‌డిసెంబర్‌ 25 ‌గీతాజయంతి

భగవద్గీత.. సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జ్ఞానభాండాగారం. ఆయన ఈ లోకంలో 125 ఏళ్ల 7 నెలల, 8 రోజుల, 30 ఘడియలు నివసించారని, సుమారు 87వ ఏట గీతను బోధించారని చెబుతారు. ఇది సార్వకాలిక, సర్వజనీన విశిష్ట గ్రంథం. అది కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే కాదు. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు సాధనం. లక్ష్యసాధకులకు మార్గదర్శి. ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదితమైన దీనిపై వందలకొద్దీ భా•ష్యాలు వచ్చాయి. గీతాధ్యయనం, గీత ఆదేశానుసారం జీవితాన్ని కొనసాగించే వారికి విజయపరంపర సొంతమవుతుందని అనుభజ్ఞులు చెబుతారు.

‘సర్వశాస్త్రమయీ

గీతా సర్వదేవ మయోహరిః

సర్వతీర్థమయీ గంగా సర్వ

వేదమయో మనుః’

మనువు సర్వవేదమైనట్లు, గంగ సకలతీర్థరూపిణి అయినట్లు, శ్రీహరి సర్వదేవమయుడైనట్లు భగవద్గీత సర్వశాస్త్ర మయం. ఇది సర్వకాలీనం, సర్వజనీనం. జ్ఞానపరిణితిని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా బోధపడే నిత్యనూతన గ్రంథం. ఈ అష్టాదశాధ్యయినికి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, వేదత్రయి, పర, అనంత, త్రిసంధ్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్న, భయనాశిని, తత్త్వార్థ జ్ఞాన మంజరి అని పద్దెనిమిది పేర్లున్నాయి. భగవానుడైన శ్రీకృష్ణుడు ఉపదేశించాడు కనుక ‘భగవద్గీత’, పరబ్రహ్మను తెలిపే విద్య కనుక ‘బ్రహ్మవిద్య’అని, వేదాంతాలను సంగ్రహించి చెప్పినందున ‘ఉపనిషత్సారం’ అంటారు.

మనిషి కష్టాల్లో పడినప్పుడు, సంశయాలతో సతమతమవుతున్నప్పుడు, నిరాశ పాలైనప్పుడు అలాంటి వారికి దిశానిర్దేశం చేసేలా శ్రీకృష్ణుడు అందించిన పరమ పవిత్ర సందేశం. మనిషిని సన్మార్గంలో నడిపేవాడు గురువైతే, అంతకు మించి లక్షణాలు గల దీనిని ‘గురు’ గ్రంథంగా అభివర్ణించ వచ్చు.

ప్రస్థానత్రయంలో ఒకటి

భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులను పూర్వీకులు ప్రస్థానత్రయంగా చెప్పారు. గమ్యంవైపు నిరంతరం సాగడమే ప్రస్థానం. అదే శ్రేష్ఠమైన ప్రయాణం. ఆ గమ్యమే భగవత్‌ ‌సన్నిధి. ఆయనను చేరుకునే ప్రయత్నమే ప్రస్థానం. వృత్తిని లేదా లక్ష్యాన్ని దేవుడుగా భావిస్తే….దానిని సాధించేందుకు సాగించే యత్నయే ప్రస్థానం. ఆ గమ్యం ‘అగమ్యం’ కాకుండా ఉండేందుకు వ్యక్తిత్వ వికాసనిపుణులు ‘గీత’ను ఒక సాధనంగా పరిగణిస్తున్నారు. ‘పనిలోనే దైవం ఉన్నాడు. కర్తవ్యాన్ని పాటించడమే స్వర్గం’ అని నారాయణుడు నరుడికి బోధించాడు.

విజేతగా నిలవాలకునే వారు మొదట మోహాన్ని వీడాలని ‘గీత’ చెబుతోంది. ఇక్కడ మోహం అంటే….కర్తవ్యాన్ని మరచి వేరే ఆలోచనలో పడిపోవడం అన్నమాట. రణభూమికి వచ్చిన విజయుడు మనసు మార్చుకొని….

‘న కాంక్షే విజయం కృష్ణ

న చ రాజ్యం సుఖాని చ

కిం నో రాజ్యేన గోవింద

కిం భోగై ర్జీవితేన వా’

(విజయం వద్దు, రాజ్య సుఖమూ వద్దు)అని బేలతనంతో అస్త్రసన్యాసం చేసిన క్షణంలో మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి నాడు ఈ మహోత్కృష్ట గ్రంథం పురుడుపోసుకుంది. భగవంతుడు ముఖత: ఉపదేశించిన పుణ్యదినమే గీతాజయంతి. ‘మాసానాం మార్గశీర్షోహం’ అని భగవానుడు ఇందులోనే చెప్పినట్లు ప్రశస్థమైన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే గీతా జయంతి కూడా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్రంథం ఆవిర్భావదినోత్సవం జరుపుకోవడం ‘గీత’కే చెల్లింది. ‘గీత’లో కర్మయోగ అధ్యాయం అత్యంత ప్రధానం. కర్మయోగ మార్గం నేటి యువతకు, సమాజానికి వ్యక్తిత్వ వికాసాన్ని తెలియచెబుతోంది.

‘కర్మణ్యే వాధికారస్యే మాఫలేషు కదాచన

మాకర్మ ఫలహేతుర్భూ ర్మాతే సంగోస్త్వ కర్మణి’..

‘నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది. కర్మఫలాన్ని ఆశించే అధికారం నీకు ఎన్నడూ లేదు. కర్మలకు నీవు కారణభూతుడవని భావించకు. ధర్మాన్ని నిర్వర్తించడంలో అనాసక్తుడవుగా ఉండకు’ అన్నాడు గీతాచార్యుడు. నీ పనిని శ్రద్ధతో చేసి కర్మఫలాన్ని అంటే కష్టసుఖాలను పరమాత్మకు వదిలిపెట్టడం అన్నమాట. తనకు సంక్రమించిన పనిని ప్రేమతో చేయాలి తప్ప ఆశతో కాదని అంతరార్థంగా వ్యాఖ్యా నిస్తారు. నేటి మాటల్లో చెప్పాలంటే ‘ఇష్టమైన పని’.

కర్తవ్యబోధిని

‘జంతూనాం నరజన్మ దుర్లభమ్‌’, ‘‌నరత్వం దుర్లభం లోకే’, ‘దుర్లభో మానుషో దేహ:’ లాంటి సూక్తులను బట్టి మానవ జీవితం ఎంతో ఉదాత్తమైనదో తెలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేందుకు ప్రయత్నిస్తూ మానవ జన్మకు సార్థకత కలిగించాలి. వ్యక్తులు ఎదిగినప్పుడే వ్యవస్థ కూడా సుసంపన్న మవుతుంది. తనను తాను ఉద్ధరించుకొని ఉన్నతి సాధించడాన్ని ‘ఆత్మోన్నతి’ అంటారు. ఆ స్థితికి చేరాలంటే ముందుగా తన బలాలు బలహీనతలను బేరీజు వేసుకొని సాధనతో బలహీనతలను అధిగమించాలి.

మనిషి స్వయంకృతంవల్లనో, పరిస్థితుల ప్రభా వంతోనే నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాడు. కర్తవ్య నిర్వహణలోనూ ఎన్నో గడ్డు సమస్యలు, అడ్డంకులు ఎదురవుతుంటాయి. తాను చేయబోయే పని సరైనదేనా? దానిని చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? చేయకపోతే వచ్చే దుష్ఫలితం ఏమిటి? నేను ఎంతవరకు చేయగలను? చేయలేకపోతే ఏమిటి? అలాంటి సంశయస్థితిలో తాత్కాలికంగానే అయినా కర్తవ్య విముఖుడయ్యే అవకాశం ఉంది. దాని నుండి బయటపడవేసి కర్తవ్య విముఖుడుని సుముఖినిగా చేసే దివ్యోపదేశం భగవద్గీత. ‘ధర్మ విహితమైన కర్తవ్య పాలనలో ఊగిసలాట పనికిరాదు. కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందే. నిష్కామకర్మకు అంతిమ విజయం తథ్యం. ధర్మబద్ధంగా, భగవదర్పితంగా నిర్వహిస్తే అది పాపనాశనమై తుదకు మోక్షసాధకం అవుతుంది’ అని గీతాచార్యుడు చెప్పారు. ‘ధర్మంగా కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అని భగవానుడు పదేపదే చెప్పినది పార్ధుడికే కాదు. ఆ సందేశం సర్వమాన వాళికి వర్తిస్తుంది.

వ్యక్తిత్వ వికాస ‘గీత’

విద్యార్థులకు సులువుగా బోధించేందుకు, ఉద్యోగులను చైతన్య పరిచేందుకు విద్యాసంస్థలు, బహుళ జాతి సంస్థలు ‘గీత’ను సరికొత్త కోణంలో అధ్యయనం చేస్తున్నాయి. అందులో అంతర్లీనంగా ఉండే అంశాలను ఉద్దీపనగా చేసుకుంటే సంస్థల మనుడగను తీర్చిదిద్దవచ్చని భావిస్తూ, ఆచరిస్తున్నారు కూడా. కార్యాలయాల్లో పని వాతావరణం మెరుగు పడేందుకు, సిబ్బందిలో ఒత్తిడిని తగ్గించేందుకు, వృత్తిపరమైన కారణాల వల్ల ఉత్పన్నమయ్యే మానసిక సమస్యలను దూరం చేసేందుకు ‘గీత’లోని కర్మయోగమే మార్గమని కోజికోడ్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ రూపొందించిన అధ్యయన నివేదిక చెబుతోంది.

ఒక్కొక్క సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కార మార్గాలు ఈ సందేశంలో కనిపిస్తాయి. అందుకే ‘నా కర్తవ్య దీక్షకు భగవద్గీత సదా శక్తిని ఇస్తుండేది. నాకు ఎప్పుడు సందేహం కలిగినా భగవద్గీతను చేతిలోకి తీసుకుంటాను. అన్ని సమస్యలకు అందులో పరిష్కారం లభిస్తుంది’ అన్నారు మహాత్మాగాంధీ.

ఒక్కొక్క శ్లోకభావాన్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టేవారు జన్మరాహిత్యం పొందుతారని సర్వోపనిషత్తుల సారమైన ‘గీత’కు మొదటగా భాష్యం రాసిన ఆదిశంకరులు ప్రవచించారు. ‘భగవద్గీతా కించిదధీతా గంగాజలల కణికా పీతా’ (గీతా శ్లోకం ఒక్కటి పారాయణం చేసినా గంగ జలం తాగినంత పుణ్యం వస్తుంది) అని చెప్పారు. ‘భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్నైనా గురుముఖత: అధ్యయనం చేసినవారు ధన్యులని ఆయనే అన్నారు. ఎందరో మహామహులు లెక్కకు మిక్కిలిగా వెలువరించిన వ్యాఖ్యానాలను చదివి జీర్ణించుకొనే తీరిక, ఓపిక, శక్తిసామర్ధ్యాలు అందరికీ ఉండవన్నది నిజమే. దీనిని అమూలాగ్రం చదవలేని వారు మొదటి చివరి శ్లోకాలను జాగ్రత్తగా చదివితే గీతాసారం ఒంటబడుతుందని చెబుతారు.

ఉద్యమ‘గీత’

మనిషి ‘మనీషి’ కావడానికి గీత మార్గనిర్దేశకత్వం చేస్తుందని ఎందరో మహనీయులు వ్యాఖ్యానించారు.

భగవద్గీత కేవలం మతపరమైనదో, సన్యాసులకో, యోగులకో, వృద్ధులకో పరిమితమైన గ్రంథమో కాదు. అలనాడు కురుక్షేత్రంలో అర్జునుడి మోహాంధకారాన్ని నశింపచేసిన ఈ గ్రంథం భారత స్వరాజ్య సమరంలో ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. పంజాబ్‌ ‌కేసరి లాలా లజపతిరాయ్‌ ‌మాండలే జైలు జీవితంలో దీనిని లోతుగా అధ్యయం చేసి ‘గీతా సందేశం’అనే పుస్తకాన్ని రాశారు.‘గీత’లోని కర్మయోగం అధ్యాయంతో ప్రభావితులైన బాలగంగాధరతిలక్‌ ‘‌గీతా రహస్యం’ అనే గ్రంథం రాశారు. ఉత్తమ లక్ష్యాన్ని తీర్చేదిద్దే ‘ధర్మసింధు’ గీత అని స్వామి వివేకానంద అభి వర్ణించారు. భగవద్గీత లేకపోతే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమైనట్టు కాదని ఇంగ్లండ్‌ ‌కవి ఎడ్విన్‌ ఆర్నాల్డ్ అన్నారు.

‘ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతమ్‌

ఏకోదేవో దేవకీ పుత్ర ఏవ

ఏకో మంత్రస్య నామానియాని

కర్మాప్యేకం తస్య దేవస్య సేవా’

(గీతాశాస్త్రమే ఏకైక శాస్త్రం, దేవకీనందనుడు శ్రీకృష్ణుడే ఏకైక దైవం, ఆయన నామాలు దివ్యమంత్రాలు, ఆయన సేవే సత్కర్మయుక్త ఏకైక సేవ) అని ఆర్యోక్తి. అలాంటి ‘జీవన గీత’ గానం వరస మారింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో అది వినిపించినప్పుడు ‘శవ జాగారమో లేక శవయాత్రో’ అనే సంకేతాలిచ్చే స్థితికి గీతాపఠనాన్ని తీసుకురావడం అత్యంత శోచనీయం. మనిషి ఎలా మనీషిగా మారాలో చెప్పే ‘జ్ఞాన’గీతను మరణ సమయంలో వినిపించడంలో ఔచిత్యం బోధపడదు. తెలుగు వారంతా ఈ దుష్ట సంప్రదాయాన్ని తొలగించేందుకు కంకణబద్ధులై ఇది ‘శోభ’ గీతే కాని శోక’ గీత కాదు, కారాదు అని నిరూపించాలి. అదే ‘గీతా జయంతి’కి ఇచ్చే నిజమైన గౌరవం.

కొన్ని ‘గీతో’క్తులు

*  పిరికితనాన్ని వదలి లక్ష్యదిశగా ధైర్యంతో అడుగువెయ్యి. గతాన్ని తలచి వగచడం కాదు. భవిష్యత్తులో సాధించాలనుకునే విజయాల కోసం ప్రణాళికబద్ధంగా సాగు.

*   విజయాలకు మనసే మూలం. అధైర్యం నిండి ఉండే మనసు ఏమీ చేయలేదు. అన్యాయాలను ఎదుర్కోవడం లాంటివి చేయలేదు. అందుకే మనో దౌర్బల్యాన్ని విడనాడి సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి.

*     ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థితప్రజ్ఞుడుగా ఉండడం. అంటే కష్టంలో కుంగకపోవడం, సుఖంలో పొంగక• పోవడం.

*     నీకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వర్తించు. నువ్వు చేసే మంచి పనులే నిన్ను రక్షిస్తాయి.

*    సర్వ ప్రాణుల పట్ల సమదృష్టి కలవారే పండితులు. సమాజం నుంచి ఏదో కోరుకుంటు న్నప్పుడు తాను కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలి.

*     విషయాలపై అనురక్తి కలవాడు శాంతిని పొందలేడు.

*     అభ్యాసం, వైరాగ్యాలతో మనసు నిగ్రహించుకో వచ్చు. ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

*     భగవంతుడిని ఏ దృష్టితో సేవిస్తే అలానే అనుగ్రహిస్తాడు. పరమాత్మే సర్వం అని నమ్మిన వారికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది.

*   ఉత్తమ జీవితం సాగించాలంటే ఇంద్రియాల అదుపు అవసరం. కోరికలు దు:ఖానికి హేతువులు. కోరికలే లేక•పోతే దు:ఖానికి తావేలేదు.

*     అథం పాతాళానికి దారితీసే స్వార్థపరమైన కోరిక విషవలయంలో చిక్కవద్దు.

*     అనవసరమైన ఆలోచనాలు రానీయవద్దు. అవి బుద్ధిలో వేగాన్ని మందగింప చేస్తాయి.

*     ఏ విషయాన్ని అయినా బాగా ఆలోచించి స్థిరమైన నిర్ణయానికి రావాలి. ఏకాగ్రతతో పని చేయాలి.

*     నిస్వార్థ బుద్ధితో చేసే పనిలో పాపపుణ్యాల ప్రసక్తి ఉండదు.. ఇలా మానవ జీవితానికి చుక్కాని.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram