‌కరోనా కల్లోలం వేళ దేశంలోని పలు ఆధ్యాత్మిక, ధార్మిక, మత, వ్యాపార, సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలకు అండగా నిలవాలని భావించాయి.  ‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్‌- ‌హమ్‌ ‌జీతేంగే’ కార్యక్రమం ద్వారా పలువురు స్వామిజీలు,  వివిధ రంగాల ప్రముఖులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మే 11 నుండి 15 వరకు ఫేస్‌బుక్‌, ‌యూట్యూబ్‌ ‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో తమ భావాలు పంచుకున్నారు. లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ (‌రిటైర్డ్) ‌గుర్మీత్‌సింగ్‌ ‌కన్వీనర్‌గా ఏర్పడిన కొవిడ్‌ ‌రెస్పాన్స్ ‌బృందం (సిఆర్‌టి) ఈ కార్యక్రమాన్ని ఐదురోజులు నిర్వహించింది. ఈ ఉపన్యాస ధారావాహిక మే 15న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌జీ ఉపన్యాసంతో ముగిసింది.

సకారాత్మక ఆలోచనల గురించి మాట్లాడమని నాకు చెప్పారు. ఇది చాలా కష్టం. ఎందుకంటే మనం కూడా క్లిష్టస్థితిలో ఉన్నాం. ఎన్నో కుటుంబాల్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆకస్మాత్తుగా వారిని వదిలి మృత్యువు పాలయ్యారు. మనవారిని కోల్పోయిన దుఃఖం, భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించిన బాధ వీటి మధ్య కొట్టు మిట్టాడుతున్న వారిని పరామర్శించడం కంటే వారికి సాంత్వన కలిగించడం ముఖ్యం. కానీ ఈ దుఃఖాన్ని కేవలం సాంత్వన ద్వారా శాంతింపచేయడం కష్టమే. మనం మన సానుభూతిని మాత్రమే పంచగలం. పంచుతున్నాం కూడా. కానీ మన సంఘ కార్యకర్తలు ఈ సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారి వారి సామర్థ్యాలను బట్టి కార్య నిమగ్నులై ఉన్నారు. అందరినీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం నకార్మాత్మక ఆలోచనలు చేయరాదు. సకారాత్మకంగా ఆలోచించాలి.

ఇంతకు ముందు మాట్లాడిన వక్తలు మనసుని ఎలా దృఢంగా ఉంచాలో చెప్పారు. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సమాజ సేవ చేయాలని, సమాజం గురించి ఆలోచించాలని చెప్పారు. అవే మాటలు నేను నాదైన శైలిలో చెప్తాను. ఇందులో ముఖ్యమైనది మనసు. ఒకవేళ మనసు అలసిపోతే, ఒక పాము ముందు అలసిసొలసిన ఎలుక ఎలా పడి ఉంటుందో, మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అలా కానివ్వ కూడదు. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో, అంతే ఆశాజనకంగానూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో సమాజంలోని వికృతులు కూడా బయటపడుతూ ఉంటాయి. కానీ ఈ మరణవార్తల కంటే సమాజంలో మంచిపనులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. విపత్కర పరిస్థితులలో ఉన్నా కూడా చాలామంది తమ గురించీ, సమాజం గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొంతమంది సమాజం గురించే ఆలోచిస్తున్నారు. నిరాశ పడాల్సిన అవసరంలేదు. పోరాడాల్సిన అవసరం ఉంది. నిరాశ, రోజూ కొంతమంది గురించి దుర్వార్తలు వినడం, మీడియాలో ప్రతికూల కథనాలు మొదలైనవి మన మనసుకు బాధ, క్షోభ కలిగిస్తాయి. ఇలా ఉండ కూడదు. మానవ చరిత్రలో ఇప్పటివరకు అలా జరగలేదు. ఇటువంటి ఎన్నో బాధలను, ఆటంకాలను దాటుకొని మానవ సమాజం ముందుకు సాగింది. ఇప్పుడు కూడా సాగుతుంది.

సంఘ సంస్థాపకులు, డా. హెడ్గేవార్‌ ‌తల్లిదండ్రులు, ప్లేగు వ్యాపించినపుడు నాగ్‌పూర్‌లో తమ గురించి ఆలోచించకుండా సమాజ సేవ చేశారు. ప్లేగుకు చికిత్స అందుబాటులో లేదు. సమాజం గురించి వెళితే మనం బలి అవ్వాల్సిందేనని ఆలోచించే సమయం అది. కానీ ఆ పుణ్య దంపతులు రోగుల సేవ చేస్తూ ఒకేరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. అప్పటికి హెడ్గేవార్‌ ‌బాలుడు. డాక్టర్‌ ‌కూడా కాలేదు. అలాంటి సంవేదనాత్మక వయసులో ఈ పరిస్థితుల ప్రభావం ఆయనపై ఎలా ఉండేది? ఆయన జీవితం దుఃఖంతో నిండిపోయిందా! నిరాశ చెందక ఈ వియోగపు విషాన్ని దిగమింగి సమాజపు కష్టాన్ని ఆయన కూడా పంచుకున్నారు.

విపత్తులు వచ్చినపుడు మన ప్రవృత్తి ఎలా ఉండాలి? మనం భారతీయులం. ఈ జీవితం జనన మరణాల చక్రం అని మనకు తెలుసు. మనం పాత వస్త్రాలు వదిలి నూతన వస్త్రాలు ఎలా ధరిస్తామో, అలాగే ఈ జర్జరమైన శరీరాన్ని వదిలి ఆత్మ ముందుకు సాగుతుంది. ఇది మనకు తెలుసు కాబట్టి జనన మరణాలు మనల్ని నిరాశ, నిష్క్రియాపరం చేయలేవు. బ్రిటన్‌ ‌ప్రధాని విన్‌స్టన్‌ ‌చర్చిల్‌ ‌టేబుల్‌ ‌పై ఒక వాక్యం రాసి ఉండేది. అదేమిటంటే- Please understand there is no pessimism in this office. We are not interested in the possibilities of defeat. They do not exist. ‘మనం ఓటమి గూర్చి ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే మనం ఓటమి చెందము.’ వారు గెలిచారు. ఆనాటి పరిస్థితి చూస్తే ఇంగ్లండ్‌ ‌నాశనమయ్యేది. కానీ నెలల పాటు బాంబుదాడులు భరిస్తూ బ్రిటన్‌ ‌ప్రజలు దేశాన్ని నిలబెట్టడమేకాదు, శత్రువుపై విజయం సాధించారు. ఇదెలా సాధ్యమయింది? కేవలం ఆలోచనా ధోరణి వల్లనే. ముందున్న విపత్తును, చీకటిని, దుఃఖాన్ని చూసి వారు భయపడలేదు. స్వీకరించారు. మనం ఇలాగే ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలి. సంపూర్ణ విజయం సాధించేవరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. కొవిడ్‌ ‌మొదటి తాకిడిలో ప్రజలు, ప్రభుత్వం, పాలనా యంత్రాంగం అందరూ గాబరాపడ్డారు. మునుముందు మూడవ తాకిడి కూడా రావచ్చును. అయినా ఆందోళన చెందరాదు.

 సాగర మథనం చేస్తున్నపుడు ఎన్నో విలువైన వజ్రాలు, రత్నాలు బయటకు వచ్చాయి. వాటిపై ఆశతో మథనం ఆపలేదు. హాలాహలం కూడా వచ్చింది. అయినా ప్రయత్నం ఆపలేదు. అమృతం లభించేవరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రపంచ మానవాళి మొత్తం కష్టంలో ఉంది. ప్రపంచాని కంతటికీ భారతదేశం ఒక ఉదాహరణలా నిలవాలి. మన ప్రయత్నం మనం చేద్దాం. పనులల్లో వేగం పెంచాలని అజీం ప్రేమజీ చెప్పారు. వేగం ఎలా పెరుగుతుంది? ఎప్పుడైతే మనం ఒక జట్టుగా కలిసి పనిచేస్తామో అప్పుడు పెరుగుతుంది. దీనికి పెద్ద ఉదాహరణ పుణె. అక్కడి ప్రముఖులు, వ్యాపారులు, డాక్టర్లు, పరిపాలకులు, ఆసుపత్రి నిర్వాహకులు, ప్రజా సంఘాలు కలసి ఒక సముదాయాన్ని ఏర్పరచారు. ఈ ఆపదనుండి బయటపడ్డారు. అన్నిచోట్ల ఇలాంటి సామూహిక ప్రయత్నాలు జరగాలి. ఆలస్యమైనా ఫర్వాలేదు, కలసికట్టుగా ఉండి, వేగాన్ని పెంచి అంతరాన్ని తగ్గించి ముందంజ వేయొచ్చు. ఇది మన నుంచే మొదలు కావాలి.

మరో ముఖ్య విషయం చైతన్యం. మనం చైతన్యవంతంగా ఉంటే మనల్ని మనం రక్షించుకున్నట్టే. అలాగే క్రియాశీలంగా ఉండాలి. చైతన్యంగా ఉండడంలో ముఖ్యమైనవి- 1) స్వయంగా చైతన్యంగా ఉండడం, 2) ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఉదా? ప్రాణాయామం, ఓంకారం, దీర్ఘశ్వాసలు, సూర్య నమస్కారాలు, వీటిని ఆన్‌లైన్‌ ‌ద్వారా కూడా నేర్చుకోగలం. ఇవి రోజూ చేయాలి. 3) మన ఆహారం- శుద్ధ సాత్విక భోజనం చేయడం. శరీర శక్తిని పెంపొందించే భోజనం చేయడం. శాస్త్ర సమ్మతమైన మాటలనే నమ్మండి. మన ఆయుర్వేదం ఒక శాస్త్రం. అందులో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. శాస్త్రం ఆధారంగా వీటిని తీసుకోవడంలో తప్పులేదు. శరీరాన్ని, మనస్సును అస్థిరపరిచే వాటిని వదిలేయాలి.

ఖాళీగా ఉండకండి. కొత్తది నేర్చుకోండి. కుటుంబంతో గడపండి. కొంచెం అనుమానం వచ్చినా పరీక్షకు వెనుకాడకండి. కొంతమంది కొవిడ్‌ ‌బారిన పడడం అవమానంగా భావిస్తారు. ఆసుపత్రిలో చేరడానికి తటపటాయిస్తారు. కొందరు అనవసరంగా చేరతారు. దీనివలన ఎవరికైతే అత్యవసర చికిత్స అవసరమో వారికి చోటుండదు. మనకు తెలిసిన వారికి కొవిడ్‌-19 ‌గురించి అవగాహన కల్పించాలి. ఎవరైతే ఇవి చేస్తున్నారో వారి కార్యక్రమాలలో మనం పాల్గొనవచ్చు. ప్రత్యక్ష్యంగా కొవిడ్‌ ‌రోగులకు సేవ చేయాలనుకొంటే, వారికి ఆసుపత్రిలో బెడ్‌ ‌కోసం, ఆక్సిజన్‌ ‌కోసం, అవసరమైన సేవలు అందించడం కోసం, ఇలా ఎన్నోరకాలగా మనం సేవలు అందించ గలం. మొదటిదశలో ఎందరో జీవనోపాధిని కోల్పోయారు. రోజుకూలీల పరిస్థితి ఘోరం. ఆ కుటుంబాలు ఆకలితో ఆలమటించకుండా చూడాలి. రేపు కొవిడ్‌-19 ‌వలన ఉపాధి, సంపాదన మందగించి ఆర్థికవ్యవస్థ డీలాపడటం లాంటివి మొదలవుతాయి. వీటిని ఎదుర్కోవడానికి ఇప్పటినుండే సిద్ధంగా ఉండాలి. స్కిల్‌ ‌ట్రైనింగ్‌ ‌లాంటి కార్యక్రమాలలో సమాజపరంగా, వ్యక్తిగతంగా మనం ఎంత సహాయపడగలమో అంత సహాయపడాలి. ఇది వేసవి. ఫ్రిజ్‌ ‌మీద ఆధార పడకుండా ఉపాధి కోల్పోయిన కుమ్మరి దగ్గర కుండ కొనండి. ప్రస్తుత, రాబోవు పరిస్థితుల గురించి చర్చ జరుగుతోంది. ఇది భయపెట్టడానికి కాదు. రాబోయే పరిస్థితులను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండమని చెపుతున్నారు. నియమాలు, క్రమశిక్షణను పాటిస్తూ, నడుస్తూ, సమాజాన్ని నడిపిస్తూ, సేవ చేస్తూ, సేవ చేస్తున్న వారికి సహాయాన్ని అందిస్తూ మనం ముందుకు వెళ్లాలి. ఇది మన సంకల్పం. మనం గెలవాలి. ఎన్నో తరాలుగా, ఎన్నో కష్టాలను ఎదురొడ్డి నిల్చిన దేశం- మన భారతదేశం. ఇది మహమ్మారి కావచ్చు, ప్రపంచాన్నంతా వణికిస్తుండొచ్చు, రూపం మార్చుకొని రావచ్చు. ఈ యుద్ధం కఠినమైనదే. కానీ యుద్ధం చేయాల్సిందే. గెలవాల్సిందే. గెలుస్తాం.

ఎన్నో నాగరికతలు మట్టిలో కలిసిపోయాయి. కానీ మన భారతదేశంలో ఏదో శక్తి ఉంది. అందుకే ఇప్పటికీ కొనసాగుతోంది. మన పూర్వీకులు సత్యాన్ని దర్శించి దానిని వారు మనకు అందించారు. సత్యాన్ని ఆచరించే సంస్కృతి మనది. గెలుపోటములను స్వీకరిస్తూ, ధైర్యంగా సత్యాన్ని సాధించేవరకు దృఢ సంకల్పంతో సాగాలని చెప్తుంది. ఇంతకు ముందు పెద్దలు చెప్పిన విషయాలను హృదయాంతరాళలో నిలుపుకొని, వాటిని అర్థం చేసుకొని మన ప్రయత్నాలను వేగవంతం చేద్దాం. నిరాశ చెందకండి. మన గెలుపు తథ్యం. ధన్యవాదాలు.

——————-

ధైర్యాన్ని కోల్పోవద్దు: శ్రీ జైనముని ప్రమాణ్‌ ‌సాగర్‌జీ

ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితి శాశ్వతం కాదు. ధైర్యాన్ని కోల్పోవలసిన  అవసరం లేదు. మనసును ధృడపర్చుకొని వ్యాధిపై పోరాటం చేసి జయించచ్చు. ఈ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక దృష్టి కోణాన్ని పెంపొందించుకోవాలి. వ్యాధి కేవలం శరీరానికే తప్ప మనసుకు కాదు. మనసు రోగం బారినపడితేనే అసలైన ప్రమాదం. చాలామంది వ్యాధి బారిన పడుతున్నప్పటికీ వ్యాధి నయం చేసుకొని బయటపడ్డవారే ఎక్కువ. కాబట్టి ధైర్యంగా ఉంటేనే ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు.

———————-

భగవద్భక్తి, ఆత్మవిశ్వాసాలే మన ఆయుధం: శీశీశ్రీ పండిత్‌ ‌రవిశంకర్‌ ‌గురూజీ

ప్రస్తుతం మనం ఘోరవిపత్తును ఎదుర్కొంటున్నాం. దానివల్ల మనోబలాన్ని కోల్పోయి నిరాశకు గురవుతుంటాం. మన చూట్టూ ఉన్న కష్టాలు, ఇబ్బందులు మనల్ని కుంగదీస్తాయి. ఈ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాన్న విషయా లపై ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాలి. భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చాడు. దాన్ని మేల్కొల్పడమే మనం ప్రస్తుతం చేయగలిగినది. ప్రజల్లో ఉన్న ధైర్య, శౌర్య, ఉత్సాహాలను మేల్కొల్పాలి. ఉత్సాహంగా ఉంటే నిరాశ ఉండదు. మనం ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటేనే మన చుట్టూ ఉన్నవారికి ధైర్యం చెప్పగలం. మనమే కుంగిపోతే ఎవ్వరికీ సహాయపడలేం. ఇంకొకటి కరుణ – ఇది అందరికీ ఉంటుంది. మనిషి వేదన, బాధలో ఉన్నప్పుడు కరుణ చూపాలి. దీని వల్ల మనోధైర్యం పెరుగుతుంది. అంతేకాదు, అందరూ జాగరూకతతో మెలగాలి. నియమాలకు కట్టుబడి మనం మరొకరిని అలా ఉండమని ప్రేరేపించాలి. అందరినీ ముందుకు తీసుకెళ్లడానికి ఇది చాలా ముఖ్యమైన అడుగు. మనం బాధలో ఉన్నప్పుడు మన మనస్సు స్థిరంగా ఉండదు. మనం చేసే ఏ పనీ విజయవంతం కాదు. వీటిని జయించాలంటే ప్రాణాయామం, ధ్యానం, మంత్రోచ్ఛారణ చేయాలి. వీటి వల్ల ఆత్మబలం వస్తుంది. భగవంతుడిపై భక్తి కలిగి ఉండాలి. భగవంతుడు ఉన్నాడు. ఆయనే మనకి బలం ఇస్తున్నాడనుకోవాలి. దైవభక్తి మానసికమైన ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. ఆహారంపై కూడ శ్రద్ధ పెట్టాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆయుర్వేదాన్ని అనుసరించాలి. ఈ విషయాలను మనం ఆచరిస్తే ఈ రుగ్మతలను అధిగమించగలం. ప్రతిఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు కోవాలి. మనసులో నకారాత్మకమైన విషయాలకు తావివ్వకూడదు. పరుల కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. దీని వల్ల మన మనస్సులో సకారాత్మకమైన స్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరులతో మాట్లాడటం కాస్త తగ్గించుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా – కరోనా – కరోనా. మనం మాట్లాడుకున్నంత మాత్రాన వైరస్‌ని తరిమి కొట్టలేం కదా. అందరూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలి.  మనం ఈ విపత్కర పరిస్థితి నుండి తప్పక బయటపడతాం. ఇది తథ్యం. ఓం శాంతి. జై హింద్‌.

——————-

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం : సాధ్వి రితంభర (పరమ శక్తిపీఠం వాత్సల్య గ్రామ్‌ ‌స్థాపకులు)

ధైర్యం, సాహసాలు ఉంటే పెద్ద పర్వతాలను కూడా కదిలించవచ్చు. ఒక మహానది తన ప్రవాహంలో అడ్డువచ్చిన రాళ్లను కూడా ఇసుకగా మార్చేస్తుంది. కాబట్టి సంక్షోభం ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతఃశక్తిని జాగృతపరచి ఆ సమస్యను ఎదుర్కో వాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దైవం పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసినప్పుడే ఆ పరిష్కారం కనిపిస్తుంది. ఈ విశ్వాసం తోనే మనం ఈ మహమ్మారిని జయించవచ్చు. మరొ కరిలో లోపాలు వెతికి, వారిపై ఆరోపణలు చేయ కుండా ప్రతిఒక్కరూ ఆత్మ సంయమనం, నిష్ట, విశ్వాసాలను పెంచుకోవాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన శక్తిని నకారాత్మక ఆలోచనలకే వ్యర్ధం చేస్తే అప్పుడు సరైన నిర్ణయం తీసుకుని, దానిని అమలు చేసే సామర్ధ్యాన్ని కోల్పోతాం. కాబట్టి మనసులోకి నకారాత్మక ఆలోచనలు రానివ్వకూడదు.

——————–

కరోనాపై కలసికట్టుగా పోరాడదాం: అజీమ్‌ ‌ప్రేమ్‌జీ (విప్రో అధినేత)

ఎన్నడూలేని, ఎవరూ ఊహించని ఈ సంక్షోభంలో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతిని తెలుపుతున్నాను. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మనందరికీ తగిన ఆత్మ స్థైర్యం, ధైర్యం ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మనందరం అన్ని వేళలా జాగరూకతతో వ్యవహరించాలి. అందుకు సరైన శాస్త్రపరిజ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలి. అంతేకాదు, ఈ విపత్కర పరిస్థితుల్లో దేశమంతా ఒకటిగా నిలవాలి. భేదాభిప్రాయాలను పక్కనపెట్టాలి. ఏకత్వభావనే ప్రస్తుత అవసరమని గుర్తించాలి. ఐకమత్యమే మన బలం. ఈ మహమ్మారి మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజానీకం మరింత ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. వారికి సహకారం అందించడం అవసరం. ఈ సంక్షోభం నుంచి బయటపడిన తరువాత సామాజిక, ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి.

—————-

మనసును జయిస్తే లోకాన్ని జయించినట్లే: సంత్‌ ‌జ్ఞాన్‌దేవ్‌సింగ్‌ (‌శ్రీ పంచాయతీ అఖాడా, నిర్మల్‌)

‌భయపడవలసినది, ఆందోళనకు గురి కావలసినది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో మార్పు లేకుండా ఎల్లకాలం నిలిచిపోయేది ఏది లేదు. కష్టం వచ్చిందంటే అది అలాగే ఉండిపోదు. వచ్చినట్లుగానే పోతుంది. అందుకని ఆందోళన చెందవద్దు. దురదృష్టవశాత్తూ వ్యాధి సోకితే భగద్భావన చేయాలి. భగవద్గీత చదవాలి, గురువాణి చదవాలి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనసును జయిస్తే లోకాన్ని జయించినట్లే. మనసు ఆరోగ్యంగా, స్వస్థతతో ఉంటే ఏ సంక్షోభం, సమస్య మనల్ని ఏమి చేయలేదు. నేడు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలు, సూచనలు మన భారతీయ జీవన విధానంలో ఎప్పటినుండో అనుసరిస్తున్నవే. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని అనుసరిస్తే చాలు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది నిజం. కాబట్టి మన ప్రాచీన సంప్రదాయాల్ని ప్రతిఒక్కరం పాటిద్దాం. ఆరోగ్యంగా ఉందాం.

—————

ఆందోళన వదు్ద : డా।। నివేదిత భిడే (వివేకానంద కేంద్ర (కన్యాకుమారి), అఖిల భారత ఉపాధ్యక్షురాలు)

మనదేశం ఎన్నో సంకట పరిస్థితులను ఎదుర్కొని అభివృద్ధి చెందుతోంది. నేడున్న కఠిన పరిస్థితుల్లో కూడా విజయం పొందే దాకా మనం నిశ్చితంగా ఎదుర్కొందాం. అయితే ఇందుకు మనందరం 5 రకాల పనులు చేయాలి. 1) ప్రాణశక్తిని పెంచుకోవడం: కరోనా వ్యాధిలో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కనుక నిత్యం శ్వాససంబంధిత వ్యాయామాలు (ప్రాణాయామ) చేయాలి. ఓంకార ఉచ్చారణతో కలిగే స్పందనల వల్ల శరీరంలో అనేక సకారాత్మక మార్పులతో శక్తి వృద్ధి చెందుతుంది. 2) మనసు అనంతశక్తిని గుర్తించాలి: వివేకానంద ఈ విషయంలో ఎంతో విశ్వాసం కలిగించారు. కాబట్టి కొవిడ్‌ ‌సోకినా భయపడవద్దు. రోజూ నిద్రలేవగానే నేను ఆరోగ్యంగా ఉన్నానని సంకల్పం చేసుకోవాలి. 3) సమయాన్ని సద్వినియోగం పరచుకోవడం: నేటి పరిస్థితుల్లో ఎక్కువ సమయం ఇంటికే పరిమితమై ఉంటున్నాం. టీవీలో వార్తలు చూస్తూ భయపడిపోతున్నాం. దాని బదులు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులందరు కలిసిమెలసి కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. దీని ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. 4) సేవ: ఈ కఠిన పరిస్థితులలో కూడా నేనేమి సేవ చేయగలనని ఆలోచించాలే తప్ప భయపడుతూ కుంగిపోరాదు. మన చుట్టుపక్కల వారికి మనకు వీలైన సాయం చేయాలి. కొవిడ్‌ ‌బారిన పడ్డవారు తొందరగా కోలుకోవాలని రామరక్షా స్తోత్రం, హనుమాన్‌ ‌చాలీసా ప్రార్ధనలు కూడా చేయొచ్చు. ఇలాంటి నిస్వార్ధ సేవ మనకు ఉన్నతిని కలిగిస్తుందని స్వామి వివేకానంద అంటారు. 5) నిర్భయత్వం: ఇది వీరభూమి. మృత్యువును చూసి భయపడవద్దు. మృత్యువు స్వల్ప విరామం మాత్రమే. ఈ అయిదు విషయాలు పాటిస్తూ విజయం సాధిద్ధాం.

—————–

సహనం, విశ్వాసమే ఆయుధాలు: పూజ్య శంకరాచార్య విజయేంద్ర సరస్వతి (కంచి మఠం పీఠాధిపతి)

కరోనా మహమ్మారి కారణంగా మనం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఏడాది క్రితం ఈ వైరస్‌ ‌భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో మన సమాజంలోని ప్రజలందరి కృషి, సహకారం ద్వారా సంక్షోభాన్ని అధిగమించాం. ఇప్పుడు అదే సంక్షోభం మళ్లీ అలుముకుంది. ఈసారి కూడా మన సమాజంలోని ప్రతిఒక్కరూ ఐక్యంగా మహమ్మారిపై పోరాటం చేయాలి. ప్రస్తుత సవాలును అధిగమించడానికి రెండు రకాల ప్రయత్నాలు అవసరం. ఒకటి ప్రార్థన, సదాచారం. రెండవది అస్వస్థతను నయం చేసుకునేందుకు  వైద్య చికిత్స కోసం వెళ్లడం. అంతేకాదు, సహనం, విశ్వాసం కూడా అవసరం. ఈ రెండు ఉంటే ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోవచ్చు.

——————–

విమర్శలకు సరైన సమయం కాదు: సద్గురు జగ్గీవాసుదేవ్‌

‌భయం, నిరాశ, క్రోధం వీటిలో ఏదీ మనకు ఉపయోగపడే లక్షణం కాదు. ఒకరిపై ఒకరు నిందించుకోవడానికి ఇది సమయం కాదు. ఇప్పుడు మనమంతా ఐక్యంగా నిలబడాల్సిన సమయం. సమస్య ఎదుర్కొంటున్న బాధితులను స్వాంతన పరుస్తూ వారిని జాగ్రత్తగా ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్య నుండి దూరంగా వెళ్లడం పరిష్కారం కాదు. భారతీయ సాంస్కృతిక మూలాల్లోకి సమాజం మరొకసారి వెళాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. భారతదేశం సరైన మార్గదర్శనం చేయగలదని ఎంతో ఆశగా ప్రపంచం మన వైపు చూస్తుంది.

——————–

సానుకూల ఆలోచనలనే పంచుకుందాం: పద్మవిభూషణ్‌ ‌సోనాల్‌ ‌మాన్‌సింగ్‌ (‌ప్రముఖ కళాకారిణి)

ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అనంతమైన ఆశ, సానుకూల వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఎవరూ నిరాశకు లోనుకారు. మనమందరం ఈ యుద్ధంలో పోరాడుతున్నాం. కచ్చితంగా విజయం లభిస్తుంది. అయితే కోపం, నిరాశ, ఒత్తిడులకు దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలను పంచుకోవాలి. సమాజంలో సామూహిక స్థాయిలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఇతరులకు మద్దతునిద్దాం.

———————

By editor

Twitter
Instagram