– డాక్టర్‌ ఎం. అహల్యాదేవి

సంక్రాంతి పండుగ సామరస్యానికి ప్రతీక. దేశాన్నేకాక సమస్త విశ్వాన్ని ఐక్యతా సూత్రంలో బంధించే దైవం సూర్యుడు. ప్రపంచంలోని సమస్త ప్రజలు ఆరాధించే దైవం సూర్యభగవానుడు.

‘విష్ణుమయం జగత్సర్వం’ అన్నది సూర్యుని సర్వవ్యాపకత్వాన్ని రుజువు చేస్తుంది. సూర్యుని శ్రీమహావిష్ణువు ముఖమండల తేజస్సుగా శాస్త్రాలు అభివర్ణించాయి. అందుకే సూర్యుని సూర్య నారాయణగా పేర్కొంటారు. మకర సంక్రాంతి పర్వదినం సూర్యోపాసనకు సంబంధించినది. సూర్యోపాసన వల్ల రుణవిముక్తి, దారిద్య్ర నాశనం జరుగుతుంది. హృదయ, నేత్ర రోగాలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులు సూర్యుని కాంతి ద్వారా తొలగిపోతాయి.


భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కాంతి వృత్తం ఏర్పడుతుంది. సూర్యుడు మకరరేఖ నుండి ఉత్తర కర్కాటక రేఖవైపు ప్రయాణించడాన్ని ఉత్తరాయణమనీ, దక్షిణంతో మకర రేఖ వైపు ప్రయాణించడాన్ని దక్షిణాయనం అని అంటారు. ఉత్తరాయణం ఆరు నెలల్లో సూర్యుడు మకరరేఖ నుండి మిథునం వరకు ఆరు రాశుల్లో సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యం. ఈ ఉత్తరాయణం ఆరు మాసాల్లో దేహం త్యజించిన యోగులు బ్రహ్మను చేరుకుంటారని భగవద్గీత చెబుతుంది. అందుచేతనే భీష్మ పితామహుడు దేహత్యాగం కోసం ఉత్తరాయణ కాలం దాకా వేచి ఉన్నాడని చెబుతారు.

సంక్రాంతి మూడు రోజుల పండుగ. కొన్నిచోట్ల నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు. మొదటిరోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజున కనుమ, నాలుగో నాడు జరుపుకునే పండుగను ముక్కనుమ అని పిలుస్తారు.

భోగిమంటల కాంతి

ఇంద్రునికి ఇష్టమైన రోజు. ఈ రోజు ఇంద్రుణ్ణి పూజిస్తే మంచిది. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి దక్కించుకున్న పూజ ఇది. దీనినే ఇంద్రపూజ అని కూడా అంటారు. భోగినాడు కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యంతో, పాలతో పొంగలి చేసి ఇంద్రునికి నైవేద్యంగా సమర్పించడం ఆచారం. శ్రీమహావిష్ణువు వామనావతారంలో భోగినాడే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినట్లు మరొక కథనం. ఈ రోజు వామనుని పూజించడం కూడా సంప్రదాయం. ఈ రోజున తెల్లవారుఝామున ఇంటి ముంగిట భోగిమంట వేస్తారు. గొబ్బెమ్మలను పిడకలుగా చేసి అందులో వేస్తారు. ఇది ఒకరకంగా చిన్నపిల్లల పండుగ కూడా. ఐదేళ్ల లోపు పిల్లలకు ఈరోజు భోగిపళ్లు పోయడం సంప్రదాయం. రేగుపళ్లు, నానబెట్టిన శనగలు, చెరకు ముక్కలు, నాణాలు, పూలు అన్నీ కలిపి పిల్లలకు దిష్టి తీసి తలపై పోస్తారు. భోగిపళ్లు పోయడం వల్ల శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభించి చిన్నారులు శక్తిమంతులవుతారని, దీర్ఘాయువుతో వర్ధిల్లుతారని శాస్త్రవచనం. కొన్నిచోట్ల భోగి రోజున స్త్రీలు ఆయురారోగ్య సౌభాగ్యుల వృద్ధి కోసం గొబ్బి గౌరీ వ్రతం చేస్తారు. కొన్నిచోట్ల ఈ రోజు బొమ్మల కొలువు పెడతారు. సంతానలక్ష్మీ అయిన గోదాదేవి ఆండాళ్‌ ‌కల్యాణం ఈరోజు వైభవంగా జరుపుతారు.

సరదాల సంక్రాంతి

సూర్యుడు ఒక సంవత్సరంలో పన్నెండు రాశుల్లో పరిభ్రమిస్తాడు. ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. మకరరాశిలో ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర రాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దేవతాలోకంలో సంవత్సరంలో ఆరు నెలలు పగలు, మిగిలిన ఆరు నెలలు రాత్రి. మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దేవలోకంలో దేవతలు ఈ పగలు ఆరునెలలు మేల్కొని ఉండడం వల్ల భూమిపై జరిగే శుభకార్యాలపై వారి దృష్టి పడుతుందని చెబుతారు. అందుచేతనే సంక్రాంతి తర్వాత ఎక్కువ శుభకార్యాలు నిర్వహిస్తారు.

దక్షిణాయన సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించి నప్పుడు పగటి సమయం తక్కువగాను, రాత్రివేళ ఎక్కువగాను ఉంటుంది. మకరరాశిలో అంటే- ఉత్తరాయణం ప్రారంభమైన నాటి నుంచి పగళ్లు దీర్ఘమవుతాయి. మకర సంక్రాంతికి నదుల్లో స్నానంచేసి, సూర్యదేవునికి ఈ కింది మంత్రంతో జలం సమర్పిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు.

ఓం ఘృణి సూర్యాయనమః శ్రీసూర్యనారాయణ ఇతి అర్ఘ్యం సమర్పయామి

ఈ మంత్రంతో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత బ్రహ్మణులకు దానం చేయాలి. నదీస్నానాలు చేయలేని వారు తమ ఇంట్లోనే నీటిలో నువ్వులు వేసి గంగాజలాన్ని స్మరించి స్నానం చెయ్యాలి. స్నానం చేసాక రాగిపాత్రలో శుద్ధ గంగాజలం నింపి కొంచెం బెల్లం, నువ్వులు, చందనం, అక్షతలు, పుష్పాలు వేసి పైన చెప్పిన మంత్రంతో లేదా గాయత్రీ మంత్రంతో సూర్యనారాయణులకు అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత నువ్వులు, బెల్లం, పెసర పప్పు వంటివి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఆ పదార్థాలన్నీ బ్రాహ్మణునికి దానం చేయాలి. కొంచెం ప్రసాదంగా స్వీకరించాలి.

ఈ సంక్రమణ కాలంలో దానధర్మాలు విరివిగా చేయడం వల్ల ఆయా వస్తువులన్నీ వారికి జన్మజన్మల వరకు లభిస్తాయని చెబుతారు. స్త్రీలు పసుపు, కుంకుమలు; నువ్వులతో చేసిన వంటకాలు, వెన్న, వస్త్రాలు, రొట్టెలు దానం ఇవ్వడం వల్ల వారికి సకల సంపదలు, సౌభాగ్యాలు లభిస్తాయి. ఈ పర్వదినాన పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చి బ్రాహ్మణులకు కొత్త ధాన్యం, నెయ్యి, కూరలతో పాటు కూష్మాండకాయ (గుమ్మడికాయ)ను దానంగా ఇస్తారు. ఈరోజున గుమ్మడికాయను దానం ఇవ్వడమే కాకుండా, ఆరగించడం వలన కూడా ఆరోగ్యపరంగా ఎంతో వృద్ధి కలుగుతుంది. గుమ్మడికాయ తినడం వల్ల స్త్రీలలో వంధ్యాదోషం- అంటే పిల్లలు కలగకుండా ఉండే వ్యాధి తొలగిపోతుందని ఆయుర్వేదం చెబుతున్నది. సంక్రాంతి పండుగ ప్రధాన భక్ష్యం నువ్వులు అంటించిన సజ్జల రొట్టె. వైద్యపరంగా, ఆరోగ్యపరంగా ఇది చాలామంచిది. మార్గశిర, పుష్య మాసాలలో చలి అధికంగా ఉంటుంది, కాబట్టి నువ్వులు, సజ్జలను పండుగ రుచులుగా చెప్పారు మన పూర్వికులు. ఈ రెండు పదార్థాలు దేహానికి కావాల్సినంత వేడినిచ్చి చలి నుంచి కాపాడతాయి.

ఉత్తరాభిముఖుడైన సూర్యుడు రథంపై సంచరిస్తుండగా వైకుంఠ ఏకాదశినాడు రథమందిరం ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఆ సమయంలో, ఆ ద్వారం నుండి ముక్కోటి దేవతలు సూర్యభగవానుని దర్శించి, పూజిస్తారు. దానికి ప్రతీకగా సంక్రాంతి నాడు రథం ముగ్గును లోపలికి వస్తున్నట్లు వేస్తారు. ముక్కనుమ నాడు బయటకు వెళుతున్నట్లు వేస్తారు.

సకల సంపదలనిచ్చే కనుమ

సంవత్సరమంతా చేసిన శ్రమకు ఫలితంగా పశువులను ధన, ధాన్యరాశులను పూజించే రోజు ఇది. వీటిని లక్ష్మీస్వరూపంగా భావించి పూజిస్తే సంపద మరింతగా వృద్ధి చెందుతుందని విశ్వాసం. ఈరోజు మినుములతో చేసిన వంటకాలు స్వీకరించాలి. గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందేలు, పొట్టేళ్ల సమరాలు, హరిదాసుల కీర్తనలు, జంగమ దేవరలు, గాలిపటాలు ఎగురవేయడం, కొత్త అలుళ్లుకు మర్యాదలు, పిండివంటలతో కుటుంబంలో ఆత్మీయతలు వెల్లివిరిసే రోజే కనుమ.

ముక్కనుమ విశిష్టత

కనుమ మరుసటి రోజుని ముక్కనుమ అంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాలలో బొమ్మల నోము (సావిత్రీ గౌరీనోము) చేస్తారు. సావిత్రీ గౌరీదేవి వేదమాత. ఈ దేవత గురించి వరాహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి. అలా తొమ్మిది సంవత్సరాలు ఆచరిస్తే శుభం కలుగుతుంది.

ముగ్గుతో ఆరోగ్యం

సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ప్రత్యక్షమవు తాయి. ఆడపడుచులు తెల్లవారుజామునే లేచి దీక్షతో రంగవల్లులను తీర్చిదిద్దడం సంక్రాంతి సమయంలో అందర్నీ ఆకర్షించే మనోహర దృశ్యం. ముగ్గులు వేయడంలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పేడనీళ్లతో గృహప్రాంగణాన్ని అలికి శుభ్రంచేసి సున్నపు పిండితో ముగ్గులు వేయడం వల్ల క్రిమికీటకాలు నశిస్తాయి. ముగ్గులోని కళాత్మకత కంటి నరాలను ప్రేరేపించి మెదడుకు సంతోషభావాన్ని అందిస్తుందని చెబుతారు. మొత్తానికి రంగవల్లులు వేయడం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.

About Author

By editor

Twitter
Instagram