వందేళ్ల క్రితం భూగోళం మీద దాడి చేసిన స్పానిష్‌ ‌ఫ్లూకీ, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ 19‌కీ మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. రోగులలో అవే లక్షణాలు, అవే బాధలు. నేటి ప్రపంచంలో కూడా అచ్చు అవే పరిణామాలు పునరావవృతమవుతున్నాయి. ఐసోలేషన్‌, ‌మాస్క్, ‌పరిశుభ్రత- ఇవే ఆనాడు కూడా వ్యాధి నిరోధకాలుగా భావించారు. అయితే అది యాంటిబయాటిక్స్ ‌కనుగొనని కాలం. అవి ఇప్పుడు వచ్చాయి. కానీ ఇవి మాత్రమే రోగులను రక్షించడం లేదు. వైద్య చరిత్రలో అక్షరబద్ధమైన ఆనాటి దృశ్యాలను గమనిస్తూ, వర్తమాన ప్రపంచంలో మనం చూస్తున్న పరిణామాలను  బేరీజు వేద్దాం.

అత్యంత వేగంగా వ్యాపించే స్పానిష్‌ ‌ఫ్లూ అంటువ్యాధి గుజరాత్‌లోని ఆ ఆశ్రమాన్ని కూడా చుట్టుముట్టేసింది. అందులోనే 48 సంవత్సరాల గాంధీజీ నివాసం ఉంటున్నారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన నాలుగేళ్ల తరువాత అదే ఆయన ఆవాసమైంది. కొంచెం ఎక్కువే అయినా ఈ అంటువ్యాధి వేధించినంత కాలం ఆయన పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ద్రవ పదార్థాలకే పరిమిత మయ్యారు. గాంధీజీకి స్పానిష్‌ ‌ఫ్లూ సోకిన సంగతి నమోదు చేస్తూ ఒక పత్రిక ఇలా రాసింది, ‘గాంధీజీ జీవితం ఆయనది కాదు, భారతదేశానిది’.

ఈ ప్రాణాంతక అంటువ్యాధి తగిలిన సైనికులు కూడా ఉన్న ఒక ఓడ జూన్‌ 1918 ‌సమయంలో బొంబాయి తీరానికి చేరింది. ఆ తరువాతే ఆ అంటువ్యాధి భారతదేశాన్ని చుట్టముట్టింది. ఆ సంవత్సరం జూన్‌ 5‌న వ్యాధి ప్రబలుతున్న సంగతిని అధికారంగా ప్రకటించారని చెప్పవచ్చు. బొంబాయి నౌకాశ్రయంలో విధులు నిర్వర్తించిన ఏడుగురు పోలీసులలో ఆ అనారోగ్య లక్షణాలు కనిపించాయి. అప్పటి ఆరోగ్య తనిఖీ ఉద్యోగి (ఇన్‌స్పెక్టర్‌) ‌మాటలలో చెప్పాలంటే, • ‘రాత్రి చొరబడే దొంగలా’ ఈ వ్యాధి ప్రవేశించింది. కానీ పంజాబ్‌, ‌సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌కు చెందిన సైనికులు తమ స్వగ్రామాలకు రైళ్లలోనే వెళ్లారు. అందుకే నాటి తొలిదశ వ్యాధి ఆ రెండు చోట్ల వేగంగా విస్తరించింది. సెప్టెంబర్‌లో దక్షిణ భారతదేశంలో దీని రెండోదశ మొదలయింది. తీరప్రాంతంలో విస్తరించింది.

మొదటి ప్రపంచ యుద్ధం ఆఖరి ఘట్టంలో స్వైర విహారం చేసిన ఈ అంటువ్యాధి ‘స్పానిష్‌ ‌ఫ్లూ’ అంటూ ఒక దేశం పేరుతో ప్రసిద్ధిలోకి వచ్చినా, నిజానికి అమెరికాలోని కాన్సాస్‌లో పుట్టిందని అంటారు. అసలు స్పెయిన్‌ ‌మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తటస్థంగా ఉంది. 1918 జనవరి చివరిలో అమెరికా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడు, ‘తీవ్రరూపంలో ఒక అంటువ్యాధి ప్రబలుతోంది’ అని హెచ్చరించాడు. కానీ నాటి ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదు. స్పెయిన్‌లో ఇది పుట్టకపోయినా, తొలిదశలో ఆ దేశాన్ని చావగొట్టింది. వార్తాపత్రికలలో విపరీతంగా వార్తలు వచ్చేవి. దీనితో ఈ అంటువ్యాధికి ఆ దేశం పేరు ఖరారు చేసేశారు. కానీ వ్యాధి తీవ్రత ప్రజలకు తెలియకుండా నాటి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం వల్ల రకరకాలుగా నివేదించేవి పత్రికలు. అందుకే స్పానిష్‌ ‌ఫ్లూ గురించి ప్రస్తావించవలసి వస్తే ‘స్పానిష్‌ ‌లేడీ’ అంటూ స్పెయిన్‌ ‌పత్రికలు కొంటెతనంతో రాసేవి.

మొదటి ప్రపంచ యుద్ధం చాలావరకు ట్రెంచ్‌ల (నిలువెత్తు గోతులు) నుంచి సాగింది. యుద్ధం సమాప్తమవుతున్న కాలంలోనే, అంటే 1918 మే ప్రాంతానికి ఈ వ్యాధి లక్షణాలు సైనికులలో పొటమరించాయి. చాలా దేశాల సైన్యాలను అది బలహీనపరిచింది. మరొక భయంకరమైన వ్యాధి- ట్రెంచ్‌ఫుట్‌. ‌ట్రెంచ్‌లలో రోజుల తరబడి ఉన్న సైనికుల కాళ్లు, అందులో పడి నిల్వ ఉండిపోయిన వర్షపు నీటితో నానిపోయేవి. ఎలుకలు కొరికేవి. చనిపోయిన సైనికుల మృతదేహాలను ఎవరూ తొలగించేవారు కాదు. వాటిని ఎలుకలే తినేవి. దానితో అసాధారణ పరిమాణంలో బలిసి ఉండేవి. అవి ట్రెంచ్‌‌లో ఉండే సైనికుల కాళ్లు కరిచేవి. బోదలా వీరి కాళ్లు వాచిపోవడమే కాదు, పాదాల చర్మం చిట్లి భయానకంగా తయారయ్యేవి. దీనికే తరువాత ట్రెంచ్‌ఫుట్‌ అని పేరు పెట్టారు.

కచ్చితంగా చెప్పాలంటే మే మాసం చివరిలో ఆ వ్యాధి బొంబాయిలో ప్రవేశించింది. నాటి తొలిదశ వ్యాధి మరీ ప్రమాదకరంగా పరిణమించలేదు. దీనిని అధికారులు ఎలా గుర్తించారంటే, ‘కోతల సమయంలో కొంతమంది కూలీలు మరీ నీరసంగా కనిపించేవారు. రోజంతా పనిచేసే శక్తి కూడా ఉండేది కాదు’. సెప్టెంబర్‌ 19, 1918‌న ఒక ఆంగ్ల దినపత్రిక ఇలా నమోదు చేసింది, ‘ఇక్కడ (బొంబాయిలో) 293 మంది అంటువ్యాధి బారిన పడి మరణించారు. అయితే ఇంతకు మించి ప్రమాదం ఉండకపోవచ్చునని కూడా తెలిపింది. నిజానికి ఆ అంటువ్యాధి కోటీ డెబ్బయ్‌ ‌లక్షల నుంచి కోటీ ఎనభయ్‌ ‌లక్షల మంది భారతీయులను బలితీసుకుంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినవారి సంఖ్య కంటే ఈ వ్యాధికి బలైన భారతీయుల సంఖ్య ఎక్కువ. చావులతో భారత్‌ ‌భరించిన విషాదం చాలా బరువైనది. దేశ జనాభాలో ఆరో వంతు కన్నుమూశారు. ముఖ్యంగా మహిళలు -పౌష్టికాహార లోపం ఉన్నవారు, శుభ్రత, గాలీవెలుతురూ లేని ఇళ్లలో నివాసం ఉన్నవారు, అంటువ్యాధి బారిన పడిన వారికి సేవలు అందించినవారు దారుణంగా చనిపోయారు. పురుషుల మరణాల కంటే వీరి మరణాలే అధికం.

మొత్తం ప్రపంచ జనాభాను బట్టి చూస్తే మూడింట ఒక వంతు ఈ వ్యాధి సోకినవారే. యాభయ్‌ ‌నుంచి వంద మిలియన్లు, అంటే ఐదు నుంచి పదికోట్ల మంది రాలిపోయారు. నాటి ప్రపంచ జనాభాలో ఇది ఐదు శాతం.

కానీ, గాంధీజీ, అంటువ్యాధి లక్షణాలు కనిపించిన ఆయన అనుచరులు అదృష్టవశాత్తు కోలుకున్నారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా చాలామంది తమ తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ప్రముఖ హిందీకవి సూర్యకాంత్‌ ‌త్రిపాఠి (నిరాలా) భార్య, ఇతర సభ్యులు స్పానిష్‌ ‌ఫ్లూతోనే తుదిశ్వాస విడిచారు. ‘కన్నుమూసి తెరిచినంతలోనే నా కుటుంబ సభ్యులంతా దూరతీరా లకు వెళ్లిపోయారు’ అని ఆయన రాసుకున్నారు కూడా. ‘అనేక మృతదేహాలను గంగ మింగింది’ అని, ‘శవాల గుట్టలు తయారయ్యాయి. వాటిని దహనం చేయడానికి కట్టెలు లేవు’ అని కూడా ఆనాటి దృశ్యాన్ని ఆయన కళ్లకు కట్టారు. ‘దీనికి తోడు ఆ ఏటి రుతుపవనాలు ముఖం చాటేశాయి. దుర్భిక్షం వంటి పరిస్థితి తలెత్తింది. తిండితిప్పల కోసం జనం నగరాలకు వలసపోయారు. దీనితో వ్యాధి మరింత విస్తరించింది’ అని కూడా నిరాలా నమోదు చేశారు. ఒక దినపత్రిక ఇచ్చిన కథనం ప్రకారం రోజుకు 150 నుంచి 200 మృతదేహాలు శ్మశానాలకు చేరేవి.

1918 నాటి స్పానిష్‌ ‌ఫ్లూ యాంటిబయాటిక్స్ ‌కనుగొనని పూర్వ యుగంలో వచ్చింది. వ్యాధి బాగా ముదరిపోయిన వారికి వైద్యం అందించడానికి సరైన వైద్య సదుపాయాలు ఏవీ లేని కాలమది. దానికితోడు పాశ్చాత్య వైద్య పద్ధతులకు అంతగా ఆదరణ ఉండేది కాదు. చాలామంది భారతీయులు దేశీయ ఔషధాల మీద, వైద్య విధానాల మీద ఆధారపడేవారు.

ఎంతో రద్దీగా ఉండే బొంబాయిలో అప్పుడు వ్యాధి ఆరంభమై, విస్తరించింది. ఇవాళ కూడా రెండుకోట్ల జనాభా ఉన్న ముంబైలోనే కేసులు అధికం.

1918 జూలై ఆరంభంలో రోజుకు 230 మంది వంతున ఆనాడు బొంబాయిలో చనిపోయేవారు. జూన్‌ ‌మాసానికి ఈ సంఖ్య మూడురెట్లు పెరిగిపోయింది. ‘ఒళ్లు పేలిపోయేటట్టు జ్వరం, వీపంతా నొప్పులు, మూడురోజుల వరకు బాధపెట్టేవ’ని టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా నమోదు చేసింది. బొంబాయి నగరంలోని దాదాపు ప్రతి ఇంటిలోను ఒకరు జ్వరంతో బాధపడ్డారు అని కూడా ఆ పత్రిక రాసింది. కార్మికులు కార్యాలయాలకు, కర్మాగారాలకు దూరంగా ఉన్నారు. అప్పటికి భారత్‌లో ఉంటున్న యూరోపియన్ల కంటే భారతీయులకే, పిల్లలు, పెద్దలు సహా, ఈ వ్యాధి ఎక్కువగా సోకింది. బొంబాయిలో ఇరుకు ఇళ్లలో, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే వ్యాధి విస్తరించింది. బయట ఎక్కువ సమయం ఉండకుండా, ఇళ్లలోనే ఉండాలని ఆనాడు ఆ పత్రిక పౌరులకు సూచించింది. విశాలంగా, పచ్చని పెరళ్లతో, గాలీవెలుతురూ పుష్కలంగా ఉన్న ఇళ్లలో నివాసం ఉండే ఆంగ్లేయుల జోలికి ఈ వ్యాధి ఎక్కువగా వెళ్లలేదు కూడా. వీరి ఇళ్లలో పనిచేసే భారతీయ నౌకర్లు కూడా పెద్దగా ఆ వ్యాధి బారిన పడలేదు. మౌరా చుహాన్‌ అనే అమెరికా పరిశోధకుడు ఇచ్చిన వివరాల ప్రకారం కింది తరగతి హిందువు లలో మృతులు 61.6 శాతం ఉన్నారు. ముస్లింలు 19.2 శాతం, ఉన్నత కుటుంబాల హిందువులు 18.9 శాతం, భారతీయ క్రైస్తవులు 18.4 శాతం, పార్సీలు 9 శాతం, యూరోపియన్లు 8.3 శాతం చనిపోయారు.

రోగ లక్షణాలు చూసి ‘కంగారు పడిపోకుండా విశ్రాంతిగా ఉండడమే’ ఈ వ్యాధికి పెద్ద మందు అని టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా నాడు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. జనం గుంపులు గుంపులుగా ఉన్నచోటకి వెళ్లకుండా ఉంటే వ్యాధి సోకదని కూడా తెలియచేసింది. అంటే ఉత్సవాలలో పాల్గొనరాదని, థియేటర్లకు, పాఠశాలలకు, సమావేశమందిరాలలో జరిగే ఉపన్యాస కార్యక్రమాలకు, విందులూ వినోదాలకీ, రద్దీగా ఉండే రైలు బోగీలలోకి వెళ్లరాదని టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా తెలియచేసింది. గాలీవెలుతురూ ఉన్న ప్రదేశంలో పడుకోవడం, లేదా ఆరుబయట పడుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం వ్యాధి తగ్గంచుకోవడానికి అవసరమని తెలియచేసింది. కానీ నాటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అంటువ్యాధి నేరం తమ మీద పడకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నించింది. భారత్‌లో ఉండే అశుభ్ర వాతావరణంతోనే అంటువ్యాధి విస్తరించిం దని బ్రిటిష్‌ అధికారులు చెప్పేవారని వైద్యశాస్త్ర చరిత్రకారిణి మృదులా రామన్న రాశారు. రోగులను వాళ్ల ఖర్మానికి వాళ్లని వదిలిపెట్టేశారు పాలకులు. వైద్య సౌకర్యాల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని విదేశీ ప్రభుత్వం వల్ల, దేశం పెద్ద మూల్యమే చెల్లించింది.

ఆనాటి ఇంకొక పరిణామం కూడా ప్రస్తావించు కోదగినదే. ఆ సమయంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వారంతా మొదటి ప్రపంచ యుద్ధంలో క్షతగాత్రులకు సేవలు అందించేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సేవకులే స్పందించారు. వారే చిన్న చిన్న వైద్యశాలలు ఏర్పాటు చేశారు. మృతదేహాలను తొలగించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రోగులకు సేవ చేయడం ద్వారా వచ్చిన డబ్బునే అన్నీ కోల్పోయిన వారికి బట్టలు, ఆహారం సమకూర్చడానికి వినియోగించేవారు. చరిత్రలో అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా చదువుకున్న వారు, పెద్ద కుటుంబాల వారు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

కరోనా కుటుంబం నుంచి వచ్చిన 1918 నాటి స్పానిష్‌ ‌ఫ్లూ, 2019 నాటి కొవిడ్‌ 19 ‌మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. మరొక విస్మయం కలిగించే విషయం ఉంది. 1918లో ఈ వ్యాధిని ఎదుర్కొన డానికి ప్రపంచం వద్ద ఎలాంటి వైద్య సంసిద్ధత లేదు. చిత్రం ఏమిటంటే- వందేళ్ల తరువాత ఇవాళ కూడా అదే పరిస్థితి. తేడా ఒక్కటే. వ్యాధి లక్షణాలు కనిపించినవారిని ఐసోలేషన్‌లో ఉంచడం. అప్పుడు లేని యాంటిబయోటిక్స్ ‌మందులు ఉపయోగించడం. వాస్తవం చెప్పాలంటే ప్రపంచ మానవాళిని చావగొట్టి చెవులు మూసే శక్తి ప్రకృతికి ఉంది. దానిని ప్రసన్నం చేసుకోవడం, కలుషితం కాకుండా చూసుకోవడం ప్రపంచ మానవాళి కర్తవ్యం. ఒకవేళ వేరే ఏదో దేశం పుణ్యమా అని మనం కూడా అలాంటి అంటువ్యాధి బారిన పడితే మనం శుభ్రంగా ఉండడమే పరిష్కారం. కాబట్టి కేవలం ఆరోగ్య సంక్షోభం తలెత్తిన సమయంలోనే, డాక్లర్లు, నిపుణులు లక్షలసార్లు చెప్పిన మీదటే శుభ్రత పాటించడం కాదు. పారిశుద్ధ్యం జీవితంలో భాగం కావాలి. పరిసరాలను అద్దంలా ఉంచుకుంటే అంటువ్యాధులు చేరవు. ఇందుకు ప్రభుత్వం చేసేది చేయాలి. కానీ ప్రజల బాధ్యతే అధికం. పౌష్టికాహారం, వ్యాక్సినేషన్‌ ‌వంటివి ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. కానీ ప్రతివారి వాకిలి తుడిచి పెట్టే పని ప్రభుత్వం చేయలేదు. కోట్లాది ప్రజల ముఖాన మాస్క్ ‌సరిగా ఉందో లేదో చూడడం ప్రభుత్వాలకు అసాధ్యం. ప్రతి గంటకు జనం చేతులు కడుగుతున్నారో లేదో చూసే విధి సర్కారుదే అనడం అసందర్భం. అది ముమ్మాటికీ మన బాధ్యత.

 (బీబీసీ న్యూస్‌, ఇతర ఆధారాల నుంచి)

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram