మోప్లాల జిహాద్‌

‌వందేళ్ల ఖిలాఫత్‌ ఉద్యమం – 10

ఖిలాఫత్‌ ‌మలిదశ ఉద్యమం రక్తసిక్తమయింది. ఉద్యమకారుల ఆగ్రహం ఆంగ్ల పాలకుల మీద నుండి ఆ సమస్యతో ఏ మాత్రం సంబంధం లేని తమ తోటి పౌరులు హిందువులపైకి మళ్లింది. హిందువు లపై విస్తృతంగా దాడులు జరిగాయి. మత ఘర్షణలు చెలరేగాయి. అనేకమంది అమాయక హిందువులు ప్రాణాలు కోల్పోయారు. టర్కీ సామ్రాజ్య విచ్ఛిన్నం చేసిన ఆంగ్ల పాలకులను ఏమీ చేయలేక, ఖిలాఫత్‌ ఉద్యమానికి సహకరించిన హిందువులనే పొట్టన పెట్టుకున్నారు. హిందూ-ముస్లిం ఐక్యత గురించి, అహింస గురించి గాంధీజీ అహర్నిశలు ప్రసంగాలూ, వ్యాసాలూ రాస్తూ, బోధలు చేసినా ఆయనకు మద్దతుగా నిలిచిన ముస్లిం ఛాందసవాద మూకలకు అవి తలకెక్కకపోవటం విడ్డూరమనిపించినా, వాస్తవం. గాంధీజీ అల్లరిమూకలను అదుపు చెయ్యలేకపోయారు. భస్మాసురహస్తం మాదిరిగా ఉద్యమానికి సహకరించిన హిందువులే లక్ష్యంగా దాడులకు తెగబడటంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక పద్ధతి ప్రకారం 1919 నుండి 1922 వరకు దాదాపు మూడేళ్ల పాటు దేశంలో ఏదో మూలన హిందువులపై దాడులు  జరుగుతున్నా కాంగ్రెస్‌ ‌పార్టీ ఖిలాఫత్‌ ఉద్యమానికి మద్దతు ఉపసంహరించుకోలేదు. ఘర్షణల ఆరంభంలోనే కాంగ్రెస్‌ ఆ ‌పని చేసి ఉంటే అపారమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగేవికావు. ఖిలాఫత్‌ ‌నాయకత్వం గాంధీజీనీ, ఆయన మద్దతుదారులనూ మోసగించింది. అయినా గాంధీజీ వారిని గుడ్డిగా నమ్మి, వారి సీమాంతర విధేయతనూ, ఇస్లామిక్‌ ‌దేశాలకు మద్దతునిచ్చే ధోరణినీ ఖండించకపోగా పెంచి పోషించారు. స్వరాజ్యం కోసం చేస్తున్న ఉద్యమానికి, టర్కీ సామ్రాజ్య సమగ్రతను కాపాడటం కోసం జరుగుతున్న ఉద్యమానికి సంబంధమే లేదు. మొదటి ఉద్యమం దేశానికి సంబంధించింది. రెండవ ఉద్యమం మధ్య ఆసియాలోని టర్కీ భవిత్యానికి సంబంధించింది. రెంటి లక్ష్యాలు వేరువేరు. పరస్పర విరుద్ధ లక్ష్యాలతో నడుస్తున్న రెండు ఉద్యమాలను ఒకదానిని మరొకదానికి పూరకంగా నడవటానికి చేసిన ప్రయత్నం వల్ల ప్రజలు గందరగోళంలో పడ్డారు. ముస్లిం దాడులను, కుట్రలను ఎదుర్కొనేందుకు దీటుగా హిందువులను సంసిద్ధపరిచే నాయకత్వం కొరవడింది.

నెల్లూరు (నాటి మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ, నేటి ఆంధప్రదేశ్‌) ‌లో 1919 సెప్టెంబర్‌ 22 ‌ప్రారంభమైన ముస్లిం దాడులు మత ఘర్షణలకు దారితీశాయి. పైకి చెదురుముదురు ఘర్షణలుగా కన్పించినా,  ఆ తర్వాత 3 ఏళ్లపాటు దేశమంతటా కొనసాగాయి. కొన్ని ముఖ్యమైన ఘర్షణలు గురించి చెప్పుకున్నా, వాటి జాబితా విస్తృతంగా ఉంది. 1920 మేలో మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలోని తంజావూరు, సింధురాష్ట్రం, సిక్కూర్‌లలో మత ఘర్షణలు చెలరేగాయి. జూలై నెలలో వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో, ఆగస్ట్‌లో పంజాబ్‌లో, సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో పెద్దపెటున మత ఘర్షణలు జరిగాయి. 1921 జనవరిలో బొంబాయి ప్రెసిడెన్సీలోని కొలాబా జిల్లాలో, ఫిబ్రవరిలో బెంగాల్‌ ‌ప్రెసిడెన్సీలోని నయాహటీలో, ఆగస్ట్‌లో కరాచీలో ఘర్షణలు జరిగాయి. 1921 అక్టోబర్‌లో మద్రాస్‌, ‌కలకత్తాల లోనూ, నవంబర్‌లో కూర్గ్, ‌హౌరాలలోనూ డిసెంబర్‌లో కన్ననూర్‌లో తీవ్ర స్థాయిలో మతఘర్షణలు జరిగాయి. 1922 ఫిబ్రవరి 15,16 తేదీలలో అస్సాంలో పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఇవన్నీ ఏకపక్షంగా జరిగిన దాడులు.

ఈ ఘర్షణలు అన్నీ ఒక ఎత్తు. మలబారులో (కేరళ) మోప్లాలు చేసిన జిహాద్‌ ‌మరొక ఎత్తు. హిందువుల మీద జరిగిన ఆ నరమేధంలో మబారు మోప్లాలు (మలయాళం మాట్లాడే మలబారు ముస్లింలు) విదేశీ ముస్లిం ఆక్రమణదారులను అనుసరించారు. దేవాలయాలను నేలమట్టం చేశారు. ఆస్తులను కొల్లగొట్టారు. స్త్రీలను మానభంగం చేసారు. బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారు. ఈ హిందువుల ఊచకోతనే మన వామపక్షీయులు, కాంగ్రెస్‌ ‌వారు వలస పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు వ్యతిరేకంగా మోప్లాలు సాగించిన సాయుధ తిరుగుబాటుగా ప్రశంసిస్తూ వారిని భుజాలకు ఎత్తుకోవటం ఆధునిక భారతదేశ విషాదం. మోప్లాలు చేయని ఘోరంలేదు. నేరంలేదు. పాల్పడని అత్యాచారం లేదు. అయినా వాటిని కప్పిపుచ్చి, వారిని కీర్తించటం, ప్రశంసించటం జరిగిన ఘోరాలు, నేరాలు కంటె తీవ్రమైన నేరం. వాస్తవాలను కప్పిపుచ్చి నందువలన ఎవరికి ప్రయోజనం? ప్రముఖ కమ్యూనిష్టు నాయకుడు నంబూద్రిపాద్‌ ‌చేసిన ప్రశంస చూడండి, ‘భూస్వామ్య వర్గపు అణచివేతకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపించిన ఘనత ఎర్నాడ్‌, ‌వల్లువనాడ్‌ ‌తాలూకాలకు చెందిన నిరక్షరాస్యులైన వెనుకబడిన మోప్లాలకు దక్కుతుంది’ (A Short History of Peasent Movement in Kerala, E.M.S. Namboodripad, Peoples Publishing House, 1943, p.1). అన్ని అత్యాచారాలకు పాల్పడ్డ ఖిలాఫత్‌వాదులను, మోప్లాలను స్వాతంత్ర సమర యోధులకిచ్చే పింఛను పథకానికి అర్హులుగా స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వం ప్రకటించి, మంజూరు చెయ్యటం, అలాగే దేశం కోసం సర్వస్వం సమర్పించిన స్వాతంత్య్ర సమరయోధులను, టర్కీ సామ్రాజ్య విచ్ఛిన్నం జరగకుండా వలస పాలకులపై ఒత్తిడి పెంచేందుకు తోటి పౌరులపై మూకమ్ముడి దాడులకు పాల్పడ్డ సంఘ విద్రోహశక్తులను ఒకే గాట కట్టటం మన నాయకుల వెర్రితనానికి, కుహనా సెక్యులర్‌ ‌చేష్టలకు పరాకాష్ట.

ఆనాటి సంఘటనలను సవివరంగా దేశానికి తెలియచేసిన వ్యక్తులలో ప్రముఖుడు దివాన్‌ ‌బహదూర్‌ ‌గోపాలన్‌ ‌నాయర్‌. ‌డిప్యూటీ కలెక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేసిన నాయర్‌ 1923‌లోనే ‘మోప్లా రెబిలియన్‌’ ‌పేరుతో పుస్తకం ప్రచురించారు. వివిధ వార్తాపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా ఉద్యమం ముగిసిన రెండు సంవత్సరాలకే నిష్పాక్షికంగా రాసిన పుస్తకం ‘మోప్లా రెబిలియన్‌’. ‌దాని ఆధారంగా ఆనాటి చరిత్రను తెలుసుకుందాం.

ఉత్తర కేరళలో మలబారు తీరంలో నివాసం ఉంటున్న మలయాళం మాట్లాడే ముస్లింలను ‘మాప్పిల్లా’లు అని పిలుస్తారు. ఆ పదం ఆంగ్ల రూపాంతరమే ‘మోప్లా’. 1920వ దశకం నాటికి వేగంగా, విస్తారంగా ఈ మలయాళీ ముస్లిం సమాజం ఎదిగింది. ఆనాడు మలబారు తీరం జనాభా 10 లక్షలు. అందులో సుమారు మూడవ వంతు మోప్లాలే. దక్షిణ మలబారు తీరంలో వారు ఎక్కువగా ఉన్నారు. జిహాద్‌కు కేంద్రంగా ఉన్న ఎర్నాడ్‌ ‌తాలుకా జనాభాలో 60 శాతానికి పైగా మోప్లాలే. ఆనాటి మలబార్‌ ‌జిల్లాలో మొత్తం 10 తాలుకాలు ఉన్నాయి. దక్షిణ మలబార్‌లోని ఎర్నాడ్‌, ‌వల్లువనాడ్‌, ‌పొన్నాని, కాలికట్‌ ‌తాలుకాలలో, ఉత్తర మలబార్‌ ‌లోని కురుమన్‌‌బ్రాండ్‌, ‌వయనాడ్‌ ‌తాలూకాలలో మోప్లాలను అణచివేయటానికి సైనిక పాలన విధించవలసి వచ్చిందంటే వారు ఏస్థాయిలో దౌర్జన్యాలకు, దహనకాండకు, సామూహిక హత్యా కాండకు పాల్పడ్డారో ఊహించవచ్చు. ఎర్నాడ్‌ ‌తాలూకాలోని 94 గ్రామాలకు గాను 94 గ్రామాలలోనూ, కాలికట్‌ ‌తాలుకాలోని 65 గ్రామాలకు గాను 23 గ్రామాలలోనూ, వల్లువనాడ్‌ ‌తాలుకాలోని 118 గ్రామాలకుగాను 68 గ్రామాల లోనూ, పొన్నాని తాలుకాలోని 121 గ్రామాలకు గాను 35 గ్రామాలలోనూ మోప్లాలు సాటి హిందూ గ్రామస్థులపై దౌర్జన్యాలకు తెగబడ్డారు.

పశ్చిమ తీరానికి, అరేబియాకు వర్తక వాణిజ్య సంబంధాలు ఏనాటి నుండో ఉన్నాయి. ఆ క్రమంలో కొందరు అరబ్బు వర్తకులు మలబారు తీరంలో వ్యాపారం కోసం నివసించేవారు. వారికి స్థానిక ప్రజలు సహకరించారు కూడా. వారి ప్రార్థనల కోసం స్థానికులే మసీదులు కూడా కట్టించారు. అరబ్బులు స్థానికులలో కొందరిని ఇస్లామ్‌లోకి మార్చే ప్రయత్నం చేసారు. చెరుమాన్‌ ‌పెరుమాళ్‌ అనే చేర రాజుల వంశీకుడిని ఇస్లాంలోకి మార్చారు. ఆగస్ట్, 1825‌లో చెరుమాన్‌ ‌మక్కా వెళ్లాడు. అరబ్బు మిషనరీలను మలబార్‌కు వచ్చి, ఇస్లామ్‌ను వ్యాప్తి చెయ్యమని కోరాడు. మాలిక్‌-ఇబ్న్-‌దినార్‌ ‌నాయకత్వంలో ఒక మత ప్రచారకుల బృందం మలబార్‌ ‌తీరం చేరుకొని, స్థానిక పాలకుల అనుమతితో మలబారు, దక్షిణ కన్నూరులలో 10 మసీదులు నిర్మించి, మత మార్పిడులు చేయటం మొదలెట్టారు. వారి కృషి కాలక్రమంలో ఫలించింది. మలయాళం మాట్లాడే ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాలికట్‌ ‌జమీందారు సైతం మతమార్పిడులకు ప్రోత్సహిం చాడు. ఎందుకంటే అరబ్బు దేశాలకు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్లే ఓడలలో పనిచేయటానికి, అరబ్బులకు విక్రయించటానికి మతం మారిన వారు బాగా ఉపయోగపడేవారు. ప్రతి మత్యకారుడి ఇంట్లో కనీసం ఒకరిని మహమ్మదీయుడిగా పెంచాలని ఆయన ఉత్తర్వులు ఇచ్చాడు. వ్యాపార ప్రయోజనాల కోసం జాతిని పణంగా ప్టెటానికి ఆయన వెనుకాడలేదు. టిప్పు సుల్తాన్‌ ‌మలబార్‌పై 1789లో దాడి చేసాడు. అనేక దేవాలయాలను  కొల్ల గొట్టాడు. హిందూ భూస్వాములను మలబారు తీరం నుండి వెళ్లగొట్టాడు. వేలమందిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు. ఉత్తర మలబార్‌లో మోప్లాలు అగ్ర కులాలకు చెందిన ధనికులు కాగా, దక్షిణ మలబార్‌ ‌మోప్లాలు నిమ్న కులాలకు చెందినవారు. తియ్య, చెరుమన్‌, ‌ముక్కవన్‌ ‌కులాలకు చెందిన వారిలో అనేక మందిని గ్రామాలకు గ్రామాలు ముస్లింలుగా మార్చారు. (The Mappilla Rebellion 1921: Peasant Revolt in Malbar, Robert L. Hardgrave Jr, Modern Asain Studies, Vol. II, No:1 (1977), p. 59)

ఖిలాఫత్‌ ఉద్యమానికి ముందు

మోప్లాలకు దౌర్జన్యాలు కొత్తేమీకాదు. హిందువులుగా ఉన్నంతకాలం శాంతి కాముకులుగా ఉన్నవారే ఇస్లామిక్‌ ‌మతప్రభావం కారణంగా, నిరంతర ద్వేషపూరిత బోధనల కారణంగా హింసా ప్రవృత్తిని అలవర్చుకొన్నారు. 1742 నుండి అడపాదడపా దౌర్జన్యాలకు, దొంగతనాలకు, అత్యాచారాలకు పాల్పడిన చరిత్ర వారిది. 1764లో తలశేరికి దగ్గరగా ఉన్న ధర్మడం పోర్చుగల్‌ ‌చర్చిపై ఇద్దరు మోప్లాలు దాడులుచేశారు. 16వ శతాబ్దపు మలబార్‌ అరబిక్‌ ‌చరిత్రను జయనల్‌- ‌దిన్‌-అల్‌ ‌మల్బరీ (Zayn al- din al- Malbari) ‘పవిత్ర యోధులకు కానుక’ (A Gift to Holy Warriors) అనే పుస్తకం రాశాడు. పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా జిహాద్‌కు పూనుకొమ్మని మలబార్‌ ‌ముస్లింలను ప్రేరేపిస్తూ రాసిన పుస్తకం అది. 16వ శతాబ్దం నాటికే వారిలో ఇస్లామిక్‌ ‌దేశాల అనుకూల వైఖరి (Pan Islamic) దృఢంగా నెలకొన్నది. ఇండోనేషియా ముస్లింలతో కలసి పోర్చుగీసు వారితో పోరాటానికి దిగిన చారిత్రక సందర్భాలు ఆ శతాబ్దంలో అనేకం ఉన్నాయి (The Islamic Frontier in South West India: The Shahid As a Cultural Ideal amoung the Mappillas of Malbar, Stephen F. Dale, Modern Asain Studies, Vol.2, No:1, 1977, pp.42-43, 48, 58).

1836 నుండి 1921 – 22 వరకు మలబార్‌ ‌తీరంలో మోప్లాలు 33 సార్లు దౌర్జన్యాలు చేశారు. ఈ దౌర్జన్యాలలో ఒక్కటి తప్ప అన్నీ గ్రామీణ ప్రాంతాలలోనే జరిగాయి. 3 సార్లు తప్ప మిగిలిన 30 సార్లు హిందువులపై దాడులకు దిగారు. అయితే ఈ దాడులు తీవ్రతరమైనవి కావు. కొన్ని రోజులలోనో వాటిని అణచివేసారు. లేదా అల్లర్లు సమసిపోయాయి. ఈ దాడులలో బాధితులు కూడా ఎక్కువమందిలేరు. కేవలం మూడుసార్లు ముప్ఫైమంది కంటె ఎక్కువ మంది మోప్లాలు దాడులలో పాల్గొన్నారు. దాడులు చేసిన మోప్లాలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. షహిద్‌లుగా – మతం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులుగా నిలబడాలన్న తపనతో హిందువులపై దాడులకు పాల్పడటం, ఆపై ఆత్మహత్యలకు పాల్పడటం ఆ ప్రాంతంలో కొంతకాలం పాటు రివాజు అయింది. మొత్తం 350 మంది మోప్లా దౌర్జన్యకారులలో 322 మంది చనిపోగా 28 మందిని పట్టుకొన్నారు. ఆత్మహత్యలకు సిద్దమయి దాడులు చేసేందుకు ముందుకు వచ్చిన వారిని అభినందిస్తూ చేసే మత సంప్రదాయ ప్థ•తులు అసలు దాడులకు కొన్ని వారాలకు ముందే ప్రారంభమయ్యేవి. అంటే ఈనాటి ఆత్మాహుతిదాడులు ఆనాడూ ఉన్నాయి. ఆత్మాహుతి దాడులకు పాల్పడే వారిని ఆనాడు, ఈనాడు మత వీరులుగా కీర్తిస్తూనే ఉన్నారు.

పైన పేర్కొన్న వివరాలను స్టీఫెన్‌ ‌డేల్‌ ‌తన గ్రంథాలలో విశ్లేషించారు (The Mappilla Outbreak: Ideology and Social Conflict in 19th Century Kerala, The Journal of Asain Studies, Vol. 35, No:1, Nov-1975, pp.85-97). 33 సార్లు దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలుసుకున్నాం కదా! అందులో 9 సందర్భాలు మాత్రమే వర్గ సంఘర్షణకు సంబంధించినవి. మరో మూడింటికి కారణం భూవివాదాలు. భూవివాదాలకు ఏమాత్రమూ సంబంధం లేకుండా జరిగిన దౌర్జన్యాల సంఖ్య 13. అందులో 4 వ్యక్తిగత వైషమ్యాలకు సంబంధించింనవి. ఆంగ్ల కలెక్టర్ల మీద రెండుసార్లు దాడులు చేశారు. ఒక ముస్లిం మత నాయకుడిని బహిష్కరించినందుకు ఒకసారి, బలవంతంగా మతం మార్చిన ఒక హిందూ బాలుడిని రక్షించినందుకు ఇంకొకసారి దాడిచేశారు. ఇస్లాం నుండి హైందవంలోకి మారిన పూర్వ హిందువులను వారి కుటుంబాలతో సహా చంపివేశారు. అటువంటి సంఘటనలు మూడు జరిగాయి. 8 సందర్భాలలో ఏ లక్ష్యంతో దాడులకు పాల్పడ్డారో తెలియదు. దాడులకు పాల్పడాలన్న లక్ష్యంతోనే దాడులు చేశారు. సయ్యద్‌ ‌ఫజల్‌ (1820-1901) ‌వంటి మత ప్రబోధకులు తరచుగాజిహాద్‌కు  పిలుపునిస్తూ చేసిన విద్వేషపూరిత మత ప్రసంగాలే మోప్లాల దౌర్జన్యాలకు ప్రధాన హేతువు.

మోప్లాల దౌర్జన్యాలకు భూతగాదాలు, కౌలుదార్ల రైతుల తొలగింపులు ప్రధాన కారణం కాదు. అంగీకరించని కౌలు మొత్తాన్ని చెల్లించనప్పుడు, కావాలని ఎగగొట్టటానికి ప్రయత్నం చేసినపుడు, నమ్మకం కోల్పోయినపుడు భూయజమానులు చేస్తున్న వారిని కాదని కొత్తవారికి తమ భూములను ఇవ్వటం అనాదిగా జరుగుతున్నది. ఈనాడూ జరుగుతున్నది. కొందరు విశ్లేషకులు మోప్లాల దౌర్జన్యాలకు వర్గ సంఘర్షణ రంగుపులిమి, భూతగాదాలే వారి అసంతృప్తికి కారణమని చెప్తున్నారు. 1862 – 1880 మధ్య మలబారు తీరంలో కౌలుదార్ల తొలగింపులు పెరిగాయి. 1862లో 1891 మందిని తొలగించగా, 1880 నాటికి వారి సంఖ్య 8,335కు పెరిగింది. అయితే ఇలా తొలగించిన కౌలు రైతులలో మూడింట రెండువంతులు హిందువులే. వారు వివిధ వ్యవసాయమే ఉపాధిగా ఉన్న కులాల వారు. కేవలం 3వ వంతు మంది ముస్లిం మోప్లాలు. ఈ తొలగింపుల వలనే మోప్లాల దౌర్జన్యాలు, తిరుగుబాట్లు పెరిగినట్లు ఆధారాలు కనిపించటం లేదు. మోప్లాలు 1921కి ముందు చేసిన దౌర్జన్యాలకు, ఆ తర్వాత చేసిన దౌర్జన్యాలకు ముఖ్యమైన తేడా ఉంది. మోప్లాల మత దౌర్జన్య ప్రవృత్తికి, సామాజిక సంఘర్షణలకు పాల్పడే వారి నైజానికి కావలసిన భావజాలాన్ని  ఖిలాఫత్‌ ఉద్యమం ఇచ్చింది.

మోప్లాల జిహాద్‌కు బీజాలు

ఎర్నాడ్‌ ‌తాలుకాలో  ఏప్రిల్‌ 28, 1920‌న ఖిలాఫత్‌ ఉద్యమ సమావేశం జరిపారు. వెయ్యి మందికి పైగా మోప్లాలు హాజరైన ఆ సమావేశంలో టర్కీ  సమస్యను సానుకూలంగా పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ తీర్మానం చేశారు. సానుకూల పరిష్కారం దొరకకపోతే, సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని ముస్లిం ప్రజానీకానికి పిలుపు నిచ్చారు. గాంధీ, షౌకత్‌ ఆలీలు సంయుక్తంగా కాలికట్‌లో ఆగస్ట్ 18‌న ఒక సమావేశంలో ప్రసంగిం చారు. ఖిలాఫత్‌ ‌ప్రాధాన్యాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమ ఆవశ్యకతను వివరిస్తూ వారు ఉత్తేజ భరిత ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత మోప్లా జనాభా కేంద్రీకృతమైన ప్రాంతాలలో అనేక చిన్న చిన్న సమావేశాలు జరిపారు. మద్రాస్‌కు చెందిన యాకూబ్‌ ‌హసన్‌ ‌ఖిలాఫత్‌ ఉద్యమ నాయకుడు. కాలికట్‌లో ఫిబ్రవరి 15, 1921న ఆయన ఖిలాఫత్‌ ‌సభలో ప్రసంగించవలసి ఉంది. కాని సభకు ప్రభుత్వ యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. ఆయన ప్రసంగం వినటానికి ఎప్పటి నుండో ఎదరుచూస్తున్న మోప్లాలకు అనుమతి నిరాకరణ తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. (Nair, ibid, pp. 12-16). మత ప్రబోధకులు గ్రామ గ్రామాన కాలినడకన, సైకిళ్ల మీద తిరిగి ఖిలాఫత్‌ ఉద్యమ ఆశయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. అఫ్ఘ్గాన్లు ఏ క్షణమైన దేశం హద్దులు దాటి రావచ్చని, వారికి సహకరించటం ప్రతి ముస్లిం బాధ్యత అని ప్రచారం చేశారు. ఆంగ్లేయులను తరిమికొట్టి తిరిగి ఇస్లామిక్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రానున్నదని నమ్మబలికారు. ఇస్లామిక్‌ ‌ప్రభుత్వం రాగానే పెద్ద పెట్టున భూసంస్కరణలు చేపట్టి, భూస్వాముల భూములను పేదలకు, కౌలుదార్లకు పంచుతారని చెప్పారు. ప్రతిగ్రామంలో ప్రతి మోప్లాకు కేటాయంచే భూములను సైతం గుర్తించారు. ఇక ఉద్యమం పెద్దఎత్తున జరగటమే ఆలస్యమని, ఉద్యమం విజయవంతం అయితే, వారికి ఇవ్వదలచిన భూములు వారి స్వంతం అవుతాయని ఆశపెట్టారు. మద్రాస్‌ ‌నగరంలో మౌలానా మహమ్మదాలీ చేసిన ప్రసంగాన్ని ముద్రించి కరపత్రాల ద్వారా విస్తృతంగా పంచారు. ముస్లిం ప్రజానీకాన్ని రెచ్చగొడ్తూ చేసిన ఆ ప్రసంగాన్ని ప్రచురించటం, పంపిణీ చేయటం నేరమని ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ మారుమూల గ్రామాలకు సైతం ఆ కరపత్రాలు చేరిపోయాయి.

(వచ్చేవారం: జిహాద్‌కు అనుకూల వాతావరణం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram