదు. సకాలంలో వానలు కురిసేవి. అదీ పనిపాటలకు ఆటంకం కలగని రీతిలో. ప్రతి ఒక్కరికి గౌరవనీయ బ్రతుకుతెరువు ఉన్నందున అక్రమ మార్గంలో ఆర్జనకు తావుండేది కాదు. వృక్షాలు కాలానుగుణంగా పుష్పిస్తూ, ఫలిస్తూ కనిపించేవి. వృక్షాలు నేలకొరిగేదాకా పెరగేవి తప్ప వృక్ష సంహారం అనేది లేదు.విస్తారంగా అడవులు ఉండడం వల్ల క్రూరమృగాలు జనారణ్యాలలోకి రావలసిన అవసరం కలగలేదు.అందరి కోసం ఒక్కడిగా నిలిచిన రాముడు ఆదర్శంగా ఒక్కడి కోసం అందరు కలసి అన్నట్లు ప్రజలు పరస్పర విరోధరహితంగా, ఆత్మీయతతో మెలగేవారు. సాక్షాత్‌ ‌భగవత్సరూపుడే రాజైతే కష్టాలకు తావెక్కడ?

పాలకుల లక్షణం

పాలకుల శక్తి సామర్థ్యాలు, వారి నడవడిపైనే ప్రజాసంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఏలిక విజ్ఞానవంతుడైతే చాలదని, ధర్మపరుడు కూడా కావాలని రామాయణం చెబుతోంది. ఇది సర్వకాలాలకు వర్తిస్తుందనేందుకు ఒక ఉదంతాన్ని పేర్కొనవచ్చు. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరిన హనుమకు అక్కడ వేదఘోష వినిపించింది. యజ్ఞయాగాది సంరంభాలు అగుపించాయి. లంకానగరం సువర్ణనిర్మితం. ‘ఇలా వేదనాదం వినిపిస్తోంది. లంకాధిపతి మహాపండితుడు. మరెందుకు ఈ పతనావస్థ?’ అనిపించిందట.

 అంటే పాలకులు ఎంత విజ్ఞానాన్ని ఆర్జించి, ఎంత ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినా ధర్మాచరణ లోపిస్తే అది రాణించదు అనేందుకు లంకారాజ్యమే నిదర్శనం.‘లంకలో పుట్టినవారంతా రాక్షసులు కారు’ అన్నట్లు రాజ్యంలోని ప్రజలందరు చెడ్డవారు కాకపోవచ్చు కానీ పాలకుడు దుష్టుడైతే వాళ్లకూ కష్టనష్టాలు తప్పవు. అందుకే ‘రామునిలా ఉండు, రావణునిలా కాదు’ అనే నానుడి పుట్టి ఉంటుంది.

రాచరికంలో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్య యుగంలో వంశానుగతపాలన వేళ్లూనుకుంటుండగా, అందుకు భిన్నంగా, రాచరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చింది రామాయణం. చక్రవర్తి హోదాలో దశరథుడు తనకు నచ్చినరీతిలో కుమారుడికి యువరాజ పట్టాభిషేకం జరిపించవచ్చు. కానీ తన ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం కోరారు.‘ఇది ప్రతిపాదన మాత్రమే. అందరికీ ఆమోదయోగ్యమైతేనే రాముడు యువరాజు అవుతాడు. ఒకవేళ ఇష్టం కాకపోతే ఉత్తములుగా భావించేవారిని ప్రతిపాదిస్తే మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుందాం’ అని దశరథుడు వివరించారు. రామపట్టాభిషేకానికి సభ ఆనందోత్సాహాలతో ఆమోదం తెలిపింది. తనయుడు భరతుడికి పట్టం కట్టాలన్న కైకేయి కోరిన వరాన్ని దశరథుడు ఆమోదించినా, రాముడు మన్నించవలసిన అవసరం లేదు. జ్యేష్టుడిగా తనకు రాజ్యాధికారం ఉందని గట్టిగా వాదించవచ్చు. కానీ ఆయనది విలువలతో కూడిన రాజకీయం. ఆయన ధర్మాన్నే విశ్వసించాడు. ‘తండ్రి నీకు ఇచ్చింది అయోధ్య, నాకు ప్రసాదించింది వనవాసం, ముని సేవాభాగ్యం’ అని సోదరుడు భరతుడిని ఓదార్చాడు.అందుకే రాముడు ఆరాధ్యుడయ్యాడు.

రామచంద్రుడు ప్రతివిషయంలో ప్రజాభి ప్రాయాన్ని మన్నించేవారు. విరివిగా పౌర సమావేశాలు ఏర్పాటుచేసి వినమ్రతతో మనసులోని మాట చెబుతూ, గురువులు, పెద్దలతో హితబోధ చేయించేవారు. తన అభిప్రాయాల పట్ల అభ్యంతరాలు ఉంటే నిర్భయంగా వెల్లడించాలని కోరేవారని రామాయణం చెబుతోంది. ‘జ్ఞానమార్గంలో ఎదురయ్యే విఘ్నాలను అధిగమించగలగాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. ఎవరికీ భయపడవద్దు. ఎవరితోనూ అనవసర శత్రుత్వం వద్దు. మౌనాన్ని పాటిస్తే కలహాలకు ఆస్కారమే ఉండదు. అలాంటి వారికి అంతటా సుఖమే..’ అని రామహితోక్తులని తులసీదాసు (రామ్‌చరిత్‌ ‌మానస్‌) ‌వర్ణించారు. రామస్మరణ, రామభక్తి, రామభజన ముక్తిప్రదాలని ఆయన అన్నారు.

పదకొండు వేల సంవత్సరాలు పాలన సాగించిన తరువాత అవతార పరిసమాప్తి సమయాన్ని గ్రహించిన రాముడు, తనయులు లవకుశలకు పట్టం కట్టే విషయంలో తండ్రి దశరథుడు మార్గాన్నే అవలంబించాడు. సభను సమావేశపరచి, ‘నన్ను అనుమతిస్తే లవకుశలకు రాజ్యం అప్పగించి దేహత్యాగం చేస్తాను’ అని పౌరులను అర్థించాడు. వాస్తవానికి ‘వారసత్వ’ సంప్రదాయంలో అలాంటి లాంఛన పక్రియలు అవసరంలేదు. కానీ ధర్మమూర్తి నడవడి అది. నేటి రాజకీయ, పాలనా వ్యవస్థలను చూస్తున్న వారికి అవన్నీ కథలుగానూ, వింతగానూ అనిపించవచ్చు.

అధికారం కాదు… అనురాగం

‘అధికారం కోసం పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ/హెచ్చెను హింసాద్వేషం/ ఏమౌవుతుందీ దేశం’ అని ఒక సినీకవి ఆవేదన చెందారు. అందుకు భిన్నం ఇక్ష్వాకు వంశ గమనం. తండ్రి మాట కోసం అడవి దారి పట్టాడు రాముడు. అన్న సింహాసనం తనకు వద్దని అగ్రజుడి పాదుకలకు పట్టాభిషేకం చేశాడు భరతుడు. రావణ సంహారంలో తనకు అండగా నిలిచిన వారందరిని సముచితంగా సత్కరించిన జానకీ వల్లభుడు తమ్ముడు లక్ష్మణుడిని యువరాజుగా నియమిస్తానంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు.

ఎందరో రాజులు ఎన్నో రాజ్యాలు ఏలినప్పటికీ లోకంలో ‘రామరాజ్యం’ నానుడే యుగయుగాలుగా స్థిరపడిపోయింది. ఏ యుగానికైనా, ఏ జగానికైనా అదే ఆదర్శంగా నిలిచింది. ఇతర రాజవంశాల పాలకుల సంగతి అటుంచితే, ఇక్ష్వాకు వంశంలోనే రామునికి ముందు, తరువాత కూడా ఈ మాట వాడుకలోకి రాలేదు.అంటే శ్రీరాముని ధర్మనిష్ఠ, సమదృష్టి, సమత, మమత లాంటివి అందుకు కారణంగా చెబుతారు.

రామకథ తెలుగువారి సొత్తు

ఉత్తర భారతదేశంలో సరయూ నదీదీరంలో అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి దక్షిణపథానికి చేరుకుని, సీతాపహరణంతో లంక దాకా సాగాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువ కాలం తెలుగు నేలను సంచరించి నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రజ రామకథను ఎంతగా సొంతం చేసుకుందో చెప్పడానికి ఒకటి రెండు ఉదాహరణలు. వనవాసంలో భాగంగా సీతారామ లక్ష్మణులు ఒక రోజు ఒక ప్రాంతానికి చేరినప్పుడు ఈ ఊరిపేరు ఏమిటి? అన్న సీతమ్మ ప్రశ్నకు ‘సఖీ నేటిపల్లె’ (అంటే ఈ రోజు ఇక్కడే బస) అన్నాడట రాముడు? అదే తూర్పుగోదావరి జిల్లాలోని ‘సఖినేటిపల్లి’ అంటూ మురిపెంగా చెప్పుకుంటారు. అలాగే రావణుడిని ఎదిరించి నేలకూలిన జటాయువును చేరిన రాముడు ‘లే పక్షి!’ అని పిలిచాడట. అదే అనంతపురం జిల్లాలోని ‘లేపాక్షి’ అని గాథ ప్రచారంలో ఉంది. ఇక భద్రాచలంలోని పర్ణశాల ప్రాంతంలో సీతమ్మకు సంబంధించిన ఆనవాళ్ల గురించి చెప్పుకోవడం తెలిసిందే. సర్కార్‌ ‌సొమ్ముతో భదాద్రి ఆలయాన్ని కట్టించాడనే అభియోగంతో చెరసాల పాలైన కంచర్ల గోపన్న (రామదాసు)ను విడిపించేందుకు రామలక్ష్మణులు తానీషాకు కలలో కనిపించి సొమ్ము అప్పగించారనే కథ జగత్ప్రసిద్ధమే.

మానవీయత, నైతికత, సామాజిక బాధ్యత గ•ల పాలకులు ఉత్తములుగా వినుతికెక్కుతారు. అవి లోపించిన వారు ‘ఉత్త’ పాలకులుగానే మిగిలి పోతారు. మొదట కోవకు చెందిన వారి గాథ రామాయణం మానవ జీవన పారాయణం. రామచంద్రుడు ఆదర్శమూర్తి. వేదవేద్యుడు ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు మానవమాత్రుడిగానే వ్యవహరించారు. పాలితులే ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి అర్చించారు. యుగయుగాలుగా అర్చిస్తున్నారు. యుగాలు గడిచినా, తరాలు మారినా మనో మందిరాల్లో కొలువై ఉన్నాడు, మధురాతిమధుర రామనామం జనం నాల్కలపై నర్తిస్తూనే ఉంది, ఉంటుంది.

About Author

By editor

Twitter
Instagram