ధర్మం కోసం ప్రాణత్యాగం

తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్‌బహదూర్‌ ‌వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. తేగ్‌బహదూర్‌ ‌వైశాఖ కృష్ణ పంచమి (పూర్ణిమాంతం) నాడు అమృత్‌సర్‌లో జన్మించారు. తండ్రి పేరు గురుహర గోవింద్‌, ‌తల్లి నానకీ. మొగలుల పాలనకు వ్యతిరేకంగా పోరాడినవారిలో తేగ్‌బహదూర్‌ ‌ప్రముఖులు. ఆయన వ్యక్తిత్వం సాధన, తపస్సు, త్యాగాలకు ప్రతీకగా నిలిస్తే.. ఆయన కర్తృత్వం శారీరక, మానసిక శౌర్యానికి గుర్తుగా నిలుస్తుంది.


నకారాత్మక ఆలోచనలు అదుపు చేయగలిగితేనే ధర్మమార్గంలో పయనించగలుగుతారు. నింద-స్తుతి, లోభం-మొహం వంటి వాటికి ఎవరైతే లొంగి పోతారో వారు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటారు. సాధారణ వ్యక్తులు కష్టసుఖాలకు విచలితులవుతారు. కానీ యోగులు, సిద్ధపురుషులు వీటికి అతీతులు. ఈ విషయాన్నే గురు తేగ్‌బహదూర్‌ ఇలా చెప్పారు ‘ఊసతతి నిందిఆ నాహి జిహి కంచన్‌ ‌లోహ్‌ ‌సమాని -సుఖు దుఖు జిహ్‌ ‌పరసై నహీ లోభు మోహు అభిమాను’ (శ్లోకం: మొహలా 9వ భాగం 1426).

ఎలాంటి చింత, భయం లేకుండా ధర్మమార్గంలో పయనించే సమాజాన్ని నిర్మించాలని గురు తేగ్‌బహదూర్‌ ‌భావించారు. ఆయన సమాజంలో సంస్కారాన్ని, విలువలను పెంపొందించారు. ధర్మం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారు. విపత్కర పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన చేసిన పనుల వల్ల దేశ ప్రజల్లో ధైర్యం పెరిగింది. బ్రజ భాషలో ఆయన ఇచ్చిన సందేశం భారతీయ సంస్కృతి, తత్వచింతన, ఆధ్యాత్మికతల మేలు కలయిక.

గురు తేగ్‌బహదూర్‌ ‌నివసించిన ఆనందపూర్‌ ‌సాహిబ్‌ ‌మొగలుల అన్యాయానికి, అత్యాచారాలకు ఎదురొడ్డి నిలిచింది. భారత్‌ను పూర్తి ఇస్లామీకరణ దేశంగా మార్చాలని ఔరంగజేబ్‌ ‌భావించాడు. బౌద్ధ మతానికి, ఆధ్యాత్మికతకు కేంద్రమైన కశ్మీర్‌పై దృష్టి సారించాడు. మొగలుల అకృత్యాలను భరించలేక కశ్మీరీలు గురు తేగ్‌బహదూర్‌కు తమ గోడు చెప్పుకున్నారు. వారు చెప్పింది విన్న తరువాత ఆయన ఆలోచనలో పడ్డారు. కశ్మీర్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దేశం పూర్తిగా ఇస్లామీకరణ చెందకుండా నివారించాలంటే మార్గం ఏమిటి? అని ఆలోచించారు. అందుకు ఒక్కటే మార్గమని భావించారు. ఎవరో ఒక మహాపురుషుడు దేశం కోసం, ధర్మం కోసం ఆత్మబలిదానం చేయాలి. అలాంటి బలిదానం వల్ల కలిగే ప్రజాచైతన్యం వల్ల మొగలులు భయపడతారు. కానీ అలా బలిదానం ఎవరు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానంగా ‘ఈ సమయంలో మీకంటే మహాపురుషుడు ఎవరున్నారు?’ అని తేగ్‌బహదూర్‌ ‌పుత్రుడైన  గోవింద్‌రాయ్‌ (‌పదవ గురువు గురు గోవింద్‌సింగ్‌) అన్నారు.

ఔరంగజేబ్‌ ‌సైన్యం గురు తేగ్‌బహదూర్‌తో పాటు మరో ముగ్గురిని బంధించింది. అందరినీ ఢిల్లీ తీసుకువచ్చారు. అక్కడ వారిని అనేక చిత్రహింసలకు గురిచేశారు. ఇస్లాం స్వీకరించాలని భయపెట్టారు, బెదిరించారు. నానా యాతనలకు గురిచేశారు. మత గురువును చేస్తామని, భోగభాగ్యాలకు లోటుండదని ఆశపెట్టారు. అయినా గురు తేగ్‌బహదూర్‌తో పాటు తన ముగ్గురు శిష్యులు ధర్మాన్ని వీడలేదు.

ఢిల్లీ చాందినీచౌక్‌ ‌వద్ద తేగ్‌బహదూర్‌ ఎదురు గానే తన శిష్యుడు భాయి మతిదాస్‌ను రంపంతో నిలువునా చీల్చారు. మరొక శిష్యుడు భాయి దయాల్‌ను సలసల కాగే నూనెలో వేశారు. భాయి సతిదాస్‌ను పత్తిలో మూటకట్టి నిప్పుపెట్టారు. ఈ క్రూర, అమానుష చర్యలు చూసి తేగ్‌ ‌బహదూర్‌ ‌భయపడతారని వాళ్లు అనుకున్నారు. కానీ ఆయన ఏమ్రాతం చలించలేదు. తాను నమ్మిన ధర్మంకోసం ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడలేదు. తేగ్‌బహదూర్‌ ఆత్మబలిదానంతో దేశమంతటా చైతన్యం వచ్చింది. పదవ గురువు గురుగోవింద్‌సింగ్‌ ‌తన తండ్రి బలి దానాన్ని గురించి ఇలా అన్నారు, ‘తిలక్‌ ‌జంజూ రాఖా ప్రభ తాకా కీనో బఢో కలూ మహి సాకా సాధని హోతి ఇతి జిని కరీ సీస్‌ ‌ది ఆ పర్‌ ‌సీ న ఉచరీ’.

గురు తేగ్‌బహదూర్‌ ‌జయంతి (మే 1, 2021) వేడుకలు మనం ఘనంగా జరుపుకున్నాం. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. గురు తేగ్‌బహదూర్‌ ‌మనకు త్యాగం, సంయమనాలను బోధించారు. సృజన, సమరసత, మానసిక వికారాలపై విజయం సాధించడం కోసం సాధన చేయాలని ఉపదేశించారు.

తేగ్‌బహదూర్‌ ‌ప్రభావం ఎంతటిదంటే ఢిల్లీకి వెళ్లుతున్నప్పుడు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల ఆయనను అనుసరించారు, ఆయన బోధలను విన్నారు. ఈ రోజుకీ ఆ గ్రామాల్లో పొగాకు వంటి మాదక పదార్థాల పంటలను వారు పండించరు.

నేడు ప్రపంచంలో మతఛాందసవాదం, తీవ్రవాదం పెచ్చుమీరుతున్నాయి. గురు తేగ్‌బహదూర్‌ ‌త్యాగం, శౌర్యం, బలిదానపు మార్గం మనకు చూపారు. మానవజాతి పరివర్తన శీలమైన నూతన శకంలోకి ప్రవేశిస్తున్నది. ఈ సమయంలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. అదే ఆయనకు మనం ఇచ్చే గౌరవం.

– దత్తాత్రేయ హోసబలే, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌సర్‌ ‌కార్యవాహ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram