బలిపీఠం బెంగాల్‌ -‌రక్తదాహంతో ఊగిపోతున్న టీఎంసీ

యుద్ధంలో గెలిచినవారు ఓడినవారిపై; వారి ఇళ్లు, ఆస్తులపై దాడి చేసి మానప్రాణాలను దోచుకోవడం మధ్యయుగాల నీతి. ప్రజాస్వామిక యుగంలోను గెలిచిన పార్టీలు ప్రత్యర్థుల పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తే? ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్నది ఇదే. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మొదలైన అమానుష ఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయి. ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవే. బీజేపీతో పాటు ఇతర విపక్షాల కార్యకర్తలు, అభిమానులపై తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ (టీఎంసీ) సాగించిన హింసాకాండలో ఇప్పటి వరకూ 23 మంది బలైనట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆ హింసను చూసి దేశం నివ్వెరపోతున్న తరుణంలోనే కేంద్ర మంత్రి మురళీధరన్‌ ‌కాన్వాయి మీద దాడి జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనా, కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌హెచ్చరించినా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీకి చీమ కుట్టినట్లయినా లేదు. నామమాత్రపు పరిహారంతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. దేశ విభజన నాటి హింస గుర్తుకు వస్తున్నదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించవలసి వచ్చింది. మరోవైపు ఆ హింసపై జాతీయ మీడియా దొంగ నిద్ర నటించడమే కాదు, ఆ ఘటనలను చిన్నవిగా చేసి చూపించాలనే ప్రయత్నం చేసింది.

ఇది మానవత మీద దాడి.

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. ఓడిన పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది. ఈ ప్రాథమిక సత్యాన్ని గ్రహించి పార్టీలు హుందాగా వ్యవహరించాలి. అంతేకానీ, గెలిచాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే అహం పనికిరాదు. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత అసోం, కేరళ, తమిళ నాడు, పుదుచ్చేరిలలో ప్రశాంత వాతావరణంలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. కానీ బెంగాల్‌! ‌వాటికి పూర్తి భిన్నం. తృణమూల్‌ ‌విజయోత్సవాలు ప్రతిపక్ష కార్యకర్తలకు, సమర్ధకులకు కాళరాత్రులుగా మారాయి.

ఫలితాల వెంటే హింసాకాండ

పదేళ్ల మమతా బెనర్జీ పాలనకు ఓటర్లు చరమగీతం పాడతారని భావిస్తున్న తరుణంలో, ప్రచారం చివరి రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. తృణమూల్‌కు అనుకూలమైనాయి. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్ల సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 77 సీట్లకు ఎదగడాన్ని టీఎంసీ జీర్ణించుకోలేక పోయింది. ఫలితాలు వెలువడగానే హింసాకాండ మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాలయా లతో పాటు నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఇళ్లపై దాడులు జరిగాయి. విజయోత్సవాల పేరిట టీఎంసీ కార్యకర్తలు నగరాలు, పట్టణాలు, గ్రామాలు- అన్ని ప్రాంతాల్లో చెలరేగిపోయారు. బీజేపీ కోసం పని చేసిన వారే లక్ష్యంగా సాగారు. ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేశారు. లూటీలు చేసి తగుల బెట్టారు. ఇండ్లలోకి వెళ్లి మహిళల పట్ల దారుణంగా వ్యవహ రించారు. పార్టీకి ఓటు వేసిన వారినీ వదలలేదు.

గంగాపూర్‌లో మే 2న అర్ధరాత్రి బీజేపీ కార్యకర్త ఉత్తమ్‌ ‌ఘోష్‌ను టీఎంసీ గూండాలు హత్య చేశారు. జగద్దల్‌ ‌ప్రాంతంలో శోవ రాణి మండల్‌, ‌రాణాఘాట్‌ ‌లో ఉత్తమ్‌ ‌ఘోష్‌, ‌బెలియఘటాలో అభిజిత్‌ ‌సర్కార్‌, ‌సోనార్పూర్‌ ‌దక్షిణ్‌లో హరోమ్‌ అధికారి, సీతాల్‌ ‌కుచ్చిలో మౌమిక్‌ ‌మౌత్ర, బోల్పూర్‌లో గౌరబ్‌ ‌సర్కార్‌ ఆ ‌దుండగుల దాడిలో మరణించారు. ఈ మారణ కాండ టీఎంసీ కార్యకర్తల ముసుగులో ఉన్న బంగ్లా చొరబాటుదారులదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

‘నా కళ్ల ముందే మా ఇంటిపైకి బాంబులను విసిరారు. ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తనయినందుకు టీఎంసీ కార్యకర్తలు నాపై కక్ష కట్టి దాడి చేశారు. ఏ మాత్రం కనికరం లేకుండా మా ఇంట్లో కుక్కపిల్లలను కూడా చంపారు’ అని అభిజిత్‌ ‌సర్కార్‌ ‌టీఎంసీ గుండాల చేతిలో హత్యకు గురయ్యే ముందు తీసుకున్న వీడియోలో చెప్పాడు.

టీఎంసీ మూకల చేతిలో అక్కడక్కడా మహిళలపై అత్యాచారం జరిగిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. నానూర్‌లో టీఎంసీ కార్యకర్తలు తమ ఇద్దరు మహిళా పోలింగ్‌ ఏజెంట్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మాజీ ఎంపీ, తారకేశ్వర్‌ అభ్యర్థి స్వపన్‌ ‌దాస్‌గుప్తా ఆరోపించారు. తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 12 గ్రామాల్లో పలువురు మహిళా బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేశారని కూడా చెప్పారు.

సువేందుకు చేదు అనుభవం

నందిగ్రాం బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమినీ టీఎంసీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. ఫలితాలు రాగానే హల్దియా పోలింగ్‌ ‌కేంద్రంపై దాడి చేశారు. నియోజకవర్గ బీజేపీ కార్యాలయానికి నిప్పంటించారు. విజయం సాధించి నందిగ్రామ్‌ ‌వచ్చిన సువేందు వాహన శ్రేణిపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. ఆరాంబాగ్‌లో కూడా ఇదే జరిగింది. అక్కడ టీఎంసీ అభ్యర్థి సుజాత మండల్‌ ఓడినట్టు ప్రకటించగానే స్థానిక బీజేపీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గోపాల్‌ ‌నగర్‌ ‌ప్రాంతంలో ఇండ్లను, దుకాణాలను ధ్వంసం చేశారు. బీజేపీ పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్న కార్యకర్త ఇంటిపై దాడి చేశారు. ఇంటిని విడిచి పెట్టి పోవాలని బెదిరించారు. ఘర్షణలకు సంబంధించిన పలు వీడియోలను, హింసాత్మక ఘటనల్లో మృతి చెందినవారి, గాయ పడినవారి ఫొటోలనూ బీజేపీ సోషల్‌ ‌మీడియాలో పోస్ట్ ‌చేసింది. ఈ ఘటనలు వేలల్లో ఉన్నాయి.

కోల్‌కొతాలోని ఏబీవీపీ కార్యలయంపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ చర్యను ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నిధిత్రిపాఠి ఖండించారు. బీజేపీ కార్యకర్తల ఇండ్లు, కార్యాయాలతో పాటుగా హిందూ దేవాలయాలపై కూడా టీఎంసీ కార్యకర్తలు, జిహాదీ శక్తులు దాడులకు పాల్పడ్డారు.

పారిపోయిన హిందూ కుటుంబాలు

ఎన్నికల తర్వాత బెంగాల్‌లో జిహాదీ శక్తులు విజృంభించాయి. ఫలితాలు వెల్లడైనాక తృణమూల్‌ ‌కార్యకర్తలు హింసకు పాల్పడ్డారని, ముఖ్యంగా హిందూ కుటుంబాలను వెతికి మరీ దాడులు చేస్తున్నారని స్వపన్‌ ‌దాస్‌గుప్తా చెప్పారు. బీర్‌భూమ్‌లోని వేయి హిందూ కుటుంబాలు ఇళ్ల నుంచి పారిపోతున్నాయని ట్వీట్‌ ‌చేశారు.‘ఈ ప్రాంతం నానూర్‌ ‌విధానసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. భయంకరమైన పరిస్థితి నెలకొంది. మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని, తక్షణమే ఈ ప్రాంతానికి భద్రత కల్పించాలి’అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షాను కోరారు. గణేష్‌ ‌ఘోష్‌ అనే బీజేపీ కార్యకర్త తన ప్రాణాలకు ముప్పున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కలసి బెంగాల్‌ ‌నుంచి పారిపోవలసి వచ్చింది.’ అన్నదే దాని సారాంశం.

శాంతిభద్రతలు కుప్పకూలాయి: నడ్డా

ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారంటే, అందులో అతిశయోక్తి లేదు. ‘హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అల్లర్ల కారణంగా దాదాపు లక్షమంది స్థానికులు సొంతూర్లను వదిలేసి పోయారు. ఈ కుట్ర వెనుక ఆమె ప్రమేయం ఉంది గనుకే ఆమె నోరు మెదపకుండా ఉన్నారు. హింసను ప్రేరేపించిన మమత చేతులు ఇప్పటికే రక్తంతో తడిశాయి. నిరుడు ‘‘అంపన్‌’’ ‌తుపాను కారణంగా గ్రామాల్లో విధ్వంసం చూశాం. నేడు మమత కారణంగా అదే విధ్వంసం పునరావృతమైంది. హింస కారణంగా బెంగాలీలు పొరుగున ఉన్న అస్సాంకు వలసవెళ్లారు’ అని నడ్డా వ్యాఖ్యానించారు.

ఈ హింసలో 23 మంది మరణించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ‌ఘోష్‌ ఆరోపించారు. ఎన్నికలు జరిగిన స్ధానాల్లో దాదాపు సగం నియోజకవర్గాల్లో హింసాకాండ ప్రజ్వరిల్లిందని చెప్పారు.

బెంగాల్‌ ‌పరిణామాలపై జాతీయ నాయకత్వం పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు, ధర్ణాలు చేపట్టాయి. 30కి పైగా దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా నిరసన తెలిపారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. విదేశాల్లోని సుమారు 50కి పైగా నగరాల్లో ప్రవాస భారతీయులు, బెంగాలీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

గవర్నర్‌కు మోదీ ఫోన్‌

‌బెంగాల్‌ ‌ఘర్షణలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ వెంటనే నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సత్వరమే నివేదికను పంపని పక్షంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణి స్తామని హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత  భారీ హింస చోటు చేసుకున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌జగ్‌దీప్‌ ‌ధనకర్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ ‌చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ నేత ఒకరు సుప్రీం కోర్టును కోరారు.

చేతులూపుకుంటూ రాజ్‌భవన్‌కు

మరోవైపు రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్‌ ‌జగ్‌దీప్‌ ‌ధన్‌కర్‌ ‌స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పన్‌ ‌బందోపాధ్యాయ, డీజీపీ వీరేంద్రను రాజ్‌ ‌భవన్‌కు పిలిపించుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నివేదిక లేకుండానే రాజ్‌భవన్‌కు వారు రావడంపై జగదీప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిస్థితిని వివరించ డంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని గవర్నర్‌ ఆరోపించారు. రాష్ట్ర పాలన రాజ్యాంగ విరుద్ధంగా ఉండడం, హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వకపోవడం దారుణ మని ట్వీట్‌లో పేర్కొన్నారు. వెంటనే శాంతి నెలకొనేలా చూడాలని వారిని ఆదేశించారు. గతేడాది ఇదే శాంతి భద్రతల విషయంలో సీఎం మమతా బెనర్జీకి, గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధన్‌ఖర్‌ ‌మధ్య వివాదం తలెత్తగా.. ఈసారి గవర్నర్‌పై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర మంత్రిపైనే….

ఎన్నికల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్‌ ‌కూడా టీఎంసీ కార్యకర్తలకు లక్ష్యంగా మారారు. వెస్ట్ ‌మిడ్నాపూర్‌ ‌వచ్చిన మంత్రి కాన్వాయ్‌ను టీఎంసీ జెండాలను పట్టుకున్న కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌లోని ఓ కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఆ దృశ్యాలను మురళీధరన్‌ ‌ట్విటర్‌లో షేర్‌ ‌చేశారు. టీఎంసీ గూండాలే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

సీపీఎంనూ వదల్లేదు

వామపక్షాలు, కాంగ్రెస్‌ ‌శ్రేణులపై కూడా టీఎంసీ దాడులు కొనసాగాయి. బుర్‌ద్వాన్‌ ‌జిల్లా జమల్‌పూర్‌లో వామపక్ష కార్యకర్త, ఐద్వా నాయకురాలు కకాలి క్షేత్రపాల్‌ ‌మరణించారు. విజయోత్సవాలు చేసుకుంటున్న టీఎంసీ కార్యకర్తలు క్షేత్రపాల్‌ ఇం‌ట్లోకి ప్రవేశించారు. పదునైన కత్తితో పొడిచారు. ఆసుప్రతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో 10 మంది వామపక్ష కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన హింసాకాండలో పలువురు వామపక్ష కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ పార్టీ శ్రేణులపై దాడులను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఖండించారు.

మహిళా కమిషన్‌ ‌రంగప్రవేశం

 బెంగాల్‌ ‌హింసాకాండను సుమోటాగా తీసుకుని విచారణ చేయనున్నట్లు జాతీయ మహిళా కమిషన్‌ ‌ప్రకటించింది. నందిగ్రామ్‌లోని తమ కార్యాలయంపై టీఎంసీ కార్యర్తలు దాడి చేసి, మహిళా కార్యకర్తలపై భౌతికదాడులకు పాల్పడుతున్న దృశ్యాలను బీజేపీ నేతలు కైలాష్‌ ‌విజయ్‌ ‌వర్గియా, సంబిత్‌ ‌పాత్ర షేర్‌ ‌చేశారు. కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌రేఖా శర్మ నేతృత్వంలోని బృందం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి, మహిళలపై దాడులకు సంబంధించి విచారణ చేస్తుందని కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మీడియా ద్వంద్వ వైఖరి

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన జరిగినా భూతద్దంలో చూపించే జాతీయ మీడియా బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటలపై పూర్తిగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. ఒకవేళ ఇవే ఘటనలు యోగి ఆదిత్యనాథ్‌ ‌పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో జరిగి ఉంటే వార్తా పత్రికలు, టీవీ చానళ్లు ఊదరకొట్టేవి. ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని శోకాలు పెట్టేవి. బెంగాల్‌లో ఘటనలను నిష్పాక్షికంగా నివేదించలేదు. పైగా అక్కడక్కడా వెలుగులోకి వచ్చిన ఘటనలపై పుకార్లు అనే ముద్రవేసి తొక్కి పెట్టే ప్రయత్నాలు జరిగాయి. హక్కులు, మానవత్వం, సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యం లాంటి చిలకపలుకులు పలికే వర్గాలు పూర్తిగా మౌనం వహించాయి. తీవ్రవాదులను విడిపించడానికి రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు తలుపులు తట్టేవారు ఇప్పుడు మమతకు వంతపాడుతున్నారు. ప్రజల జీవితం, హక్కులు వారి రాజకీయ దృష్టితో ముడిపడి ఉంటాయా?

మమత ఎదురుదాడి

ఈ హింసాత్మక ఘటనలు ఏమంత పెద్దవి కావని చెప్పేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోంది. చనిపోయిన వారిలో తమ కార్యకర్తలు కూడా ఉన్నారని సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. 16 హత్యలు జరిగాయని ఆమె అంగీకరించారు. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని వేర్వేరు ఘటనల ద్వారా తెలుస్తున్నది. వారిలో ఎక్కువ బీజేపీ కార్యకర్తలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల అనంతంర జరిగిన హింసపై దర్యాప్తు చేస్తామని, మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. హింసకు ఎన్నికల కమిషనే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతి భద్రతలు తానే పర్యవేక్షిస్తానన్న మమత.. డీజీపీ నీరజ్‌ ‌నయాన్‌పై బదిలీ వేటు వేయడమే కాక.. పాత డీజీపీ వీరేంద్రకు తిరిగి బాధ్యతలు అప్పగించారు.

బయటి శక్తుల ప్రమేయం ఉందా?

ప్రస్తుతం బెంగాల్‌ ‌నుండి వస్తున్న వార్తలు, వీడియోలు ఎంతో ఆవేదన, ఆగ్రహం కలిగించే విధంగా ఉన్నాయి. వామపక్ష పార్టీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని గతంలో తృణమూల్‌ ‌పార్టీ వారే ఆరోపణలు చేసేవారు. కానీ ఇప్పుడు రెట్టింపు హింస, అత్యంత పాశవికంగా, పెద్దఎత్తున సాగుతోంది.

పశ్చిమ బెంగాల్‌లోకి దశాబ్దాలుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ ‌నుంచి అక్రమ చొరబాట్లు కొనసాగుతున్నాయి. ఫలితంగా జనాభా సమతౌల్యం చాలా వరకూ దెబ్బతిన్నది. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కమ్యూనిస్టులు, ప్రస్తుత టీఎంసీ ప్రభుత్వం కూడా చొరబాటుదారులను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నాయి. గత కొన్నేళ్లుగా మయన్మార్‌ ‌నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు వీరికి తోడయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఈ శక్తులు చురుగ్గా పాల్గొన్నాయి. వీరంతా సహజంగానే బీజేపీని వ్యతిరేకిస్తూ టీఎంసీకి అండగా నిలిచారు. చొరబాటుదారులు దేశ భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నా తృణమూల్‌ ‌ప్రభుత్వం స్వార్ధం కోసం వీరిని వాడుకుంటోంది. ఇది జాతీయ భద్రతకు చేటు. బీజేపీ అధికారంలోకి రాలేక పోయిందని బ్రహ్మానందంలో మునిగి తేలుతున్నవారు కనీసం ఈ వాస్తవం గుర్తించాలి.

– క్రాంతి : సీనియర్‌ ‌జర్నలిస్ట్

హింసకాదు, సామరస్యం కావాలి:  ఆర్‌ఎస్‌ఎస్‌

‌పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చెలరేగిన హింసను రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటనలో ఆరోపించారు. బెంగాల్‌లో ఎన్నికైన ప్రభుత్వం తక్షణ కర్తవ్యం హింసను కట్టడి చేసి, శాంతిభద్రతలను అదుపులో ఉంచడమేనని హితవు చెప్పారు. జాప్యం లేకుండా నిందితులను అరెస్ట్ ‌చేయడం ద్వారా బాధితులలో భద్రతా భావం నింపాలని కోరారు. వారి పునరావాసానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో వ్యవహరించే విధంగా, రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలది ముఖ్య పాత్ర. ఈ సంప్రదాయంలో పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బెంగాల్‌  ‌సమాజం మొత్తం ఉత్సాహంగా పాల్గొంది. అధికార, విపక్షాలు భావోద్వేగాలకు తగినట్లుగా, కొన్నిసార్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు పరిమితులను దాటడం సహజమే అయినా, ఎన్నికల అనంతర హింసలో కొన్ని శక్తులు అత్యంత అనాగరికమైన, నీచమైన రీతిలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాయిని, అమాయక ప్రజలను దారుణంగా చంపాయని, ఇళ్లను తగలబెట్టాయని, దుకాణాలను  దోచుకున్నాయని హోసబలే ఆందోళన వ్యక్తం చేశారు.

పోటీ చేసే పార్టీలన్నీ మన దేశానికి మాత్రమే చెందినవని, ఎన్నికల్లో పాల్గొనే వారందరూ- అభ్యర్థులు, మద్దతుదారులు, ఓటర్లందరూ దేశపౌరులే అని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని హోసబలే హితవు చెప్పారు.

అవాంఛనీయ హింస ఫలితంగా నిరాశ్రయులైన షెడ్యూల్డ్ ‌కులాలు, తెగల ప్రజలతో పాటు వేలాదిమంది తమ మాన, ప్రాణాలను కాపాడు కోవటానికి పారిపోవాల్సి వచ్చిందని హోసబలే చెప్పారు. కూచ్‌బిహార్‌ ‌నుండి సుందర్‌బన్‌ ‌వరకు ప్రతిచోటా, సామాన్య ప్రజలలో విస్తృతమైన భయపూరిత వాతావరణం నెలకొన్నదని చెప్పారు. ఈ తరహా హింస సహజీవనం కలిగిన భారతీయ సంప్రదాయానికి విరుద్ధమన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, మన రాజ్యాంగంలో పొందుపరిచిన ‘ప్రజలందరూ ఒకటే’ అనే భావనకు పూర్తిగా విరుద్ధం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలనా యంత్రాంగాల పాత్ర పూర్తిగా నిష్క్రియాత్మకమై, వారు ప్రేక్షకులుగా మిగిలిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఈ అనాగరికమైన, అమానవీయ అల్లర్లు చేసే వారు దేనికీ భయపడుతున్నట్లు కనిపించలేదన్నారు. హింసను నియంత్రించడానికి రాష్ట్ర పోలీసులు, పరిపాలన ఎటువంటి చొరవ చూపకపోవడం దురదృష్టకరం అని దత్తాత్రేయ విమర్శించారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాని ప్రధాన బాధ్యత సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే అని దత్తాత్రేయ హోసబలే గుర్తు చేశారు. ఎన్నికల విజయం రాజకీయ పార్టీలకు చెందినది, కాని ఎన్నికైన ప్రభుత్వం మొత్తం సమాజానికి జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని సూచించారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో బాధితుల పక్షాన నిలబడడం ద్వారా ఆయా వర్గాలలో విశ్వాసం కలిగించడం కోసం, హింసను ఖండిస్తూ బెంగాల్‌ ‌లోని మేధావులు, సామాజిక, మత, రాజకీయ నాయకులు శాంతి, సద్భావం, సామరస్యం నెలకొల్పడానికి చొరవ చూపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ‌సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram