– కర్రా నాగలక్ష్మి

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది


డాల్లాస్‌లోని కొడుకింటికి వచ్చి ఇవాళ్టికి వారం దాటింది, కాస్త కాస్త జెట్లాగ్‌ ‌తగ్గి ఇక్కడి సమయానికి అలవాటు పడుతున్నాను.

మావారు రిటైర్‌ అయినప్పటి నుండి ప్రతీ ఏడాదీ ఆరునెలలు పిల్లలతో గడపడం అలవాటుగా మారింది, ఈ దేశంలో నాకు నచ్చనిది పనిమనుషులు లేకపోవడమే, అయితే మన దేశంలోలా దుమ్ము ధూళి వుండదు కాబట్టి ఆ పని తప్పుతుంది. మెక్సికన్స్ ‌గంటల లెక్క దొరుకుతారు. కానీ నాలుగు డబ్బులు ఎక్కువ యెక్కడ దొరికితే అక్కడకి వెళ్లిపోతారు, దాంతో మళ్లా పనిమనిషి (ఇక్కడ పనిమనిషి అనకూడదట) వేట మొదలవుతుంది, ముందు వాళ్లని ఇంటర్వ్యూ చెయ్యడం ఆమెకి మనం నచ్చి మనకి ఆమె నచ్చితే ఆమె మనకి సహాయం చెయ్యడానికి వస్తుంది, మొత్తంమీద పనిమనిషి వేటలోనే రోజులు గడిచిపోతుండేవి.

నాకు ఇక్కడికి రావాలంటే జంకు యెందుకంటే పనిమనిషి వుండదని, డెబ్భైలకి దగ్గర పడుతున్న ఈ వయసులో పనులు చెయ్యడం కష్టం, అలాగని కోడలొక్కర్తీ పనిచేసుకుంటూ వుంటే చూడలేను. ఇక్కడ వుంటే పనులు చేసుకోలేక వెనక్కి వెళ్లిపోదామని అనిపిస్తుంది, అక్కడ వుంటే పిల్లల మీద దిగులుతో ఇక్కడికి రావాలనిపిస్తుంది.

నా ఈ పరిస్థితి మా వాళ్లకి తెలుసు, ఈసారి ఇంక వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు, కారణం మంచి హెల్పరు, అదీ ఫుల్‌టైము హెల్పరు (అమెరికాలోనే వుండి పోదామనుకున్నప్పుడు ఇక్కడి భాషని కూడా అలవాటు చేసుకోవాలిగా?) దొరికిందని కోడలు ఫోన్‌ ‌చెయ్యడమే.

తెల్లవారిన దగ్గర నుంచి ప్రతీ పనీ ఎంతో చురుగ్గా, అభిమానంగా చేస్తున్న ఆమెని మొదటిచూపులోనే మంచి మనిషని, వయసు అరవైలు దాటేయని పోల్చుకున్నాను. వయసు కచ్చితంగా చెప్పలేనుగాని అరవై దాటిందని మాత్రం చెప్పగలను. మావారి ఉద్యోగరీత్యా దేశమంతటా తిరగటం వల్ల నాకు ముఖ్యమైన భాషలన్నీ వచ్చు. తప్పో ఒప్పో ఎదుటివారితో వారి భాషలో మాట్లాడడం నాకో సరదా, మొదటి పరిచయంలోనే గుజరాతీలో పలకరించి నర్మదని ఆశ్చర్యపరిచేను.

ఒక వయసు దాటిన తరువాత టీవీ చూస్తూ గడపడం కష్టమే, మాట్లాడ్డానికి మరో మనిషి దొరకడం ఈ రోజులలో ఓ అదృష్టంగానే భావించాలి, అదీ సుమారుగా మన ఏజ్‌ ‌గ్రూపు అయితే బంగారానికి తావి అబ్బినట్లే.

కొత్తలో నాకిష్టమైన ఢోకలా, ఖమండ్‌ ‌లాంటివి చేయించుకోడం, పులిహోర బొబ్బట్లు లాంటివి ఆమెకి నేర్పడం లాంటి వాటితో గడిచిపోయింది.

మంచంమీద కూడు దొరుకుతూ వుండే సరికి నాకు స్వర్గం దిగివచ్చినట్లైంది.

పిల్లలతో గడపడానికి కావలసినంత సమయం దొరకడం మరో అదృష్టం.

అష్టలక్ష్మీ స్తోత్రం చదివేటప్పుడు ఎప్పుడూ నాకో అనుమానం వచ్చేది, అదేంటంటే అష్టైశ్వర్యాలలో దాసదాసీల సుఖం

 ఎందుకు కలపలేదో, పాపం ఇక్కడివారికి అన్ని సుఖాలూ వుంటాయిగాని పనిమనుషుల సుఖం మాత్రం వుండదు. అలాంటి సమయంలో సోమవారం నుంచి శనివారం సాయంత్రం వరకు ఇంట్లో వుండి పనిచేస్తూ, ఆదివారానికి సరిపడా ఆహారం శనివారమే చేసి ఫ్రిడ్జ్‌లో సర్దివెళ్లే నర్మద దొరకడంతో మహాలక్ష్మి అనుగ్రహం నా ఇంటిమీద పరిపూర్ణంగా వుందనే భావన కలిగేది.

ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడుతూ తన పని తాను చేసుకుపోయే నర్మద అంటే ఇంట్లో అందరం ఇష్టపడసాగాం.

రాత్రి నా గదిలోనే కార్పెట్‌మీద పక్క పరచుకొని నిద్రపోయేది, అలారం అవసరం లేకుండా అయిదుకొట్టేసరికి లేచిపోయేది. అర్ధరాత్రి దాటినా నిద్రపట్టకపోవడం, పగలు ఎనిమిదయినా తెలివి రాకపోవడం గత పదేళ్లుగా అలవాటుగా మారిన నాకు పక్కమీద పడుకోగానే నిద్రపోయే నర్మదను చూస్తే కాస్త ఈర్ష్యగా అనిపించేది.

నర్మద భర్త లేడని, కొడుకింట్లో వుంటోందని, కాలేజీ చదువులకి వచ్చిన మనుమలు వున్నారని తెలుసు, ఇంత సంపన్న దేశంలో వున్న నర్మదకి అరవైలు దాటిన వయసులో ఇలా రోజంతా పనిచెయ్యవలసిన అవసరం ఏమిటో మాత్రం ఎంత తలబద్దలు కొట్టుకున్నా బోధపడేది కాదు.

నాకు నేనే రకరకాల కథలు అల్లుకొనే దాన్ని, ఓ కథలో కోడలు విలను, అత్తగారిని దేశంకాని దేశం తీసుకువచ్చి నానా బాధలూ పెట్టి ఇలా వేరే ఇళ్లల్లో పనులకి కుదర్చడం, ఆ కథ కొంతవరకు బాగానే వుండేది కాని ఆపైన నా ఊహ నాకే నచ్చేది కాదు.

మరో కథ.. ఆ కొడుకు నర్మద సొంత కొడుకు కాదు, నర్మద పెంచుకున్న కొడుకు, నర్మద భర్త మరణించేక ఆమె సొమ్మంతా తీసుకొని ఆమెని ఇలా పనిమనిషిగా మార్చేడు, ఓకే ఇది బాగున్నట్లే వుంది. కాని మరి నర్మద మన దేశంలోనే వుండాలి కదా? ఇక్కడికెలా వచ్చింది, అలాంటి కొడుకైతే పాస్‌పోర్టులు, వీసాలు వగైరా ఖర్చులు పెట్టి ఇంత దూరం ఎందుకు తెస్తాడు, అక్కడే ఆమెని వదిలేయొచ్చు కదా? అనే అనుమానం రావడంతో ఆ కథ కూడా ఫిట్‌ అవలేదు.

నాకు నర్మద కథేంటో ఆమె ద్వారా వినాలనే కుతూహలం రోజురోజుకీ పెరిగి పోసాగింది.

ఈ విషయం కోడలి దగ్గర అంటే.. ఇంకొకళ్ల విషయాలలో తలదూర్చడం సభ్యత కాదని ఓ క్లాసు పీకింది.

ఏంటో ఈ కాలం పిల్లలు, అంటీముట్ట నట్లుంటారు, మనం అలా యెలా వుండగలం, పోనీ నర్మదనే అడుగుదాం అంటే ఏదో మొహమాటంగా అనిపించేది, నాకెందుకులే అనుకుందామని చూస్తే ఈమె ఆలోచనలతో అర్ధరాత్రి పట్టే నిద్ర కూడా పారిపోసాగింది.

డైరెక్ట్‌గా అడగలేక నర్మదతో అత్తగార్లని ఆరళ్లు పెట్టే కోడళ్ల కథలు చెప్పేదాన్ని, కాని ఆమె దగ్గర నుంచి మాత్రం ఆమె కథని రాబట్టలేకపోయేను.

మరోసారి పెంపుడు పిల్లల కథలు చెప్పేదాన్ని, ‘‘అమ్మా మీతో కబుర్లు చెప్తూ పనిచేసుకుంటూంటే సమయమే తెలీదు’’ అని చెప్పి వెళ్లిపోయేది.

నర్మద విషయం కొడుకుతో చర్చించడానికి ప్రయత్నించేను, ‘‘అమ్మా, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, మధ్యలో మనకెందుకు, హాయిగా టీవీ చూసుకో, పిల్లలతో ఆడుకో, అక్కరలేని విషయాలలో తలదూర్చకు’’ అన్నాడు.

‘‘సామెతలు బాగా వాడ్డం నేర్చుకున్నావుగాని, ఏదో వయసులో వున్నప్పుడైతే ఫరవాలేదు, జీవిత సంధ్యలో ప్రయోజకుడైన కొడుకు పంచలో, ప్రేమగా ఓ ముద్ద పడేస్తే చాలానుకొనే సమయంలో ఇలా పరాయి పంచన ఏ కారణం లేకుండా ఎందు కుంటుందీ అన్నదే నా ప్రశ్న’’.

‘‘అమ్మా నువ్వెంత మంచిదానివో తెలుసా? ప్రశ్నా నువ్వే వేస్తావ్‌, ‌జవాబు కూడా నీ ప్రశ్నలోనే వుండేలా చూస్తావు, నీలాంటివాళ్లు పదవ తరగతి పరీక్ష పేపరు సెట్‌ ‌చేస్తే నా సామిరంగా’’ అంటున్న కొడుకుని ‘‘జవాబా?, నా ప్రశ్నలోనా?’’ అన్నాను.

‘‘అదేనమ్మా ఆవిడ ప్రయోజకుడైన కొడుకుని కనలేదేమో, ప్రయోజకుడైతే ఆమెను సుఖపెట్టేవాడే కదా?’’ అని అక్కడ నుంచి వెళ్లిపోయేడు.

ఆనాటి నుంచి నా ఊహలలో నర్మద కథకి కొడుకే విలనుగా మారిపోయేడు.

వారం వారం జీతం కోడలి అకౌంటులో  వేయమనేది. ఓపిక వున్న ఇప్పుడే ఆమె ఆ పంచనా ఈ పంచనా బ్రతకవలసి వస్తోంది, వయసుడిగిన తరువాత ఆమె గతేమవుతుంది అనేది నాకిప్పుడు పట్టుకున్న కొత్త సమస్య.

ఖాళీ తల భూతాల నివాసం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.

నాది కాని సమస్యతో కొన్ని రోజులు ఆలోచించి నాకు తోచిన పరిష్కారాలు ఆమెకి తెలియజెయ్య సాగేను. బ్యాంకులో నర్మద పేరుమీద అకౌంటు ఓపెన్‌ ‌చేసుకొని వారం వారం వచ్చే జీతం అందులో వేసుకొని కొడుకుకి కొంత మొత్తం ఇచ్చి మిగతాది ఆమె దగ్గరే వుంచుకొంటే కాలుచెయ్యి స్వాధీనం తప్పినప్పుడు వాడుకోవచ్చన్నది ఓ సూచన, లేదా మన దేశం తిరిగి వెళ్లిపోయి మిగతా పిల్లల దగ్గర మిగిలిన జీవితం గడపడం.. ప్రతీరోజూ ఇవే సూచనలు మార్చి మార్చి చేస్తూ వుండేదాన్ని.

‘‘అమ్మా నాకున్నది వీడొక్కడేనమ్మా, వీడిని వదిలి నేనుండలేనమ్మా, మీరు మంచివారు, నా గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకండమ్మా’’ అని అక్కడ నుంచి వెళ్లిపోయేది.

ఎలాగైనా నర్మదని ఆమె కొడుకు, కోడలు చెర నుంచి తప్పించి ఆమెకి మంచి భవిష్యత్తు కల్పించాలని గట్టిగా అనుకున్నాను.

అందుకే ప్రతీవారం జీతంలో కొంత సొమ్ము దాచుకోమని చెప్పసాగాను. ఆమె నవ్వుతూ విని తలూపి వెళ్లిపోయేది.

ఇదేం మనిషి, ఎన్ని చెప్పినా ఈ గాడిద బ్రతుకే కావాలంటుంది, ఓసారి గట్టిగా చెప్పి చూడాలని నిశ్చయించుకున్నాను.

ఎదురుచూస్తున్న సమయం ఓ పదిరోజులలో వచ్చింది. ఓ శుక్రవారం కొడుకు, కోడలు పిల్లలని తీసుకొని ఫ్రెండింట్లో పార్టీకి వెళ్లారు. శుక్రవారం పార్టీ అంటే నేను రానని వాళ్లకి తెలుసు. శుక్రవారం రాత్రి మొదలయ్యే పార్టీ శనివారం సాయంత్రం వరకు జరుగుతుందని నా అనుభవం. అందుకే దానికి దూరంగా వుంటాను.

ఈ శుక్రవారపు రాత్రిని ఉపయోగించుకొని నర్మదని ఆమె కొడుకు చెర నుంచి విడిపించాలని అనుకున్నాను.

రాత్రి ఫలహారమయేక నా వాదనలో భాగంగా ‘‘నర్మదా ఈసారి నువ్వేం చెప్పినా వినను. ఇప్పటివరకు వాళ్లకోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావు. ఇక పైనైనా నీ జీవితం నీకు నచ్చినట్లు హాయిగా గడుపు, దానికోసం నీకే సహాయం కావాలన్నా చేస్తాను, ఇండియా వెళ్లాలనుకుంటే దానికి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను’’ లాంటి మాటలతో ఆమెను కన్విన్స్ ‌చేద్దామనుకున్న నన్ను ‘‘నేను కోరుకున్న జీవిత మిదేనమ్మా, నాకేం కష్టంలేదు’’ అన్న నర్మద మాటలకి ఆశ్చర్యపోయాను.

‘‘ఇదా నువ్వు కోరుకున్న జీవితం, ఎందుకు నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటావు. నేనేం చిన్నపిల్లలా కనబడుతున్నానా? బుద్ధీ జ్ఞానం వున్నవాళ్లు ఎవరైనా ఇలా పరాయి ఇళ్లల్లో పనులుచేసి బ్రతకాలని కోరుకుంటారా?’’

‘‘నేను కోరుకుంటున్నాను, అదే నేను చేసిన తప్పుకి నేను వేసుకున్న శిక్ష కాబట్టి.’’

‘‘తప్పు…. శిక్షలాంటి మాటలు వాడి నీ కొడుకుని వెనకేసుకురాకు, కని పెంచి విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను ముసలి వయసులో జాగ్రత్తగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం కాదూ…’’

‘‘ఔనమ్మా, అది నీలాంటి తల్లులకు, కాని నాలాంటి తల్లులకు కాదు’’.

‘‘సరే, సరే, నీ కొడుకు ప్రయోజకుడు కాలేక పోయేడు, అది నీ మీద వేసుకున్నావు చూడు అది నీ గొప్ప మనసుని చూపిస్తుంది, నీకు కొడుకు మీద అపారమైన ప్రేమ వుంది. కాదనను, ఇప్పటివరకు ఆరోగ్యంగా వున్నావు, ఆర్జించ గలుగుతున్నావు కాబట్టి నీ కొడుకు, కోడలు నిన్ను చూసుకుంటున్నారు. ఇప్పుడున్న శక్తి రేపుండదు. శక్తి ఉడిగేక నీ బ్రతుకేంటి? ఎలా వుంటావు? ఎక్కడ వుంటావు? అందుకే రేపటి గురించి ఆలోచించుకోమంటున్నాను.’’

‘‘నే చెప్పే కథ పూర్తిగా వినండి, నేనెలాంటి తల్లినో అప్పుడు మీకే తెలుస్తుంది.’’

ఎప్పటి నుండో నర్మద కథ వినాలని ఎదురుచూస్తున్నాను, అందుకే ‘‘సరే చెప్పు’’ అన్నాను.

‘‘గుజరాత్‌లో ఓ చిన్న పట్టణంలో పద్నాలుగేళ్ల వయసులో ఓ ఉమ్మడి కుటుంబంలో నాలుగో కోడలుగా కాలుపెట్టాను. కళ్ల నిండా కలలు, కానీ ఆ కలలు ఆ యింట్లో తీరవని తెలిసేలోపు ఓ పిల్లాడి తల్లినయ్యాను. ఉమ్మడి కాపురం. అత్తగారు, మావగారు, ఆరుగురు బావమరుదులు, నలుగురు ఆడబిడ్డలు, వీరు కాక యెనభైయేళ్లు దాటిన మా వారి తాత, నాయనమ్మ, ఇద్దరు మరుదులు, ఇద్దరు ఆడబిడ్డలు పెళ్లికున్నారు. నలుగురు కోడళ్లం పొద్దున్న ఆరుకి వంచిన నడ్డి రాత్రి పదయేవరకు యెత్తే వీలుండేది కాదు.

ఇక వ్యాపారం అంటే అదీ ఉమ్మడి ఆస్తే. వేరు పడాలి అంటే నాయనమ్మ, తాత కాలం చేసేవరకు వీలు లేదు. మా పుట్టింట్లో కూడా ఇదే తంతు. ఆర్జన ఎంత వున్నా ఖర్చు మాత్రం ఆచితూచి చేస్తారు. రేపటి గురించి ఆలోచించాలని అంటారు.

జీవితమంటే ఇంతేనా? అనే నిరాశ కలుగ సాగింది. నేను కట్టే బట్ట కొనుక్కోవాలన్నా, పిల్లాడికి ఓ చాక్లెట్‌ ‌కొనాలనుకున్నా ఇంట్లో అందరి అనుమతీ తీసుకోవాలి. నా ఇల్లు నాకు నచ్చినట్లుగా సర్దుకోవాలనే చిన్న కోరిక కూడా బయట పెట్టుకొనే స్వాతంత్య్రం లేదు. పిల్లాడు పెరిగి పెద్దవుతున్నాడు, నాలాగే వాడు కూడా కోరికలన్నీ చంపుకొని బ్రతకాలా? అనే ప్రశ్న నాలో అశాంతిని కలుగజెయ్యసాగింది. పిల్లవాడిని ఎవరు మందలించినా సహించలేకపోయేదానిని. పిల్లలూ పిల్లలూ కొట్లాడుకోవడం సహజమే అయినా నా పిల్లాడి మీద ఎవరు చెయ్యి చేసుకున్న పిచ్చి కోపం వచ్చేది. మనసులో వుంచుకున్న కోపం తరువాత తరువాత తీవ్రంగా బయటపడడంతో ఇంట్లో అశాంతి, నామీద చెడు అభిప్రాయం మొదలయింది. బాంధవ్యాలలో పగుళ్లుపడ్డాయి, అవి పెరిగి పెద్దవవుతూ వుండడంతో పెద్దలందరూ కలిసి వేరింటి కాపురానికి అనుమతించేరు.

ఇల్లు వేరయింది కాని వ్యాపారం అందరిదీ, కాబట్టి లెక్కపెట్టి సామాన్యంగా జీవించడానికి సరిపడా మాత్రమే సొమ్ము చేతికందేది, నా కోరికలు ఎక్కడవక్కడే వుండిపోయేయి.

ఉమ్మడి వ్యాపారంలోంచి కూడా బయట పడితేగాని నాకు కావలసిన జీవితం నాకందదని అనిపించసాగింది.

నా భర్త వ్యాపారదక్షత మీద నాకు నమ్మకం వుంది. ఉమ్మడి వ్యాపారంలోంచి బయటకి వచ్చి సొంత వ్యాపారం పెట్టుకోడానికి ప్రోత్సహించేను. ప్రోత్సహించేను అనడం తప్పేమో? గొడవలు పెట్టుకున్నాను అంటే కరెక్టేమో?

ఇంట్లో గొడవలకు ముగింపు పలకడానికి కుటుంబంతో తెగతెంపులు చేసుకొని వారిచ్చినది తీసుకొని అహమ్మదాబాదులో కొత్త వ్యాపారం మొదలుపెట్టేడు నా భర్త.

నా భర్త మీద నాకున్న నమ్మకం నిజం చేసేడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. నా కోరికలన్నీ తీర్చుకోవడంలో కాలం ఎలా పరిగెత్తిందో గమనించుకోలేదు, టైమ్‌ ‌టు టైమ్‌ ‌నా భర్త నన్ను హెచ్చరించినా నేను పట్టించుకోలేదు, నా కొడుకుకి అడిగినంతా ఇవ్వడం, చదువులో వాడు వెనకపడడం జరిగిపోయింది.

అడిగినంత సొమ్ము ఇవ్వడమే నాకు నా కొడుకు మీద వున్న ప్రేమకి కొలమానం అనుకున్నాను.

పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందనే వుద్దేశంతో ఇరవై రెండో యేట కొడుక్కి పెళ్లి చేసేం, ఒకరికి ఇద్దరయ్యేరు, ఖర్చులు బాగా పెరిగేయి. అప్పుడు తెలీలేదుగాని మనోవ్యాధో ఏమో తరచూ మా ఆయన ఆరోగ్యం పాడవసాగింది.

వాడికే పుట్టిందో కోడలు ప్రోద్బలమో అమెరికాలో వ్యాపారం చేద్దామని మొదలుపెట్టేడు. నేను, కొడుకు, కోడలు ఓ పార్టీ మా ఆయనొక్కడూ ఓ పార్టీ కాబట్టి మేమే గెలిచాం. అనుకున్నట్లుగానే ఇక్కడి వ్యాపారం అమ్మేసి అందరం అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. వ్యాపారం అమ్మినరోజు మంచం మీద పడ్డ నా భర్త నాలుగోరోజు మరణించేడు. దినవారాలు ముగించేక అమెరికాకి బయలుదేరి వచ్చేం.

భర్త మరణం నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు.

ఫ్రెండ్స్ ‌సహాయంతో ఓ స్టోరు పెట్టుకున్నాం. కొడుకు, కోడలు, నేనూ ముగ్గురం కష్టపడసాగేం. కాని అనుకున్నంత లాభాలు వచ్చేవి కావు, ఖర్చు చెయ్యడానికి అలవాటుపడ్డ మాకు వ్యాపార మెలకువలు తెలియవు. నష్టాలలో కూరుకుపోయేం. స్టోరు అమ్మడం తప్ప గత్యంతరం లేకపోయింది. డబ్బు వున్నప్పుడు అలవాటైన సరదాలు డబ్బు పోయేక పాడలవాట్లగా మారేయి. స్టోరు కొనుక్కున్నవారు మా కోడలుకి బిల్లింగులో సహాయకురాలిగా తీసుకున్నారు కాని చదువురాని నాకు ఏ ఉద్యోగం చూపించగలరు. జాగ్రత్తగా గడుపుకుంటే ఒక జీతం సరిపోతుంది కాని చెడు అలవాట్లయిన నా కొడుకు ఖర్చుల కోసం నేను ఇలా ఇళ్లల్లో పనులకి కుదురుకున్నాను’’.

వింటున్న నేను ఊరుకోలేకపోయేను, ‘‘నీ కొడుకు అలవాట్లను మానిపించాలని ప్రయత్నించలేదా? ఏ రీహేబ్‌ ‌లోనో పెడితే ప్రయోజన ముండేదేమో? అంతేకాని వాడికి కావలసినంత డబ్బు ఇస్తూ నువ్వే పాడు చేస్తున్నావని నీ కనిపించలేదా? తోటకూర నాడు చెప్పనయితిని కొడకా అని అనిపించలేదా?’’

‘‘వాడిమీద అపరిమితమైన ప్రేమ సరైన సమయంలో వాడిని హెచ్చరించలేకపోయింది, చేతులు కాలిపోయేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి? కాలిన గాయాలకు మందు రాసుకోవాలి గాని, మేం ఇక్కడికి వచ్చేసరికే వాడు అన్ని రకాల మత్తుమందులకు అలవాటు పడ్డాడు. రీహేబ్‌లో కూడా పెట్టేను. కాని మత్తుకి అలవాటుపడ్డ వాడి శరీరం పడే యాతన తల్లిగా నేను చూడలేకపోయేను. అందుకే వాడిని అక్కడ నుంచి తెచ్చి నా దగ్గరే వుంచుకున్నాను. వాడు ఇప్పుడున్న పరిస్థితికి నా తెలివి తక్కువతనమే కారణం. నేను చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. అందుకే నా కంఠంలో ప్రాణమున్నంతవరకు వాడికి కావలసినవి అందజేస్తాను. అంతేకాని వాడిని వాడి మానాన వదిలిపెట్టి నా స్వార్థం నేను చూసుకోలేను. భగవంతుడి దయ వల్ల కోడలి పెంపకంలో మనవలు బాగా చదువుకుంటున్నారు.

మంచి తల్లి నవ్వాలని మంచి కోడలిని కాలేకపోయేను, మంచి భార్యను కాలేకపోయేను, ఇప్పుడు నా కొడుకును చూస్తే నేను మంచి తల్లిని కూడా కాలేకపోయేను. కొందరి జీవితాలింతే. మీరు మంచివారు, మిగతా విషయాలు నాకు తెలీవు కాని మీ అబ్బాయిని చూస్తే తెలుస్తోంది మీరు మంచి తల్లని, నా గురించి ఆలోచించి మీ రాత్రులు పాడుచేసుకోకండి, గుడ్‌నైట్‌’’ అని అటు తిరిగి క్షణాలలో నిద్రపోయింది.

రాత్రి చాలా సేపటివరకు నర్మద మాటలను మననం చేసుకుంటున్న నేను ఆమె మనస్తత్వాన్ని విశ్లేషించాలని ప్రయత్నించేను, నా వల్ల కాలేదు. నర్మద మంచి తల్లా? కాదా? అని ప్రశ్నించుకుంటే మాత్రం ‘‘చాలా మంచి తల్లి’’ అనే అనిపించింది.

About Author

By editor

Twitter
Instagram