జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి అధిక ఆశ్వయుజ బహుళ దశమి – 12 అక్టోబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌కొవిడ్‌ 19 ‌మరణాలు ఆరుమాసాల పదిరోజులలో లక్ష దాటేశాయి. మార్చి 22న ప్రారంభమైన ఆ వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్టోబర్‌ 6‌వ తేదీకి అందిన సమాచారం ప్రకారం భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య 1,02,685. కేసుల సంఖ్య 66 లక్షలు దాటింది. ఒక దశలో రోజుకు 90,000 కేసుల వరకు నమోదై తీవ్రంగా కలవరపెట్టాయి. అక్టోబర్‌ 5-6 ‌తేదీలలో 74,442 కేసులు నమోదైనాయి. కోలుకుంటున్నవారి శాతం 84.34కి చేరుకోవడం సాంత్వన కలిగించే అంశమే అయినా, వైరస్‌ ‌తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తుంది.

కరోనా కట్టడి, వైరస్‌ ‌విస్తరణ రైలు పట్టాల్లా కనిపిస్తున్నాయి. మరణాలు  ఆపడానికి అవసరమైన వ్యాక్సిన్‌ ‌లేదా టీకా ఆవిష్కరణ ఇంకా ఊరిస్తూనే ఉంది. రష్యా కనిపెట్టిన టీకా దురదృష్టవశాత్తు విశ్వసనీయమైనదని పేరు తెచ్చుకోలేకపోయింది. ఆక్స్‌ఫర్డ్ ‌వారి పరిశోధన మూడో దశలో దుష్ఫలితాలు కనిపించి, మరింత జాప్యానికి దారి తీసింది. ఏమైనా మరొక ఆరుమాసాలకు గాని వ్యాక్సిన్‌ ‌మన దేశానికి వచ్చే సూచనలు కానరావడం లేదు. ఇక అంతుపట్టని రీతిలో సర్వవ్యాప్తమవుతున్న కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవు. ఆరుమాసాల పాటు దేశంలో ఏ పనీ చేయకుండా పొట్ట గడిచే అవకాశం అధిక సంఖ్యాకులకు లేనేలేదు. పైగా అన్‌లాక్‌డౌన్‌ అమలుకూ, కొవిడ్‌ ‌విస్తరణకూ సంబంధం ఉంది. అయినా అన్‌లాక్‌డౌన్‌ ‌పక్రియను నిలిపివేయడం అసాధ్యం. మద్యం దుకాణాలు తెరవడం, తరువాత హోటళ్లు, మాల్స్‌కు అనుమతి ఇవ్వడం, వ్యాయామశాలలు, సినిమా, టీవీ షూటింగులు జరపడానికి,  సిటీ బస్సులు నడపడానికి, మెట్రోకు ఇప్పటికే పచ్చజెండా ఊపడం, అతి త్వరలో సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతించడం ఇవన్నీ వైరస్‌ ‌పెరగడానికి దోహదం చేసేవే అయినా, అనివార్యంగా సడలింపులు ఇస్తున్నారు. ఇవ్వక తప్పని వాతావరణమే ఉందని యావన్మందీ అంగీకరించకా తప్పడం లేదు. కానీ విచారించవలసిన అంశం ఏమిటంటే, వైరస్‌ ‌నివారణకు అత్యవసరంగా భావిస్తున్న కనీస జాగ్రత్తలు పాటించడం దగ్గర జనావళి చూపిస్తున్న దారుణ నిర్లక్ష్యం. ఆ జాగ్రత్తలు అసాధారణమైనవీ, అందుబాటులో లేనివీ, ఆచరణకు అందనివీ కూడా కాదు. అయినా జనంలో ప్రమాదకరమైన అలక్ష్యం కనిపిస్తున్నది. ఇది క్షంతవ్యం కాదు కదా!

అన్‌లాక్‌డౌన్‌ ‌పక్రియ ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికే తప్ప, నీచ రాజకీయాలు యథేచ్ఛగా సాగించడానికి కాదు. ఈ వాస్తవాన్ని సజావుగా స్వీకరించడం దగ్గరే, సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవడం దగ్గరే దేశంలోని  విపక్షాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. నిజం చెప్పాలంటే నేరపూరితంగా వ్యవహరిస్తున్నాయి. సంఘ విద్రోహులు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

కొవిడ్‌ 19 ‌మనుషులను చంపగలదేమోకానీ, అసాంఘిక శక్తుల మనసు మార్చలేదు. అందుకే నేరాలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం ఇలా ఉన్నది కాబట్టి బాధితులకూ, బలైపోయిన వారికీ పరిస్థితులు మెరుగైన తరువాత న్యాయం అందించే సంగతి చూడవచ్చునని అనలేం. న్యాయంలో జాప్యం ఇంకా పెద్ద నేరమని అంగీకరించవలసిందే. కానీ వారికి తక్షణ న్యాయం అందించేందుకు వేరే మార్గాలు ఉన్నాయి. మన న్యాయవ్యవస్థ ఉంది. దాని ద్వారా పోలీసులను, ప్రభుత్వాలను నిలదీయవచ్చు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లు ఎక్కనక్కరలేదు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఉద్దేశించి అమలు చేస్తున్న ఆ నిబంధనలను అధికార పార్టీ రాష్ట్రాలలో అయితే ఒక రకంగాను, బీజేపీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలో అయితే ఇంకొ రకంగాను చూస్తున్నాయి ఈ విపక్షాలు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన దుర్ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వీధులకెక్కి నిరసన ప్రదర్శన చేయడం ఏమిటి? సామాజిక, ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలను ఒక ముఖ్యమంత్రే ఉల్లంఘిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇలాంటి వారంతా తమ రాజకీయ ప్రయోజనాల కంటే ముందు ప్రపంచం ముందు ఉన్న భయానక వాస్తవాలను గమనంలోకి తీసుకుకోవడం అవసరం.

కొవిడ్‌ 19‌తో ప్రపంచం ఎలాంటి విపత్తులను ఎదుర్కొన్నదో, ఎదుర్కొన బోతున్నదో వివరించే సమాచారం ఇప్పటికీ అడపాదడపా వెలువడుతూనే ఉంది. ఆ విధంగా చూస్తే కరోనా కబంధ హస్తాలలో ప్రపంచం రోజురోజుకీ మరింతగా చిక్కుకుపోతున్న సంగతి అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పదిశాతం ఈ వైరస్‌ ‌బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది. ఆ సంస్థ అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్‌ ‌మైఖేల్‌ ‌రాయాన్‌ ‌వెల్లడించిన విషయం మరింత ఆందోళనకరమే. కొవిడ్‌ ‌కోరలకు చిక్కుకున్నవారు ప్రపంచ జనాభాలో పదిశాతం అని చెబుతున్నా, వాస్తవ అంచనాల ప్రకారం ఈ సంఖ్య కన్నా 20 రెట్లు అధికమని ఆయన అంటున్నారు. అంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి పదిమందిలో ఒకరు కరోనా కాటుకు గురైనవారే. కొవిడ్‌ 19 ‌తాజా పరిస్థితి గురించి చర్చించేందుకు ఏర్పాటైన 34 సభ్య దేశాల ప్రతినిధుల సభలోనే డాక్టర్‌ ‌రాయాన్‌ ఈ ‌సంగతి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలూ, జాన్సన్‌ ‌హాకిన్స్ ‌విశ్వవిద్యాలయం సేకరించిన లెక్కలూ దాదాపు సరిపోయాయి. ఆ విశ్వవిద్యాలయానికి అందిన సమాచారాన్ని బట్టి ప్రపంచ జనాభా 760 కోట్లలో 76 కోట్ల మంది వైరస్‌ ‌బారిన పడ్డారు.

అదృష్టవశాత్తు దేశంలో వైరస్‌ ‌బాధితుల రికవరీ రేటు సాంత్వన కలిగించే స్థాయిలో ఉంది. కానీ నీచ రాజకీయ వైరస్‌ ‌సోకి దేశానికి బెడదగా మారిపోతున్న వారే పెరిగిపోతున్నారు. దీనికీ ఓ ఔషధం కనుగొనాలి.

By editor

Twitter
Instagram