నూట నలభయ్‌ ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి అది. 800 పడకలు ఉన్న ఆ ఆసుపత్రి ఒకనాడు ఆసియాలో అతి పెద్దదిగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. కానీ 20 ఏళ్ల క్రితం మూత పడింది. ఆసుపత్రే కోమాలోకి పోయింది. ఇక పునరుద్ధరించడం సాధ్యం కూడా కాదు అన్న రీతిలో తయారయింది. అలాంటి దానిని ఇప్పుడు రెండు వందల యాభయ్‌ ‌మంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌, ‌భారతీయ జనతా పార్టీ, సంఘ్‌ ‌పరివార్‌లోని ఇతర సంస్థల కార్యకర్తలు అక్షరాలా రేయింబవళ్లు శ్రమించి, పదిరోజులలోనే కొవిడ్‌ ఆసుపత్రిగా వినియోగంలోకి తెచ్చారు. ఈ అద్భుతం కర్ణాటకలోని బంగారు గనుల కోలార్‌లో జరిగింది.

చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చో వడం సరికాదు. చిరుదీపమైనా వెలిగిస్తే గొప్ప ప్రయోజనం నెరవేరుతుంది. లేని చీకటిని తిడుతూ ఘనత వహించిన కాంగ్రెస్‌ ‌నేతలు నిరసన శిబిరాలలో కూర్చుని ఉంటే, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ కార్యకర్తలు మాత్రం ఒక జ్యోతిని వెలిగించి చూపించారు.

దాని పేరు భారత్‌ ‌గోల్డ్ ‌మైన్స్ ‌లిమిటెడ్‌ ఆసుపత్రి (బీజీఎంఎల్‌). ‌బంగారు గనుల అధికారులు జేడీ ఒడొన్నెల్‌ ‌సోదరులు 1880లో స్థాపించారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బీజీఎంఎల్‌ ‌తొలిసారి విద్యుత్‌  ‌సౌకర్యం పొందింది. ఎక్స్‌రే యూనిట్‌ను మొదటిగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి కూడా ఇదే. 120 ఏళ్లు సేవలు అందించిన తరువాత, గనులతో పాటే (2001) మూతపడిపోయింది.

 కొవిడ్‌ 19 ‌మొదటిదశే కాదు, రెండోదశ కూడా కర్ణాటకను అతి దారుణంగా కుంగదీసింది. కోలార్‌ ‌జిల్లా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆ జిల్లాకు చెందిన పార్లమెంట్‌ ‌సభ్యుడు, బీజేపీ నాయకుడు ఎస్‌. ‌మునిస్వామికి ఒక ఆలోచన వచ్చింది- ఖాళీగా ఉన్న ఆ విశాలమైన ఆసుపత్రిని ఈ ఆపద వేళ ఎందుకు వినియోగంలోకి తేకూడదు? అంటే కొవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌గా మార్చాలనుకున్నారు. ఇలాంటి ఆలోచన వచ్చిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర అనుబంధ సంస్థల వారితో ఆయన సంప్రదించారు. ప్రస్తుతానికి రెండువందల పడకల ఆసుపత్రిగా సిద్ధం చేయాలన్న తన ఆలోచన చెప్పారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి అనుమతి తీసుకున్నారు. దానితో సంఘ్‌ ‌సంస్థల నుంచి 250మంది స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు.

స్వయంసేవకులు, బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఒక సవాలుగా స్వీకరించారు. ఎంపీ మునిస్వామి మాటలలో చెప్పాలంటే, ఆసుపత్రిని పునరుద్ధరించాలన్న ఆలోచనను సమర్ధించడానికి ముందుకు వచ్చిన వారు దాదాపు లేరు. నిజమే, అందులో పేరుకు పోయిన వ్యర్థాలు, చెత్త చెదారం 400 ట్రాక్టర్లయిందంటేనే దాని దుస్థితిని ఊహించవచ్చు. ఆసుపత్రిని శుభ్రపరచడమే తమకు అతి పెద్ద సవాలుగా పరిణమించిందని కోలార్‌ ‌గోల్డ్ ‌ఫీల్డ్ ‌ప్రాంత ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్త ఎస్‌. ‌ప్రవీణ్‌ ‌చెప్పారు. ‘ఈ ఆలోచన వచ్చిన తరువాత మొదట నేను ఆసుపత్రి లోపలికి వెళ్లాను. ఎక్కడ చూసినా గబ్బిలాలే. నేల మీద ఐదారు సెంటీమీటర్ల ఎత్తున దుమ్ము. ఏ గది చూసినా, హాలు చూసినా దట్టంగా సాలెగూళ్లే. అందుకే చాలామంది దీనిని శుభ్రం చేయడం సాధ్యమవుతుందా అన్న ఆలోచనల్లో పడిపోయారు కూడా. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌, ‌సేవాభారతి, జనజాగరణ్‌ ‌సమితి కలసి కట్టుగా అనుకున్నది సాధించాం’ అన్నారు ప్రవీణ్‌. ఏ‌ప్రిల్‌ 27‌న మొదలుపెట్టిన పని, మే 7కల్లా పూర్తి చేయగలిగారు. ఆసుపత్రి లోపలే కాదు, ఆసుపత్రి కట్టిన ఐదెకరాల ప్రాంగణాన్ని కూడా శుభ్రపరిచారు. విద్యుత్‌ ‌సరఫరా వ్యవస్థకు, అవసరమైన అన్నిచోట్ల మరమ్మతులు చేయించారు. నీటి వసతిని పునరుద్ధరించారు.

ప్రస్తుతం వైద్యానికి అవసరమయ్యే మౌలిక వసతులను కల్పిస్తున్నారు. నాలుగు నడవాలను ఐసీయు కోసం కేటాయించారు. ఇందులో 140 ఇనుప మంచాలు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఇప్పటికీ అవి చెక్కు చెదరలేదు. వంద కిలోల బరువుండే ఆ మంచాలన్నీ పాతవే. కానీ ఒక మంచం ఎత్తాలంటే ముగ్గురు నలుగురు అవసరమవుతున్నారు అని ప్రవీణ్‌ ‌చెప్పారు. అవి ఇంకొక శతాబ్దం పాటు కూడా ఉపయోగించుకోవచ్చు. వీటికి తెల్లరంగు వేయించి ముస్తాబు చేశారు. ‘ఈ ఆసుపత్రిని పునరుద్ధరించడంలో ఇక్కడి ఎంపి, కార్యకర్తలు పడిన శ్రమను చూశాను. ఎంతో కష్టించారు వారు. ఈ ఆసుపత్రి సేవలు ఆ తరువాత కూడా కొనసాగించి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాను. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి స్థాయిలో ఉంచాలి’ అని కోలార్‌ ‌గోల్డ్ ‌ఫీల్డ్ ‌ప్రాంతానికి చెందిన ఒక పౌరుడు కోరుతున్నారు. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో స్థానికులకే కాదు, సరిహద్దులోని మన చిత్తూరు జిల్లా, తమిళ జిల్లాల వారికి కూడా ఇందులో వైద్య సేవలు అందిస్తారు.

నిజానికి 2020లో, అంటే తొలిదశ కొవిడ్‌ ‌సమయంలోనే దీనిని పునరుద్ధరించాలన్న ఆలోచన కేంద్రానికి ఉంది. కానీ కోలార్‌ ‌మైన్స్ ‌కార్మికులు కొంత వ్యతిరేకత చూపించారు. దానిని పునరుద్ధరించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని వాదించారు. ఏమైనా ఎన్నో సదుపాయాలు ఉన్న ఒక మంచి ఆసుపత్రిని కొవిడ్‌ ‌వంటి విపత్కర పరిస్థితులలో సంఘ్‌పరివార్‌ ‌వినియోగంలోకి తీసుకువచ్చింది. దేశ ప్రజలు కొవిడ్‌తో బాధపడుతున్నారు. ఆక్సిజన్‌ అం‌దుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. వ్యాక్సిన్‌ అం‌దక భయపడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌నేతలు సహా, దేశంలో విపక్ష నేతలు, ఎన్‌జీవోలు, మీడియా తాపీగా విమర్శలు చేస్తున్నారు. అంతా ప్రభుత్వమే చేయాలంటూ విమర్శలు కురిపించడానికి పరిమితమైతే పరిస్థితులు చేయి దాటిపోతాయి. పౌరులు కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎంత సాయం చేసినా అది ప్రాణాలకు మేలు చేస్తుంది. సంఘ్‌ ‌పరివార్‌ ‌చేసింది అదే.

(మే 19వ తేదీన కేజీఎఫ్‌ ఆసుపత్రిని పునఃప్రారంభించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్థనారాయణ, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ ‌సుధాకర్‌, ఎం‌పి మునిస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విభాగ్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌శంకర్‌నారాయణ, సంఘ పరివార్‌ ‌సభ్యులు హాజరయ్యారు.)

About Author

By editor

Twitter
Instagram