డిసెంబర్‌ 25 ‌ముక్కోటి ఏకాదశి

‘‌మాసానాం మార్గ శీర్షాహం’ అన్నాడు జగద్గురువు శ్రీకృష్ణభగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో ఉత్తమం, శ్రేష్ఠమైనదని అర్థం. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికీ అంతే ప్రాధాన్యం, ప్రత్యేకతలు ఉన్నాయి. నెలకు రెండు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు, అధికమాసంలో మరో రెండు వస్తాయి. ప్రతి ఏకాదశిని పవిత్రమైనదిగా భావిస్తారు. వీటన్నిటిలో వైకుంఠ ఏకాదశి భిన్నమైనది. అన్ని ఏకాదశులను చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ఒక్కదానిని మాత్రం సౌరమానంతో గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశించే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు.

పురాణగాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి)నాడు యోగనిద్రకు ఉపక్రమించి, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొన్న శ్రీమహావిష్ణువు మార్గశిర శుద్ధ ఏకాదశి (ముక్కోటి/వైకుంఠ) నాడు సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా వైకుంఠానికి చేరకుంటారు. గరుడారూఢుడై వేంచేసిన దేవదేవుడిని అక్కడి ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు సేవించుకుంటారు కనుక ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది. దీనిని ‘హరివాసం, వైకుంఠ దినం’అనీ అంటారు. ఈ రోజున వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం తెరుస్తారు. ఆ ద్వారాన్నే ‘వైకుంఠ ద్వారం’అంటారు. ఆ రోజు వేకువజామునే వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించుకుంటే సకలపాపాలు నశించి అనంత పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం. శ్రీరంగ క్షేత్రంలో ఈ రోజు నుంచి 21 రోజులు పగలు( పగల్‌ ‌పాథ్‌), ‌రాత్రి (ఇరుల్‌ ‌పాథ్‌) అని రెండుగా విభజించి విష్ణునామ సంస్మరణాత్మక దర్శనభాగ్యం కలిగిస్తారు. విశ్వమానవ వికాశ గ్రంథం భగవద్గీత ఆవిష్కృతమైనది ఈ తిథినాడే కావడం మరో విశిష్టత.

వైష్ణవ క్షేత్రాలలో ఉత్తరద్వార దర్శనం విశిష్ట ఉత్సవం, పెద్దపండుగ. దక్షిణాభిముఖుడైన స్వామిని ఉత్తరం వైపు నిలిచి సేవిస్తే సద్యోముక్తి లభిస్తుందని వైష్ణవ ఆగమాలు చెబుతున్నాయి. అందుకు శ్రీరంగంలోని రంగనాథ దర్శనాన్ని ఉదాహరణగా చెబుతారు. నిత్యం ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహించే మహాక్షేత్రం శ్రీరంగం. అక్కడి సంప్రదాయం అన్ని వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి నాడు అమలు చేస్తున్నారు. ఏకాదశి ఘడియలు ప్రారంభమైనప్పటి నుంచి ద్వాదశి తిథి వరకు ఉత్తర ద్వారాలు తెరిచి ఉంచుతారు. దేవతా గణాలు, పితృదేవతా గణాలు వైకుంఠవాసి దర్శనం కోసం వేచి ఉంటారని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాల నుంచి దర్శనమిచ్చి మోక్షం ఇస్తాడని ప్రతీతి.

ముక్కోటి ఏకాదశి

వైకుఠ ఏకాదశి వైశిష్ట్యాన్ని వివరించే అనేక గాధల్లో ఒకటి. త్రేతాయుగంలో రావణుడి బాధలు భరించలేని దేవతలు బ్రహ్మదేవుడిని వెంటపెట్టుకొని హరివాసరమైన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు శ్రీహరి సన్నిధికి చేరి తమ బాధలు విన్నవించుకున్నారు. శ్రీహరి వారిని అనుగ్రహించాడు. ముక్కోటి దేవతలు ఒక్కటై విన్నవించగా వారికి అభయమిచ్చాడు కనుక ‘ముక్కోటి ఏకాదశి’ అని వ్యవహారంలోకి వచ్చిందంటారు. ఆ రోజున ముప్పయ్‌ ‌మూడు కోట్ల దేవతలు భువికి వస్తారట. ఆ కారణంతోనూ ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.

వైకుఠ ఏకాదశి

‘కుంఠం’ అంటే లోపించడం అని అర్థం. అది లేని స్థితి వైకుంఠం. ఏకాదశి అంటే పదకొండు. అవి అయిదేసి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు. ఈ ఏకాదశాంశాల ఏకత్వమే పరిపూర్ణస్థితి. అలాంటి పూర్ణత్వానికి వైకుఠమని పేరు.

శ్రీమహావిష్ణువు చేతిలో హతులైన మధుకైటభులనే రాక్షసులు దివ్యరూపాలు ధరించి దివ్యజ్ఞానం పొంది, ‘దేవా! మాకు నిజరూపాలు కలిగిన ఈరోజు చరిత్రలో నిలిచేలా వైకుంఠంలాంటి మందిరాన్ని నిర్మించి ఈ రోజున ఉత్తర ద్వారంలో నిన్ను దర్శించి అర్చించే వారికి వైకుంఠప్రాప్తి ప్రసాదించు’ అని ప్రార్థించారు. వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక ‘వైకుంఠ ఏకాదశి’అని అంటారు. దీనికి ‘మోక్షోత్సవ దినం’ అని కూడా పేరుంది.

పద్మపురాణంలోని కథనం ప్రకారం, లోకకఠకు డైన ముర అనే రాక్షసుడి బాధలు భరించలేని దేవతలు శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడిని అంతమొందించేందుకు అస్త్రాలు సమకూర్చుకునేందుకు బదరికాశ్రమం చేరిన ఆయన హైమవతి అనే గుహలో యోగనిద్రకు ఉపక్రమించాడు. అదే అదునుగా అక్కడికి చేరిన ముర విష్ణువుపై దాడికి దిగగా శ్రీమహావిష్ణువు శరీరం నుంచి ఉద్భవించిన మహాశక్తి (ఆమే మహాదుర్గ) మహాగ్ని గోళాల్లా జ్వలిస్తున్న కంటిచూపుతో ఆ దానవుడిని కాల్చిభస్మం చేసింది. మేల్కొన్న శ్రీహరి ఆ మహాశక్తికి ఏకాదశి అని పేరుపెట్టి వరం కోరుకోమనగా, ‘ఈ రోజున (ఏకాదశి) ఉపవాసం చేసిన వారి పాపపరిహారమై, సమస్త శుభాలు కలగాలని, జన్మాంతరం వైకుంఠప్రాప్తి కలగాలి’ అని కోరింది. అందుకు ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాస దీక్ష చేస్తారు. ఈ ఒక్కరోజు ఉపవాసంతో సంవత్సరంలోని ఇతర ఏకాదశి ఉపవాస దీక్ష చేసినంత ఫలితం దక్కుతుందన్నది పెద్దలు చెబుతారు. ఉపవాసం అంటే కేవలం నిరాహారంగా ఉండడం అని కాదు. భగవంతుడికి సమీపంగా ఉండడం అని అర్థం. ‘లంఖణం పరమౌషధం’ అని ప్రతీతి. దేహరుగ్మతలకు పరిష్కారం ఉపవాసం. ఏకాదశినాటి నిరాహారం వల్ల ఇటు ఆరోగ్యం, అటు పుణ్యం అని చెబుతారు.

ఆ రోజంతా ప్రతి క్షణం దైవనామస్మరణతో గడుపుతూ తులసీతీర్థం మాత్రమే తీసుకోవాలని,అలా చేయలేని వారు ‘కృష్ణార్పణం’అంటూ అల్పాహారం తీసుకునేలా మినహాయింపునిచ్చారు. అయితే రోజంతా నారాయణ మంత్రం నోట నర్తిస్తూనే ఉండాలని చెబుతారు.

హరి అర్చన

శ్రీమహావిష్ణువు అలంకార, సామగానలోల ప్రియుడు. వైకుంఠ ఏకాదశి నాడు ఆలయంలో కానీ, ఇంటి వద్ద కానీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో అలంకరిస్తారు. పూజకు ప్రధానంగా తామరపూవులు, తులసి వినియోగిస్తారు. పాయసం లాంటి మధుర పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టాక్షరీ జపంతో పాటు స్తోత్రాలు ఆలపిస్తారు. ఇలా అర్చన, జపం,ధ్యాన సాధానాల ద్వారా వైకుంఠపతి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.

తిరుమలలో

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని మహావైభవంగా నిర్వహిస్తారు. ఏకాదశికి ముందువచ్చే మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారదర్శనం తరువాత మరునాడు తిరుమల స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వస్తారు. తిరుమలలో ఏటా నాలుగు సందర్భాలలో పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు స్నానం చేయిస్తారు. అందులో మార్గశిర శుద్ధ ద్వాదశి కావడం గమనార్హం. వైకుంఠ ఏకాదశి నాడు సకల పుణ్య తీర్థాలు సూక్ష్మ రూపంలో స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని,సకల దేవతలు అక్కడ ఆవహిస్తారని పెద్దల మాట. అందుకే చక్రస్నానానికి అంత విశిష్టత.

‘మంగళం భగవాన్‌ ‌విష్ణు:

మంగళం గరుడధ్వజా

మంగళం కమలాకాంతమ్‌

‌త్రైలోక్యం మంగళమ్‌ ‌కురు’

– ఎ. రామచంద్ర రామానుజ,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram