పశుపక్ష్యాదులతో మనుషులు స్వస్థత పొందడం ఎప్పటి నుంచో ఉంది. యోగా ప్రపంచ వ్యాప్తమైన తరువాత కొందరు పాశ్చాత్యులు కొత్త విధానం తెచ్చారు. ఎక్కడి నుంచో తెచ్చుకున్నవాటికి కాస్త మెరుగు పెట్టి తమవిగా చేసుకోవడం చాలా దేశాలకి తెలిసిన సృజనాత్మక విద్యే. యోగాకు అలా తగిలించిన కొత్త పేరు మేకధ్యానం అను గోట్‌యోగా. ఇదేమిటి బకధ్యానంలా! బక ధ్యానంలో- కొంగజపం అన్నమాట- ఉండే మాయామర్మాలు ఇందులో లేవు. గోట్‌యోగాలో ఆరోగ్యం రహస్యం ఉంది. మేకల మందల మధ్య యోగా చేయడమే గోట్‌ ‌యోగా. మేకపిల్లలు యోగుల వీపెక్కుతూ ఉంటాయి కూడా. కానీ, మేకల ప్రశాంత నడవడిక యోగీశ్వరుల అనుభవానికి వస్తుందట. దానికి మించిన మందుకాని మందు ఇప్పుడు ప్రపంచం ముందుకు వస్తోంది. కొవిడ్‌ 19 ‌కోరల్లో చిక్కుకుని శ్లేష్మంలో ఈగల్లా ప్రపంచ జనాభా ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ నెదర్లాండ్స్ అనే దేశంలో ఒక మారుమూల పట్టణంలో ఆచరించే ఒక పద్ధతి కరోనా నేపథ్యంలో హఠాత్తుగా వెలుగులోకి వచ్చింది. జ్వరం, దగ్గు, చేదు నోరు, తలనొప్పి వంటి వాటితో కొవిడ్‌ 19 ‌సోకినట్టు నిర్ధారిస్తారు. క్వారంటైన్‌కి తోలేస్తారు. లేదంటే వాటికే మందులు మింగిస్త్తారు. ప్రైవేటు ఆస్పత్రులు చేతికి ఎముక లేకుండా లక్షలలో బిల్లులు వేస్తారు. ఏమైనా కరోనా పేరు వింటే, లోపల్లోపల ఆ వైరస్‌ని గురించిన బెంగ కుమ్మరిపురుగులా దొలిచేసే సంగతి పచ్చినిజం. కరోనా పేరు చెవిన పడితే చాలు, ఏదో ఆందోళన, ఏదో గుబులు. భవిష్యత్తు మీద నిరాశ. పీపీఈ కిట్లు, అంబులెన్సులు అన్నీ కళ్ల ముందు కదిలి లోకం బేజారెత్తిపోతోంది. అదేవద్దు, దీని నుంచి బయట పడమని వైద్యులు మొత్తుకుంటున్నారు. వాళ్లు మొత్తుకున్నా, మొట్టినా రోగులు బయటపడాలని ఏమీలేదు.వాళ్లు వినాలని అసలే లేదు. సరిగ్గా సరైన సమయంలో నెదర్లాండ్స్ ‌వారి ఒక పద్ధతి ప్రపంచం ముందుకు వచ్చింది.

ఆ వైద్య విధానం పేరు కొయి కఫెలెన్‌. అం‌టే- ఆవును కౌగలించుకోవడం.

కొయి కఫెలెన్‌ అనే మాట నెదర్లాండ్స్ ‌వాళ్లది మాత్రం కాదు. డచ్‌ ‌వాళ్లది. అక్కడ కొద్దికాలం క్రితమే ఇలా ఆవును ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ప్రశాంతతను పొందే పద్ధతి ఆరంభ మైందట. ఎలా సాధ్యపడిందో మరి, డచ్‌ ‌వాళ్లకైనా పదేళ్ల కిందటే ఈ అద్భుతం తెలిసిందట. కానీ నెదర్లాండ్స్ ‌ద్వారా ప్రపంచానికి వెల్లడైంది. అచ్చు మన దేశంలో మాదిరిగా అన్నమాట. మన ఆచారాల గొప్పతనం గురించి మనకు ఎంతమాత్రం పట్టదు. తలకెక్కదు. మరేదో దేశం వాళ్లు వాటి గొప్పతనం చెబితే, ‘అబ్బో!’ అంటూ ఇంక వెంట పడతాం. అన్నట్టు ఆవు కౌగిలింత గురించి తెల్లవాళ్ల వార్తా సంస్థ బీబీసీ చెప్పింది. కాబట్టి భారతీయులు కొంచెమైనా నమ్ముతారేమో! మనవాళ్ల సంగతి ఏమో కానీ కొవిడ్‌ ‌తరువాత చాలా పాశ్చాత్య దేశాలలో ఈ పద్ధతి ఊపందుకుంది.

ఇందులో ప్రతి నాలుగ్గంటలకి పదేసి మాత్రలు కష్టపడి మింగే పనిలేదు. సూదిమందు తీసుకోనక్కర లేదు. పథ్యాల మాటే లేదు. ఇక శస్త్ర చికిత్స ఊసే లేదు. క్వారంటైన్‌ ‌మాటే లేదు. మరెలా తగ్గుతుంది! ఊరికే, ఒక ఆవుని కొద్దిసేపు ప్రేమగా ఆలింగనం చేసుకుంటే చాలు. ఎక్కడ లేని ఒత్తిడి మటుమాయం అవుతుందట. గాభరా ఉంటే, అది కూడా మంత్రం వేసినట్టు చక్కా పోతుందట. బీబీసీ వారి నివేదిక ప్రకారం రోటర్‌డ్యామ్‌ ‌నుంచి స్విట్జర్లాండ్‌, అమెరికా వరకు ఇప్పుడు ఆవుల కొట్టాలకు జనం బారులు తీరుతున్నారట. కొన్ని ఆవుల కొట్టాల దగ్గర వాటి దగ్గర రెండు మూడు గంటలు ఉండి, కౌగిలించుకుని, కొద్దిసేపు సేవ చేసి వెళ్లడానికి రుసుము కూడా వసూలు చేస్తున్నారు. అమెరికాలోనే మౌంటెన్‌హార్స్ ‌ఫామ్‌ ‌దగ్గర 75 అమెరికన్‌ ‌డాలర్లు రుసుముగా వసూలు చేస్తున్నారు. ఇది గంటకు మాత్రమే. నాష్‌విల్లె అనే చోట కూడా ఈ సౌకర్యం ఉంది. నెదర్లాండ్స్‌లో అయితే ఒక ఆవుల ఫామ్‌ ‌యజమాని జనం కోసం 14 గంటల పాటు తన ఆవుల కొట్టాన్ని తెరిచి ఉంచుతున్నాడట.

నెదర్లాండ్స్‌లో రూవెర్‌ అనే చిన్న పట్టణం ఈ కొత్త వైద్య చిట్కాని ప్రపంచానికి అందించింది. జోస్‌ ‌వాన్‌ ‌స్ట్రాలెన్‌ అనే ఆయన స్పాన్‌‌బ్రోయెక్‌ అనే చోట ఆవు కౌగిలింతతో మనిషి శరీరంలో వచ్చే మార్పుల గురించి చెప్పడానికి కొన్ని తరగతులు నిర్వహించేవాట. ఇది ఆరేళ్ల క్రితమే. అది కూడా ఆయనేమీ కనిపెట్ట లేదు. కొందరు రైతులే తమ అనుభవాలు చెబితే వాటిని ఇలా జనంతో పంచుకున్నాడు జోస్‌వాన్‌. ఆవుల దేహభాష గురించి కూడా చక్కని మాటలు చెప్పాడతడు. అవి చెవులు కిందకి వాల్చి, అర్థ నిమీలిత నేత్రాలతో ఉండి, తల పట్టుకు వచ్చి మీ ఒళ్లో పెడితే వాటికి గొప్ప సాంత్వన కలిగినట్టట. ఆవు కౌగిలింత అంటే సానుకూల శక్తిని ఇచ్చి పుచ్చుకోవడమేనని అంటారాయన. వాటి నులి వెచ్చని స్పర్శ, మంద్రంగా కొట్టుకునే కొట్టుకునే వాటి హృదయ స్పందన మనలో సానుకూల దృష్టిని పెంచుతాయి. నీలాకాశం కింద హరిత శాద్వలాల మీద, ఆవులమంద మధ్య ఉంటే ఆ అనుభూతి మాటలకు అందదని కూడా అన్నాడాయన.

గోమాత సమక్షం ఇంత పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుందనీ, దీని వెనుక బోలెడంత హేతుబద్ధత ఉందనీ వీళ్లకి తెలుసో తెలియదో అన్న సంగతి పక్కన పెడదాం. కానీ, 2007లో అప్లయిడ్‌ ‌యానిమల్‌ ‌బిహేవియర్‌ ‌సైన్స్ అనే పత్రిక ఆవు గురించి కొన్ని చక్కని సంగతులు చెప్పింది. ఫ్రెంచ్‌, ఆ‌స్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్పిన సంగతులవి. గాఢమైన సాంత్వన పొందడం గురించి ఆవును చూసి నేర్చుకోవచ్చునట. ఆవు నడుం మీద, గంగడోలు మీద నెమ్మదిగా మర్దనా చేస్తే అది చెవులు వెనక్కి తీసుకుంటుందట. ఇంకొక విషయం కూడా రాసింది ఆ పత్రిక. ఆవులు దగ్గరగా ఉంటే సానుకూల దృక్పథం పెరుగుతుందట. అలాగే మనుషులలో ఆక్సిటోసిన్‌ ‌హార్మోన్‌ను పెంచి ఒత్తిడి నుంచి దూరం చేసే గుణం ఉంటుందట. అందుకే కరోనా వచ్చిన తరువాత ఆవులతో గంటల తరబడి కాలక్షేపం చేసే అలవాటు పాశ్చాత్య ప్రపంచంలో పెరిగిందట. ఈ ఆక్సిటోసిన్‌ ‌సంగతి మన బెంగళూరుకు చెందిన డాక్టర్‌ ‌బి. గిరీశ్‌చంద్ర కూడా గతంలోనే చెప్పారట. ఆ పత్రిక కంటే మన డాక్టర్‌ ‌గారే ఇంకాస్త విడమర్చి చెప్పారు. ఒకసారి ఆవును కౌగిలించుకుంటే సంతోషాన్ని ఇచ్చే ఆక్సిటోసిన్‌, ‌సెర్టోనిన్‌, ‌డోపామైన్‌ అనే హార్మోన్లు చైతన్యవంతం అవుతాయట. దీనితో కోర్టిసాల్‌ అనే హార్మోన్‌ (ఒత్తిడిని కలిగించేది) శక్తి తగ్గుతుందట. అందుకే ఒత్తిడి, డిప్రషన్‌ ‌లక్షణాలు తగ్గుతాయట.

అసలు కొవిడ్‌ 19 ‌కాలంలో పెంపుడు జంతువుల మీద మనుసుల మమకారం బాగా పెరిగిందట. 24 అవర్‌ ‌పెట్‌ ‌వాచ్‌ అనే సంస్థ 1500 అమెరికా నివాసాల మీద ఒక సర్వే జరిపి ఈ విషయం తేల్చింది. అంతకు ముందు కంటే పెంపుడు జంతువులను సాకే గుణం 400 రెట్లు పెరిగిందట.

ఆవు సాధుజంతువు అని చిన్నప్పుడే చదువుతాం. అంతేకాదు, గోమాతకు చక్కని సహనం కూడా ఉంటుంది. చాలా సున్నితంగా ప్రవర్తిస్తుంది. ఆవు స్పర్శలోని వెచ్చదనం, గుండెలయ ఆందోళనతో ఉన్న వారిని సాధారణ స్థితికి తీసుకు వస్తాయట. మొత్తంగా మనిషి శరీరంలోని జీవశక్తి, రోగ నిరోధక శక్తిలను పెంచి, ఒత్తిడిని నివారించ డానికి తోడ్పడతాయట.

మధురైకి చెందిన జితేంద్ర గోల్చా అనే ఆయన అనుభవం చూద్దాం. ఆయన అక్కడే ఒక గెటెడ్‌ ‌కమ్యూనిటీ సముదాయంలో ఉంటారు. దానికి సమీపంలో పెద్ద పచ్చగడ్డి బయలు, ఒక నీళ్ల కుంట ఉన్నాయట. వాటి కోసం ప్రతి ఉదయమూ ఆవులు వస్తూ ఉంటాయట. వాటిని చూడగానే మనశ్శాంతిగా అనిపిస్తుందట ఆయనకి. ఇంతకీ జితేంద్రగారికి ఆవు కౌగిలింత గురించి తెలియదు. కానీ ఆ మనశ్శాంతి కోసం గడచిన 21 సంవత్సరాలుగా ఆ ఆవుల మందను ప్రతి ఉదయం తప్పనిసరిగా వీక్షిస్తున్నారట. వాటి దగ్గరకి వెళ్లి వాటి గంగడోలు, నడుము కొద్దిసేపు మర్దన చేస్తారట, అంతే.

గోవు భారతదేశ జాతీయ జంతువే కాదు, అంతర్జాతీయ జంతువు అన్నా నిజమే అవుతుంది కదా!

About Author

By editor

Twitter
Instagram