‘‌వందే వాల్మీకి కోకిలమ్‌’

అక్టోబర్‌ 31 ‌వాల్మీకి జయంతి

‘‌కూజింతం రామరామేతి మధురం మధురాక్షరం/ఆరుష్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలమ్‌’ (‌కవిత్వమనే కొమ్మనెక్కి రామా! రామా! అని కూస్తున్న వాల్మీకి అనే కోకిలకు నమస్కరిస్తున్నాను) ఆదికవి స్తుతి. కోకిల కూత మధురంగానే ఉంటుంది. ఈ వాల్మీకి కోకిల రచన మధురంగానూ, మధురాక్షరం గానూ ఉంటుంది. కోకిల గానం ‘కుహూ’రవమే కాగా ఈ మహాకవి గానం మధురాక్షర సమన్వితం. రత్నాకరుడు కిరాతకుడిగా ఉంటూ దారిదోపిడీలతో జీవనం సాగించేవాడు. మహర్షుల ఉపదేశం, శ్రీరామ జపంతో మహర్షి, మహాకవి, ఆదికవి అయ్యాడు. శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని లోకానికి అందించాడు. అనేక దేశాలు భాష, నాగరికత అంటే ఏమిటో తెలియక కొట్టుమిట్టాడుతున్న కాలంలోనే వాల్మీకి వేద ధర్మ ప్రతిపాదిత శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని నిర్మించాడు. వ్యక్తి, కుటుంబ, సంఘ ధర్మాలతో త్రివేణి సంగమంలా ఈ మహాకావ్యం తరతరాలుగా మానవజాతిని పునీతం చేస్తోంది. ఈ రసమయ కావ్యంలో ఆధ్యాత్మిక విద్యా రహస్యాలను కూడా అంతర్వాహినిగా ప్రసరింపచేశాడు. ఉత్తమ మానవతా విలువలు కలిగిన దీని మాధుర్యాన్ని ఆస్వాదించిన పాశ్చాత్య పండితులు అనేకులు తలలూపారు. ‘భారతదేశం వాల్మీకి దేశం- రామాయణ దేశం’అని మాక్స్‌ముల్లర్‌ ‌మహాశయుడు కీర్తించాడు.

భారతదేశానికి అనంత ఆధ్యాత్మిక కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి ఇచ్చిన వాల్మీకి పుట్టుపూర్వోత్తరాలను మననం చేసుకుంటే-ఆయన వరుణుడి పదవ కుమారుడని పురాణాలు చెబుతున్నాయి. ప్రచేతసుడి కుమారుడని, వరుణుడి కుమారుడని రామాయణం, బ్రహ్మ కుమారుడని ఉత్తర రామాయణం చెబుతున్నాయి. బ్రహ్మశాపం కారణంగా బోయవాడిగా జన్మించాడని రామాయణం చెబుతోంది. వాల్మీకిగా పూర్వా శ్రమంలో దుర్మార్గంగానే మెలిగాడు. కుటుంబ పోషణకు దారిదోపిడీలు చేసేవాడు. ఒకనాడు సప్తరుషులను అడ్డగించగా, ‘నీ పాపాలలో భార్యాబిడ్డలు పాలు పంచుకుంటారేమో తెలుసుకొని రా’ అని హితవు పలికారు. అదే మాట కుటుంబ సభ్యులను అడిగినప్పుడు వ్యతిరేక సమాధానం వచ్చింది. జ్ఞానోదయమై ఋషులను శరణువేడాడు. తనకు సన్మానం ఉపదేశించాలన్న వినతి మేరకు తారక•మంత్రాన్ని అనుగ్రహించారు. రామనామ నిశ్చల జపంతో ఆయన చుట్టూ పుట్టపెరిగింది. తపస్సిద్ధిపొందాడు. వల్మీకం (పుట్ట)నుంచి వెలుపలికి వచ్చినందున వాల్మీకిగా ప్రసిద్ధుడయ్యాడు.

తమసా నదీతీరం నుంచి తన ఆశ్రమానికి వస్తూండగా ఓ వేటగాడు క్రౌంచపక్షిని బాణంతో కొట్టగా ఆయన నోట….

‘మానిషాద ప్రతిష్ఠాంత్వం ఆగమః శాశ్శతీస్సమాః

యత్‌ ‌క్రౌంచ్‌మిధునాదేకం అవధీః కామ మోహితమ్‌’ (ఓ ‌బోయవాడా! క్రౌంచపక్షులు జంట కామక్రీడలో ఉండగా మగపక్షిని సంహరించావు కనుక నీవు ఈ లోకంలో చాలా కాలం నిలకడగా ఉందువు గాక) అని అలవోకగా శోకపూరిత శ్లోకం వెలువడింది. ఆడపిట్ట విలాపంతో ఆయన మనసు కలతచెందింది. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న శిష్యబృందం కూడా ఆ సన్నివేశాన్ని చూసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దానినే కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ ‘జీవుని వేదన’ అన్నారు. బోయవాడి చర్యతో వాల్మీకికి కలిగిన శోకం శ్లోకమైంది. అది కూడా ఛందోబద్ధం కావడం ఆయననే అశ్చర్యపరిచింది. తన పలుకులను పరీక్షించుకుంటే అందులో నాలుగు పాదాలు ఉండగా, ప్రతిపాదం ఎనిమిది అక్షరాలు కలిగి ఉంది. శోకం శ్లోకమైన ఆ క్షణం జనావళిని తరింపచేసే మహాకావ్యానికి, ఆది కావ్యానికి బీజం వేసింది. ఇది ఛందోబద్ధమైన ప్రథమ కావ్యంగా భారతీయ వాఙ్మయ చరిత్ర చెబుతోంది.

‘వృత్తం రామస్య వాల్మీకీః । సుకృతిః కిన్నర స్వరౌ।

కింతత్‌? ‌యేన మనోహర్తుమ్‌। అలంస్వాతాం న శ్వణ్వతామ్‌।। (‌చరిత్రా! శ్రీరామునిది. రచనా! వాల్మీకిది. గానము చేసేవారా కిన్నర కంఠస్వరులైన లవకుశులు. ఇక ఇందులో శ్రోతల మనసులను అలంరించని అంశం ఏముంది?)అని మహాకవి కాళిదాసు రామాయణాన్ని శ్లాఘించాడు.

‘మధుమయిఫణితీనాం మార్దదర్శీ మహర్షిః’ (మధుర శబ్దాలకు మార్గదర్శిగా నిలిచిన మహర్షి) అని భోజరాజు శ్లాఘించారు.

‘మానిషాద ప్రతిష్ఠాంత్వం….’ శ్లోకం నిషాదుడిని శపిస్తున్నట్లు పైకి కనిపించినా అందులోని ప్రతిపదాన్ని పరిశీలిస్తే అవతారపురుషుడు శ్రీరాముడికి మంగళాశాసనం చేసినట్లనిపిస్తుందని సాహితీవేత్తలు విశ్లేషించారు. వక్రబుద్ధితో సీతామాతాను అపహరించిన రావణుడిని సంహరించినందుకు, అతని వల్ల దేవతలకు గల పీడ వదల్చినందుకు నీవు శాశ్వత కీర్తి పొందేదవు గాక!అని మరో అర్థం ఈ శ్లోకంలో దాగుందని వివరిస్తారు.

వేటగాడి బాణానికి క్రౌంచపక్షి నేలకూలిన సంఘటన చూసినప్పటి నుంచి కలత చెందిన వాల్మీకి అటు తర్వాత నారదుడిని కలిసి తన ఆవేదనను వివరించాడు. వైవాహిక బంధంలోని ఎడబాటు గురించి అద్భుతమైన రచన చేయవలసిందిగా త్రిలోకజ్ఞుడైన దేవర్షి సలహా ఇచ్చాడు. తన కావ్యనాయకుడి పాత్రకు తగిన ఉన్నత వ్యక్తిత్వం, అసాధారణ లక్షణాలు గల వారు ఉన్నారా?…

‘కోన్వస్మిన్‌ ‌సాంప్రతంలోకే గుణవాన్‌ ‌కశ్చ వీర్యవాన్‌, ‌ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో దృఢవ్రతంః’ (ఈ లోకంలో గుణవంతుడు, వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు,సత్యవాది, దృఢవ్రతుడు) ఎవరు అనే ప్రశ్నలతో రామాయణ కావ్యం పుట్టింది. అలాంటి గుణగణాలు గల వారు కనిపించడం కష్టతరమేనని, అయినా ఇక్ష్వాకు వంశీయుడు రామునిలో ఆ శుభలక్షణాలు ఉన్నాయంటూ….

‘ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైఃశ్రుతః

నియతాత్మా మహావీర్యౌ ద్యుతిమాన్‌ ‌ధృతిమాన్‌ ‌వశీ’ అని శ్రీరాముడి సుగుణాలను నారదుడు వర్ణించగా విన్న వాల్మీకి ఆయనను సభక్తిగా అర్చించాడు. రాసిన రామకథ క్రమంగా శతకోటి ప్రవిస్తరమైంది. రామాయణాది పురాణ రచనకు ప్రతిభ మాత్రమే సరిపోదట. అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంతో అవసరమట. త్రిమూర్తులు, సప్తరుషులు, నారదాది మహనీయుల అనుగ్రహపాత్రుడైన ఆయనలో భక్తి విశ్వాసాలకు కొదువలేదు. వాటితోనే రామకథ పాత్రలను అజరామరం చేశాడు. స•ంస్కృతి పరంగా కథను సర్వజనీనం, విలువలను సార్వకాలికం, మనిషిని పురుషోత్త ముడిని చేశాడు. సృష్టిలో ఏ రూపమైనా శ్రీరామునితో సరిపోలేదనేంత ఉన్నతంగా రాముడిని వర్ణించాడు. అందుకే ‘రామో విగ్రహవాన్‌ ‌ధర్మః’ (శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మం) అన్నారు. ‘రామాదివత్‌ ‌వర్తితవ్యం’ శ్రీరామసోదరుల వలె ప్రవర్తించాలి. ‘నరావణాదివత్‌’ (‌రావణాదుల మాదిరిగా కాదు) అని వాల్మీకి కృతి హితవు చెబుతోంది. మానవ (రామసోదరులు), వానర సోదరులు (వాలి, సుగ్రీవ),రాక్షస సోదరులు (రావణాదులు) పాత్రలను మహాకవి నిర్వహించిన తీరు అనితరసాధ్యమని, ఆ మూడు రకాల సోదరులు ఒక్కొక్క ప్రకృతికి ఒక్కొక్క ప్రతీక అని అంటారు విమర్శకులు.

శ్రీరాముడిని అవతారపురుషుడిగా కంటే ఆదర్శమూర్తిగా, ఆరాధ్యదైవంగానే మలిచాడు వాల్మీకి ముని. రాముడిని ఉత్తమత్వానికి ప్రతిబింబంగా తీర్చిదిద్దాడు. రాముడు కూడా తాను శ్రీ మహావిష్ణువు అవతారమని పేర్కొనలేదు. ఏ పాత్రతోనూ ఆయనను అవతారపురుషడని అనిపించలేదు. శాంతమూర్తి, ధర్మరక్షకుడు, సత్యసంధుడు, సమర్థ పాలకుడిగా, ఎదురులేని వీరుడు, సత్‌పుత్రుడు, అనురాగ సోదరుడు, ప్రాణమిత్రుడు, ఉత్తమభర్త… ఇలా అనేక ఉత్తమ లక్షణాలు గల నాయకుడిగా ఆవిష్కరింప చేశాడు. శ్రీమద్రామాయణ రచనతో రాముని పాత్రకు విశ్వవిఖ్యాతిని, శాశ్వతకీర్తిని కలిగించాడు. ఏడు కాండలు, వంద ఉపాఖ్యానాలు, ఆరు వందల సర్గలు, 24 వేల శ్లోకాలతో గల ఈ ‘ఆది’ మహాకావ్యం మానవుడు తన జీవితాన్ని ఆదర్శంగా మలచుకునే తీరును ప్రబోధిస్తుంది. అనన్యరీతిలో కథాగానం చేసి రామకీర్తిని లోకోత్తరం చేసిన మహాఋషి. ఆయన చేపట్టిన రామాయణ కృతి రచన ప్రతిష్ఠాత్మక క్రతువు. సమకాలికుడైన ఒక మహా చక్రవర్తి చరిత్ర కనుక రచనాశైలి అంతే బిగువుగా ఉండాలి. సాక్షాత్‌ ‌బ్రహ్మదేవుడు, ఆయన మానస పుత్రుడు నారదుడిచే ప్రబోధితమై, బ్రహ్మవరప్రసాది వాల్మీకి ఉపక్రమించిన కార్యానికి ఆటంకానికి అవకాశం ఉండదని ఈ అపూర్వ కావ్యం నిరూపించింది.

రామాయణ కథలేని భారతీయ భాషలేదు. రామాలయంలేని పల్లెలేనట్లే, రామకథలేని భాషలేదనడం అతిశయోక్తి కాదు. అదంతా వాల్మీకి అక్షరభిక్ష. ఇది భారతదేశ సాహిత్య సంపదే కాదు. టిబెట్‌, ‌టర్కీ, చైనా, సింహళం, జావా, కంబోడియా, థాయ్‌లాండ్‌, ఇం‌డోనేషియా, మలేసియా, వియత్నాం లాంటి ఎన్నో దేశాలకు విస్తరించింది. ఈజిప్టు రాజవంశం పేర్ల, కథలతో రామాయణగాథలకు ఆ దేశానికి పరిచయం ఉన్నట్లు చెబుతారు.

విశ్వనాథ వారు తమ కృతికి పేరుపెట్టినట్లు ‘రామాయణం కల్పవృక్ష’మే. దానికి రాముడు మూలాధారం. రామాయణం శాశ్వతధర్మానికి కేంద్రం. త్యాగభావానికి, త్యాగశీలతకు నిలయం, నిత్య సంపదకు స్థావరం. జడత్వానికి, భవరోగానికి దివ్యౌషధం. రసజ్ఞానికి రమణీయ కావ్యం. సామాన్యు లకు అందమైన కథ. నీతివేత్తలకు నీతిశాస్త్రం. యోగులకు యోగశాస్త్రం, మంత్రసాధకులకు మంత్రరాజం మహిమాన్వితం, ముముక్షువులకు మోక్షప్రదం. సర్వజనశ్రేయోదాయకం, సర్వమంగళప్రదం.

వేదాలను నాలుగుగా విభజించి, బ్రహ్మ పురాణంతో ప్రారంభించి బ్రహ్మాండ పురాణం వరకు పద్దెనిమిది పురాణాలు రాసిన వ్యాసభగవానుడు బ్రహ్మాండపురాణంలో ఆధ్యాత్మిక రామాయణాన్ని ప్రవేశపెట్టారు. రామాయణాన్ని సమూలంగా పరిశీలించిన ఆయన అవసరమైనంత వరకు స్వీకరించారని విద్వన్ముణులు చెబుతారు. 24 వేల శ్లోకాల కావ్యాన్ని 4,200 శ్లోకాలకు సంక్షిప్త పరచి రచన సాగించారంటారు. అప్పటికే ప్రసిద్ధమైన కథను తిరిగి రాయాలంటే ప్రస్తుత శైలి, కథాకథనం అంతకంటే ప్రత్యేకత కలిగి ఉండాలని, అప్పుడే అది శోభిస్తుందన్న న్యాయాన్ని బట్టి ‘ఆధ్యాత్మ రామాయణం’ అనే పేరుతో ఆధ్యాత్మిక భావాన్ని పొందుపరుస్తూ కథనం నడిపించారు. ‘కావ్యం పేరుకు తగినట్లే ఆధ్యాత్మిక సంఘటనలు, సందర్భాలు కల్పించి ఆయా పాత్రలతో జ్ఞానోపదేశం చేయించారు. వాల్మీకి, వ్యాసమహర్షులు సంస్కృత వాఙ్మయానికి రెండు కళ్లు అని, వాల్మీకి రచన బంగారమైతే దానికి శాశ్వత పరిమళం అద్దినవాడు వ్యాసుడు’అని సాహితీ విమర్శకులు సూత్రీకరిస్తారు.

మహాభారతం లోకేతిహాసం అయితే రామాయణం ఆత్మేతిహాసమని, వ్యాసుడు పరాశరాత్మజుడైతే వాల్మీకి ప్రచేతస-ఉన్నత మనోభూమికల-ఆవిష్కారమని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య అభివర్ణించారు. వాల్మీకి మహా కావ్యాన్ని మాతృకగా తీసుకొని ఎన్నో రామాయణాలు, ఎన్నో పక్రియలలో ఎన్నో భాషలలో పుట్టుకొచ్చాయి.

‘యః కర్ణాంజలి సంపుటైరహ రహస్సమ్యక్‌ ‌పిబత్యా దరాత్‌

‌వాల్మీకేర్వదనరావింద గళితం రామాయణాఖ్యం మధు

జన్మవ్యాధి జరావిపత్తి మరణై రత్యంత  సోపద్రవం

సంపారం సవిహాయ గచ్ఛతి పుమాన్‌ ‌విష్ణోః  పదం శాశ్వతమ్‌’….

‘ఆదికవి వాల్మీకి పలికిన రామకథామృతాన్ని ఆస్వాదించినవారు జన్మదుఃఖం జరాదుఃఖం, వ్యాధి, ఆపదలు, మరణబాధ లేకుండా వైకుంఠప్రాప్తి పొందుతారు’ అని భావం.

‘శ్రీరామాయణ కావ్యకథ… జీవన్ముక్తి మంత్రసుధా’ అని తరతరాలుగా మానవజీవితంతో మమేకమైన కావ్యస్రష్టకు అనంత వందనాలు.

– రామచంద్ర రామానుజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *