కొవిడ్‌ 19 ‌రెండో దశపై డాక్టర్‌ ‌దేమె రాజారెడ్డి

కరోనా వైరస్‌ ‌రూపం మార్చుకొని, తీవ్ర స్థాయిలో భారత్‌ ‌మీద దాడి చేసిందని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ‌రాజారెడ్డి చెబుతున్నారు. మూడోదశ కూడా ఉన్నా అంత ప్రమాదకరం కాదని చెప్పారు. లాక్‌డౌన్‌ ‌విధింపును నేటి పరిస్థితులలో ఊహించలేమని కూడా ఆయన అన్నారు. కొవిడ్‌ ‌రెండోదశ నేపథ్యంలో డా. రాజారెడ్డితో  జాగృతి జరిపిన ఇంటర్వ్యూలో విశేషాలు.


ఆరు దశాబ్దాలుగా వైద్యరంగంలో సేవలు అందిస్తున్నారు. ఎన్నో సలహా సంఘాలలో సభ్యునిగా పాల్గొన్నారు. భారత వైద్యరంగంతో పాటు, అంతర్జా తీయ స్థాయిలో వచ్చిన మార్పులను గమనించిన వారు మీరు. కొవిడ్‌ 19 ‌రెండోదశను చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నది?

బాధగానే ఉంది. ఆవేదన కలుగుతోంది. మొదటి వేవ్‌ ‌ముగిసింది. రెండో వేవ్‌ ఇం‌త ప్రమాదకరంగా పరిణమిస్తుందని ప్రభుత్వాలే కాదు, వైద్యరంగంలోని వారు కూడా ఊహించలేదనే అనిపిస్తున్నది. ఇప్పుడే చూశాను- గడచిన 24 గంటలలోనే (మే 1 ఉదయం పదిగంటల వరకు) 4,01,993 కేసులు నమోదై నాయి. అసలు ప్రపంచంలోనే ఇన్ని కేసులు నమోదు కావడం మొదటిసారి అని చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అంటువ్యాధులను ఈ స్థాయిలో ఎదుర్కొనలేదు. అందుకే దీని నివారణలో వైద్యరంగానికీ అనుభవం లేదు. ప్రజలకీ అనుభవం లేదు. ఒకటి నిజం, కొవిడ్‌ 19 ఒకటో దశ కంటే, రెండోదశ అత్యంత ప్రమాదకరంగా దాడి చేసిన సంగతి హఠాత్తుగా గుర్తించవలసి వచ్చింది. దీనిని ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా లేని మాట నిజమే. దాని కారణాలు దానికి ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత వైద్యరంగంలోని బలహీనతలను ఇది బయటపెట్టింది.

మొదటి దశ అంతగా కుదిపేసింది. రెండో దశ, మూడో దశలను బ్రిటన్‌ ఎదుర్కొన్నది. అమెరికా నాలుగో దశను ఎదుర్కొంటున్నది. మన దేశంలో రెండో దశ మీద ఇంత వినాశనాన్ని ఎందుకు అంచనా వేయలేకపోయారంటారు?

రూపు మార్చుకోవడంలోనే కాదు, విస్తరించడంలో కూడా రెండో దశలో కరోనా చూపించిన వేగం మన అంచనాకు అందలేదనిపిస్తుంది. అసలు ఏ వైరస్‌ ‌పరిణామమైనా అలాగే ఉంటుంది. రూపు, తీవ్రతలు పెంచుకోవడం వాటి లక్షణమే. కానీ ఇది వేరు. మొదటి దశ తాకిడికి సంవత్సరం నిండి పోయింది. మరొకసారి వచ్చినా తీవ్రంగా ఉండదు అన్న అలక్ష్యం దేశంలో ఉంది. మొదటి వేవ్‌లో యువత, చిన్నారుల• క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు అలా కాదు, యువకులు మరణిస్తున్నారు. ఆఖరికి ఏడాది పసిబిడ్డ కూడా చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. పసిపిల్లలు చనిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఎందుకంటే, పుట్టిన వెంటనే వాళ్లకి అన్ని వ్యాక్సిన్లు వేస్తారు. మరొక వైరస్‌ ఏదీ వారికి సోకే అవకాశం ఉండదు. కానీ ఆ నమ్మకాన్ని కరోనా రెండోదశ బద్దలు కొట్టేసింది. వందేళ్ల క్రితం వచ్చిన స్పానిష్‌ ‌ఫ్లూ (కరోనా కుటుంబంలోనిదే) విస్తరణ గురించి ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికా ఏ విధంగా నమోదు చేసిందో, ఇవాళ అచ్చంగా అదే పునరావృత మవుతోంది. నాడు ఇది మూడు దశలలో వచ్చింది. మొదటి దశ కంటే రెండో దశ తీవ్రత చాలా ఎక్కువ. వేసవిలో వైరస్‌ ‌ప్రమాదకర రూపు దాల్చిందని బ్రిటానికా చెప్పింది. మనుషులను బలిగొనే స్థాయిలో న్యుమోనియా చాలా వేగంగా సోకడం మొదలు పెట్టింది. రెండోదశ సోకిందని చెప్పడానికి మొదటి రోగ లక్షణం కూడా అదేనని రాశారు. ఇప్పుడు అక్షరాలా అదే జరుగుతోంది. ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. అమెరికాలోనే కేంప్‌ ‌డేవిడ్‌ అనే చోట అంతకు ముందు కేసులేమీ లేవు. కానీ హఠాత్తుగా వ్యాధి ప్రబలింది. వ్యాధి లక్షణాలు కనిపించిన రెండు రోజులలోనే కన్నుమూసేవారు. ఆరు రోజులలో 6,674 మంది చనిపోయారు. మృతులలో సగం మంది యువకులే.

మూడో దశను కూడా దేశం ఎదుర్కొంటుందా?

వైద్యశాస్త్ర చరిత్రను బట్టి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ అది తీవ్రంగా ఉంటుందన్న దాఖలాలు చరిత్రలో లేవు. అది సాంత్వన కలిగిస్తుంది.

ప్రభుత్వ వైఫల్యం గురించి వస్తున్న మాటేమిటి?

మొదటిదశలోనే కేంద్ర ప్రభుత్వం చాలా మార్గదర్శకాలు ఇచ్చింది. రెండోసారి కూడా ముందుగానే ఇచ్చింది. అవి బాగానే ఉన్నాయి కూడా. ఇప్పటికీ కరోనా సోకకుండా ఉండాలంటే మాస్క్ ‌వాడడం, భౌతికదూరం పాటించడం, తరచు చేతులు కడుక్కోవడం, గుంపులు కట్టకుండా ఉండడమే అసలు మందు. కానీ పాటిస్తున్నవారు తక్కువ. ఇంకా చెప్పాలంటే, వైరస్‌ ‌బాగా ముదిరిన తరువాత ఆసపత్రులకు పరుగుతు తీస్తున్నవారూ ఉన్నారు. మరీ చిత్రంగా రాజకీయ నాయకులు కొందరు ఈ వైరస్‌ ఇం‌డియాకే పరిమితమన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇండియా ఎదుర్కొంటున్న పరిస్థితిని నిరుడు అమెరికా, ఇటలీ, బ్రెజిల్‌ ‌వంటి దేశాలు ఎదుర్కొ న్నాయి. ఇప్పుడు అమెరికాలో నాలుగో వేవ్‌ ఉం‌ది. ఇటలీలో తక్కువ తీవ్రతతో వైరస్‌ ఉం‌ది. ఇప్పటికీ వైరస్‌ ‌ప్రపంచంలోని చాలా దేశాలలో ఉందని ఐక్య రాజ్యసమితి చెబుతున్న సంగతిని గుర్తు చేసుకోవాలి. ఇది ప్రపంచ విపత్తు. అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం.

వ్యాక్సిన్‌ ‌విదేశాలకు ఎగుమతి చేయడం గురించి విమర్శలు వస్తున్నాయి. ఎగుమతిని తప్పు పట్టవచ్చా?

ఇవి కూడా అనాలోచితంగా చేస్తున్న విమర్శలు. రాజకీయమే కేంద్ర బిందువుగా జరిగే విమర్శలు. ఆ ఎగుమతులు తప్పవు. ఎలాగంటారా? ఉదాహరణకి కోవాగ్జిన్‌ ‌తీసుకోండి. దాని అధ్యయనం యావత్తు విదేశాలలో జరిగింది. క్లినికల్‌ ‌పరీక్షలు కూడా ఎక్కువగా అక్కడే జరిగాయి. కాబట్టి ఆ దేశాలకు వ్యాక్సిన్‌ ‌పంపించక తప్పదు. ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేరు కూడా. అదొక్కటే కాదు, నిజానికి ఇది వ్యాక్సిన్‌ ‌దౌత్యం అనవచ్చు. మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు వ్యాక్సిన్‌ అం‌దుకున్న తరువాత అనుకూల వైఖరికి వచ్చాయి. నిజానికి అప్పుడు దేశంలో వ్యాక్సినేషన్‌ ‌గురించిన ప్రణాళిక ఏదీ లేదు. ఇక్కడ మానవత్వంతో పాటు, ప్రపం చంలో పేద దేశాలకు సాయం అన్నది ఒక అవసరం. అక్కడ వైరస్‌ ‌జాడ ఉంటే, విస్తరిస్తే అది ప్రపంచాన్ని ముంచగలదు. ప్రపంచమే ఒక కుగ్రామం అనుకున్న ప్పుడు మన జాగ్రత్తతో పాటు ఇరుగు పొరుగులను కూడా సాధ్యమైన స్థాయిలో ఆదుకోవాలి.

ఎన్నికల వల్ల వైరస్‌ ‌విస్తరించిందన్న మాటేమిటి?

ఎన్నికలే వైరస్‌ ‌విజృంభణకు కారణమని చెప్పడానికి శాస్త్రీయమైన కారణాలు పెద్దగా లేవు. మహారాష్ట్ర పరిస్థితి ఘోరం. కానీ అక్కడ ఎన్నికలేమీ లేవు. ఉత్తర ప్రదేశ్‌ ‌పరిస్థితి కూడా ప్రమాదకరంగానే ఉంది. అక్కడ కూడా ఎన్నికలు లేవు. పరిస్థితిని రాజకీయం చేయడానికి చూస్తున్నవారి మాటలు అవన్నీ.

ఆక్సిజన్‌ ‌సరఫరా లోపం మీద విమర్శలు ఎంతవరకు సమంజసం?

సాధారణంగా ఆసుపత్రులలో ఆక్సిజన్‌ ‌నిల్వలు భారీగా ఉండవు. అవసరం కూడా కాదు. ఐసీయూలో, ఆపరేషన్ల సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ అవసరమైన కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం వల్ల ఒక సంక్షోభంలా కనిపిస్తున్నది. అందరికీ ఆక్సిజన్‌ అవసరమన్న ఒక కృత్రిమ వాతావరణ సృష్టి కూడా ఉందంటే కొట్టిపారేయలేం.

లాక్‌డౌన్‌తో తీవ్రతను తగ్గించగలమా?

లాక్‌డౌన్‌ ‌విధింపు ఈ పరిస్థితులలో ఊహిం చడం కష్టం. ఇది ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న దశ. మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధిస్తే పరిస్థితి అనూహ్యంగా దెబ్బతింటుందని అనిపిస్తున్నది. నేను చెప్పేదేమిటంటే, ప్రజలలో వైరస్‌ ‌గురించిన చైతన్యం పెరగాలి. ఈ జాతీయ విపత్తును నివారించడంలో నేను కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలన్న ఆశయం ప్రతివారిలో ఉండాలి. మాస్క్, ‌భౌతికదూరం, శానిటైజర్‌ ‌వంటి వాటితో సదా జాగ్రత్తలు పాటిస్తే లాక్‌డౌన్‌ అవసరం రాదు.

వైరస్‌ ఒక బాధ. కానీ హృద్రోగులు, అత్యవసర వైద్యం కావలసిన కేన్సర్‌ ‌రోగులు ఉంటారు. వారి సంఖ్య కూడా తక్కువ కాదు. వారి పరిస్థితి ఏమిటి?

ఇది కూడా సమస్యే. కానీ ఎలక్టివ్‌ (‌కాటరాక్ట్ ‌వంటివి) శస్త్ర చికిత్సలు ఆపమంటున్నారు. కానీ గుండె, కేన్సర్‌కు కీమో వంటివి ఆపడం లేదు. వీటిని ఎమర్జెన్సీ శస్త్ర చికిత్సలు అంటాం. తరువాత ఎలక్టివ్‌ ‌శస్త్రచికిత్సలు కూడా ఎక్కువ కాలం ఆపకూడదు కాబట్టి (ఎండోస్కోపి వంటివి మినహా) పునరుద్ధ రించారు. కానీ వీరిని బయటకు తీసుకురావడం, ఆసుపత్రులలో ఎక్కువ సమయం ఉంచడం సమస్య అవుతోంది.

ఈ మహా సంక్షోభంలో ప్రభుత్వ ఆసుపత్రులు చేతులెత్తేశాయని అనుకోవచ్చునా?

ఎంతమాత్రం కాదు. ఈ మహా సంక్షోభంలో ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను ఆదుకున్నాయని అనుకుంటున్నారా? అలా అనుకోవడం తొందర పాటు. ప్రభుత్వ ఆసుపత్రుల సామర్ధ్యం ప్రైవేటు ఆసుపత్రులకు లేదని గుర్తించాలి.

కొవిడ్‌ ‌నేపథ్యంలో కొందరు ఒక ప్రశ్న వేస్తున్నారు. ప్రజలను ఇటువంటి ఆరోగ్య సంక్షోభం చుట్టుముట్టి నప్పుడు దాని నుంచి కాపాడడానికి తెలుగు రాష్ట్రాల వైద్యరంగానికి ఉన్న సామర్ధ్యం ఎంత అనుకోవచ్చు?

ఈ ప్రశ్నకు జవాబు అన్వేషించడం తప్పదు. అందుకు ఇది సరైన సమయం కూడా. ముందు చెప్పినట్టు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేటు ఆసుపత్రులు ప్రత్యామ్నాయం కాలేవు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులను, వాటిలోని సౌకర్యాలను మెరుగుపరిస్తే వాటి శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుస్తుంది. ఇలాంటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, కేజీహెచ్‌, ‌గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వంటివాటికి ఉన్న సామర్ధ్యం ప్రైవేటు ఆసుపత్రులకు ఉండదు. ఇదేదో పూర్వ వైభవం కోణంలో మాట్లాడుతున్నానని అనుకోవద్దు. పక్కనే ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత ఆశాజనకంగా పనిచేస్తున్నాయో ఒక్కసారి గమనించడం మంచిది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రు లలో కూడా పరిశోధక కేంద్రాలు ఉన్నాయి. నాయకులు వాటిలోనే చేరతారు. అలా నమ్మకం పెంచుతారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణలో వైద్య పరిస్థితుల గురించి అధ్యయనం చేయడానికి మాజీ ఎంపి, డా.నర్సయ్యగౌడ్‌ ‌నాయకత్వంలో ఒక సంఘాన్ని నియమించారు. అందులో నేనూ ఉన్నాను. నేను రెండు సూచనలు చేశాను. ఒకటి: వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్యులు ప్రైవేట్‌‌ప్రాక్టీస్‌ ‌చేయకుండా నిషేధించడం. అందువల్ల నాణ్యమైన, పటిష్టమైన బోధనకు అవకాశం ఉంటుంది. రెండు:ప్రభుత్వ ఆసుపత్రులలో చేయగలిగిన శస్త్రచికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులకు పంపకూడదు. ఇందువల్ల ఏటా ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులపరం కాకుండా చేయవచ్చు. దానితో నర్సులు, డాక్టర్ల ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. సామర్ధ్యం పెంచవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల సామర్ధ్యం తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్ధం కాదు. ఒకప్పుడు కేజీహెచ్‌లో రాత్రి తొమ్మిది వరకు కూడా శస్త్రచికిత్సలు చేసేవారని మా ప్రొఫెసర్లు చెప్పేవారు. అన్ని వందల పడకలు, అన్ని విభాగాలు, అంతమంది డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రులలో సాధ్యంకాదు. వీటిని నిరుత్సాహపరచమని కాదు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయడం వల్ల దేశం అపార మూల్యం చెల్లించుకుంటున్న సంగతి గుర్తించాలని నా మనవి. సందర్భం కాబట్టి, తెలుగు ప్రాంత వైద్యులకు ఉన్న గుర్తింపు గురించి ఒక విషయం చెబుతాను. అసోసియేషన్‌ ఆఫ్‌ ‌ఫిజీషియన్స్ ఇం‌డియా వారి టెక్సట్‌బుక్‌ ఆఫ్‌ ‌మెడిసిన్‌ (‌పాఠ్యగ్రంథం) ఉంది. దేశంలో అంతా ఇదే చదువుతారు. ఇటీవల 11వ సంపుటం వెలువడింది కూడా. భారతదేశంలో ప్రధానంగా కనిపించే రోగాల వివరాలన్నీ ఇందులో ఉంటాయి. 445 అధ్యాయాలు. దాదాపు అంతమందే రచయితలు. రెండువేల పేజీలు, రెండు వాల్యూమ్‌లు. ఇందులో తెలుగు ప్రాంతాల నుంచి కనిపించే పేర్లు రెండే- ఒకటి డా. దయాసాగర్‌, ‌రెండు నాది. ఇది చూస్తే నాకు కొంచెం బాధగానే ఉంటుంది. ఆఖరికి జాతీయ స్థాయిలో కూడా శాస్త్రం విషయంలో మన వైద్యులు గుర్తింపునకు నోచుకోవడం లేదన్నదే నా బాధ.

ప్రైవేటు ఆసుపత్రుల ధ్యేయం వేరు. అందులో వైద్యుల సేవల తీరు వేరు. ప్రభుత్వ ఆసుపత్రులు అలాకాదు. ప్రభుత్వ ఆసుపత్రులని మెరుగు పరిస్తే మంచి వైద్యులు వస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలు పెంచితే సాధారణ ప్రజలు సుఖంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఇలాంటి సంక్షోభాలు సమీప భవిష్యత్తులోనే (మూడో దశ కొవిడ్‌ అనుమానాల నేపథ్యంలోనే) ఎదుర్కొనే సూచన ఉంది. కాబట్టి ప్రభుత్వ వైద్యాన్ని తక్షణం మెరుగు పరిచే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన జరగాలి. ఉస్మానియా, గాంధీ, కేజీహెచ్‌, ‌గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల వంటివి మరిన్ని నెలకొల్పాలి.

About Author

By editor

Twitter
Instagram