కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు ముందుగా భయాన్ని వీడాలి. మనోధైర్యమే ఈ మహమ్మారికి అసలు మందు అనే విషయం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలంటున్నారు, డాక్టర్‌ ‌వేదప్రకాశ్‌.

‌కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో డాక్టర్‌ ‌వేదప్రకాశ్‌తో జాగృతి ముఖాముఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికివారే సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌విధించుకోవాలని, అత్యవసరమైతే తప్ప  బయటకు రావొద్దని కోరారు.

డాక్టర్‌ ‌వేదప్రకాశ్‌ ‌గోల్కొండ భాగ్‌ ‌సంఘచాలక్‌గా ఉన్నారు. సక్షమ్‌ ‌సంస్థకు తెలంగాణ ప్రాంత అధ్యక్షులు…


మనదేశంలో కరోనా రెండో దశ విజృంభణకు ప్రజల నిర్లక్ష్యమే కారణమా? గతానికి, ఇప్పటికి ప్రజల్లో కరోనా పట్ల భయం తగ్గిపోవడానికి గల కారణం ఏమిటి?

ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా.. కొంతమంది అవసరం లేకపోయినా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇష్టారీతిగా రోడ్లపైన తిరుగుతున్నారు. సినిమాలు, షికార్లకు కూడా వెళుతున్నారు. కరోనా వచ్చినా రెండు వారాలు ఇంట్లో ఉంటే అదే తగ్గిపోతుందనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. ప్రజల నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక కారణమే. ఇలాంటి చర్యల వల్ల వారితో పాటు వారి కుటుంబానికి, సమాజానికి కూడా హాని చేస్తున్నారు. అయితే ఇందులో ప్రభుత్వాల నిర్లక్ష్యమూ కొంత ఉంది. కరోనా రెండో దశ తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయామని ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వినిపించింది. మరొకవైపు కొవిడ్‌ ‌నిబంధనల అమలు విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కరవైంది. దీనివల్ల వైరస్‌ ‌మరింత వ్యాప్తి చెందిందని చెప్పవచ్చు. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కొనే బాధ్యత ప్రతిఒక్కరిదీ. ఎవరో ఒకరినే మనం తప్పు పట్టలేం.

మహమ్మారి నివారణలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలకు లాక్‌డౌన్‌ ‌విధించే ఆలోచన లేదు. కాబట్టి ఎవరికివారే సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌విధించుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఒకవేళ బయటకు వచ్చినా మాస్క్‌ధారణ, భౌతికదూరం తప్పక పాటించాలి. ప్రతి అరగంటకు ఒకసారి చేతులు శభ్రం చేసుకోవాలి. స్వయంఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారు, ఉద్యోగులు కొవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వర్తించుకోవాలి.

కరోనా కట్టడిలో ప్రభుత్వాల చర్యలు ఎలా ఉన్నాయి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయనే చెప్పాలి. అయితే ఇంతకముందు చెప్పినట్టే రెండో దశ కరోనా విజృంభణను అంచనా వేయడంలో కాస్త ఆలస్యం జరిగిందని మాత్రం చెప్పాలి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని కొందరు నిపుణులు సూచిస్తున్నప్పటికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపడంలేదు. ఎందుకంటే మొదటి దశ లాక్‌డౌన్‌తో ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతిన్నది. ఆదాయ వనరులు పూర్తిగా తగ్గి పోయాయి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం. కాబట్టి లాక్‌డౌన్‌ ‌విధించకుండానే నైట్‌ ‌కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లవంటి చర్యలతో కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. మరొకవైపు వ్యాక్సిన్‌ ‌పంపిణీ కార్యక్రమం దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలవుతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సినేషన్‌ ఇవ్వను న్నారు. అయితే ఇది దీర్ఘకాలం కొనసాగే పక్రియ. రెండు లేదా మూడు నెలల్లో అయిపోయేది కాదు.

కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ఒక్కటే పరిష్కారమా?

ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానం దృష్ట్యా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే పరిష్కారం. కరోనాను ఎదుర్కోవాలంటే శరీరానికి రోగనిరోధకశక్తి అవసరం అనే విషయం తెలిసిందే. రోగనిరోధకశక్తిని మనం స్వతహాగా పెంపొందించుకోవడం కష్టం. అది వ్యాక్సిన్‌ ‌ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వ్యాక్సిన్‌ ‌తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి వేగంగా పెరుగు తుంది. దేశవ్యాప్తంగా మన జనాభాలో డెభ్బై శాతం మందికి వ్యాక్సినేషన్‌ ‌పక్రియ పూర్తయితే సామూహిక రోగనిరోధకశక్తి (హార్డ్ ఇమ్యూనిటీ) ఏర్పడుతుంది. అంటే వైరస్‌ ఒకరి నుండి మరొకరికి సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్‌ ‌తీసుకోగానే ఇక తమకు కరోనా రాదనే భావన సరికాదు. వ్యాక్సిన్‌ ‌తీసుకున్నప్పటికీ కొవిడ్‌ ‌నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నిర్లక్ష్యం పనికిరాదు.

ఆసుపత్రుల్లో పడకల కొరతకు కారణాలేమిటి?

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు చాలా భయపడిపోతున్నారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటేనే తమ ప్రాణాలు దక్కుతాయని కొంతమంది భావిస్తున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆసుపత్రుల్లో పడకల కొరత ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ముందుగా భయాన్ని పోగొట్టాలి. కరోనా పట్ల వారిలో అవగాహన కల్పిస్తూ మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఐసోలేషన్‌ ‌కేంద్రాలు ఏర్పాటుచేయాలి. లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలతో బాధపడేవారు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకునేలా వారికి అన్నివిధాలుగా సహకరించాలి. వారిపై నిరంతర పర్యవేక్షణ కూడా అవసరం. హోం ఐసోలేషన్‌లో ఉండి ఏ విధంగా చికిత్స తీసుకోవాలో ఐసీఎంఆర్‌ ‌రూపొందించిన మార్గదర్శకాలను ప్రతిఒక్కరికి తెలియజేయాలి. సేవాభారతి స్వచ్ఛంద సంస్థ తమ హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌ 040-48213100 ‌ద్వారా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి వైద్య సహాయం అందిస్తోంది. ఇంకా అనేక సంస్థలు కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాయి. ఇటువంటి సంస్థల గురించి ప్రభుత్వాలు కూడా ప్రచారం చేయాలి. ఈ చర్యల ద్వారా కొంతవరకు ఆసుపత్రుల్లో బెడ్ల కొరతను ఎదుర్కోవచ్చు. దీంతో ఇతర దీర్ఘకాల రోగాలుండి కరోనాతో బాధపడుతున్న వారు ఆసుపత్రుల్లో చేరి తమ ప్రాణాలు రక్షించుకోవచ్చు.

ప్రస్తుతం మనదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆక్సిజన్‌ ‌కొరత. ఈ పరిస్థితిని ఎలా అధిగమించవచ్చు?

మనదేశంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం విషయంలో ఎటువంటి సమస్య లేదు. కానీ ఆక్సిజన్‌ ‌సరఫరా, నిల్వ చేసుకునే విషయంలోనే సమస్య ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ ఉత్పత్తిచేసే ప్లాంట్‌లు చాలానే ఉన్నాయి. దానిని పరిశ్రమల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అయితే మెడికల్‌ అవసరాల కోసం ఈ స్థాయిలో ఆక్సిజన్‌ అవసరం ఏర్పడుతుందని ఎవరు ఊహించలేదు. కాబట్టి ఆక్సిజన్‌ ‌సరఫరా, రవాణా వంటి విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కానీ ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్రం అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ ‌నిల్వలన్నీ పారిశ్రామిక అవసరాలకు కాకుండా వైద్య అవసరాలకే వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. ఆయా రాష్ట్రాలకు యుద్ధవిమానాల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. విదేశాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని దేశాలు ఉచితంగానే ఆక్సిజన్‌ ‌సరఫరాకు ముందుకు వచ్చాయి. మరొకవైపు కొందరు దళారులు ఇదే అదనుగా ఆక్సిజన్‌ను, రెమిడిసివిర్‌ ఇం‌జక్షన్లను బ్లాక్‌ ‌మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లుగా వార్తలు చూస్తున్నా. ఇది అత్యంత బాధాకరం. ఇటువంటి వారిని పట్టుకొని కఠిన శిక్షలు విధించాలి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు కాసులపై కక్కుర్తితో కొవిడ్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తూ రోగుల నుంచి ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీనిని ఎలా చూడాలి?

కరోనా మనకు అనేక పాఠాలు నేర్పుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కొందరు ఇతరులకు సేవ చేసేందుకు పెద్దమనసుతో ముందుకొస్తున్నారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలకు తెగించి మరి కరోనాతో పోరాడుతున్నారు. కానీ మరొకవైపు కొందరు కరోనా పేరుతో అక్రమ దందాలకు పాల్పడుతూ ప్రజల్ని వేధిస్తున్నారు. అంటే కరోనా వైరస్‌ ‌మనిషిలోని మంచిలక్షణాలతో పాటు, అవలక్షణాలను కూడా బయటపెడుతోందన్న మాట. కాబట్టి మనిషిలో వ్యక్తిత్వ నిర్మాణం జరగనంత వరకు ఎన్ని చట్టాలు వచ్చినా అదే స్థాయిలో ఉల్లంఘనలు కూడా జరుగుతాయి. కాబట్టి ముందు వ్యక్తి ఆలోచన తీరు, మనస్తత్వం మారాలి. ప్రస్తుత పరిస్థితిలో ప్రతిఒక్కరూ ఎంతో బాధ్యతతో నడుచుకోవాలి. కుదిరితే ఇతరులకు మంచి చేయాలి. అంతేకానీ తమ స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం సరికాదు. ఈ విపత్కర సమయంలో ఎందరికో అండగా నిలుస్తున్న పలు సామాజిక సేవాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల స్ఫూర్తితో కరోనా నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.

ఇంటర్వ్యూ: కోరుట్ల హరీష్‌

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram