జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి నిజ ఆశ్వయుజ శుద్ధ తదియ – 19 అక్టోబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


కశ్మీర్‌కు పట్టిన చీడ, లోయను దహిస్తున్న పీడ వదలడానికి ఇంకా సమయం పట్టేటట్టే ఉంది. భారత సర్వోన్నత చట్టసభ పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదంతో అమలులోకి వచ్చిన 370 అధికరణం రద్దు నిర్ణయాన్ని కొట్టిపారేస్తున్నారు కశ్మీర్‌ ‌నాయకుడు ఫారుక్‌ అబ్దుల్లా. ఈయన మాజీ ముఖ్యమంత్రి. కేంద్ర మాజీ మంత్రి. ప్రస్తుతం పార్లమెంట్‌ ‌సభ్యుడు. ఈయన అంటాడు- 370 అధికరణం రద్దును పొరుగు చైనా ఏనాడూ ఆమోదించలేదట. ఆ స్వయం ప్రతిపత్తిని తిరిగి కట్టబెట్టే వరకు మేం ఆగేది లేదని ఆ పొరుగు కుమ్మరిపురుగు ఇప్పటికే చెప్పిందని కూడా గుర్తు చేస్తున్నారు, ముదిమితో మెదడు కుళ్లిన ఈ పెద్దమనిషి. దీనిని బట్టి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యసభలో అడుగుపెట్టిన ఈ రాజకీయవేత్త నైచ్యాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం? 370 అధికరణం రద్దును చైనా జీర్ణించుకోలేకపోయినందుకు ఈయన మన చానెళ్లలో వాంతి చేసుకోవడంలో అర్థం ఉందా? ఇంకా, 370 అధికరణం రద్దు తరువాత చైనాకు మనసు పాడైపోయిందని కూడా చెప్పారు. 370, 35ఎ చట్టం మళ్లీ రావాలన్న ‘వారి’ ప్రజల మనోభీష్టాన్ని అల్లా నెరవేరుస్తాడేమో చూడాలని కూడా అన్నారు. ఇలాంటి సన్నాయి నొక్కుల తరువాత మనసులోని అసలు విషయం, విషం జమిలిగా కక్కేశారు. చైనా సాయంతో తిరిగి వాటిని పునరుద్ధరిస్తాడట.

ఈ ధోరణిని ఏమనాలి? బీజేపీ వ్యాఖ్యానించినట్టు ఈ వాచాలత, నోటి దురుసు ‘దేశద్రోహం’ కాక మరేమిటి? కశ్మీర్‌ ‌తమ జాగీరేనన్నట్టు, కుటుంబ ఆస్తి అన్నట్టు, ఇప్పటికీ కశ్మీర్‌కు సుల్తాన్లు, పాదుషాలు తామేనన్నట్టు విర్రవీగే నాయకులకు ఆ రాష్ట్రంలో లోటు లేదు.అక్కడి సాధారణ ముస్లింలు మాత్రం దారుణమైన పేదరికంలో ఉంటారు. ఓ మూడు కుటుంబాల నాయకులు, హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌పేరుతో పాకిస్తాన్‌కూ, ఉగ్రవాదానికీ పరోక్ష మద్దతు ఇచ్చే నాయకులు మాత్రం కోట్లకు పడగలెత్తుతారు. వీళ్ల బిడ్డలు మన ఇతర నగరాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉంటారు. ఇదే మోసం గడచిన ఏడు దశాబ్దాలుగా నిరాఘాటంగానే సాగిపోతోంది. కుంకుమ పూలవనం కుక్కమూతి పిందెలతో నిండిపోతోంది.

రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగినవారికీ, రాష్ట్రంలోను కేంద్రంలోను కూడా పదవులు నిర్వహించిన వారికీ అంతో ఇంతో ఇంగిత జ్ఞానం ఉంటుందని దేశప్రజలు అనుకోవడం సహజం. దేశ సమగ్రతను కాపాడతామని ప్రమాణం చేసి పొరుగున ఉన్న శత్రుదేశం సాయంతో ఏదో సాధిస్తామని చెప్పే పాపపు మాటలను ఏ మతమూ అంగీకరించదని అంతా అనుకుంటాం. కానీ ఫారుక్‌ ‌నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయి? అవి కూడా ఎలాంటి సందర్భంలో వెలువడినాయి? 370 రద్దుతో కడుపు మండిన చైనా లద్దాఖ్‌ ‌సరిహద్దులలో మాటు వేసిందట. అసలు ఆ అధికరణం రద్దుతో చైనాకు ఏమిటి సంబంధం? ఇదే ప్రశ్న ప్రపంచం నుంచి కూడా వచ్చింది కదా! అలాగే ఆ అంశం మీద మాట్లాడే హక్కు పాకిస్తాన్‌కు కూడా లేదని పలు దేశాలు హెచ్చరించడం అవాస్తవం కాదు కదా! అయినా ఇవేం మాటలు? ఇంకా చెప్పాలంటే, కశ్మీరీలకు సమ్మతం కాకపోతే 370 రద్దు గురించి వారి అండతోనే పోరాడతామని అంటే కాస్త గౌరవం మిగిలేది? కానీ ఈ ఫారూక్‌ అలా అనలేదు. అనలేడు. కశ్మీరీలు ఇప్పుడు ఈ పిచ్చి సుల్తాన్‌, ‌వెర్రి పాదుషా వెంట నడవడానికి సిద్ధంగా లేరు కదా! ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్తాన్‌దేననీ, బుర్హన్‌వనీ యోధుడనీ ప్రకటించినప్పుడే ఈ వక్రబుద్ధి ఉన్మాది మీద చర్యలు తీసుకుని ఉండాల్సింది.

ఈ దేశంలో ముస్లింల నాయకులమని చెప్పుకునే వారి పట్ల, ముస్లింల హక్కులంటే గుడ్డలు చించుకునే ముస్లిమేతర మేధావుల పట్ల సాధారణ ముస్లిం ఒక నిశ్చితాభిప్రాయానికి రావడానికి ఇంకా ఆలస్యం చేయడం తగదని కూడా చెప్పవలసిన సమయమిది. కశ్మీర్‌ అం‌శానికి సంబంధించి చైనా సాయం కోరతానని నిస్సిగ్గుగా చెప్పిన ఫారుక్‌కు ఆ దేశంలో ముస్లింలు ఏపాటి  ఆత్మగౌరవంతో బతుకుతున్నారో తెలియదా? భారతదేశం మీద అక్కసుతోనో, బీజేపీ పట్ల భయంతోనో ఆయన సాటి ముస్లింలను అత్యంత క్రూరమైన వాతావరణంలోకి నెట్టివేయదలుచుకున్నారా? హక్కుల పొడ ఏమాత్రం గిట్టని డ్రాగన్‌ ‌దేశంలో ఉయ్‌ఘర్‌ ‌ముస్లింలు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో ఫారుక్‌ ‌వంటి మూర్ఖులకు చెప్పడం అవసరం. ఆ దేశ ముస్లింలకు నమాజ్‌ ‌చేసుకునే హక్కును కూడా చైనా కాలరాచింది. ఖైదీల వలె కూడా కాదు, బోనులో జంతువులను చూసినట్టే వారిని చూస్తోంది. వారి పిల్లలను వారికి దూరంగా ఉంచుతోంది. స్త్రీల పట్ల కూడా దయలేదు. ఇది ప్రపంచం కూడా వెల్లడించిన వాస్తవం. అలాంటి దేశం సాయం కోసమేనా ఫారుక్‌ ‌బులబాటం? సాటి కశ్మీరీ ముస్లింలకు సరికొత్త కాన్‌సెంట్రేషన్‌ ‌క్యాంపులు తెరిపించడమేనా ఆయన ఉద్దేశం?

హిందువులకు అనుకూలంగా వస్తున్న తీర్పులతో మతోన్మాద ముస్లిం నాయకులు నానాటికీ విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నారు. అయోధ్య వివాదాస్పద కట్టడం మీద సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు, షాహిన్‌బాగ్‌ ‌నిరసన ఆమోదయోగ్యం కాదంటూ, పోలీసులు అలాంటి వాటిని చూస్తూ ఊరుకుని ఉండవలసింది కాదంటూ వచ్చిన తీర్పు వీరిలో ఉన్మాదాన్ని మళ్లీ బయట పెట్టించాయి. ఈ చర్యలతోనే వీరికి మెజారిటీ హిందువులతో సయోధ్య, భారత రాజ్యాంగం పట్ల విధేయత ఏపాటిదో నానాటికీ ప్రశ్నార్థకమవుతున్నది. కాబట్టి తన ఆత్మగౌరవం కాపాడేది భారతదేశమా? పాకిస్తానా? చైనాయా? సాధారణ ముస్లిం సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టాలి.

By editor

Twitter
Instagram