– డాక్టర్‌ ‌రమణ యశస్వి

‌శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో  ప్రత్యేక బహుమతి పొందినది


పెద్దమ్మ రోజూ చదివే దినపత్రిక వద్దన్నదని పేపర్‌ ‌బాయ్‌ ‌చెప్పాడు. నాకు తెలిసి పెద్దమ్మ గత ఇరవై ఏళ్లల్లో పొద్దున్న పేపర్‌ ‌తెప్పించు కోవడం గానీ, చదవడంగానీ మానలేదు. తానే ఒకసారి మాటల్లో ఈ విషయం నాకు చెప్పినట్లు గుర్తు.

డబ్బు పొదుపు చేస్తుందా? లేక ఈ కరోనా సమయంలో డైలీ పేపర్‌తో కూడా వైరస్‌ ‌వస్తుందని భయపడుతోందా? పెద్దమ్మ అనుభవంతో పండిపోయిన పెద్దావిడ. మనసున్న స్త్రీమూర్తి. మనసు పీకుతోంది. ఇదే విషయం నా భార్యతో పంచుకున్నా.

‘వయసు పెరిగే కొద్దీ డబ్బుల మీద యావ పెరుగుతుంది. అందుకే పేపర్‌ ఆపేయించింది. ప్రాణం మీద తీపి కూడా పెరుగుతుంది. పేపర్‌తో వైరస్‌ ‌వస్తుందని భయంతో కూడా చేసివుండొచ్చు.’ అంటూ మళ్లీ టీవీలో లీనమైపోయింది. డైలీ సీరియల్‌ ‌చూసే సగటు మహిళ సమాధానంలాగా అనిపించి చిరాకు వచ్చింది. ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్న నేను ఆ రోజు వార్తలు కంప్యూటర్‌లో పంపే పనిలో మునిగిపోయాను.

మరుసటి రోజు కేబుల్‌ ఆపరేటర్‌ ‌ఫోన్‌ ‌చేసి ‘మీ పెద్దమ్మ గారు కేబుల్‌ ‌కనెక్షన్‌ ‌తీసేయమన్నారు’ అని చెప్పాడు. త్వరత్వరగా మధ్యాహ్న భోజనం చేసి వెళ్తున్న నన్ను చూసి మా ఆవిడ అడిగింది ‘‘ఎక్కడికీ పరుగు? బయట లాక్‌డౌన్‌ ఉం‌దని మర్చిపోతున్నారు’ అని కరోనా హెచ్చరిక చేసింది.

‘పెద్దమ్మ కేబుల్‌ ‌కనెక్షన్‌ ‌తీసేయమందట.

అసలు ఎలా ఉందోనని చూసొద్దా మని వెళ్తున్నా’ అంటూ మాస్కు పెట్టుకొని బయట అడుగు పెట్టాను.

‘కూడబెట్టింది, పిల్లలు అమెరికాలో సంపాదించి పోస్తుంది సరిపోవట్లేదేమో పొదుపు మొదలుపెట్టింది’ అంటూ లోపలికెళ్లింది.

పెద్దమ్మ గారింటికేసి చిన్నగా నడవసాగాను. ఆలోచనలు కూడా నాతో సాగుతున్నాయి.

మా పెద్దమ్మ ఇల్లు రెండుమూడు వీధుల తర్వాతే. పోలీసులతో గొడవలెందుకు అనుకొని బండి తీయకుండా చిన్నగా గల్లీల్లో తిరుగుతూ వెళ్తున్నాను. డెబ్బయ్యేళ్ల పెద్దమ్మ మాకు కొంచెం దూరపు చుట్టం. పెద్దమ్మ వరస అవుతుందని తెలుసుకొని అలా పిలవడం మొదలుపెట్టాను.

పిల్లలిద్దరూ అమెరికాలో ఉండటం వలన ఆమె ఒక్కతే ఇక్కడ వుంటున్నది. భర్త రెండేళ్ల క్రితం కాలం చేశారు.

ఉద్యోగరీత్యా నేను ఈ వూరు వచ్చి మూడు సంవత్సరాలైంది. మా అమ్మ చెప్పింది ఆ అమ్మ ఇక్కడే ఉంటుంది కలవమని. అప్పటినుంచి నేను పెద్దమ్మని వీలున్నప్పుడల్లా కలిసి వస్తున్నాను. ఆమె అడిగే చిన్న చిన్న పనులు చేసి పెట్టి కొంచెం సాయంగా ఉంటున్నాను. అవసరమైనప్పుడు ఫోన్‌ ‌చేసి పిలుస్తుంది. ఈ మధ్య కలిసి వారం అవుతోంది. ఆమెకి నేను వస్తూ పోతుండటం చాలా ధైర్యం ఇచ్చింది అని ఆమె మాటల్లో, ముఖంలో తెలుస్తోంది నాకు. పాపం ఒక్కతే వుండే పెద్దావిడకు సాయం చేయడం నాకు కూడా మానసికంగా ఆనందాన్నిస్తోంది. మా ఆవిడను కూడా తీసుకొచ్చి పరిచయం చేసాను. మా ఇంటికి పెద్దమ్మ వచ్చి భోజనం కూడా చేసి వెళ్లింది. మా పిల్లలకు కూడా పెద్దమ్మ బాగా నచ్చింది. పెద్దమ్మా, వాళ్లాయన టీచర్లుగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. మగ పిల్లలిద్దర్నీ బాగా చదివించారు. ఇద్దరూ ఏదో కంపెనీ ద్వారా అమెరికా వెళ్లి కూడా పదేళ్లపైనే అవుతుంది. వాళ్లిద్దరూ మళ్లీ ఇటు తిరిగి చూడలేదు, గ్రీన్‌ ‌కార్డు రాలేదు, వచ్చిన తర్వాత వస్తాము అనుకుంటూ. ఈ లోపు తండ్రి చనిపోయినప్పుడు వస్తారు అనుకుంటే.. వస్తే వీసా సమస్యలు వస్తాయి, అలాగే పిల్లల పరీక్షల టైం అని ఫోన్‌లో ఆందోళన, అశక్తతత, ప్రేమ ఒలకబోశారు.

ఇంతలో లోపలనుండి తాళం వేసున్న ఇంటిలో నుండి వచ్చిన చిన్న బొచ్చు కుక్కపిల్ల అరుపులతో నా ఆలోచనలు ఆగిపోయాయి. కుక్క అరుపు విని పెద్దమ్మ వచ్చి నన్ను చూసి వెళ్లి తాళం తెచ్చి తలుపు తీసి ఆహ్వానించింది.

కాసేపు కరోనా ముచ్చట్ల తర్వాత ఆమె ఆరోగ్యం, అవసరాల గురించి తెలుసుకొన్నాను. ఆమె మాటల్లో కరోనా భయం కొంత కనిపించింది. తన కన్నా న్యూయార్క్, ‌న్యూజెర్సీలలో ఉంటున్న పిల్లల గురించి ఆందోళన చెందుతున్నట్లు అనిపించింది.

పేపర్‌, ‌కేబుల్‌ ‌విషయం అడుగుదామని అనుకునే లోపే తనే ఆ విషయాలని తీసుకొచ్చింది మజ్జిగతో పాటు.

టీవీ, పేపర్లతో కరోనా భయం ఎక్కువవు తోందిట. పొద్దుగూకులు అవే వార్తలు. అమెరికా వార్తలు చూస్తుంటే ఇంకా బాధగా వుంటోందిట. కాబట్టి పొదుపు కాదు, పేపర్‌తో వైరస్‌ ‌వస్తుందని కాదు అని నాకనిపించింది. నిజానికి తన ప్రాణం మీద కన్నా పిల్లల ఆరోగ్యం మీద బెంగే ఆమెకు ఎక్కువనిపించింది.

సైకాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు. టీవీ అదే పనిగా చూస్తే ఇలాంటి భయాలు ఎక్కువయి ప్రాణభయం, ఆత్మహత్యల ఆలోచనలు వస్తాయని. మా ఇంటికి వచ్చి ఉండమని బతిమాలాను. పిల్లలు, మా ఆవిడ వుంటారు కాబట్టి కాలక్షేపం అవుతుందని చెప్పాను. అంతకు ముందులాగానే రానంటే రానన్నది. చాలాసార్లు కొన్ని రోజులన్నా వచ్చి ఉండమని అడిగాను. ఎప్పుడూ వచ్చి ఉండలేదు. ఇంతలో ఈ కరోనా గోల మొదలయ్యింది

 మాటల మధ్యలో పిల్లలిద్దరూ అక్కడ ఇబ్బంది పడుతున్నారయ్యా ఎలా బయటపడతారో ఈ కరోనా కోరల్లోంచి అని పమిట చెంగుతో కళ్లు వత్తుకుంది.

 వాళ్లు ఫోన్‌ ‌చేస్తున్నారా? అని అడిగితే.. వాళ్లు పిల్లల్ని, కుటుంబాన్ని రక్షించుకునే బాధల్లో వున్నారు. నేను బాగానే వున్నానుగా అంది వాళ్లని సమర్ధిస్తూ.

 పెద్దమ్మా! నీ ఫోన్‌ ‌రీఛార్జ్ ‌చేసి చాలా రోజులైంది.. పిల్లల్తో మాట్లాడాలన్నా, నన్ను పిలవాలన్నా ఫోన్‌ ‌ముఖ్యం. ఇవ్వాళ వేయిస్తాను అని చెప్పాను.

 పెద్దమ్మకి బ్యాలెన్స్ ‌నేను మూడు నెలలకొకసారి వేయిస్తూ వుంటాను. ఒక్కొక్కసారి అయిపో వస్తున్నప్పుడు ఆమే నాకు ఫోన్‌ ‌చేసి వెయ్యమని చెప్తుంది. నా ఆలోచనలకు గండి కొడుతూ ‘ఇంకొన్ని రోజులు బ్యాలెన్స్ ‌వస్తుంది, ఇక వేయించొద్దు’ అంది. ఆమె ముఖంలో యేవో తెలియని, నేను చదవలేని భావాలు కనపడుతున్నాయి. ఆమె అంతకు ముందులా లేదనిపించింది. ఆమెని వదలి రావడం తప్పేమో అనిపించేలా వుంది పెద్దమ్మ పరిస్థితి. తనే ‘వెళ్లిరాయ్యా బయట పరిస్థితులు బాగాలేవు’ అనడంతో తప్పక బయల్దేరాను.

సాయంత్రం టీ తాగుతూ నా భార్యతో పెద్దమ్మ బాధాకర పరిస్థితి గురించి టూకీగా చెప్పాను.

‘నీ జర్నలిస్టు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. బయటవాళ్ల ఫీలింగులు కనిపెట్టడం కాదు, నా గురించీ పిల్లల గురించీ ఆలోచించు. ఈ కష్ట సమయంలో వాళ్లకేమీ? డబ్బులున్నయ్‌. ‌బాగుంటారు.’

ఈ లాక్‌డౌన్‌ ‌పొడిగిస్తూ పోతే మనం ఎలా బతుకుతాం? అని తన దిగులు మబ్బుల్లోంచి కళ్లల్లో వర్షించింది. అంటే కరోనా అందరిలో తెలియని దిగులుని కలిగిస్తోందని అనిపించింది నా జర్నలిస్టు మనసుకి. నిజానికి నాకు మృత్యు భయం కన్నా బతుకు భయం ఎక్కువగా వుంది. అద్దె ఇల్లు, పిల్లల చదువులు, చాలీచాలని ఒంటి రెక్క జీతం.

ఆలోచనలు తెంచుకొని ‘ఎందుకో తెలీదు పెద్దమ్మ సెల్‌ ‌రీఛార్జ్‌కి ఇష్టపడలేదు.’ అన్నాను.

‘చాల్లే బాబు కిందటిసారి చేసిన ఏడొందలే ఇంతవరకూ ఇవ్వలేదు. మళ్లీ ఎక్కడ చేయించగలం’ అని మళ్లీ అది గుర్తుచేసింది. ఈ మధ్య ఆ ఏడొందల గురించే పెద్దమ్మ మీద డైలాగులు గుప్పిస్తోంది మా ఆవిడ. ఎందుకంటే ఆ ఏడొందల ప్రభావం మా నెల బడ్జెట్‌ ‌మీద చాలానే పడింది. అడగటం బాగుండదని నేను, పెద్దావిడ మర్చిపోయుంటుంది గుర్తు చేస్తే ఇస్తుందేమోనని ఆవిడ.

మళ్లీ మొదలెట్టింది ‘వాళ్లాయన చస్తే నువ్వు కర్మకాండలు స్వయంగా జరిపించి, నిత్య కర్మలు కూడా చేసినా, ఆమె బట్టలు పెట్టడం తప్పించి ఏమీ చెయ్యలా. ఆ పది రోజులు మన సంసారం ఎలా గడిచిందోనని అడగలేదు.’ కన్నీరు పమిటతో తుడుచుకొని లోపలికెళ్లిపోయింది. నువ్వు మధ్య తరగతి సామాన్య గృహిణిలా ఆలోచిస్తున్నావు. మన ఆర్ధిక పరిస్థితుల వల్ల కామోసు. నేను మా పెద్దమ్మ, అలాగే ఒక ఒంటరి గృహిణికి ప్రతిఫలాపేక్ష లేకుండా సాయం చేద్దాము అని ఆలోచిస్తున్నాను. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. ఇద్దరమూ కరెక్ట్.

అది నిజమే. చుట్టాలలో బాగా బతికిన ఒంటరి మహిళ, పిల్లలు దూరంగా వున్నారు. ఆదుకోవడం ధర్మమేలే. మన పరిస్థితి కన్నీటి కారుచిచ్చులా ఉంది’ నసుక్కుంటూ వెళ్లింది.

పెద్దాయన చనిపోయిన తర్వాత ఆవిడ నన్ను కొంచెం సొంత మనిషిలా చూడటం మొదలెట్టింది.

అయితే ఈ కరోనా అందరి ఆలోచనలలో మార్పు తెచ్చినట్లు ఆమె మదిలో కూడా మార్పు తెచ్చినట్లుంది. తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటోంది. పిల్లలు వస్తారని ఆశలు వదులుకున్నట్లుంది. అలాగే ఈ కరోనా మహమ్మారి పిల్లలకేమైనా హాని చేస్తుందేమోనని ఆందోళనలో వున్నట్లుంది.

పెద్దమ్మ రెండ్రోజుల తర్వాత ఫోన్‌చేసి నన్నూ, మా ఆవిడని కూడా రమ్మని చెప్పింది.

పిల్లలకి టిఫిన్లు పెట్టి, జాగ్రత్తలు చెప్పి ఇద్దరం మాస్కులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లాము, ఏమి ఇబ్బంది వస్తే అకస్మాత్తుగా రమ్మని పిలిచిందో అనుకుంటూ.

వెళ్లి కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చింది . సెల్‌ ‌బ్యాలెన్స్ ‌డబ్బులు ఏడొందలు ముందుగా నా చేతిలో పెట్టింది. ‘రాసి పెట్టుకొని కూడా మొన్న నువ్వు వచ్చినప్పుడు మర్చిపోయాను ఈ డబ్బులు ఇవ్వడం’ అని నొచ్చుకుంది. తర్వాత తాను ఉంటున్న ఆ ఇంటి దస్తావేజులు నా భార్య చేతిలో పెట్టి ‘మా ఆయనకు తలకొరివి పెట్టి కొడుకు కాని కొడుకు అయ్యాడమ్మా మీ ఆయన మాకు.’

మా ఆవిడ కళ్లనీళ్లు పెట్టుకొని ‘వద్దు అత్తయ్యా మీ పిల్లలుండగా మాకు ఇవ్వడం బాగుండదు’ అని పత్రాలు ఆమెకివ్వబోతే.. ఆమె వారించి దీవించింది. తాను పెద్దమ్మ కాళ్లకి మొక్కి కింద కూర్చుండి పోయింది. ఊహించని ఈ పరిణామానికి భావోద్వేగానికి గురైనట్లుంది. మా ఆవిడ్ని లేపి ‘మీరు ఈ పట్నంలో ఇల్లు కూడా లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాను. మా పిల్లలిక ఇక్కడికి రారని అర్ధమైపోయింది. అందుకే ఈ నిర్ణయం’ అంది పెద్దమ్మ నిశ్చయంగా.

తర్వాత, ‘బ్యాంకులో 20 లక్షలు వున్నాయి. ఒక ఐదు లక్షలు నేను చిన్నప్పుడు చదువుకున్న జిల్లా పరిషత్‌ ‌స్కూల్లో ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్‌ ‌కోసం డిపాజిట్‌ ‌చేయించు. ఇంకో 5 లక్షలు ఆడపిల్లలకు పాఠశాలల్లో మరుగుదొడ్లు, బల్లలు ఇస్తున్న రోటరీ సంస్థకు ఇచ్చి, అవి నా పేరుమీద ఇవ్వమని చెప్పు. మిగిలిన పది లక్షలు మీ పిల్లల చదువుకు మాత్రమే వాడుకోండి. విదేశాలకు వెళ్తాము అంటే ఆ డబ్బు ఇవ్వకండి.’ అని కళ్ల నీళ్లుపెట్టుకొని కుర్చీలో కూలబడిపోయింది. ఇద్దరం కలిసి చాలా సేపు ఆవిడని ఓదార్చితేగాని మామూలు స్థితికి రాలేక పోయింది. మనిషికి ఎంత డబ్బున్నా ఓదార్పునిచ్చే ఒక భుజం ఆసరా లేకపోతే ఎలా వుంటుందో ప్రత్యక్షంగా చూసాం.

ఆ తర్వాత ఆమె మానసిక పరిస్థితి అర్ధం చేసుకొని నేను రోజూ ఏదో ఒక టైంలో పెద్దమ్మని చూసివస్తున్నాను.

ఒక వారం రోజులు ఇలా గడిచిన తర్వాత..

ఒక సాయంత్రం ఆమెతో కాసేపు గడిపి ధైర్యం చెప్పి వస్తుంటే ‘నాయనా రేపు ఉదయం పదకొండుకల్లా వచ్చి చూసి వెళ్లు’ అంది నా చేతిలో మజ్జిగ గ్లాసు తీకుంటూ.

మరుసటి రోజు ఆమె చెప్పినట్లే వెళ్లాను. కుక్కపిల్ల పెద్దగా అరుస్తోంది. లోపల తలుపు గడియ వేసి వుంది. పెద్దమ్మ ఎదురు వచ్చి తలుపు తియ్యలేదు. బయటినుంచే గడియ తీసుకొని లోపలికి వెళ్లాను. పెద్దమ్మ దేవుడి గదిలో కింద అచేతనంగా పడి వుంది. సంకల్ప మరణం. ఎంతో ప్రయత్నం చేస్తే, దేవుడి కృప ఉంటే లభిస్తుంది. నిష్కల్మష ప్రశాంత నిస్వార్ధ జీవనం గడిపిన పెద్దమ్మకి అది సాధ్యమయ్యింది అనిపించింది.

కింద ఆవిడ పక్కనే కూలపడ్డాను, ఏడుపు ఆపుకోలేక. అలా ఎంతసేపున్నానో ఆ షాక్‌లో నాకే తెలీలేదు. కర్తవ్యం గుర్తొచ్చి ఉలిక్కి పడి లేచాను.

అక్కడ ఒక దేవుడి పటం ముందు ఉన్న తెల్ల కాగితం నా దృష్టిని ఆకర్షించింది. తీసి చదవబోయే ముందు, మా ఆవిడకు ఫోన్‌ ‌చేసి అర్జెంటుగా రమ్మని చెప్పాను. ఆ లేఖలో ఇలా వుంది.

‘మా పిల్లలు రారని తెలుసు రవీ. నేను అనాథలా వెళ్లిపోకూడదని నీ సాయం తీసుకున్నాను. మా వారు చనిపోయినప్పుడు కానీ, ఇప్పుడు నా చావుకి కూడా నీ అండ అవసరం గుర్తించి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ కరోనా సమయంలో చనిపోవాలనే సంకల్పం తీసుకున్నా. మొదటి కారణం అమెరికాలో విధ్వంసం సృష్టిస్తున్న కరోనాతో పిల్లలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. వాళ్లకి ఏమైనా అయ్యేలోపే నేను త్వరగా చనిపోవాలని చావు తలపుతోనే బతుకుతున్నాను. అలాగే ఈ కరోనా సమయంలో కాలం చేస్తే పిల్లలు రాకపోయినా ఎవరూ తప్పు పట్టరు. తండ్రి చచ్చినా రాలేదు, తల్లి చచ్చినా రాలేదు అనే అప్రతిష్ట పిల్లలకు రాకుండా చేయాలనే పట్టుదల పెరిగిపోయి మరణ సంకల్పం తీసుకున్నా. ఈ కరోనా దయ వల్ల విమానాలు లేవు. ఎవరూ ఎటూ తిరగకూడదని ఆంక్షల వల్ల రాలేదని అందరూ అనుకుంటారు. అదృష్టం కొద్దీ తల కొరివి పెట్టడానికి నువ్వు దొరికావు. తెలియచెయ్యవలసిన వాళ్లందరికీ తెలియచెయ్యి. ఎవరూ రాలేరు కరోనా వల్ల. నలుగురు పట్టేవాళ్లని తెచ్చి పనికానిచ్చెయ్యి. మంచి నక్షత్రం చూసుకొని పోతున్నా ఇల్లు పాడు పెట్టక్కర్లా. మంచిరోజు చూసుకొని ఇంట్లో చేరిపోండి. మీ కుటుంబానికి సదా ఆ దేవదేవుడి ఆశీస్సులు వుండాలని వేడుకుంటూ.. సెలవు.’

పెద్దమ్మ చెప్పినట్లే ఆవిడ పైలోకాల్లో శాంతిగా వుండాలని శ్రాద్ధకర్మలన్నీ శ్రద్ధగా చేసాము. వాళ్ల ఊళ్లోని జిల్లాపరిషత్‌ ‌స్కూల్‌కి కబురు చేసాము, ఇలా ఒక 5 లక్షలు డిపాజిట్‌ ‌చేస్తాము, కరోనా గోల వదిలిన తర్వాత అని. మాకు మనసు మారక ముందే పెద్దమ్మ డబ్బులకు న్యాయం చెయ్యాలని కోరుకున్నాము. పెద్దమ్మ వల్ల మా ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చింది. కరోనా నుంచి బయట పడితే సమాజసేవకు మా వంతు సహకారం అందించాలని అనుకున్నాము, పెద్దమ్మకి మనసులోనే నమస్సులు అర్పించుకుంటూ..

About Author

By editor

Twitter
Instagram