చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే సరే చరిత్రను అవమానించడమే పనిగా పెట్టుకున్న రాజకీయ పార్టీ కాంగ్రెస్‌. 370 అధికరణం రద్దును వ్యతిరేకించి పరోక్షంగా కశ్మీర్‌ ‌వేర్పాటువాదులను సమర్ధించడం, బుర్హాన్‌ ‌వానిని అమాయకుడని వాదించడం, పుల్వామా దాడిలో కుట్రను చూడడం, సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ను పరిహసించడం కాంగ్రెస్‌ ‌ప్రజా వ్యతిరేక, భారతీయ వ్యతిరేక ధోరణులకు తాజా ఉదాహరణలు. మైనారిటీల బుజ్జగింపు ఆ పార్టీ సహజ లక్షణం. దానితోనే యాభయ్‌ ఏళ్లు ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్‌ ‌పార్టీ. ఆ పార్టీని చెత్తబుట్టలోకి విసిరింది దేశ ప్రజానీకం. అయినా, అదే బుజ్జగింపు ధోరణిలో భవిష్యత్తును వెదుక్కుంటున్నది. దేశ సమైక్యత, హిందువుల శ్రేయస్సులను గాలికొదిలి బుజ్జగింపునే నమ్ముకుని దింపుడుకళ్లం ఆశతో ఉంది. ఇందుకు తాజా ఉదాహరణే పంజాబ్‌లో 23వ జిల్లా ఏర్పాటు. మరో ఏడెనిమిది మాసాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి ఈ తాయిలం ప్రకటించారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రంజాన్‌ (‌మే 14) సందర్భంగా ముస్లింలకు పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ‌భారీ బహు మానం ప్రకటించారు. అదేమీ పండుగ సంబారాల కిట్‌ ‌కాదు. ఇళ్ల మంజూరు కాదు. ఏకంగా ముస్లింలకు ఒక ప్రత్యేక జిల్లా ప్రకటించారు. మలేర్‌కోట్లా అనే ప్రాంతం ఇకపై ముస్లిం జిల్లా. ముస్లింలు చిరకాలం నుంచి ముచ్చట పడుతున్నారు కాబట్టీ, ఎలాగూ కాంగ్రెస్‌ ‌పార్టీ 2017 అసెంబ్లీ ఎన్నికల హామీలలో పొందుపరిచింది కాబట్టీ ఈ ఈద్‌కి ఆ జిల్లాను ప్రకటిస్తున్నాను అని ముఖ్యమంత్రి వర్చ్యువల్‌ ‌విధానంలో ప్రసంగిస్తూ చెప్పేశారు. అంతేకాదు, 2017 సంవత్సరంలో ఈద్‌ ఉత్సవాలలో పాల్గొన్న నాటి మంత్రి నవజోత్‌ ‌సిద్ధు, ఆర్థికమంత్రి మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌బాదల్‌, ఇం‌కో మంత్రి రజియా సుల్తానా  కూడా (మలేర్‌కోట్లా ఎంఎల్‌ఏ) ‌వారందరి ‘ప్రత్యేక జిల్లా’ కోరిక త్వరలోనే నేరవేరుతుందని హామీ ఇచ్చారట.

1947 తరువాత భారత్‌లో విలీనమైన 562 సంస్థానాలలో మలేర్‌కోట్లా ఒకటి. ముఖ్యమంత్రి నిర్ణయంతో మలేర్‌కోట్లా ఇక గణనీయంగా అభివృద్ధి చెందుతుందని రజియా ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా మలేర్‌కోట్లా ప్రాంతీయలు, మరీ ముఖ్యంగా ముస్లింలు కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ఇచ్చిన ఈద్‌ ‌కానుక పట్ల సర్వదా కృతజ్ఞతతో ఉంటారని కూడా హామీ ఇచ్చారు.

ముస్లింల కోసం జిల్లాను ఏర్పాటు చేస్తున్న సందర్భం ఎంత పవిత్రమైనదో కూడా ముఖ్యమంత్రి చెప్పుకున్నారు. కానీ అది రంజాన్‌తో వచ్చిన పవిత్రత కాదు. బెంగాల్‌, ‌తమిళనాడులలో సెక్యులర్‌ ‌శక్తుల చేతిలో  మతశక్తులు ఓడిన సందర్భమట. ఈ దేశానికి ఉన్న సెక్యులర్‌ ‌సంప్రదాయం ఎంతో తద్వారా అర్ధం చేసుకోవచ్చునట. పరిపాలనా వ్యవహారాలలో ప్రజలకు దూరాభారం బాధ లేకుండా కొత్త జిల్లా ఏర్పాటు ఉపకరిస్తుందట.

సిక్కులు అత్యధికంగా ఉండే పంజాబ్‌లో ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఒకే ఒక్క ప్రాంతం మలేర్‌కోట్లా. దీని పక్కనే ఉన్న అహ్మద్‌నగర్‌, ఉప తహసీల్‌ అమర్‌గఢ్‌ ‌కూడా ఈ కొత్త జిల్లాలో భాగమవుతాయట. ప్రస్తుతం ఇది సంగ్రూర్‌ ‌జిల్లాలో భాగంగా ఉంది. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో  ఏర్పాటవుతున్న ఈ కొత్త జిల్లా యంత్రాం గం తక్షణమే పని ప్రారంభించడానికి కావలసిన భవంతిని ఏర్పాటు చేయవలసిందని సంగ్రూర్‌ ‌డిప్యూటీ కమిషనర్‌కి ఆదేశాలు కూడా వెళ్లాయి. నవాబ్‌ ‌షేర్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌పేరుతో ఒక వైద్య కళాశాల ఏర్పాటుకి రూ.500 కోట్లు కూడా మంజూరయ్యాయి. మొదట దఫాగా 50 కోట్లు విడుదల చేశారు కూడా. ప్రస్తుతం ఆ ప్రాంత బాలికలు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు కాబట్టి వారి కోసం ఒక విద్యాసంస్థను కూడా దయ చేశారు. కొత్త బస్టాండ్‌ ‌కోసం పదికోట్లు ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆఖరి నవాబు ఇఫ్తెకార్‌ అలీఖాన్‌ ‌భార్య మున్వర్‌ ఉన్నిసా ఉంటున్న ముబారక్‌ ‌మంజిల్‌ను బ్రిటన్‌కు చెందిన ఆగాఖాన్‌ ‌ఫౌండేషన్‌ ‌సాయంతో సాంస్కృతిక కేంద్రంగా, వస్తు ప్రదర్శన శాలగా తీర్చిదిద్దుతారట. ఇవన్నీ ఎన్నికలకు ముందు హఠాత్తుగా గుర్తుకొచ్చాయి.

మలేర్‌కోట్లా నిర్మాతలు భారతీయులు కారు. మొగల్‌ ‌వారసులు. ఇక్కడ దేశ విభజన వేళ ఎలాంటి రక్తపాతం జరగలేదు. దీని ఘనతకు ఇదే కారణం. 1454లో అఫ్ఘానిస్తాన్‌ ‌జాతీయుడు షేక్‌ ‌సద్రుద్దీన్‌ ‌జహాన్‌ ‌మలేర్‌కోట్లాను స్థాపించాడు. తరువాత మలేర్‌కోట్లా సంస్థానాన్ని ఏర్పాటు చేసినవాడు బయాజిద్‌ ‌ఖాన్‌. ఆఖరి నవాబుతో తనకు ఉన్న అనుబంధం గురించి కూడా ఈ వర్చ్యువల్‌ ‌ప్రసంగంలో కెప్టెన్‌ ‌పరవశంతో గుర్తు చేసుకున్నారు. ఆ నవాబును కెప్టెన్‌ ‌ప్రేమగా చాచాజీ (మామాజీ)  అని పిలిచేవారట. ఆ నవాబు భాతీజీ (అల్లుడు)  అంటూ అంతే ప్రేమగా స్పందించేవారట. మలేర్‌కోట్లాకు మరొక చెప్పుకోతగిన చరిత్ర ఉంది. గురు గోవింద్‌ ‌సింగ్‌ ‌కుమారులు బాబా జోరావర్‌ ‌సింగ్‌ (9), ‌బాబా ఫతే సింగ్‌ (7)‌లను సర్‌హింద్‌ ‌గవర్నర్‌ ‌వజీర్‌ఖాన్‌ ఇటుకలతో చుట్టూ గోడ కట్టించి, ఊపిరి ఆడకుండా చేసి చంపినప్పుడు ఈ నవాబులు దానిని ఖండిచారు. అందుకు గురు గోవింద్‌ ‌సింగ్‌ ఈ ‌సంస్థానాధీశులకు ఆశీస్సులు కూడా ఇచ్చారని చెప్పుకుంటారు. ఈ ప్రాంతం మీద  కొన్ని దాడులు జరిగినప్పుడు అక్కడ గుర్రపు స్వారీ శబ్దాలు వినిపించేవనీ, అవి గురు గోవింద్‌ ‌సింగ్‌ ‌గుర్రం మీద తిరుగుతూ రక్షిస్తూ ఉండడం వల్ల వినిపిస్తాయనీ జనం నమ్మకం. గోవింద్‌ ‌సింగ్‌ ‌కుమారుల హత్యలను ఖండించిన నవాబు పేరు షేర్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌. అవన్నీ నిజమే అయినా, ఇలాంటి కానుక ఇవ్వడం ప్రశ్నార్థకం కాదా!

దేశ విభజన సమయంలో పంజాబ్‌లో జరిగిన హింస భయానకమైనది. సిక్కులు-ముస్లింల మధ్య, హిందువులు-ముస్లింల మధ్య దారుణమైన ఘర్షణలు జరిగాయి. వేలమంది చనిపోయారు. ఎందరో ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. ఎందరో హిందువులు, సిక్కులు పాకిస్తాన్‌ ‌ప్రాంతం నుంచి భారత్‌కు ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చారు. ఇది చరిత్ర. అయితే మలేర్‌కోట్లా సంస్థానం నుంచి పాకిస్తాన్‌కు వలసలు లేవు. చివరి నవాబు ఇఫ్తెకార్‌ ‌పాకిస్తాన్‌కు వెళ్లలేదు. నిజానికి అప్పటికి మలేర్‌కోట్లా జనాభాలో ముస్లింల శాతం అంత ఎక్కువ  కాదు. పాకిస్తాన్‌ ‌వెళ్లడానికి సాధ్యపడని చాలామంది ముస్లింలు మలేర్‌కోట్లా వచ్చారు. ఆ విధంగా అక్కడ వారి జనాభా పెరిగింది.

తాజా గణాంకాల ప్రకారం మలేర్‌కోట్లా (పట్టణం) మొత్తం జనాభా 1,35,424. ఇందులో ముస్లింలు 92,765 (68.50 శాతం), హిందువులు 28,044 (2071 శాతం), సిక్కులు 12,864 (9.5 శాతం), జైన్లు 1,499 (1.1 శాతం). ఇంకా ఏఏ గ్రామాలు ఇందులో చేరతాయో నిర్ణయించవలసి ఉంది. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మలేర్‌కోట్లా ఎప్పుడూ మత కలహాలకు దూరంగా ఉందని చెప్పారు. కానీ మత శక్తులకు దూరంగా ఇప్పుడు కూడా ఉందా? 2020 సంవత్సరంలో తబ్లిఘి జమాత్‌ ‌వివాదం చెలరేగినప్పుడు ఈ చిన్న పట్టణం పేరు వార్తలలోకి వచ్చింది. ఇక్కడ ఉండే ప్రతి ముస్లింకు తబ్లిఘితో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. 1947 నాటికి దేశంలో ముస్లింలలో చాలామంది జాతీయవాదులు ఉండేవారు. వారి సంఖ్య నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చింది. లేదంటే మత ఛాందసవాదం తగ్గిస్తూ వచ్చిందన్నా తొందరపాటు కాదు. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, అందులో ముస్లిం ఛాందసవాదుల పాత్రను పరిశీలించిన తరువాత కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌చేసిన ప్రకటన దేశ సమగ్రతకు భంగం కలిగించేదేనని చెప్పడానికి వెనుకాడనక్కరలేదు. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌మహా నాయకుడు సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌గొప్ప ముందు చూపుతో ఈ సంస్థానాలను భారత రిపబ్లిక్‌లో భాగం చేశారు. పటేల్‌  ఆశయానికీ, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికీ ‘ప్రత్యేక జిల్లాలు’ నిశ్చయంగా తూట్లు పొడుస్తాయి. మరొక మాటలో చెప్పాలంటే దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తాయి.

ఒక మతం వారికి ప్రత్యేకంగా జిల్లాను ఏర్పాటుచేయడం, దానిని సెక్యులరిజం విజయవంతమైన సందర్భంలో ప్రకటిస్తున్నామని చెప్పడం ఒక ప్రహసనాన్ని తలపిస్తుంది. ఇక వచ్చే క్రిస్మస్‌కు ఇంకొన్ని కొత్త జిల్లాల గురించి  వినవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. క్రైస్తవులలో ఇలాంటి దూరాలోచన కలిగిన వారు లేరనా? మలప్పురం ప్రాంతాన్ని ముస్లిం జిల్లాగా ప్రకటించమని ఇప్పటికే ముస్లింలు కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ను అడిగారు. ఈ విధంగా చూస్తే రామనాథ్‌ ‌పురం, కోయంబత్తూరు (కొనుగునాడు), వెల్లూరు ప్రాంతాలను కూడా ప్రత్యేక ముస్లిం జిల్లాలుగా ప్రకటించమని కోరే అవకాశం ఇచ్చినట్టే. కేరళ కమ్యూనిస్టులు, తమిళనాడు డీఎంకే అడిగిందే తడువుగా వారికి పువ్వుల్లో పెట్టి ఇస్తాయంటే అతిశయోక్తి కాదు. ఇంకొన్ని ప్రాంతాల వారు కూడా ప్రత్యేక పాట అందుకుంటారని చెప్పినా తోసిపుచ్చలేం. ఇక వేర్పాటువాద పోకడలకు సంబంధించి బెంగాల్‌ ‌గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇస్లాం ఛాందసవాదం వెర్రితలలు వేస్తున్న తరుణంలో సరిహద్దు రాష్ట్రాలు బెంగాల్‌, ‌పంజాబ్‌లలో ఇలాంటి ముఖ్యమంత్రులు అధికారంలో ఉండడం భారతీయుల ప్రారబ్ధం. కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌మైనారిటీ ఓట్ల మీద కక్కుర్తితో సరికొత్త చిచ్చును దేశం గుండెల మీద పెట్టారు.

About Author

By editor

Twitter
Instagram