అక్షయం అంటే క్షయం లేనిదని అర్థం. వైశాఖ శుక్లతదియ ‘అక్షయ తదియ’ గా ప్రసిద్ధమైంది. విశేష శుభఫలితాలను ఇచ్చేతిథిగా చెబుతారు. నిండు మనసుతో చేపట్టే కార్యాలు అక్షయం కావాలన్నదే దీని పరమార్థం. అమిత ఫలదాయినిగా చెప్పే ఈ వ్రతానికి లక్ష్మీనాథుడు అధినాయకుడు. ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు, పూజాదికాలు, దానధర్మాలు, పితృతర్పణాలు విశేష ఫలితాల నిస్తాయని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లు మత్స్య పురాణం చెబుతోంది.

అక్షయ తదియనాడు చేసే దానధర్మాలు అత్యధికఫలితాలను ఇస్తాయని నారదపురాణమూ చెప్తుంది. మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయమాడిన రోజు కూడా ఇదేనట. అందుకే జనం తమ తమ స్థోమతను బట్టి బంగారం లేదా వెండి కొనుగోలు చేసి అమ్మవారికి అలంకరించి పూజలు చేస్తారు. అలా చేయలేనివారు లవణంతో సహా నిత్యావసర వస్తువులు ఏది కొనుగోలు చేసినా శుభమనే పెద్దలు చెబుతారు. దీనివల్ల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఈ రోజున ఉపవాసంతో లక్ష్మీ నారాయణులను, గౌరీమహేశ్వరులను అర్చించి అక్షతలతో హోమం, అక్షతల దానంతో సకల పాపవిముక్తులవుతారని, చేసిన దానం అక్షయంగా మారి సత్ఫలితాలనిస్తుందని శాస్త్రవచనం.

తరిగిన కొద్దీ పెరిగే సంపద

 జనశ్రుతిలో ఉన్న కథ ప్రకారం, పేదరికంలో ఉన్న ధర్మనాముడు అనే వైశ్యుడు పేదవాడు. కానీ తనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసేవాడు. కొంతకాలానికి కాలం చేసిన ఆయన ధనవంతుడైన క్షత్రియుడిగా జన్మించాడు. చిన్నతనంనుంచే ఆయన నిత్యాన్నదానం చేయసాగాడు. ఇలా ఎందుకు చేస్తున్నా వంటూ పలువురు అడిగితే, ఆయన గత జన్మ సంస్కారం ఇది, క్రితం జన్మలో చేసిన దానం వల్ల నేను స్థితిమంతుడుగా పుట్టాను. కనుక ఇప్పుడూ ఈ దానాలు చేస్తున్నాను. భగవంతుడిచ్చిన సంపదనంతా వ్యయం చేసిన కొద్దీ అది ‘అక్షయం’ అవుతుంది అన్నాడట. అందుకే ఈరోజున దానం అక్షయఫలాల నిస్తుందంటారు.

అక్షయ తృతీయ విశిష్టత

వైశాఖ శుద్ధ తదియకు ప్రతి యుగంలోనూ విశిష్టత ఉంది. కృతయుగంలో ప్రహ్లాదవరదుడు శ్రీహరి, వరహానృసింహాస్వామి రూపంలో పురూరవ చక్రవర్తికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, ఏటా చందన యాత్ర జరిపించుకుంటున్నది ఈ తిథి నాడే. త్రేతాయుగ ఆరంభం, పరశురాముని జననం, భగీరథుడు దివి గంగను భువికి తీసుకుని రావడం, ద్వాపరయుగంలో బలరాముని జననం, ద్రౌపదీ మానసంరక్షణకు శ్రీకృష్ణుడు వలువులు ప్రదానం చేసినది, పిడికెడు అటుకుల నివేదనతో బాల్య స్నేహితుడు కుచేలుడికి అనంత ఐశ్వర్యం అనుగ్రహించినది, వనవాస దీక్షలోని పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్రను ప్రసాదించినది ఈ రోజునే. నరనారాయణులు, హయగ్రీవ భగవానుడు ఈ తిథినాడే ఆవిర్భవించారు. శివయ్య వాహనం నంది జన్మించినది ఈ తిథి నాడే కావడంతో ‘బసవ జయంతి’ ని జరుపుకుంటారు. ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రం బదరీనాథ్‌ ఆలయాన్ని చలికాలం తరవాత ఈ తిథినాడే తిరిగి తెరుస్తారు. అక్షయతృతీయ నాడే కొన్ని ప్రాంతాలలో శ్రీకృష్ణునికి చందనలేపనం, గౌరీదేవికి డోలోత్సవం నిర్వహించే సంప్రదాయం ఉంది. ద్వైత సంప్రదాయవాదులు (మధ్వులు) ఈ తిథినాడు యతుల బృందావనాలకు గంధలేపనం చేస్తారు.

సామాజిక పర్వదినం

అక్షయతదియ సామాజిక పర్వదినం. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో పెళ్లి కాని యువతులతో బొమ్మల పెళ్లిళ్లు చేయించే సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనివల్ల యోగ్యుడు భర్తగా లభిస్తాడని విశ్వాసం. ఈ తిథినాడు వ్యవసాయపనులు ప్రారంభించడం, భూముల కొనుగోళ్లు, భవనాలు, సంస్థలను వంటి వాటిని ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పండుగ పరోపకారానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎండలు ముదిరే వైశాఖంలో బాటసారుల దప్పిక తీర్చే పుణ్యకార్యం అక్షయ తృతీయ నాడే ప్రారంభించడం ఆనవాయితీ. వైశాఖ మాసంలో నీటితో నిండిన కుండ, మజ్జిగ, గొడుగు, విస్సన్నకర్ర, పాదరక్షలు మొదలైనవి దానంగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల దానగ్రహీతలైన వారు ఎండ, వాన లాంటి వాటి నుంచి ఉపశమనం పొందుతారు. ఇలాంటి సంప్రదాయాలలో సామాజిక స్పృహ కనిపిస్తుంది.

About Author

By editor

Twitter
Instagram