విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబర్‌ 27

‌విద్యల నగరం విజయనగరానికే పరిమితమైన ఒకనాటి గ్రామదేవత ఉత్సవం అనంతరకాలంలో కళింగ దేశానికి విస్తరించింది. దేశవిదేశీయులను ఆకట్టుకుంటోంది. రెండున్నర శతాబ్దాలకుపైగా పూజలందుకుంటూ ఆ ప్రాంతవాసులకు కొంగు బంగారంగా మన్ననలు అందుకుంటోంది. ఆమే పైడితల్లి. విజయనగరం మహారాజుల గారాలపట్టి. ఆ సంస్థానాన్ని 1741-1757 మధ్య పాలించిన పెద విజయరామరాజు గజపతికి ముద్దుల చెల్లెలు. అన్నకు ప్రాణహాని కలిగిందని తెలిసి ఆత్మార్పణ చేసుకున్న ‘బంగారు’ (పైడి)చెల్లి. ఆ తల్లికి ఏటా జరిగేది సిరిమానోత్సవం. ఈ ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే తమ ఇంట సిరులు పండుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

నాగావళి, వంశధార, చంపావతి, శారద నదుల తీరాలలో అనేకానేక దేవాలయాలు, విద్యాలయాలు నిర్మించిన విజయనగరం మహారాజుల ఆడపడుచు పైడిమాంబకు చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. దేవీ ఉపాసకురాలు. అన్న విజయరామరాజు పొరుగు రాజ్యం బొబ్బిలిపై యుద్ధం ప్రకటించడం అమెను కలిచివేసింది. యుద్ధం వద్దని వారించింది. కదనంలో అన్ననే విజయం వరించినా, ఆయనకు ఆపద పొంచి ఉందని దేవి కలలో హెచ్చరించిం దట. ఉపవాస దీక్షలో ఉన్న ఆమె రాజవంశీయులకు అత్యంత సన్నిహితుడు పతివాడ అప్పలనాయుడు సహాయంతో బొబ్బిలి బయలు దేరింది. ఆమె విజయనగరం పెద్దచెరువు ప్రాంతానికి చేరేసరికి అన్న మరణ వవార్త తెలిసింది. విజయరామరాజు విజేతగా తిరిగి వస్తూ జొన్నవాడ సమీపంలో విశ్రమించినప్పుడు తాండ్ర పాపా రాయుడు ఆయనను హతమారుస్తాడు. ఆ సమాచారం విని తట్టుకోలేక ఆమె చెరువులో దూకి ఆత్మార్పణం చేసుకుంది. దేవీ ఉపాసకురాలైన పైడిమాంబ దైవత్వం పొంది పైడితల్లి అమ్మవారుగా వెలిసిందని కథనం. అనంతరం ఆమె పతివాడకు కలలో కనిపించి చెరువులోని తన విగ్రహాన్ని వెలికితీయించాలని చెప్పగా, విజయదశమి పర్వదినం తరువాత వచ్చిన మంగళవారం నాడు దానిని వెలికితీశారు. విగ్రహం దొరికిన చోటనే పూసపాటి రాజవంశీయులు గుడి కట్టించారు. ఆ విగ్రహాన్ని చెరువు నుంచి వెలికి తీయించిన పతివాడ అప్పలనాయుడు ఆ అమ్మకు ప్రథమ పూజారి. నాటి నుంచి ఆ కుటుంబానికి చెందిన వారు వంశపారంపర్యంగా పూజారులుగా వ్యవహరిస్తున్నారు. విజయదశమి తర్వాత వచ్చిన మంగళవారం నాడు విగ్రహాన్ని వెలికి తీయడం వల్ల నాటి నుంచి ఏటా అదే రోజున సిరిమానోత్సవం నిర్వహిస్తారు. అయితే దేవీ నవరాత్రులతో పాటే పైడితల్లి ఉత్సవాలు మొదలవుతాయి.

ఆలయ ప్రాంతమంతా అప్పట్లో దట్టమైన అడవిగా ఉండడంతో ‘వనం గుడి’ అని పేరు వచ్చింది. అది పట్టణానికి దూరంగా ఉండడంతో కోట సమీపంలో మూడు లాంతర్ల కూడలి వద్ద 1924లో మరో గుడి కట్టించారు. ఆలయం 1951లో దేవాదాయధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది.

బెజవాడ కనకదుర్గమ్మ అంశే పైడితల్లమ్మ అనే గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకప్పుడు బెజవాడను ఏలిన పూసపాటి రఘునాథరాజు (విజయనగరం పూసపాటి వంశీయుల మూల పురుషుడు) ధర్మపాలనకు మెచ్చిన దుర్గమ్మ ఏడు ఘడియల పాటు కనకవర్షం కురిపించిందని, అందువల్లే ‘కనకదుర్గ’అని పేరు వచ్చిందని చెబుతారు. ‘కనకం’అంటే ‘పైడి’ (స్వర్ణం)కనుక కనకదుర్గమ్మే ‘పైడితల్లి’అని విశ్వాసం. ఒక్కొక్క ప్రాంతంలోని పిల్లలకు అక్కడి దేవుడు, దేవతల పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్తరాంధ్రలో పైడితల్లి, పైడమ్మ,పైడిరాజు, పైడన్న,పైడప్పడు లాంటి పేర్లు కనిపిస్తాయి.

శరన్నవరాత్రుల ప్రారంభం నాడే, అంటే ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు నేరేడు చెట్టు కొమ్మను అమ్మవారి గుడివద్ద నాటడం ద్వారా జాతర ఏర్పాట్లు మొదలుపెడతారు. ఈ ఉత్సవానికి ముందుగా వచ్చే మంగళవారం నాడు ‘మొదలి చెరువు’పూజ నిర్వహిస్తారు. అమ్మవారిని పాలతో అభిషేకించి తొమ్మిది రకాల పిండివంటలతో నైవేద్యం పెడతారు. సిరిమాను పండుగకు మొదటి (లి) రోజైన మంగళ (చేరు)వారమే ‘మొదలి చెరువు’గా వాడుకలోకి వచ్చిందని స్థానికులు చెబుతారు. ఆలయ ప్రధాన పూజారి ఆ రోజు నుంచి మరింత నిష్ఠను పాటిస్తారు. అలా అమ్మ వారికి చేరువైన ఆయన ‘సిరిమాను’ నాటికి ఆమె ప్రసాదించే తేజస్సుతో మెరిసిపోతాడని అంటారు.

తొలేళ్ల ఉత్సవం

సిరిమాను ఉత్సవానికి ముందు రోజు ‘తొలేళ్ల’ ఉత్సవం నిర్వహిస్తారు.ఆ రోజున ఆలయ ధర్మకర్తలు, పూసపాటి వంశీయులు ఊరేగింపుగా వెళ్లి అమ్మ వారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఘటాలను ఊరేగింపుగా కోట దగ్గరకు తెచ్చి, కోటశక్తికి పూజలు చేసిన తర్వాత వాటిని గుడికి చేరుస్తారు. ఆ రోజున రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తారు. వాటిని నాటితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. తొలకరి ముందు భూమిని దున్నిన రోజును ‘తొలి ఏరు’ అంటారని, అదే ‘తొలేళ్లు’ మారిందని చెబుతారు.

జాలరి వల

సిరిమానోత్సవంలో జాలర్లకు ప్రత్యేక స్థానం ఉంది. చెరువు గర్భం నుంచి అమ్మవారి విగ్రహాన్ని వెలికితీయడంలో స్థానిక జాలర్ల సహాయం విశేషమైనదిగా చరిత్ర చెబుతోంది. అలా ఆమె విగ్రహ తొలిసారి దర్శన భాగ్యం వారికే దక్కింది. నాటి నుంచి జాలర్లు సిరిమానోత్సవంలో ప్రముఖంగా పాల్గొంటూ వస్తున్నారు. అమ్మవారి విగ్రహం తెలికితీతకు వల ఉపయోగించినందున దానిని ఉత్సవంలో ఉంచుతారు.

పాలధార

దీనినే ‘జనధార అనికూడా అంటారు. వీరిని అమ్మవారి సైనికశక్తిగా చెబుతారు. పూర్వం కోట వెనుక అడవిలో నివసించేవారు (ఆటవికులు) కోట రక్షణగా ఉండేవారని, దానికి గుర్తుగా ఈటెలు ధరించి, డప్పులు వాయిస్తూ సిరిమానోత్సవంలో పాల్గొంటారు. వారు అమ్మవారి శక్తికి ప్రతీకలని భక్తుల విశ్వాసం.

శ్వేత గజం/అంజలి రథం

సిరిమానోత్సంలో తెల్ల ఏనుగు మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. సంస్థానాధీశులు భద్రగజాన్ని అధిరోహించి సిరిమాను ముందు నడిచేవారు. దానిని భక్తులు ఐరావతంగా పరిగణించేవారు. ఈ ఆనవాయితీ 1956 వరకు కొనసాగింది. కాలంతో పాటు పద్ధతి మారింది. రాచరికం పోయిన తరువాత ఏనుగు ఆకారంలో రూపొందించిన బండిని వినియోగిస్తున్నారు. ఈ బండిమీద ఏడుగురు మహిళా వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. మహిళలను పైడితల్లికి పరిచారికలుగా, పురుషుడిని పోతురాజుగా చెబుతారు. ఏడుగురు స్త్రీ వేషధారులను పైడితల్లి అమ్మవారి అక్కాచెల్లెళ్ల లాంటి గ్రామదేవతలుగా భావిస్తారు. రథంపై గల వీరంతా అందరికి నమస్కరిస్తూ సాగుతారు కనుక ‘అంజలి రథం’అంటారు.

సిరిమానోత్సవం

 పైడితల్లి జాతరలో తలమానిక సన్నివేశం ‘సిరిమానోత్సవం’. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు. ఈ ఉత్సవానికి నెల ముందే అనువైన చింతచెట్టును గుర్తిస్తారు. ఏటా సిరిమాను ఉత్సవానికి సరిపడే చెట్టు దొరకడం కూడా అద్భుత మైన విషయంగా చెబుతారు. ఎంపికచేసిన చెట్టు మొదట్లో కుంభం పోసి పూజించి మొదలును నరుకుతారు. చెట్టు దిగువ భాగాన్ని తల ఆకారంలో, చివరి భాగంలో అమ్మవారు (ప్రధాన పూజారి) కూర్చునేందుకు వీలుగా పీఠం అమర్చుతారు. సిరిమాను నిడివి దాదాపు 50 అడుగులు ఉంటుంది. దీనిని ఎడ్లబండిపై ఉంచి రెండు పక్కల ఇరుసు మానులకు బిగిస్తారు. వాటి ఆధారంగా సిరిమాను పైకి లేస్తుంది. మాను కొసన పొడువైన తాడు (మోకు)ను వేలాడదీస్తారు. సిరిమానును అధిరోహించే ప్రధాన పూజారిని పైడితల్లమ్మగా పరిగణిస్తారు. కలికితురాయితో తలపాగా, నుదుట బొట్టు, కుడిచేతిలో నిమ్మకాయలు, ఎడమ చేతిలో విసన్నకర్ర, బొడ్డులో కత్తితో వచ్చే ప్రధాన పూజారిని ఆహ్వానిస్తూ ఆయన పాదాలను పసుపు నీళ్లతో కడుగుతారు. నేలపై పడుకోబెట్టిన చిన్నారులను ఆయన దాటుకుంటూ వెళతారు. దీని వల్ల చిన్నారులకు కీడు ఉంటే తొలగిపోయి మంచి జరుగుతుందని తల్లిదండ్రులు విశ్వసిస్తారు. సిరిమాను అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు మూడుసార్లు నడుస్తుంది. గజపతుల ఆడపడుచులు కోట బురుజు నుంచి ఉత్సవాన్ని వీక్షించి అమ్మవారికి నీరాజనాలు అర్పిస్తారు. సిరిమాను ఉత్సవం జరిగిన మంగళవారం తర్వాత వచ్చే మంగళవారం గుడి వద్ద స్తంభానికి ఊయల (ఉయ్యాల కంబాల) కడతారు. కార్తీక మాస శుద్ధ పాడ్యమితో సిరిమాను ఉత్సవాలు ముగుస్తాయి

సిరిమాను ఉత్సవానికి ముందురోజు రాత్రంతా భామాకలాపం ఆడతారు.నాగినీ నృత్యాలతో పాటు పులివేషాలు, ఎలుగుబంటి, రాక్షస, పిట్టలదొర వేషాలతో పాటు కర్ర, కత్తిసాము, కోలాటం, సాముగరిడీలు ముమ్మరంగా ప్రదర్శితమవుతాయి.

జాతరపై కరోనా ప్రభావం

వృత్తి, ఉపాధి కోసం దూరప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఇంత విశిష్టత కలిగిన పైడితల్లి జాతరకు తరలి రావడం ఉండేది. కానీ ఈ ఏడాది పరిస్థితి తారుమారైంది. జాతరపై కోవిడ్‌-19 ‌ప్రభావం తీవ్రంగా పడింది. దూరప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి ఉత్సవాలను తిలకించే పరిస్థితి లేదు.అసలే ప్రయాణ సాధనలు ఎక్కడికక్కడ నిలిచిపోగా, అందుబాటులో ఉన్న వాటి ద్వారా రావలనుకున్నా నిబంధనలు అడ్డొస్తున్నాయి అమ్మవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. భక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాకని నియంత్రించేందుకు బస్సు సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని సాక్షాత్‌ ‌జిల్లా మంత్రి పాత్రికేయులకు చెప్పడాన్ని బట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram