సంక్రాంతి సంబరాలు ముగిసిన తరువాత కోనసీమ ప్రజల వెంటనే హాజరయ్యే వేడుక అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవం. నారసింహుని కల్యాణం తరువాతనే తమ సంతానానికి వివాహాలు జరుపుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీ.

ఇటీవల ఈ స్వామివారి రథం దగ్ధం దుర్ఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనమే సృష్టించింది. అంతకు ముందు దేవాలయాల మీద దాడులు జరిగినా సహించిన హిందువులు, అంతర్వేది దుర్ఘటనతో పెద్ద ఎత్తున నిరసన ప్రకటించడం విశేషం. అందుకే ఈ ఉత్సవాలకు ప్రత్యేకత ఏర్పడింది. రథం దుర్ఘటన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఉత్సవాలివి. ఏటా కంటే అధికంగా భక్తులు వస్తారని అంచనా.

అంతర్వేది అంటే అంతరిక్షమని అర్థం. నరసింహస్వామి హిరణ్యకశ్యపుని సంహరించి అతని శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేశాడు. ఆ శరీరం పడిన ప్రాంతానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని ప్రతీతి. కంటికి కనిపించే ప్రత్యేక దైవం అయిన సూర్యభగవానునికి అత్యంత ప్రీతికరమైనదే రథసప్తమి పర్వదినం. ఆనాడే స్వామివారి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

నిత్య కల్యాణం నిరంతర ఉత్సవ వాతావరణం నిర్వికల్ప నివేదనం అంతర్వేది క్షేత్ర మహాత్మ్యం. అనుదినం స్వామి దర్శనం కోసం అరుదెంచే అశేష భక్త జన సందోహాన్ని అంతర్వేది శ్రీకరంగా… శుభకరంగా దీవిస్తూనే ఉంటుంది. నిజానికి ఈ దీవికే ఒక అపురూప దీవెన అంతర్వేది. ప్రకృతి వైపరీత్యాల నుంచి, మానసిక క్లేశాల నుంచి, సకల పాపాల నుంచి విముక్తి ప్రసాదించే ప్రణవ స్వరూపం ఈ స్వామిదని ఈ ప్రాంతవాసులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేతే సకల శుభాలూ చేకూరుతాయి. నారసింహ క్షేత్రాల్లో అగ్రగణ్యమైనది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించిన అంతర్నిధి అంతర్వేది. ఏటా స్వామి కల్యాణానికి లక్షలాది మంది భక్తులు సాగర సంగమం చేసే భక్తవారధి. భక్తులు దర్శించిన ప్రతీసారి కల్యాణ కాంతులే. రాష్ట్రం నలుమూలల నుంచీ, దేశం నలుదిశల నుంచి రోజూ వచ్చే యాత్రికులతో నిరంతరమూ ఉత్సవ హేలే! అసలు అంతర్వేది అంటేనే ఆధ్యాత్మిక వేదిక.

ఫిబ్రవరి 19 నుండి 28 వరకూ జరిగే అంతర్వేది స్వామి కల్యాణోత్సవాలకు కొవిడ్‌ ‌నిబంధనలను అనుసరిస్తూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కల్యాణం, రథోత్సవం, చక్రస్నానం సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్‌ ‌నయీం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 32 సి.సి. కెమేరాలు, 16 ఎల్‌యిడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. డి.ఎమ్‌., ‌హెచ్‌.‌వో. కె.వి.ఎస్‌. ‌గౌరీశ్వరరావు నేతృత్వంలో భక్తుల ఆరోగ్య రక్షణ చర్యలు, మంచినీటి క్లోరినేషన్‌ ‌తదితర చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో మద్య నిషేధంతోపాటు జిల్లాలోని పలు డిపోల నుండి అంతర్వేదికి ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాటు, స్నానఘట్టాల వద్ద 80 మంది గజ ఈతగాళ్ల నియామకం, 19వ తేదీనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంతర్వేది వచ్చే అవకాశం ఉన్నందున పల్లెపాలెంలో హెలిపాడ్‌ ఏర్పాటు వంటి చర్యలను అధికారులు చేపట్టారు.

పవిత్రమైన రథసప్తమి రోజున స్వామి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అటువంటి మహోత్సవాలకు అంతర్వేది సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ‌మురళీధరరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం సబ్‌ ‌కలెక్టర్‌ ‌హిమాన్ష్ ‌కౌశిక్‌, ఆలయ ఆనువంశిక ధర్మకర్త, మొగల్తూరు సంస్థానాధీశులు రాజీ కలిదిండి కుమార రామగోపాల రాజాబహద్ధూర్‌, ఆలయ అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌వై.భద్రాజీల నేతృత్వంతో ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రథ దగ్ధం ఘటన జరిగిన తరువాత నూతన రథం తయారు చేయించిన మొదటి తీర్థ మహోత్సవం కావడంతో దాదాపు 6 లక్షలమంది భక్తులు తీర్థ మహోత్సవాలకు హాజరు అవుతారన్న అంచనాలతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ప.గో. జిల్లా నరసాపురం నుంచి, తూ.గో. జిల్లా రాజోలు నుంచి కూడా అంతర్వేది వెళ్లవచ్చు.కోనసీమ కొసన ఈ అందాల పుణ్యక్షేత్రం ఉంది.

– జి.జవాహర్‌లాల్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram