మన దేశంలో ప్రతిపక్షాలు సెక్యులరిజం అనే సాలెగూడులో చిక్కుకున్న తర్వాత దేశ సంస్కృతి, సంప్రదాయాలు పట్ల స్పృహ కోల్పోవడమే కాదు, రాముడు ఒక ఊహాత్మక వ్యక్తి అని వాదించే వరకూ వెళ్లిపోయాయి. వారి దృష్టిలో పురాణాలు కూడా కాల్పనిక గాథలే! రామాయణంలో గిరిజన మహిళ శబరికి ఉన్న ప్రాముఖ్యం గానీ, ఆమె ప్రేమగా పెట్టిన ఎంగిలి పండ్లను రాముడు ప్రేమగా ఆరగించడంలోని ఆంతర్యం గానీ తెలియదు. కనుకనే కాంగ్రెస్ నేత రాహుల్ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కనుకనే ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదనే అబద్ధపు ప్రచారాలు చేస్తూ వచ్చారు. గిరిజన మహిళ కనుకనే ఆలయ ప్రవేశం కల్పించలేదనే భ్రమను సృష్టించే యత్నం చేశారు.
ఈ అసత్య ప్రచారాలకు తెరదించుతూ మే నెల 1వ తేదీన రాష్ట్రపతి ముర్ము బాలరాముని సందర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి ముర్ము గర్భగుడిలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. దీనిని ప్రతిపక్షాలు గుర్తించాలి. ప్రాణప్రతిష్ఠ సందర్భంలో ప్రధాని మోదీ ఎక్కడ అయితే నిలబడి పూజలను నిర్వహించారో, రాష్ట్రపతి కూడా అక్కడే నిలబడి పూజలు చేసి, హారతి ఇచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి సరయు హారతిలో పాల్గొనడమే కాదు, హనుమాన్‌గడిలకు వెళ్లి అక్కడ ఆంజనేయుడికి కూడా పూజాదికాలు నిర్వహించారు.
ఆమె గిరిజన మహిళ కనుక ఆమెకు ఆలయం లోకి ప్రవేశం ఉండదన్న స్థాయిలో రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఈ ఒక్క పర్యటనతో ఛిద్రమై పోయింది. ప్రస్తుతం కులగణన పిచ్చితో రెచ్చిపోతున్న రాహుల్ గాంధీ పచ్చ కామెర్ల కళ్లకు ఆమె ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లకపోవడానికి కారణం ఆమె కులమే. అన్య మతాలు మినహా అన్ని కులాల వారికీ భారతదేశంలో ఆలయ ప్రవేశం అమలులో ఉన్న విషయమే. అయితే, ఏ కులం వారు వెళ్లినా అక్కడ ఆలయ సంప్రదాయాలను మాత్రం పాటించి తీరాలన్న నిబంధన ఉన్నది, ఉంటుంది. ఇదేమీ అసహజం కాదు కూడా. కనీసం ఆలయ ఆవరణలో అయినా మన సంస్కృతీ సంప్రదాయాలు కనిపించాలని కోరుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు కదా?
రాష్ట్రపతి ముర్ము అయోధ్యలో శ్రీరామ్‌లల్లాను దర్శనం చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ, ‘గుజరాత్‌లో జరిగిన ఒక సభలో రాష్ట్రపతి ముర్ము గిరిజన మహిళ కనుకనే ఆమెను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదంటూ చేసిన వ్యాఖ్యలను శ్రీరామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి, ట్రస్టీ హోదాలో నేను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నాను. ఈ ఆరోపణలు, వ్యాఖ్యలు అసత్యమైనవి, నిరాధారమై నవి, పక్కదోవపట్టించేవి. రాష్ట్రపతి ముర్మును, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఇద్దరినీ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించం. షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులవారు, అత్యంత నిరుపేదలను కూడా ఆహ్వానించాం. వారంతా వచ్చారు కూడా…’ అంటూ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఈ సందర్భంగా వివరణ ఇవ్వడం గమనార్హం.
ఆధ్యాత్మిక, మత విశ్వాసాలు వ్యక్తిగతమైన విషయాలన్న అవగాహన ఉన్నది కనుకనే, రాష్ట్రపతి తనకు నచ్చిన సమయంలో, వ్యక్తిగతంగా ఎటువంటి హడావిడీ లేకుండా వచ్చి శ్రీరాముని సందర్శించు కున్నారన్న విషయం నిర్వివాదం. తనకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆలయ సందర్శనం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు. శ్రీరాముని సందర్శించుకున్న తర్వాత, ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’పై పోస్టు చేశారు. ‘‘ అయోధ్య రామ మందిరంలో దివ్యమైన రామ్‌లల్లా విగ్రహాన్ని సందర్శించినప్పటి భావనలను నేను వర్ణించలేకపోతున్నాను. రామాయణంలో శ్రీరాముడు కేవత్‌తో జరిపిన సంభాషణను, శబరి తను కొరికి మరీ తన రాముడికి ఏరి ఏరి తియ్యటి రేగిపళ్లను ఇవ్వడం వంటి హృదయాన్ని స్పర్శించే ఘట్టాలను గుర్తు చేసుకున్నాను. సమాజ విస్తృతమైన హితం కోసం వ్యక్తులందరూ కృషి చేయాలని ప్రోత్సహించే మన సమాజపు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు రూపమే రామమందిరం.ఈ యుగంలో, కాలంలో, దేశ సమగ్రాభివృద్ధి, పురోగతిలో భాగం కావడం మన అదృష్టం’’ అని పేర్కొన్నారు.
గిరిజన మహిళ ముర్మును భారతదేశ తొలి పౌరురాలిగా దేశమంతా అంగీకరించి, స్వాగతించింది. ఆమెను రాష్ట్రపతిగా ప్రతిపాదించి, గెలిపించి, గౌరవించింది భారతీయ జనతా పార్టీ. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆమె గిరిజనురాలని దేశానికి గుర్తు చేయడమే కాదు, దానిని ఆయుధంగా చేసుకుని బీజేపీని, ఆమెను కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా అవమానిస్తూ వస్తున్న రాహుల్ గాంధీకి చెంపపెట్టులా తన పర్యటనతో సమాధానం చెప్పారు.
– జాగృతి డెస్క్