‌వందేళ్ల ఖిలాఫత్‌ ఉద్యమం-9

మన మనోస్థితికి కవిత్వం అద్దం పడుతూ ఉంటుంది. మనలోని ఆలోచనలు, ఆవేదనలు, ఆకాంక్షలు కవిత్వం రూపంలో బయటకు వస్తుంటాయి. ప్రజల సామూహిక చైతన్యాన్ని ప్రతిబింబించే కవిత్వం వారి మనసులను, ఆత్మలను, ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. బంకించంద్ర చటర్జీ గేయం ‘వందేమాతరం’ (ఆనందమఠం నవలలోనిది) అందుకు చక్కటి ఉదాహరణ. మనం నివశిస్తున్న ఈ దేశం ఒక భూభాగం మాత్రమే కాదని, బిడ్డలుగా ఆమెను ఆరాధించి, కొలిచే క్షేత్రమని మనకు గుర్తుచేసి, ఆ దిశగా మనలను ఆమె సేవలో తరింప చేయటానికి ఉత్తేజపరుస్తుంది. అరవిందులు వందేమాతరం గీతం గురించి చెప్తూ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఒక్కసారి దివ్యమాతగా ఆమె స్వరూపం ప్రజల ముందు సాక్షాత్కరిస్తే, ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు చేసి, బలిదానం సమర్పించేవరకు విశ్రాంతి ఉండదు. ప్రశాంతత ఉండదు. దీర్ఘనిద్ర ఉండదు. సంకెళ్లు తొలగించి స్వేచ్ఛను పునః ప్రతిష్టచేసే వరకు నిద్రాహారాలు ఉండవు’(Rishi Bankinm Chandra, Collected Works of Sri Aurbindo, April 1907 ).

అయితే కొందరి ప్రజలకు వారు నివశిస్తున్న దేశంపట్ల వేరొక రకమైన దృష్టికూడా ఉండవచ్చు. వారి ఉద్దేశంలో ఒక భూభాగాన్ని మాతృదేవతగా భావించటం తప్పుగా తోచవచ్చు. వారి ఉద్దేశంలో ఆ భూభాగానికి దివ్యత్వాన్ని ఆపాదించి, ఆరాధించటం మతద్రోహం కూడా. మహమ్మద్‌ ఇక్బాల్‌ ‌తరానాహ్‌- ఇ-‌హింది (హిందూస్థాన్‌ ‌ప్రజల గీతం)లో తాము నివశిస్తున్న దేశం గురించి తన దృష్టికోణాన్ని ఇలా చెప్పుకున్నాడు, ‘హమ్‌ ‌బుల్‌ ‌బుల్‌నే హా ఇన్‌కీ, ఇస్‌ ‌గుల్‌స్థాన్‌ ‌హమారా’ (మేము దాని నైటేంగెల్‌ ‌పక్షులం. అది మా నివాసమైన తోట). పక్షులు ఒకతోటలో ఫలపుష్పాలను ఆస్వాదిస్తూ విహరిస్తాయి. ఆ తోటలోనే అవి శాశ్వతంగా ఉండవు. ఆ తోట ఎండిపోతే, వేరే తోటలో వాల్తాయి.

1920 వేసవికాలం నాటికి తన ఉద్యమ అంతిమరూపు రేఖలు ఎలా ఉండబోతున్నాయో ఖిలాఫత్‌ ‌వాదులు తేల్చుకోలేకపొయారు. 1920 మే నుండి నవంబరు వరకు 60 వేల మంది ముస్లింలు బుల్‌ ‌బుల్‌ ‌పక్షల వలె అఫ్ఘాన్‌ ‌దేశానికి వలస వెళ్లిపోయారు. లేదా హిజ్రత్‌ ‌చేశారు. ఎందుకంటే వారు అంతవరకూ నివశిస్తున్న భారత దేశం అవిశ్వాసుల అపనమ్మకాలతో అపవిత్రం అయింది. ఇంత పెద్ద ఎత్తున వలస వెళ్లటానికి కచ్చింగా వారి మత గ్రంథాలలో చెప్పిన విషయాలే కారణం అయిఉండవచ్చు.

ఇస్లామిక్‌ ‌గ్రంథాలలో హిజ్రత్‌

‌తమ విశ్వాసాలకు అనుగుణంగా బతకలేనప్పుడు విశ్వాసాలను అనుసరించి బతక గల్గిన ప్రాంతానికి వలస వెళ్లమని ఖురాన్‌ ఆదేశిస్తుంది. అపనమ్మకంతో బతకటం కంటె నమ్మకంతో బతకటమే మేలని చెబుతుంది. అల్లా కోసం ఎవరైతే వలస వెళతారో వారికి అల్లా సకల సౌకర్యాలను పుష్కలంగా ఈ భూమి మీద లభించేటట్లు చూస్తాడని, ఎవరైతే తన ఇంటిని కోల్పోయి, అల్లా మీద ఆయన దూత మీద నమ్మకంతో వెళతారో, వారిని చావు కూడా ఏమీ చేయలేదని, అల్లా తగిన బహుమతిని వారికి ఇస్తాడని ఖురాన్‌ ‌హామీ ఇస్తుంది (4.100).

ప్రవక్త హిజ్రత్‌ను ప్రోత్సాహించాడు. వాస్తవానికి ఆయన కూడా మక్కా నుండి మదీనాకు హిజ్రత్‌ ‌చేశాడు. మహమ్మద్‌ ‌తన అనుచరులను అబిస్సీనియా వెళ్లమని ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే అది ఒక మిత్రదేశమని, ఆ దేశ రాజు అన్యాయాన్ని సహించడని, పరిస్థితులు చక్కబడి, అల్లా వారి కష్టాలు తీర్చేవరకు ఆదేశంలో తలదాచుకొమ్మని ఆయన బోధనలు ప్రారంభించిన తొలి సంవత్సరాలలో అనుచరులకు ఉద్బోధించాడు. ముస్లిమేతర ఖురేషి చేతులలో తన అనుచరులు ఇబ్బందులు పడుతున్న కాలం అది. 622 సంవత్సరం సెప్టెంబర్‌లో తనకు సాయం చేసేవారు మక్కాలో కరవైపోగా, మక్కా నుండి మదీనాకు ఆయన వలస వెళ్లాడు. హిజ్రత్‌ అం‌టే పిరికి పందలు మాదిరిగా వలసవెళ్లటం కాదు. ఇతర ప్రాంతాలకు వెళ్లి, యుద్ధసన్నాహాలు చేసుకొని, అవిశ్వాసుల భూభాగంపై సమయం చూసి దాడిచేసి, దాన్ని ఇస్లాం ఏలుబడిలోకి తీసుకొని రావటం. హిజ్రత్‌, ‌జిహాద్‌ ‌వేరు వేరుకాదు. ప్రతీకారంతో జిహాద్‌ ‌చేయటానికి కావలసిన సైనిక బలాన్ని, ఆయుధాలను, సమీకరించుకోవటమే హిజ్రత్‌.

‌తమ మాతృభూమిని దివ్యమాతగా ఆరాధించే వారికి, తాము ఉన్నగడ్డను తమ విశ్వాసం ఆధారంగా అది నివసించటానికి యోగ్యమైనదా? కాదా? అని తర్జనభర్జన చేసేవారికి మధ్య హస్తిమసకాంతర ఉంటుంది. వారివి వేరు వేరు ప్రపంచాలు. ఈ తేడా తెలియని వారు 1920లో మనదేశం నుండి జరిగిన హిజ్రత్‌ను అర్థంచేసుకోలేరు.

దార్‌-ఉల్‌-‌హర్బ్‌గా భారతదేశం?

షావలీ ఉల్లాహ్‌ 1803 ‌తర్వాత ఒక ఫత్వాను జారీ చేసాడు. భారతదేశంలో ‘ఇమామ్‌- ఉల్‌-‌ముస్లిమన్‌’ ఉత్తర్వుల ప్రకారం పరిపాలన సాగడం లేదని, క్రైస్తవుల చేతులలోకి వెళ్లిపోయింద నేది ఆ ఫత్వా సారాంశం. ఆయన శిష్యుడు, అల్లుడు అబ్దుల్‌ అజీజ్‌ ‌మరింత వివరమైన ఫత్వాను జారీచేశాడు. ‘భారతదేశం శత్రువుల దేశంగా’ మారిందని ‘మన పవిత్ర చట్టాలకు’ సంబంధం లేని పరిపాలన ఉందని తెలియచెప్పాడు. ఆసక్తికరమైన విషయమేమంటే ఆయన ఈస్టిండియా కంపెనీ సేవలోనే తరించాడు (The Khilafat Movement in India, 1919-24, Qureshi, p.118; Shah Abdul Aziz: His Life and Time Mushiral Haque, Instiute of Islamic Culture, 1995, pp. 24-26).

ఏ దేశంలో ఇస్లామిక్‌చట్టాలు అమలులో లేవో ఆ దేశాన్ని, లేక ప్రాంతాన్ని దార్‌-అల్‌-‌హర్బ్‌గా పేర్కొనటం ఇస్లామిక్‌ ‌సంప్రదాయంలో ఉంది. ఒక దేశం దార్‌-అల్‌-‌హర్బ్‌గా మారినప్పుడు, ఆ దేశపు ముస్లింలు ఒక దార్‌-ఉల్‌- ఇస్లామ్‌కు వలసవెళ్లి, ప్రస్తుతం దార్‌-అల్‌-‌హర్బ్ (ఇస్లామ్‌ ‌వ్యతిరేకదేశం)గా ఉన్న దేశం అంటే ఒకప్పుడు దార్‌-ఉల్‌-ఇస్లామ్‌ (ఇస్లామిక్‌ ‌దేశం) ఉన్న దేశాన్ని తిరిగి జయించి తమ అధీనంలోకి తెచ్చుకొని దానిని ఇస్లామిక్‌ ‌దేశంగా మార్చాలి. 622లొ మహమ్మద్‌ ‌ప్రవక్త మదీనాకు హిజ్రత్‌ ‌చేసి 8 సంవత్సరాల తర్వాత గెలిచి, విజేతగా నిలిచాడు. 1920లో భారతదేశం నుండి అఫ్ఘాన్‌కు హిజ్రత్‌ ‌చేసిన వారి అంతిమ లక్ష్యం కూడా ఇదే.

ఆంగ్ల పాలకులు టర్కీ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేశారు. దానితో ఖిలాఫత్‌ ‌మనుగడే ప్రశ్నార్థక మయింది. కాబట్టి, వారి ఏలుబడిలో ఉన్న భారత దేశం ఇప్పుడు వారికి అపవిత్రమై పోయింది. నివాసయోగ్యం కానిదైంది. ఈ భావన ప్రతిపాదకు లలో ముఖ్యులు ఆలీ సోదరులు. ఏప్రిల్‌ 24, 1919‌న వైస్రాయి ఛెమ్స్‌ఫర్డ్‌కు రాసిన ఒక లేఖలో వారు ఇలా రాసారు. ‘ప్రస్తుతం ఉన్న దేశం నివాస యోగ్యం కానప్పుడు, ఒక ముస్లిం మరొక స్వతంత్య్ర దేశానికి వలస వెళ్లి, ఇస్లాంకు తగిన రక్షణ భద్రత తిరిగి ఏర్పడిన తర్వాత తిరిగి రావాలి. ప్రస్తుతం మేమున్న బలహీన పరిస్థితులలో, వలసవెళ్లటం తప్ప మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. (Qureshi, ibid, pp.199-120)

అఫ్ఘాన్‌ అమీర్‌ ‌ప్రకటన

టర్కీ, అరేబియా, పర్షియా దేశాలు అన్నీ పాశ్చాత్య క్రైస్తవుల అధీనంలోకి వచ్చాయి. అఫ్ఘానిస్తాన్‌ ‌దార్‌-అల్‌-ఇస్లామ్‌గా మిగిలిన ఏకైక దేశం. ఒట్టొమాన్‌ ‌సామ్రాజ్యం విచ్ఛిన్నం తర్వాత ముస్లిం ప్రపంచంలో ఏర్పడ్డ నాయకత్వ శూన్యాన్ని భర్తీ చెయ్యటానికి అఫ్ఘానిస్తాన్‌ ‌కుతూహల పడుతున్నది. ఫిబ్రవరి 9, 1920న అఫ్ఘానిస్తాన్‌ అమీర్‌ అమానుల్లా ఒక చారిత్రాత్మక ప్రసంగం చేసాడు. తన జీవితాన్ని ఖిలాఫత్‌ ‌కోసం ధారపోయటానికి సిద్ధంగా ఉన్నానని, భారతదేశం నుండి హిజ్రత్‌ ‌చేసేందుకు వచ్చేవారికి స్వాగతం పలుకుతామని చెప్పాడు. అమీర్‌ ‌ప్రసంగం భారతదేశ ముస్లింలను పులకరింపచేసింది. ఆయన ప్రసంగాన్ని స్వాగతించారు. వారి హర్షారేతికాలకు హద్దులు లేకుండా పోయాయి (The Hijrat of 1920 and Afghanistan, Abdul Ali, Proceedings of Indian History Congress, Vol.43, 1982, pp.726-727).

అఫ్ఘాన్‌ అమీర్‌ అమనుల్లా భారతదేశం నుండి వచ్చేవారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ప్రకటించాడు కూడా. వలస వచ్చేవారికి సౌకకార్యార్థం పెషావర్‌లో కాని ఢాకాలో కాని అనుమతిని బేషరతుగా మంజూరు చేస్తారని, అఫ్ఘాన్‌ ‌గడ్డమీద అడుగుపెట్టగానే తమ దేశ పౌరులుగా చూస్తామని చెప్పాడు.ప్రతివారికి సాగు చేసేందుకు భూములను, ఉండటానికి నివాస ప్రదేశాలను ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తుందని హామీ యిచ్చాడు. పెద్దలకు 5 శేర్లు చొప్పున, పిల్లలకు 3 శేర్లు చొప్పున గోధుమపిండిని ప్రతినెలా యిస్తామని, సాగుకు తక్కావీ రుణాలు మంజూరు చేస్తామని, మూడు సంవత్సరాల పాటు భూమిశిస్తు చెల్లించకుండా రాయితీ ఇస్తామని ప్రకటించారు. విద్యార్హతలు పట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మిగతావారు వారికి నచ్చిన వృత్తివ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు.

మనదేశంలో ఖిలాఫత్‌ ‌వాదులు ఆఫ్గను అమీరు ప్రకటనను స్వాగతించారు. హిజ్రత్‌ను చేపట్టే అంశంలో అఫ్ఘాన్‌ ‌మతపెద్దలలో తర్జనభర్జనలు మొదలయి, అభిప్రాయ భేదాలు పొడసూపాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ నెత్తిన పెట్టుకొనే ‘జాతీయ వాది’ మౌలానా అబుల్‌ ‌కలామ్‌ ‌ఖిలాఫత్‌ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు.

మౌలానా అబుల్‌కలామ్‌ అజాద్‌

అజాద్‌ను ఒక జాతీయ ముస్లింగా కాంగ్రెస్‌ ‌వారు ప్రచారం చేసారు. కాని ఆయన కరుడు గట్టిన ముస్లిం ఛాందసవాది. ఖిలాఫత్‌ ఉద్యమానికి కావలసిన మేధాపరమైన భూమికను తయారు చేసినవాడు అజాద్‌. ‌మతగ్రంథాల ఆధారంగా ఖిలాఫత్‌ ఉద్యమ ఆవశ్యకతను తెలియచేస్తూ ముస్లిం ప్రజానీకానికి అర్థమయ్యేరీతిలో సాహిత్యాన్ని తయారు చేసాడు. ఆయన వ్రాసిన ‘ఖిలాఫత్‌ అం‌శం, ఇస్లామిక్‌ ‌పవిత్ర స్థలాలు ’(Masala – e- Khilafat wa jazirat al-Arab) అనే ఇస్లామిక్‌ ‌సిద్ధాంత గ్రంథం ఖిలాఫత్‌ ఉద్యమ సైద్ధాంతిక భూమికను ఇస్లామిక్‌ ‌గ్రంథాల ఆధారంగా ఆవిష్కరిస్తుంది. మార్చి 25,1920న అజాద్‌ ‌మాట్లాడుతూ భారతీయ ముస్లింలు హిజ్రత్‌ ‌చేసేందుకు అవకాశం లేదని, ఎందుకంటె వారు వెళ్లేందుకు ఏ ముస్లిం దేశమూ లేదని పేర్కొన్నాడు. కాని ఐదు రోజులలో హిజ్రత్‌ ‌చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని ముస్లింలను ప్రేరేపిస్తూ అమృత్‌సర్‌ ‌నుండి వెలువడే ఒక ఉర్దూ పత్రికలో రాసాడు. ‘హిజ్రత్‌ ‌కా ఫత్వా’ పేరుతో ఆ వ్యాసం వెలువడింది. హిజ్రత్‌ ‌చేయదల్చుకొన్న మంచి ముస్లింలు తనను కాని, తనలాగా హిజ్రత్‌ అనుకూల మతపెద్దలను కాని సంప్రదించి, తగిన సూచనలు పొందవచ్చని రాశాడు. ఆయన ఫత్వాలో ఈ విధంగా పేర్కొన్నాడు, ‘షరియత్‌ ‌లోని అన్ని నిబంధనలును, సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేసిన తర్వాత, ముస్లింల ప్రయోజనాలు, రాజకీయ లాభానష్టాలు బేరీజు వేసిన తర్వాత, నేను ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చాను. భారతీయు ముస్లింలకు వలస వెళ్లటం కంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికిప్పుడు వలస వెళ్లటం కుదరనివారు వలసవెళ్లే వారికి తమ తోడ్పాటును అందించాలి.’ భారతదేశంలోనే నివాసం కొనసాగించదల్చుకొన్న వారు ‘ఇస్లామిక్‌ ‌శత్రువు’ (ఆంగ్లపాలకులు, ప్రభుత్వం)కు ఎట్టి సహకారం అందించకూడదు. ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. అలాకాక, సహకారం అందిస్తే, పవిత్ర ఖురాన్‌ ‌ప్రకారం అట్టివారిని సైతం ఇస్లాంకు శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించాడు.

అజాద్‌ ‌లక్ష్యం కానిస్టాంట్‌నోపిల్‌ ‌పరిరక్షణ మాత్రమే కాదు. ఇస్లాంను భారతదేశంలో పరిరక్షించటం కూడా. హిజ్రత్‌ను ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో చేయాలని ఆయన సూచించాడు. వలస వెళుతున్నవారు ఒక ప్రతిజ్ఞ చేసి హిజ్రత్‌కు పూనుకోవాలని చెప్పాడు. కాలక్రమంలో ఎదురైన ఇబ్బందులను, కష్టనష్టాలను గమనించి కూడా ఆయన హిజ్రత్‌కు మద్దతు దారుడిగానే ఉండిపోయాడు(Hijrat : The Flight of the Faithful – A British FIle on the Exodus of Muslim Peasats from North Inida to Afghanistan in 1920, Dietrich Reetz,1995, pp. 35-36).

హిజ్రత్‌ ‌సన్నాహాలు

హిజ్రత్‌కు ఖిలాఫత్‌ ‌కమిటీలు సన్నాహాలు చేసాయి. భారతదేశమంతటా కరపత్రాలు పంచారు. కార్యాలయాలు తెరిచారు. హిజ్రత్‌ ‌చేయటానికి ముందుకు రావసిందిగా మసీదులలో పిలుపును ఇచ్చారు. ఎవరైతే హిజ్రత్‌ ‌చేయటానికి ముందుకు రారో, వారందరూ అవిశ్వాసులు, విగ్రహారాధకులు అవుతారని మౌల్వీలు మసీదు బురుజుల నుండి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసారు. వలస దారుల పాలిట భూతల స్వర్గంగా అఫ్ఘానిస్తాన్‌ను వర్ణిస్తూ కవులు కవిత్వాలు, పద్యాలు వినిపించారు. భారతీయ ముస్లింలకు అఫ్ఘానిస్తాన్‌ ఎ‌ర్ర తివాచీలు పరిచి స్వాగతసత్కారాలు చేయనున్నదని ఊరించారు.

ఉర్దూ పత్రిక ‘జమిందార్‌’ ‌మే 7, 1928న ఒక ప్రకటన చేసింది. 1338 మంది అఫ్ఘానిస్తాన్‌ ‌వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. హిజ్రాశకం 1338వ సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని 1338 మంది మొదటి జట్టుగా అఫ్ఘాన్‌ ‌వెళ్లనున్నారని ప్రకటించింది. దేశంలో హిజ్రత్‌కు ఊపు మొదల యింది. మే 15 నుండి దేశం నుండి వలసలు మొదలయ్యాయి. టర్కీతో సంధి నిబంధనలు ఆనాడే వెల్లడయ్యాయి.

తొలినాళ్లలో హిజ్రత్‌ ‌నెమ్మదిగా సాగింది. అందుకు రెందు కారణాలు. ఖిలాఫత్‌ ‌నాయకత్వం సహాయనిరాకరణ కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేయటంతో తలమునకలైంది. హిజ్రత్‌ ‌వలన ముస్లిం సమాజానికి ఒనగూరే ప్రయోజనాన్ని కొందరు ఖిలాఫత్‌ ‌నాయకులు శంకిస్తున్నారు. వారిలో అజ్మల్‌ ‌ఖాన్‌, ఇక్బాల్‌, ‌జిన్నా వంటివారు ఉన్నారు (Qureshi, ibid, p.126).

మొట్టమొదటి జట్టులో 53 మంది ఉన్నారు. ఖైబరు కనుమను వారు దాటారు. జులై 1920 నాటికి వలసదారులలో 85 శాతం మంది వాయువ్య సరిహద్దు ప్రాంతం నుండి, 10 శాతం పంజాబ్‌ ‌నుండి అడుగుపెట్టారు. మొత్తం మీద ఏభై వేలకు పైగా భారత్‌దేశం నుండి హిజ్రత్‌ ‌చేశారు. వీరిని ముహజిరన్‌లు అని పిలిచేవారు. అఫ్ఘాన్‌ అమీర్‌ ‌హిజ్రత్‌ను నిలిపివేసిన తర్వాత ఇంకొన్ని వేలమంది ఆ దేశంలో అడుగుపెట్టారు. 1920 మే నెల నుండి సెప్టెంబరు నెల మధ్య 50 నుండి 60 వేల మంది ముహజిరన్‌లు అఫ్ఘాన్‌ ‌వలసవెళ్లారు.

ఆంగ్లేయులు ఈ వలసను ప్రోత్సహించలేదు. అలాగని నిరుత్సాహపర్చలేదు. రెండు అంశాలు వారికి కొంచెం ఇబ్బంది కల్గించాయి. వలసదారులు తమ ఇళ్లను, పొలాలను ఒక్కసారిగా అమ్మజూపటంతో ధరలు పడిపొయాయి. హిజ్రత్‌ ‌ప్రభావం సైన్యం మీద, పోలీసుల మీద కూడా పడింది. కొందరు సైనికులు, పోలీసులు సైతం అఫ్ఘాన్‌ ‌బాట పట్టారు. పెద్దసంఖ్యలో ముస్లిం సైనికులు హిజ్రత్‌ ‌చేసారు.

అంతర్జాతీయ ఇస్లామిక్‌ ‌భావన (Pan Islamism) డొల్లతనం

వలసదారులు కాలినడకన కొండ కనుమల గుండా మండువేసవిలో హిజ్రత్‌ ‌చేపట్టారు. ఆహారం, నీరు దొరకక ఇబ్బంది పడ్డారు. ఒకసారి దేశహద్దులు దాటాకా కొండలు ఎక్కటం, దిగటం వారికి బహు కష్టతరమయింది. అఫ్ఘాన్‌ అమీర్‌ ‌హామీలు నమ్మి, మౌలీలు, మౌలానాలు బోధనలు నమ్మి ఆస్తులు అమ్ముకొని బయలుదేరిన వారికి దారి పొడవునా కష్టాలే ఎదురయ్యాయి. వారికి మార్గమధ్యంలో ఎటువంటి వసతులు కల్పించలేదు. అమీర్‌ ఉద్యోగులు భారతీయ ముస్లింలను ఆదరించలేదు. సరికదా వారిని కొట్టారు, తిట్టారు, వారి నుండి విలువైన వస్తువులను బలవంతంగా తీసుకొన్నారు. స్త్రీలను, యువకులను చెరపట్టి అవమానపర్చారు. వారిని దత్తత తీసుకొన్న దేశం వారిపట్ల నిర్దయగా అమానుషంగా వ్యవహ రించటంతో తమకు ఈ దుస్థితి పట్టించిన ముల్లాలు, మతపెద్దలు కన్పడితే కాల్చివేసేందుకు వారు సిద్ధమయ్యారు. వాయువ్య ప్రాంతం సరిహద్దు ప్రాంతం నుండి కాబూల్‌ ‌వెళ్లే దారికి రెండు వైపులు వలసదారుల గోరీలతో నిండిపోయాయి. ఖైబరు కనుమ ప్రాంతం అంతా శవాల గుట్టలే కనిపించాయి (Dietrich Reetz, ibid, p. 69).

ఆగస్ట్ 1920 ‌నాటికి కాబూల్‌ ‌వెళ్లే దారులన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. శీతాకాలం త్వరలో రానున్నది. కాబూల్‌లో శీతాకాలపు చలి తీవ్రంగా ఉంటుంది. శీతాకాలంలో 40వేల మందికి మాత్రమే వారు ఆశ్రయం కల్పించగలరు. అదీ అతికష్టం మీద. దానితో ఆగస్ట్ 12, 1920‌న అమీర్‌ ‌హిజ్రత్‌ను నిలిపివేశాడు. కొందరు అఫ్ఘాన్‌ ‌పౌరులు తుపాకీలతో బెదిరించి తిరిగి భారతదేశం వెళ్లమని ముహజరిన్‌ ‌లను హెచ్చరించటం మొదలెట్టారు (Qureshi, ibid, p.141).

చాలామంది వలసదారులు అఫ్ఘాన్‌లోని పరిస్థితులు చూసి డీలాపడ్డారు. మత పెద్దల తీయటి మాటలు, ఉద్రేకపూరిత ప్రసంగాలు నమ్మి, సర్వస్వం అమ్ముకొని వచ్చినందుకు తీవ్రంగా నష్టపోయారు. దానితో కృంగి పోయారు. తిరుగుప్రయాణం చెయ్యగలస్థితిలో చాలామంది లేరు. ముందునుయ్యి, వెనుక గొయ్యిలా అయిపోయింది పరిస్థితి. నడవగల్గిన వారు కొందరు తిరిగి భారతదేశానికి చేరే ప్రయత్నం చేసారు. అట్టివారి భూములను, ఆస్తులను అఫ్ఘాన్లు బలవంతంగా గుంజుకొన్నారు. కొన్నిచోట్ల స్థానికులకు, వలసదారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. బాధలు తట్టుకోలేక బ్రతుకు జీవుడా అని రాగలిగిన వాళ్లు తిరిగి భారతదేశం వచ్చారు. మార్గమధ్యంలో కొందరు, రాతికొండలలో మరి కొందరు ప్రాణాలు కోల్పోగా భారతదేశపు నూకలు తినే యోగ్యత ఉన్నవారు. చచ్చీచెడి తిరిగి అడుగు పెట్టారు. తమదంటూ ఏమీ లేకుండా దేశంలో ఉన్నది అమ్ముకొని వెళ్లిన వారు తిరిగి వచ్చినా వారిని ప్రభుత్వం గాని, మతపెద్దలు కాని, ఖిలాఫత్‌ ‌వాదులు కాని ఆదుకున్నదిలేదు. పట్టించుకున్నది లేదు ఖిలాఫత్‌ ఉద్యమకారులు హిజ్రత్‌కు పిలుపునిచ్చారు. ప్రోత్సాహించారు. ఏర్పాట్లు చేశారు. మహత్తరమైన దైవకార్యం చేయటానికి అల్లా వారిని ఎంచుకున్నారని అభినందించారు.

ఇస్లాం జాతులకు, దేశాలకు అతీతమైన భావన అని వారు గుడ్డిగా నమ్మారు. వారి ఈ గుడ్డి నమ్మకం నుండి పుట్టిన ఆలోచనే హిజ్రత్‌. ఆచరణకు సాధ్యంకాని భావన అది. హిజ్రత్‌ ‌వేడిని తట్టుకోలేక అంటే అంతమంది వలసదారులకు సౌకర్యాలు, సదుపాయాలు కల్గించలేక, అఫ్ఘానిస్తాన్‌ ‌తన భారతీయ ‘ముస్లిం సోదరులను’ వారి స్త్రీలను అవమానపర్చి, అణిచివేసి, వెనుకకు తిప్పి పంపింది. మార్గమధ్యమంలో వారిని పట్టించుకొనే వారే లేరు. తిండితిప్పలులేక, తాగటానికి నీళ్లు దొరకక నానాయాతనలు పడి తిరగి స్వంతగడ్డకు చేరారు. తమ మాతృదేశమే వారికి దిక్కయింది. తాము దత్తత తీసుకొన్న దేశం తన్ని తరిమేస్తే మాతృదేశమే గుండెలకు హత్తుకొంది. తమ అందమైన తోటను విడిచిన బుల్‌బుల్‌ ‌పక్షులు అవతలివైపు ఉన్న తోట తాము ఊహించినట్లు పచ్చగా లేదని అనతికాలంలోనే తెలుసుకున్నారు.

  • ఆం‌గ్లమూలం: శ్రీరంగ గాడ్బొలే
    డా।। బి. సారంగపాణి

వచ్చేవారం : ఖిలాఫత్‌ – ‌మోప్లా జిహాద్‌

About Author

By editor

Twitter
Instagram