మానవ మేధ, మానవుడు సృష్టించిన కృత్రిమ మేధ పోటీపడుతూ ఉన్నాయి. ఫలితంగా సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. దాని ఛాయలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇలాన్‌మాస్క్ ‌లాంటి ఇంజినీర్లు, పారిశ్రామికవేత్తలు సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. గ్రహాంతరాల్లో మానవ నివాసం ఎంతోదూరం లేదని అంటున్నారు. అవి పగటి కలలు కాదని నిరూపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో దార్శనికుల దర్శనాలు ఎలా ఉండాలి? వందల ఏళ్ల క్రితపు భావజాలంతో మాత్రం ఉండరాదు.

దురదృష్టవశాత్తు ప్రజల్ని కాలంచెల్లిన దర్శనాలతో ప్రభావితం చేసి తమ ‘బలం’ ప్రదర్శించు కోవాలని చాలామంది ఉబలాట పడుతున్నారు. ప్రతీది మారుతుంది. అది ప్రకృతి లక్షణం. మానవ సమాజం సైతం అదే చట్రంలో తిరుగుతుందని చెబుతూనే కొన్ని మెలికలు, కొన్ని భావనల కొనసాగింపు ఉంటుందని, ఆ ‘డైనమిక్స్’ ఆధారంగా సమాజం ముందుకు కదులుతుందని వాదిస్తూ తమ తిరోగమన విధానాలను తెరమీదకు తెస్తూ ఉంటారు. వీరిలో ముఖ్యులు మార్క్సిస్టులు. మార్క్సిజం ముగిసిన అధ్యాయం అని సాక్ష్యాధారాలు చూపినా, తర్కంతో వాదించినా అంగీకరించ కుండా మానవుడు ఉన్నంతవరకు మార్క్సిజం ఉంటుంది, దోపిడీ ఉన్నంతకాలం మార్క్సిజం సజీవంగా కొనసాగుతుందనే పిడివాదంతో వాళ్లు తలపడుతూ ఉంటారు. అది పూర్తిగా అశాస్త్రీయమని స్పష్టంగా కనిపిస్తున్నా అంగీక రించకపోవడం వారి నైజం.

1853వ సంవత్సరంలో కారల్‌మార్కస్ ‘‌హెరాల్డ్ ‌ట్రిబ్యూన్‌’ అన్న అమెరికా ఆంగ్ల పత్రికలో భారత దేశంపై రెండు ప్రముఖ వ్యాసాలను రాశారు. అందులో భారతదేశం అనాగరిక (బార్బారిక) దేశం, అస్తవ్యస్త (అనార్కిక) దేశం, గోవులను, కోతులను పూజిస్తూ పొద్దుపుచ్చుతారు. పూర్తి వెనుకబడిన ఆ వ్యవస్థను సంపూర్ణంగా ధ్వంసం చేసి ఆ పునాదులపై కొత్త వ్యవస్థ నిర్మించాలంటే ‘విప్లవం’ రావాలి.. అందుకు పాత పద్ధతులు, సంప్రదాయాలు, వ్యవహారాలు అన్నీ సమూలంగా మారాలి. ఆ పని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం చేస్తోంది. ఆ విధ్వంసం ముగిశాక విప్లవ అంకురిస్తుందని రాశారు. ఇంకా ఎంతో ‘పైత్యాన్ని’ పరవశంతో ఒలకబోశారు.

పై రాతలను బట్టి కారల్‌మార్కస్ అవగాహన, ఆలోచన, ఊహ, దార్శనికత ఎంత విధ్వంసకర మైనవో ఇట్టే అర్థమవుతుంది. ప్రతీది మారుతుంది.. అది సహజ లక్షణం అంటూంటే 150 సంవత్సరాలకు పూర్వం నుంచే విధ్వంసం, ధ్వంసం, హననం, హత్య గూర్చిన ఆలోచనలతో ఊరేగడంలో ఏమైనా అర్థముందా?

ఈ ‘డిఎన్‌ఎ’‌తోనే కమ్యూనిస్టులు ఇంకా వీరంగం వేయడంలో ఏమైన మాన్యత కనిపిస్తోందా?

వాస్తవానికి మార్కస్ ఆ ‌రెండు వ్యాసాలు విషం చిమ్ముతూ, తప్పుడు సమాచారంతో, తప్పుడు అవగాహనతో రాసే సమయానికి ప్రపంచంలో భారతదేశం అత్యంత ధనిక దేశంగా విరాజిల్లుతోంది. జీడీపీ రేటు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది.  వ్యాపార వాణిజ్య రంగాల్లో అగ్రభాగాన ఉన్నది. సుదూర ప్రాంతాలతో భారతీయులు వ్యాపారం చేస్తున్నారు. భారత ప్రజలు నైపుణ్యాలతో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని యూరప్‌, ‌చైనా దేశాల నుంచి భారత యాత్రకు వచ్చినవారే తమ రచనల్లో నమోదు చేశారు. ఆ తరువాత నిపుణులు నిజమేనన్నారు.

ఈ విదేశీ యాత్రికులు రాసిన దానికీ, స్వయంగా బ్రిటిష్‌, ‌డచ్‌, ‌ఫ్రెంచ్‌ ‌వారు రాసిన దానికీ, కారల్‌మార్కస్ ‌రాసిన దానికీ హస్తిమశకాంతరముంది.

ఈ రకమైన దృష్టికోణం ఏ విధంగా ధర్మ సమ్మతమవుతుంది? అసత్యాలతో అబద్ధాలతో తన అనుయాయులను ఆకర్షించబూనుకోవడం ఏ విధంగా సమర్థనీయం?

వలసవాదం బలహీనపడుతున్న సమయంలో పెట్టుబడిదారి విధానం ప్రారంభమవుతున్న కాలంలో మార్కస్ ‌తన ఆలోచన ఆధారంగా కొన్ని సూత్రీకరణలు, సిద్ధాంతాలు చేసి వీటివల్ల మానవాళి మొత్తం స్వర్గతుల్యమవుతుందని ‘ఊహ’ చేశాడు. ఆ ఊహను సాకారం చేసేందుకు ఆ సిద్ధాంతాన్ని విశ్వసించిన వారు ప్రపంచమంతటా పదికోట్ల మందికి పైగా ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ధ్వంసం.. విధ్వంసం.. హత్యలు.. తిరుగుబాట్లు.. పేలుళ్లు.. కాల్పలు.. ఈ ‘సంస్కృతి’ ఆధారంగా నూతన ప్రపంచాన్ని నిర్మించదలిస్తే ఆ కమ్యూనిజం, సోషలిజం ఈ భూమిపై కేవలం 50 సంవత్సరాలు మాత్రమే అతి కష్టంమీద మనగలిగింది. కనీసం పెట్టుబడిదారి విధానం ప్రపంచంలో వంద ఏళ్లకు పైగా పరిఢవిల్లింది. అంతకుముందు వలసవాదం రెండువందల ఏళ్లకు పైగా తన ప్రభావాన్ని చూపింది.

కమ్యూనిజం పేర కోట్లాదిమంది ప్రాణాలను బలిగొన్న చైనా చివరికి పెట్టుబడిదారి అవతార మెత్తింది. సాంస్కృతిక విప్లవం (కల్చరల్‌ ‌రెవల్యూషన్‌) ‌పేర నరమేధాలకు పాల్పడినా, కృత్రిమ క్షామాలను సృష్టించినా మార్కస్ ఊహించిన ‘స్వర్గం’ భూమ్మీదకు రాలేదు. కోట్లాది మంది అమాయక ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయాయి. దీనివల్ల ‘పాఠం’ నేర్చుకోవలసిన అవసరం లేదా?

ఇలాంటి పంథాతో ప్రజల్ని పేదరికం నుంచి పైకి తీసుకురాలేమని మావో అనుచరుడు డెంగ్‌ ‌జియావో పింగ్‌ ‌చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, ప్రపంచంతో కలిసి నడిచినప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందని రుజువు చేసి ఆధునిక చైనా పితామహుడిగా నిలిచారు. ఈ పరిణామం దేన్ని సూచిస్తోంది? ఏదీ స్థిరంగా ఉండదు, అది ప్రకృతి లక్షణం అని చెప్పకనే చెబుతోంది కదా?

చైనాలోని ఈ పరిణామాలను, తాజా సంగతులను సైతం పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా ‘వర్గ రహిత సమాజం’ సాధ్యమేనంటూ సాయుధ పోరాటాలకు మావోలు సిద్ధపడటం చూస్తే, చదివేస్తే ఉన్న మతి పోయినట్లని పిస్తోంది.

 ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒకే విధానం అన్వయంకాదని ఐక్యరాజ్య సమితిలోని ప్రముఖుల నుంచి, ఆర్థిక నిపుణుల వరకు ఎందరో ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నారు. తాజాగా ‘ప్రపంచీకరణ’ నినాదం సైతం కుప్పకూలిపోవడంతో ఈ వాదనకు మరింత పుష్టి కలిగింది.

కమ్యూనిజం అన్ని దేశాలకు  సోషలిజాన్ని ఎలా అన్వయించలేదో.. ప్రపంచీకరణ సూత్రాల ఆధారంగా ఆర్థిక ప్రగతిని అన్నిదేశాల్లో సాధించడం కూడా సాధ్యం కాదని ప్రపంచ ఆర్థిక నిపుణులు చేతులెత్తేశారు. పిడుక్కి – బియ్యానికి ఒకే మంత్రం కుదరదన్న అవగాహన పెరుగుతోంది. ఇటీవల అమెరికాలో గాని, భారతదేశంలో గాని వినిపిస్తున్న నినాదాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌నినాదం, మేకిన్‌ ఇం‌డియా, డిజిటల్‌ ఇం‌డియా లాంటి నినాదాల వెనుక ప్రపంచీకరణ కన్నా ఆత్మరక్షణ, స్వయం సమృద్ధి భావనలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌ ఏకంగా ‘అమెరికా ఫస్ట్’ అన్న జెండా ఎగురవేశాడు. అమెరికా ముఖ్యం.. వారి ఆర్థిక ప్రగతి కీలకం, వారి ఆర్థిక శక్తి పెరుగుదల అనంతరమే మిగతా ఏవైనా.. అన్న అభిప్రాయం ప్రతిధ్వనిస్తుంటే ఆయా దేశాలు సైతం అదే బాటలో పయనిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. చైనా వ్యూహం పూర్తిగా దెబ్బతిని అగమ్యగోచర స్థితికి చేరుకుంది. జర్మన్‌, ‌రష్యా, జపాన్‌ ‌లాంటి దేశాలు సైతం తమ తమ ఆర్థిక వ్యవస్థలు చక్కదిద్దుకునేందుకు, తమ దేశాలకు అనుకూలమైన పద్ధతులను, విధానాలను అనుసరిస్తున్నాయి. ప్రపంచీకరణపై పూర్తిగా ఆధారపడే మానసిక స్థితి నుంచి తప్పుకున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో ఈ రక్షణాత్మక చర్యలకే పెద్దపీట వేస్తున్నాయి.

ప్రపంచ పోకడలు వేగంగా మారుతున్నాయి. ఇది ప్రకృతి సహజం. మారడం దాని లక్షణం. ఆర్థిక వ్యవస్థ ‘నమూనాలు’ సైతం శరవేగంగా మారుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల ఆకాంక్షల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఓడలు బండ్లవుతున్నాయి. బండ్లు ఓడలవుతున్నాయి. చిరకాలంగా వినిపిస్తున్న ఈ నానుడిని అర్థం చేసుకోకుండా మార్పు జరిగినప్పుడల్లా అంతరాలు, వ్యత్యాసాలు స్థానచలనం చెందుతాయని గమనించ కుండా ఆ డైనమిక్స్‌ను పసిగట్టకుండా 150 సంవత్సరాల క్రితం కారల్‌మార్కస్ ‌ప్రవచించిన సూత్రీకరణలు – సిద్ధాంతాలు సజీవమైనవని, ఆచంద్రతారార్కం సజీవంగా నిలుస్తాయని ప్రజలతో చెలగాటమాడటం, నరమేధాలకు 21వ శతాబ్దంలోనూ పాల్పడటం ఎంతటి దారుణం?

అడవుల్లో ముఖ్యంగా బస్తర్‌ అడవుల్లో మావోలు, నగరాల్లో అర్బన్‌ ‌నక్సల్స్, ‌వారి అనుచరులు ఈ రకమైన ఉన్మత్త కార్యక్రమాలకు, కాలం చెల్లిన సిద్ధాంతాలకు ప్రాణప్రతిష్ట చేసే పనులకు పరాక్రమంతో పూనుకుంటే ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతున్నదో అని చూడాలి కదా! గుడ్డిగా ప్రజాసైన్యం నిర్మించి, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామని ఈ డిజిటల్‌ ‌యుగంలో, కృత్రిమ మేధతో రోబోలు ఉత్పత్తి రంగంలో పాల్గొంటూ సేవలందిస్తున్న సమయంలో ఆ విధమైన ప్రేలాపనలు ప్రజ జీవనాన్ని ఎలా మెరుగుపరుస్తాయి అని ఆలోచించాలి కదా! అంతిమంగా ప్రజల సంక్షేమం – సమృద్ధి పార్టీ లక్ష్యం కావాలన్న ప్రాథమిక సూత్రాన్ని సైతం పట్టించుకోకుండా ‘రాజ్యాధికారం’ యావతో ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం ఏ విధంగా శ్లాఘనీయమవుతుంది?

– వుప్పల నరసింహం, 9985781799, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram