మానవాళి బాధాతప్త వాస్తవాలను చిత్రించిన కవయిత్రి ఆమె. మరణం, బాల్యం, కుటుంబ జీవనమే ఆమె కవితా వస్తువులు. అందుకే ఆమె అక్షరాలు ‘చెరువు మీద నిశి కప్పిన రెక్క’ల్లా ఉంటాయి. కాలం పట్ల కవి ఎంత నిర్లిప్తంగా  ఉండాలో, కాలం నీడలో మౌనిలా ఎందుకు ఉండాలో కూడా ఆమె చెప్పారు. అన్‌‌ట్రస్ట్‌వర్థీ అన్న కవితలో ఇలా అన్నారామె, ‘నేను చెబితే వినకు/ నా గుండె పగిలిపోయింది/ దేనినైనా నేను సమ్యక్‌ ‌దృష్టితో చూడను/ నేనేమిటో నాకు తెలుసు/ ఒక మానసిక వైద్యుడిలా వినడమే నేను నేర్చుకున్నాను’. ఆమె పేరు లూయీస్‌ ‌గ్లిక్‌. ఈ ఏటి సాహిత్య నోబెల్‌ ‌పురస్కారానికి ఎంపికయ్యారు. అయితే ఈ కవయిత్రి అంత అద్భుతమైన కీర్తిని కలిగినవారు మాత్రం కాదు. మరొక విషయం కూడా అకాడెమి ప్రకటించింది. ఆమె కవిత్వం అమెరికా సరిహద్దులను కూడా పెద్దగా దాటలేదు. ఇతర భాషలలోకి అనువాదం కూడా కాలేదు. అయినా  ‘విశ్వంలో ఒక వైయక్తిక దివ్య సౌందర్యంతో కూడిన ఉనికితో ఉండే ఆమె నిర్దుష్ట కవితావాణి’కి ఈ నోబెల్‌ ‌పురస్కారం ఇస్తున్నట్టు స్వీడిష్‌ అకాడెమి ప్రకటించింది.

గ్లిక్‌ ‌కవయిత్రిగా ఆవిర్భవించిన తీరు సాధారణం గానే ఉంటుంది. యూదు కుటుంబం నుంచి వచ్చిన బాలల జీవితం ఆకాలానికి ఎంత సంఘర్షణాత్మకమో  ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ వర్గం పడిన బాధను నమోదు చేయడమే ఆత్మహత్యా సదృశమైపోయేది. అలాంటి మానసిక సంఘర్షణ నుంచి బయటపడడానికి ఎందరో సృజన వైపు మరలారు. గ్లిక్‌ ‌కూడా అలాంటివారేననిపిస్తుంది. తండ్రి రాత్రి పూట పడుకునే ముందు చెప్పిన కథలు తనకు భాషా పరంగా ఒక స్పృహను కలిగించాయని అంటారామె. హంగరీ నుంచి వలస వచ్చిన  కుటుంబమది. తండ్రి రాత్రి గ్లిక్‌కు, ఆమె సోదరికి తప్పనిసరిగా కథలు చెప్పేవారు. అందులో సెయింట్‌ ‌జోన్‌ ‌కథ గ్లిక్‌ను ఎంతో కదిలించింది. కొన్ని కొన్ని సాధారణ భ్రమల నుంచి తాను ఎలా బయటపడ్డారో కూడా ఆమె చెప్పారు. 1973లో ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అక్కడితో తన జీవితం నాశనమైందని భావించారట. కానీ తరువాత సాగిన రచనలు చూశాకా, తన భాష, భావం ఎంతో మెరుగు పడినట్టు తెలుసుకున్నానని ఆమె అంటారు. మాతృత్వమే గ్లిక్‌ ‌కొత్త ఇతివృత్తాల అన్వేషణకు ఉపకరించింది. అయితే మరణం మీద మమకారం ఆమె కవితలలో తరచూ కనిపిస్తూ ఉంటుంది.

1943లో పుట్టిన ఈ అమెరికా కవయిత్రి 12 కవితా సంకలనాలను వెలువరించారు. మరొక 2 వ్యాస సంకలనాలు కూడా ప్రచురించారు. 2014లో ‘ఫెయిత్‌ఫుల్‌ అం‌డ్‌ ‌వర్చ్యువస్‌ ‌నైట్‌’ ‌కవితా సంకలనం వాటి ఆఖరిది. ఏల్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆంగ్లం బోధించే ప్రొఫెసర్‌ ‌గ్లిక్‌ ఆరు దశాబ్దాలుగా కవితా వ్యాసంగంలో ఉన్నారు. ఆమెను కన్ఫెషనల్‌ ‌పోయెట్‌గా (తన వ్యక్తిగత జీవితం ఆధారంగా రాసే కవిత్వం. ఇది 1950లలో అమెరికాలో జనించింది, ఈ కవితా స్రవంతికి ఉదాహరణ)  నిర్ధారించడం తగదనీ, ఆమె విశ్వజనీనతనే ఆకాంక్షించారని విమర్శకులు అంటారు. ఎమిలీ డికిన్సన్‌తో అమె కవిత్వాన్ని పోల్చడం కూడా సరికాదన్న అభిప్రాయం కూడా ఉంది. ఆమె కవిత్వంలో స్పష్టతను కోరుకుంటారని కూడా అంటారు. నోబెల్‌ ‌సాహిత్య పురస్కారం అందుకున్న పదహారవ మహిళ గ్లిక్‌. ‌హంగరీ యూదుల కుటుంబం నుంచి ఆమె వచ్చారు. చిన్నతనంలో బరువు పెరిగిపోతానేమోనన్న ఒక మానసిక వ్యాధి కారణంగా ఆహారం తినడం మానేసి ఎన్ని ఇక్కట్లకు గురైనదో, ఆ సమస్య నుంచే తాను కవిత్వంలోకి ఎలా ప్రయాణించానో ఆమె పలుసార్లు చెప్పారు.

1968లో గ్లిక్‌ ‘‌ఫస్ట్‌బోర్న్’ ‌పేరుతో తన తొలి కవితా సంకలనం విడుదల చేశారు. దీనితోనే ఆమెకు అమెరికా సాహితీ ప్రపంచంలో ఎనలేని ప్రతిష్ట ప్రాప్తించింది. ఇంకా డిసెండింగ్‌ ‌ఫిగర్‌, అరారత్‌ అం‌డ్‌ ‌ది ట్రయంఫ్‌ ఆఫ్‌ అచెల్లీస్‌ అనే కవితా సంపుటాలు 1985లో వెలువడినాయి.

తను మరణం తరువాత కూడా జీవించి ఉండాలనే కోరుకుంటున్నానని గ్లిక్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే తన రచనలు జనం నాలుకల మీద ఉండాలన్నదే ఆమె ఆకాంక్ష.


ఆకలి మీద పోరుకు నోబెల్ శాంతి బహుమతి

యుద్ధాలలో, సంఘర్షణలలో ఆకలి కూడా ఆయుధంగా మారిపోకుండా చూసేందుకు కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రపంచ ఆహార పథకానికి (వరల్డ్ ‌ఫుడ్‌ ‌పోగ్రామ్‌, ‌డబ్ల్యుఎఫ్‌పీ) ఈ సంవత్సరం నోబెల్‌ ‌శాంతి పురస్కారం దిక్కింది. ప్రజల, అందులో చిన్నారుల ఆకలిని యుద్ధానికి ఉపయోగించుకునే అవకాశం రాకుండా డబ్ల్యుఎఫ్‌పీ తన వంతు సాయ పడుతున్నది. యుద్ధాలు, హింసాత్మక ఘర్షణలతో తల్లడిల్లుతున్న ప్రాంతాల అన్నార్తులకు, 2019లో ఆరంభమైన కొవిడ్‌ 19 ‌బాధితులకు ఈ సంస్థ చేసిన సేవలకుగాను నోబెల్‌ ‌శాంతి పురస్కారం లభించింది.

డబ్ల్యుఎఫ్‌పీ ప్రపంచంలోనే మానవతా దృక్పథంతో నిర్వహిస్తున్న అతి పెద్ద ఆహార పథకం. 2019 సంవత్సరంలో కూడా 88 దేశాలలోని 100 మిలియన్‌ల అన్నార్తులకు ఆ సంస్థ సాయపడింది. వీరంతా ఆహార భద్రతకు సుదూరంగా, ఆకలితో ఆలమటిస్తున్నవారే. 2019 సంవత్సరంలో 135 మిలియన్‌ ‌ప్రజలు యుద్ధాలు, సాయుధ తిరుగుబాట్ల కారణంగా తిండి దొరకని స్థితికి చేరుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అన్నార్తులు కనిపించడం చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే.ఈ సంస్థ ఐక్యరాజ్య సమితిలో భాగమే. 2015లో సమితి తన శాశ్వత లక్ష్యాలలో ఒకటిగా ఆకలి నిర్మూలన పథకాన్ని ఎంచుకుంది.

కరోనా వైరస్‌ ‌కూడా ప్రపంచంలో అన్నార్తుల సంఖ్యను ఇటీవల దారుణంగా పెంచింది. దీనితో పాటు ఎమెన్‌, ‌కాంగో రిపబ్లిక్‌, ‌నైజీరియా, దక్షిణ సుడాన్‌, ‌బుర్కినాఫాసో వంటి దేశాలలో హింసాత్మక సంఘర్షణ, కరోనాల కారణంగా ఎందరో పస్తులు ఉండవలసి వచ్చింది. కరోనా నేపథ్యంలో డబ్ల్యుఎఫ్‌పీ తన సామర్థ్యాన్ని విశేషంగా పెంచుకుంది. మనందరికి వ్యాక్సిన్‌ అం‌దే రోజు వరకు ఆహారమే ఈ సంక్షోభానికి సరైన వ్యాక్సిన్‌ అని ఆ సంస్థ భావించింది.

ఆకలికీ, సంక్షోభానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అదొక విష వలయం. యుద్ధం కావచ్చు లేదా హింసాత్మక సంఘర్షణ కావచ్చు అవి అంతిమంగా ఆహార భద్రత భగ్నం చేయడానికీ, ఆకలిమంటలకీ దారి తీస్తాయి. ఇవి కూడా తిరిగి హింసాత్మక వాతావరణానికి తోడ్పడతాయి. అంటే యుద్ధాలను, సంఘర్షణలను పూర్తిగా నిర్మూలిస్తే తప్ప అన్నార్తులు లేని ప్రపంచం అనే తమ లక్ష్యం నెరవేరదని డబ్ల్యుఎఫ్‌పీ భావిస్తున్నది. 2030 సంవత్స రానికల్లా ఆకలి లేని ప్రపంచం నిర్మించాలన్నదే ఈ సంస్థ మహోన్నత ఆశయం.

డబ్ల్యుఎఫ్‌పీ ఐక్యరాజ్య సమితికే చెందిన ఆహార విభాగం. డిసెంబర్‌ 19, 1961‌లో దీనిని నెలకొల్పారు. దీని ప్రధాన కేంద్రం రోమ్‌లో ఉంది. ఎనభయ్‌ ‌దేశాలలో దీని కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి డేవిడ్‌ ‌బీస్లే అధిపతి. 17,000 మంది ఉద్యోగులతో ఇది నడుస్తున్నది. ఏటా సగటున 83 దేశాలలోని 91.4 మిలియన్‌ అన్నార్తులకు ఈ సంస్థ ఆహారం సరఫరా చేస్తున్నది. 2019 సంవత్సరా నికి ఇది ఆదుకుంటున్న అన్నార్తుల సంఖ్య (88 దేశాలలో) 97 మిలియన్‌లకు చేరుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలలో మూడింట రెండు వంతులు సంక్షుభిత దేశాలలోనే జరుగుతున్నాయి. అత్యవస రంగా ఆహారాన్ని అందించడమే కాకుండా, సహాయ పునరావాస కార్యక్రమాలను కూడా ఈ సంస్థ చేపడుతున్నది.

ఈ సంస్థను 1961లో స్థాపించారు. అంతకు ముందు సంవత్సం జరిగిన ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ‌సమావేశంలో ఇందుకు సంబంధించి రూపకల్పన జరిగింది. అప్పుడు శాంతి కోసం ఆహారం పథకం డైరెక్టర్‌గా జార్జ్ ‌మెక్‌ ‌గవర్న్ ఉన్నారు. మొదట 1963లో సుడాన్‌లో ప్రయోగాత్మ కంగా ఆహార పథకం ప్రారంభించారు. నిజానికి ఇది 20వ శతాబ్దంలో ఆరవ దశకంలో ఆరంభించి నప్పటికీ అసలు ఈ ఆలోచనకు ఆ శతాబ్దంలో అతి ఘోరమైన రెండో ప్రపంచ యుద్ధమే పురుడు పోసింది. ఆ యుద్ధానంతర దృశ్యం దయనీయమైనది. ఐరోపాలో చాలా భాగాలలో ప్రజలు ఆకలితో అలమటించిపోయారు. పలు దేశాలలో అన్నార్తులు ముఖ్యంగా బాలలు చెత్త కుప్పల మీద పడేసిన ఆహారం కోసం ఎగబడడం కనిపించేది. పిల్లలైతే ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం జంతువుల వలెనే కుమ్ములాడుకునేవారు. ఏదో ఒకటి, బతికితే చాలు అనుకునే రీతిలో ఏరుకుని తిన్నారు. ప్రపంచంలో చాలా చోట్ల ఇవే హృదయ విదారక దృశ్యాలు కనిపించేవి. ఇదే అంశాన్ని 1948లో జనరల్‌ ఐసెన్‌ ‌హోవర్‌ ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇది ఆయన స్వీయానుభవం కూడా. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాల తరఫు సేనలకు నాయకత్వం వహించిన ఐసెన్‌హోవర్‌ ‌తరువాత అమెరికా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం బాలలను ఎలాంటి దుస్థితికి తెచ్చిందో ఆయనకు అర్థమైంది. 1960లో ఆయన రెండో సారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో మరొకసారి ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. ఆ మరుసటి సంవత్సరమే డబ్ల్యుఎఫ్‌పీ అమలులోకి వచ్చింది. దీనికి జాన్‌ ఎఫ్‌ ‌కెన్నెడి ప్రోత్సాహం కూడా ఉంది. 1961లో ఏర్పడిన డబ్ల్యుఎఫ్‌పీ ఆ మరుసటి ఏడాదే అంటే 1962లోనే పెద్ద పరీక్షను ఎదుర్కొన వలసి వచ్చింది. ఉత్తర ఇరాన్‌లో భారీ భూకంపం వచ్చింది. 12,000 మంది చనిపోయారు. దీనితో ఆ సంస్థ 1500 టన్నుల గోధుమలు, 270 టన్నుల చక్కెర, 27 టన్నుల తేయాకు పంపించింది. తరువాత ఎన్నో దేశాల ప్రజలను – యుద్ధాల వేళ, కరువు కాటకాల సమయంలో ఈ సంస్థ ఆదుకున్నది. తన కార్యకలాపాల కోసం ఈ సంస్థ 5,600 ట్రక్కులు, 30 నౌకలు, వంద విమానాలు కలిగి ఉంది. ఏటా ఈ సంస్థ 15 బిలియన్‌ల రకరకాల రేషన్లు ఆయా దేశాల ప్రజలకు అందిస్తూ ఉంటుంది.

భారతదేశంలో 1963 నుంచి డబ్ల్యుఎఫ్‌పీ తన కార్యకలాపాలు సాగిస్తున్నది. దేశంలో 21.25 శాతం మంది నేటికీ రోజుకు రెండు డాలర్ల కంటే తక్కువ ఆదాయం (దాదాపు రూ. 150) పొందుతున్న వారే. ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత జవాబుదారీతనంతో, సమర్ధంగా, పారదర్శకంగా నిర్వహించ డానికి ఆ సంస్థ తన వంతు సాయమందిస్తున్నది.ప్రజా పంపిణీ పథకం కింద దేశంలో 800 మిలియన్‌ ‌ప్రజలకు గోధుమలు, బియ్యం, చక్కెర, కిరోసిన్‌ ‌సరఫరా చేస్తారు. ఈ వస్తువులు నిజంగా అవసరమైన వారికి చేర్చడానికి పాటుపడుతూ ఉంటుంది. ఇది ప్రపంచం లోనే అతి పెద్ద పంపిణీ పథకాలలో ఒకటి. దీనిలో ప్రభుత్వానికి సాయపడుతూ, సంస్కరణలు తేవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నది.

ఈ సంస్థ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎక్కువగా అమెరికా ఉత్పత్తులనే కొనుగోలు చేసి ఆ దేశానికి ఆర్థికంగా సాయపడు తున్నదని ఒక విమర్శ. అలాగే ఇది కొన్ని దేశాలకు విదేశీ సాయం మీద విపరీతమైన మమకారాన్ని పెంచుతున్నదని మరొక విమర్శ. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

By editor

Twitter
Instagram