విద్యవల్ల వినయం, వినయం వల్ల పాత్రత, పాత్రత వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, దాని కారణంగా ఐహికాముష్మిక సుఖమూ కలుగుతాయని ఆర్యవాక్కు. వీటన్నిటి పెన్నిధి చదువుల తల్లి అనుగ్రహం. ‘విద్వాన్‌ ‌సర్వత్ర పూజ్యతే..’ అనే హితోక్తికి హేతువు సకలజ్ఞాన ప్రదాయిని సరస్వతీ మాత. సురగురువు లాంటి అసామాన్యుల నుంచి సామాన్యుల వరకు ఆమె దయాలబ్ధపాత్రులే. మేధాశక్తి, విద్యాసంపద గల దేవతాగురువు బృహస్పతి విద్యాసిద్ధి కోసం వాణీని ఆశ్రయించారని కథనం. మహాపండితుడిగా వినుతికెక్కిన ఆదిశేషువు కూడా భూదేవి జ్ఞానభిక్ష కోరినప్పుడు సరస్వతీదేవిని ఉపాసించే భూమాతకు జ్ఞానబోధ చేశారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. గురుశాపంతో విద్యలన్నీ కోల్పోయిన యాజ్ఞవల్క్యమహర్షి సూర్యుని సూచన మేరకు శారదాదేవిని ప్రార్ధించారట. సరస్వతీదేవి లేకపోతే లోకమంతా మృతప్రాయమేనంటూ ఆమె వైభవవైశిష్ట్యాలను వివరించారు. అంతటి విశిష్టత కలిగిన శారదామాత శ్రీమన్నారాయణుడి నాలుక నుంచి ఉద్భవించిందని పురాణగాథ. ‘తెల్లని వస్త్రం ధరించిన సరస్వతీదేవి కాంతిమంత వదనంతో చల్లని చిరునవ్వు వెదజల్లుతుంటుంది. సత్త్వగుణ ప్రదాయి నియై విరాజిల్లుతుండగా, బ్రహ్మాది దేవతలతా ఆమెను కీర్తిస్తుంటారు’ అని దేవీ భాగవతంలో శ్రీ మహావిష్ణువు నారదమునికి వివరించారు.

వాణీ బ్రహ్మ స్వరూపిణి. సర్వవిద్యలకూ అధిదేవత. ఆమె శక్తి వల్లనే ప్రాణులకు ఉలుకు, పలుకు సిద్ధిస్తున్నాయి. దీపం నుంచి కాంతి ప్రసరించినట్లు ఆమెలోని చైతన్యం జగత్తంతా వెల్లివిరుస్తుంది. ఆ చదువుల తల్లి మాఘ శుద్ధ పంచమినాడు ఉద్భవించారు. దీనిని శ్రీ పంచమి అనీ అంటారు. బౌద్ధులు దీనిని మంజుపంచమిగా పిలుస్తారు. సరస్వతీ ఆరాధన సనాతన వైదిక ధర్మంలోనే కాకుండా బౌద్ధజైనాలలోనూ కనిపిస్తోంది.

 ఈ రోజే కాకుండా చైత్రమాసంలో వచ్చే పంచమి నాడు, శరన్నవరాత్రుల సందర్భంగా మూలానక్షత్రం నాడు ‘పలుకుతేనెల’తల్లిని ప్రత్యేకంగా అర్చిస్తారు. సరస్వతీమాత ఆలయాలలో లేదా మూలా నక్షత్రంలో మహా సరస్వతిగా అలంకరించిన నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. వసంత పంచమి నాడు విద్యా సామగ్రిని అమ్మవారి సమక్షంలో ఉంచి ప్రత్యేకంగా అర్చించినా ప్రతినెలా మూలానక్షత్రం నాడు సరస్వతిని పూజించాలని, పాయసం, చెరకురసం, ఆవుపాలు, అరటిపళ్లు, చక్కెర, పటిక బెల్లం లాంటి సాత్విక పదార్ధాలు నివేదించాలని పెద్దలు చెబుతారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలలోని సరస్వతీ క్షేత్రాలను స్థూలంగా మననం చేసుకుంటే..

బాసర

‘శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి

వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే’…

వేదవ్యాస ప్రతిష్ఠితమైన బాసర (తెలంగాణ రాష్ట్రం, నిర్మల్‌ ‌జిల్లా)లోని జ్ఞానసరస్వతి విశేష పూజలందుకుంటున్నారు. గోదావరి తీరంలో పరమాత్ముడి గురించి తపస్సు ఆరంభించిన వ్యాసుడు శారదాదేవి ఆదేశానుగుణంగా నిత్యం అనుష్ఠాన సమయంలో మూడు పిడికిళ్ల ఇసుకను ఒడ్డున మూడురాశులుగా పోయసాగారు. అలా ఆ రాశులు ముగ్గురమ్మల మూర్తులయ్యాయి. సరస్వతీదేవిని అధిదేవతగా, మిగతా ఇద్దరిని(మహాలక్ష్మీ, మహాకాళి)ప్రత్యధి దేవతలుగా వ్యాసుడు ప్రతిష్ఠించాడు. ఆయన తపస్సు చేయడం వల్ల ఆ ప్రాంతానికి వ్యాసపురి అని పేరు వచ్చిందని చెబుతారు. కాలక్రమంగా వాసరగా, బాసరగా ప్రసిద్ధికెక్కింది. పుష్య బహుళ పంచమి నుంచి మాఘశుద్ధ అష్టమి వరకు పద్దెనిమిది రోజుల పాటు శ్రీ పంచమి ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీపంచమి నాడు అమ్మవారికి మహాభిషేకం తరువాత పుష్పాలంకరణ కన్నుల పండువగా ఉంటుంది. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని చిన్నకోడూరు సమీపంలోని అనంతసాగరంలోని సరస్వతీక్షేత్రంలోని మూలమూర్తి నిలుచుని దర్శనం ఇవ్వడం ప్రత్యేకత.

కొలను భారతి…

ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కొలనుభారతీ దేవి క్షేత్రంలో శ్రీపంచమితో పాటు అన్ని ముఖ్య పర్వదినాలలో ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు. నాలుగు చేతులతో ఆవిర్భవించిన అమ్మవారు వీణాపాణిగా కాకుండా పుస్తకధారిణిగా ఉండడం విశేషం. సప్తరుషులు యాగం చేసినప్పుడు యాగఫలంగా భారతి స్వయంభువుగా వెలిశారని చరిత్ర చెబుతోంది.

కొలనులో కొలువు తీరిన…

కేరళలోని కొట్టాయం సమీపంలోని పనచ్చి కాడులో మూకాంబికగా పిలుచుకునే సరస్వతీదేవి పచ్చని ప్రకృతి మధ్య చిన్న కొలనులో కొలువుదీరారు. నవరాత్రులలో విద్యార్థులు, రచయితలు తమ పుస్తకాలు, రచనలు అమ్మవారి దగ్గర ఉంచి విజయ దశమి నాడు తిరిగి తీసుకోవడం సంప్రదాయం.

శంకరభగవత్పాదులు నెలకొల్పిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం మొట్టమొదటిది. తుంగాతీరంలో ప్రసవవేదన పడుతున్న కప్పకు త్రాచుపాము తన పడగ నీడలో ఆశ్రయమిచ్చిన దృశ్యం ఈ పీఠస్థాపనకు ప్రేరణగా చెబుతారు. లోకానికి ప్రేమసుధలు పంచే విద్యా నిలయంగా శంకరులు ఈ పీఠాన్ని స్థాపించారు. అనంతర కాలంలో ఆలయ స్వర్ణగోపుర ప్రభలతో తళుకులీనుతోంది. ఆలయ జీర్ణోద్ధరణ, నవీకరణ సందర్భాలలో కుంభాభిషేకాలు నిర్వహించాలన్న ఆగమశాస్త్ర నిర్దేశానుసారం ఆలయ స్వర్ణగోపురానికి పన్నెండేళ్లకు ఒకసారి శ్రీపంచమి నాడు కుంభాభిషేకం నిర్వహిస్తారు.

గుజరాత్‌లోని మాండ్లిక్‌పూర్‌, అహ్మదాబాద్‌, ‌సిద్ధపూర్‌, ‌వాంకనేర్‌, ‌రాజస్థాన్‌లోని బరాన్‌, ‌పుష్కర్‌, ‌లక్ష్మణ్‌గఢ్‌, ‌ఖోడియార్‌ ‌నగర్‌, ‌కళ్యాణ్‌, ‌గగోదర్‌, ‌పదుస్మ, దింగుచా, నానాజడేశ్వర్‌, ‌భీంపూర్‌, ‌రాజ్‌పూర్‌, ‌పల్లు, కమ్లి, సెవారీ, సారంగవాస్‌, ‌కశ్మీర్‌లోని శ్రీనగర్‌, ఉత్తరప్రదేశ్‌లోని హనుమాన్‌ ‌గంజ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌లోని బార్మోర్‌, ‌పంజాబ్‌లోని ధురీ, తమిళనాడులోని కూత్తనూర్‌, ‌కేరళలోని కొల్లూరు, తెలంగాణలో వర్గల్‌లో అమ్మవారి ముఖ్య ఆలయాలు ఉన్నాయి.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram