నాయనార్లు, ఆళ్వార్లు హిందూ సంస్కృతి పరిపుష్టికి చేసిన కృషి ఎనలేనిది, అనితర సాధ్యమైనది. వేద విచారధార లేక హిందూధర్మ మూలభావనలు ఏ ఒక్క సామాజికవర్గ పరిధిలోనివి కావు. వాటిపై ఏ ఒక్క సామాజిక వర్గానికి గుత్తాధికారాలు లేవు. లేక ఏ ఒక్క భాష (సంస్కృతం) వాటికి సంకెళ్లు వెయ్యలేదు. వాటికి అవధులు లేవు. అవి ఏ ఒక్క ప్రాంతానికో (ఆర్యావర్తం) పరిమితంకావు. అవి సమస్త మానవాళికి సంబంధించినవి. సకల విశ్వమే వాటి పరిధి.

సామాన్యశకం(కామన్‌ ఎరా జు) కి అనేక శతాబ్దాలు ముందే తమిళనాడు, కేరళలలో హిందూధర్మంలోని ప్రధాన సంప్రదాయాలైన శైవం, వైష్ణవం సమాజాన్ని ప్రభావితం చేశాయి. కర్మకాండ, దేవాలయాలు, సంగం సాహిత్యం , జానపద కళారూపాలు, ఆచార వ్యవహారాలు, తీర్థయాత్రలలో ఇది అభివ్యక్తమౌతూ వచ్చింది. దక్షిణాదిని పాలించిన అన్ని రాజవంశాలు ఈ రెంటిలో ఏదో ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తూ వచ్చారు.

తర్వాత కాలంలో శైవనాయనార్లు, వైష్ణవ ఆళ్వార్లు సనాతన ధర్మంలోని మూలభావాలను, సారాన్ని, హృదయాలను ద్రవింప చేసే తమ గీతాలాపనల ద్వారా ప్రజా సమూహాలు అర్థం చేసుకొనేలా ప్రయత్నించారు. నాయనార్లు, ఆళ్వార్లు ఒక కులానికి పరిమితం కాలేదు. వారిలో అన్ని కులాలవారూ ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. హిందూధర్మం బ్రాహ్మణుల స్వంతమనీ, దాన్ని ఇతరుల నెత్తిన రుద్దుతున్నారనీ జరుగుతున్న విషప్రచారాన్ని నాయనార్లు, ఆళ్వార్లు మూలాలతో సహా పెకలించివేశారు. భారత జాతీయ సమైక్యతకు వారు చేసిన కృషి వెలకట్టలేనిది. అది అజరామరం.

నిత్యజీవనంలో ఎదురయ్యే ఎగుడు దిగుళ్లు, కష్టాలు, దుఃఖాల నుంచి సామాన్య ప్రజలకు భక్తిమార్గం ద్వారా వారు ఉపశమనం కల్గిస్తూ వచ్చారు. భక్త బృందాలను వెంటబెట్టుకొని, తాము ఆశువుగా రూపొందించిన గీతాలను ఆలాపిస్తూ ఊరూరు తిరుగుతుండేవారు. ‘‘వారిలో కొందరు అద్భుతంగా పాడగలిగిన కంఠం కలవారు, శాశ్వతంగా నిలిచిపోయే భక్తిగీతాలను అందించారు. వారి కవితలు, సంఖ్యాపరంగా కాని, భావజాల పరంగా కాని మానవ చరిత్రలో వాటికవే సాటి’’ అని గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్లశాఖ అధిపతిగా పనిచేసిన కె.ఆర్‌.శ్రీ‌నివాస అయ్యంగార్‌ ‌పేర్కొంటున్నారు.

నాయనార్లు

నాయనార్లు, నిస్వార్థతకు, సామాజిక సమానత్వానికి, సమరసతకు, మానవ సేవకు, త్యాగానికి ప్రతీకలు. దక్షిణాదిలోని అన్ని ప్రముఖ శివాలయాల్లో నాయనార్ల విగ్రహాలను ప్రతిష్టించు కున్నారు.

నాయనార్ల గీతాలన్నిటిని నంబి అండార్‌ ‌నంబి అనే శైవగురువు ‘తిరుమురైలు’ (సంపుటాలు)గా క్రోడీకరించారు. వాటి వివరాలు:

సంపుటాలు          పేరు        కృతికర్తలు

1-7           దేవారం              అప్పార్‌

                                ‌         సంబందార్‌

                                ‌          సుందరర్‌

8              ‌తిరువాచకం           మాణిక్యవాచకార్‌

9              ‌తిరుసైప్ప               వివిధ నాయనారులు

10           తిరుమందిరం        తిరుమూలార్‌

                                ‌వివిధ నాయనారులు

వీరిలో మొట్టమొదటి నాయనార్‌ ‌తిరుమూలార్‌. ‌తర్వాత నలుగురు నాయనార్లు: అప్పార్‌ (600-681 ‌జు), సంబందార్‌ (644-660 ‌జు), మాణిక్యవాచకార్‌ (660-692 ‌జు), సుందరార్‌ ( 710) ‌నమాజాన్ని ప్రభావితం చేశారు.

తిరుమూలార్‌

‌తిరుమూలార్‌ ‌రచించిన తిరుమందిరంలో 3000 గీతాలున్నాయి. తిరుమందిరం శైవ సిద్ధాంతాన్ని విపులీకరిస్తుంది. అనురాగం, శివుడు వేర్వేరు కాదు. అనురాగం శివుడిగా రూపాంతరం చెందుతుందనేది ఈ సిద్ధాంత మూల భావం.

అప్పార్‌ ‌లేక తిరునవుక్కరసు నాయనార్‌

‌దేవారంలోని గీతాల్లో 307 అప్పార్‌ ‌రచించారు. నిమ్నకులంగా పిలుచుకునే కులంలో అప్పార్‌ ‌జన్మించారు. 80 ఏండ్ల సుదీర్ఘ జీవనయానం వల్ల కలిగే పరిణతి ఆయన గీతాల్లో ప్రతిబింబిస్తుంది. గ్రామాల్లో నివసించే బీదబిక్కీ ప్రజల హృదయాలను ఆయన కదిలించేవారు. అప్పార్‌ ‌ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతితో కలిసి జీవించాలని ఆయన తపిస్తూ వచ్చారు. ఆయన మధురగీతాలలో ప్రకృతి సౌందర్యం సమ్మిళితమైంది. గ్రామీణ ప్రాంతంలోని సాధారణ నిత్యజీవితం నుంచే ఆయన ఉపమానాలను ఎంచుకొన్నారు.

పల్లవ చక్రవర్తి మహేంద్రవర్మన్‌ × అప్పార్‌ అనుచరుడు. మహేంద్రవర్మ × తిరుచనాపల్లి రాతి శాసనంలో అప్పార్‌ ‌ప్రస్తావన ఉంది.

సంబందార్‌

‌సంబందార్‌ 16 ‌సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అంత స్వల్ప జీవితంలో 384 గీతాలు రచించారు. ఆయన గీతాలు అత్యున్నతస్థాయి సాహిత్య సౌరభాన్ని వెదజల్లుతుంటాయి.

మాణిక్యవాచకార్‌

‌మాణిక్యవాచకార్‌ ‌బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పాండ్యరాజు అలమర్దనార్‌ ‌వద్ద మంత్రిగా ఉండేవారు. రాచకార్యాలపై విరక్తి చెంది ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించారు. శైవ మూలతత్వాన్ని, ముఖ్యంగా పరబ్రహ్మకు తనను తాను పూర్తిగా సమర్పించుకోవాలనే భావాన్ని ఆయన తిరువాచకంలో 51 గీతాల్లో వ్యక్తీకరించారు.

సుందరార్‌ ‌లేక సుందరమూర్తి నాయనార్‌

‌సుందరార్‌ 18 ‌సంవత్సరాలు జీవించారు. వారు రచించారని చెప్పుకునే వేలాది గీతాల్లో వందమాత్రమే లభ్యమౌతున్నాయి. తేనెలొలికే వారి మధురగీతాలు నేటికీ తమిళనాట ప్రజల నాల్కల మీద తారాడుతుంటాయి. ఆ గీతాలను దేవాలయాల్లో నిత్యమూ ఆలపిస్తుంటారు.

ఇతర శైవ గురువులు

నాయనార్లతోపాటు మరో 63 మంది శైవ గురువులు తమిళనాడులో విరాజిల్లారు. వారిలో అన్ని వృత్తులవారూ ఉన్నారు – రైతులు, పశువుల కాపరులు, కుమ్మరులు, నేతకారులు, మత్య్సకారులు వగైరా. శెక్కిలార్‌ ‌రాసిన పెరియ పురాణంలో వారి జీవితాలు వివరంగా అందించడం కనిపిస్తుంది. ఈ శైవ గురువులు 2వ శతాబ్దం జు నుంచి 9వ శతాబ్దం జు మధ్యలో జీవించారని ప్రతీతి. వీరిలో తిలకవతీయ, పునీతవతియార్‌, ‌మంగైయార్క రాసియార్‌ ‌వంటి మహిళా భక్త శిఖామణులు కూడా ఉన్నారు. కులబేధం, అస్పృశ్యత వంటి దురాచారం, స్త్రీపురుష వ్యత్యాసం సామాజిక జీవనంలో అంతర్భాగాలు కానే కాదని నాయనార్లు, తమ గీతాల ద్వారా ప్రబోధించారు. ఈ మహోన్నత ఆదర్శం ప్రతిబింబించే విధంగా జీవించారు.

ఆళ్వార్లు

ఆళ్వార్లు జుకి అనేక శతాబ్దాల ముందువారని ప్రతీతి. అయితే అందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలేవీ లభించటం లేదు. తర్వాత వచ్చిన వైష్ణవ గురువులు 500-850 జు కాలానికి చెందినవారు. వారిలో కొందరు నాయనార్లకు సమకాలీకులు. ఆళ్వార్లు 12 మంది.

నాయనార్లవలె, ఆళ్వార్లు కూడా అన్ని కులాలకు చెందినవారు. నమ్మాళ్వార్‌ ‘‌వెల్లాల’కు చెందినవారు కాగా, తిరుమంగై ‘నిమ్నకులం’ ‘కళ్లాల’కు చెందిన వారు. కులశేఖర క్షత్రియుడు కాగా, పెరియాళ్వావార్‌, ఆం‌డాళ్‌ ‌బ్రాహ్మణులు.

ఆళ్వార్ల కవితలు భక్తి ప్రధానమైనవి. నిత్యజీవితంలోని కష్టాలను మరపింపజేసి, భక్తులను అనిర్వచనీయ తన్మయత్వంలో ఓలలాడిస్తుంటాయి. కర్మకాండ తదితర వైదిక ఆచారాల నుంచి, భారతీయ తాత్విక విచారధారను భక్తి మార్గంవైపు వారు మరలించారు.

ఆళ్వారులు వెలయించిన 4000 పాశురములను (గీతాలు) నాథముని క్రోడీకరించారు. దానికి నాలాయిర దివ్యప్రబంధమని పేరు. దీనికి వైష్ణవ సంప్రదాయంలో భగవద్గీతకున్నంత ప్రాధాన్యం ఉంది. నాథముని తన దివ్యప్రబందాన్ని ద్రవిడ వేదంగా పేర్కొన్నాడు. శ్రీరామానుజుల సంపూర్ణ శరణాగతి అనే ప్రపత్తివాద మూలరూపం ఆళ్వారుల రచనల్లో కనిపిస్తుంది. దివ్యప్రబంధంలోని గీతాలు వైష్ణవాలయాలలో ఆలపిస్తుంటారు. తిరుపతి, శ్రీరంగం మొదలైన ప్రఖ్యాత వైష్ణవ దేవాలయాల్లో ఆళ్వార్ల ఆండాళ్ల విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు.

దివ్య ప్రబంధం నాలుగు భాగాలు – తిరుమోలి, పెరియతిరుమోలి, ఇయాల్పై, తిరుయాయమోలి.

వాటిని రచించిన ఆళ్వార్లు:

తిరుమోలి              :     పెరియాళ్‌ ‌వార్‌

                                ఆం‌డాళ్‌

                                ‌కులశేఖర

                                తరుమలిపై

                                తొండరిప్పోడి

                                తిరుప్పాన్‌

                                ‌మధురకవి

పెరియతిరుమోలి  :        తిరుమగై

ఇయాలై                      పోయకై

                                భూతత్తార్‌

                                ‌పెయాళ్వార్‌

                                ‌తిరుమలిసై

                                నమ్మాళ్వార్‌

                                ‌తిరుమగై

తిరుయాయమోలి         నమ్మాళ్వార్‌

‌మొదటి నలుగురు ఆళ్వార్లు

పోయకై, భుతత్తార్‌, ‌పేయాళ్వార్‌ ఆళ్వార్లు ఒకొక్కరు వంద గీతాలను అందించారు. మహావిష్ణువు అవతారాలను వర్ణిస్తూ వారు తమ భక్తి గీతాలకు ప్రాణం పోశారు. తిరుమోలిపై గీతాలలో బౌద్ధ, జైన సంప్రదాయాలపట్ల కొంత ఆగ్రహం కనిపిస్తుంది. ఆయన పల్లవరాజు మహేంద్రవర్మ × సమకాలికుడు.

నమ్మాళ్వార్‌, ‌మధురకవి

సంపూర్ణంగా భక్తిభావనాలోకంలో ఓలలాడిన మహాత్ముడు నమ్మాళ్వార్‌. ఆయన గీతాల్లోని తియ్యదనం, భావుకత, ఆకట్టుకొనే దృశ్య చిత్రీకరణలు భక్తి సంగీతంలో వాటికవే సాటి. ప్రఖ్యాత చరిత్రకారుడు కె.ఎ.నీలకంఠశాస్త్రి ఇలా వ్యాఖ్యా నించారు: ‘‘ఉపనిషత్తులు ప్రబోధించే లోతైన తాత్త్విక సత్యాలు ఆయన గీతాలలో ప్రతిబింబిస్తుండటంవల్ల, నమ్మాళ్వార్‌ ‌ప్రజల హృదయాల్లో ఉన్నత స్థానాన్ని అందుకొన్నాడు. నమ్మాళ్వార్‌ ‌మహాయోగి. ఆయన తిరుయాయమోలి గీతాలు నిగూఢమైన అనుభవాలు. అందరినీ ఒప్పించే విధంగా ఉంటాయి. ఆళ్వార్లందరి వలె విష్ణువు అవతారాలు, లీలలు, ఆయన గీతాలలో ఇతివృత్తాలుగా అందరినీ తన్మయంలో ముంచెత్తు తుంటాయి. రాముని, కృష్ణుని గాథలు అత్యంత రమణీయంగా ఆ గీతాలు వర్ణిస్తుంటాయి. ఆయన ఒక మహాయోగి, తత్త్వవేత్త మాత్రమేకాక, ఒక మహా సాహిత్యకారుడు కూడా’’.

నమ్మాళ్వార్‌ ‌వద్ద బ్రాహ్మణ శిష్యుడు మధురకవి. ఆయన తనగురువుపై రచించిన గీతాన్ని భక్తులు పాడుకొంటుంటారు.

పెరియాళ్‌ ‌వార్‌, ఆం‌డాళ్‌

‌పెరియాళ్‌ ‌వార్‌, ఆయన కుమార్తె ఆండాళ్‌ ‌కవితలు తమిళ సాహిత్యంలో ఆణిముత్యాలు. వారిరువురు 650 కవితలు వ్రాశారు. శ్రీరంగ నాథుడిని ఆండాళ్‌ ‌తన ప్రియుడిగా ఊహించుకొంది. ఆమె కవితల్లో, తన ప్రియుడైన శ్రీకృష్ణుని సాంగత్యం కోసం పడే విరహవేదన ప్రతిబింబిస్తుంది.

కులశేఖర

కులశేఖర 9వ శతాబ్దంలో తిరువనంతపురం పాలిస్తుండేవారు. ఆయనలోని ఆధ్యాత్మికత, శ్రీకృష్ణుని పట్లగల భక్తి భావన పెల్లుబికి సింహాసనాన్ని త్యజించేటట్లు చేశాయి. సన్యసించేటట్లు చేశాయి. ఆయన పెరుమాళ్‌ ‌తిరుమోలిలో 103 గీతాలున్నాయి. ఆయన ముకుందమాల అనే స్తోత్రాన్ని సంస్కృతంలో రచించారు.

తిరుప్పన్‌, ‌తొండరిప్పోడి, తిరుమగై

చివరి ముగ్గురు ఆళ్వార్లలో తిరుప్పన్‌ 10 ‌గీతాలు మాత్రమే రచించారు. తొందరప్పోడి 55 గీతాలు వ్రాశారు. అత్యధికంగా తిరుమగై 1851 గీతాలు రచించారు. తిరుప్పన్‌ ‘అం‌టరానికులంగా’ పేరు పడిన కులానికి చెందినవారు. బ్రాహ్మణ పుజారులు కూడా ఆయన చెప్పింది అనుసరించేవారు. తిరుమగై (. 8వ శతాబ్దం), కోజవార్‌ ‌కులానికి చెందినవారు. ఈ ఆళ్వార్లందరూ, కర్మకాండ, ఆచారాల నుంచి హిందూ తాత్విక విచారధారను భక్తిమార్గంవైపు మళ్లించారు.

నాయనార్లు, ఆళ్వార్లు అందించిన తాత్త్విక సంపద

నాయనార్లు, ఆళ్వార్లు హిందూ సంస్కృతి పరిపుష్టికి చేసిన కృషి ఎనలేనిది, అనితర సాధ్యమైనది. వేద విచారధార లేక హిందూధర్మ మూలభావనలు ఏ ఒక్క సామాజికవర్గ పరిధిలోనివి కావు. వాటిపై ఏ ఒక్క సామాజిక వర్గానికి గుత్తాధికారాలు లేవు. లేక ఏ ఒక్క భాష (సంస్కృతం) వాటికి సంకెళ్లు వెయ్యలేదు. వాటికి అవధులు లేవు. అవి ఏ ఒక్క ప్రాంతానికో (ఆర్యావర్తం) పరిమితంకావు. అవి సమస్త మానవాళికి సంబంధించినవి. సకల విశ్వమే వాటి పరిధి.

ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత (ప్రస్థానత్రయం) హిందూధర్మ ఆత్మ, కర్మకాండకాదు. కర్మకాండ ఇష్టమున్నవాళ్లు అనుసరించవచ్చు. ఈ మూలసత్యాన్ని నాయనార్లు, ఆళ్వార్లు ప్రబోధించారు. ఈ తమిళ మహానుభావులు ఉపనిషత్తులు అందించిన వైదిక రుషులతో సమానమైన స్థానాన్ని సముపా ర్జించారు.

– ప్రొఫెసర్‌ ‌యస్‌.‌వి.శేషగిరిరావు, ఛాన్సలర్‌, ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ ఆఫ్‌ ‌కేరళ , కాసర్‌గోడ్‌

About Author

By editor

Twitter
Instagram