‘‌వందనం’ అభినందనం

నమస్కారం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. మనసునిండా గౌరవం నింపుకొని వినయ విధేయతలు ఉట్టిపడేలా ఎదుటివారి హృదయాన్ని తాకేలా చేసేదే నమస్కారం. అందుకే దీనిని హృదయాంజలి అని అంటారు. నమస్కారం లేదా అభివాదమంటే ఓ పలకరింపు. పగవాడు ఇంటికి వచ్చిన నమస్కరించి ఆహ్వానించడం సంప్రదాయం. భాగవతం చెప్పిన నవవిధ భక్తిమార్గాల్లో వందనం (నమస్కారం) ఆరవది. త్రికరణశుద్ధిగా నమస్కరించడమే దీని లక్షణం. అన్న, ధన, విద్య, రూప, కీర్తి తదితర ఎనిమిది అహంకారాలు తొలగిపోయి అష్టపాశాల నుంచి విముక్తికి నమస్కారం సులభసాధనమని చెబుతారు. వందనాన్నే శరణాగతిగానూ వ్యహరిస్తారు.

‘అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది. అదియే దైవం’ అన్నారు ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆ దీపమే పరమాత్మ అనుకుంటే ఆయనకు సమర్పించే ఆత్మప్రదక్షిణ నమస్కారం.

పెద్దలు, సుపరిచితులు కనిపించినప్పుడు, అతిథులకు నమస్కారం, నమస్తే చెప్పుకోవడం ఉండేది. నాగరికత, సాంకేతికత పెరుగుతున్న తరుణంలో ఆ సంప్రదాయం కనుమరుగవుతూ కరచాలనం, ఆ తరువాత హలో, హాయ్‌ ‌లాంటి పలకరింపులు చోటుచేసుకున్నాయి. నమస్కరించక తప్పదన్నట్లు చేతిని గుండె దగ్గరకు తీసుకు వెళ్లడమో, చేయి ఊపడమో చేస్తుంటారు. ఎదుటి వారు కూడా అదే తీరులో తలపంకించడమో (కొందరు అదీ చేయరు) చేస్తారు. దాన్ని వారి సంస్కారంగానే భావించాలి. కరచాలనం, ఆలింగనాలు ఆత్మీయ పలకరింపులే. కానీ వాటికి సందర్భాలూ ఉంటాయి. ఆత్మీయ మిత్రులు కలసినప్పుడు ఆలింగనం కొంత వరకు సబబు కావచ్చుకానీ పెద్దల పట్ల అది సరికాదు కదా? నమస్కారం అని చేతుల జోడింపులో గౌరవం, మర్యాద, వినయ విధేయతలు, ప్రేమ లాంటి సాత్విక లక్షణాలు కనిపిస్తాయి.

గౌరవ సూచకమైన వందనం మొక్కుబడిగా, కృతకంగా ఉండకూడదు. ‘కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ/కరమూలే తు గోవిందః..’ అరచేతి ముందు భాగంలో లక్ష్మీదేవి, మధ్యభాగంలో సరస్వతీ, మూలభాగంలో గోవిందుడు అని ఆర్యోక్తి. అలా దేవతలు నివసించే చేతులను కలిపి వందనం చేయడంలో త్రికరణశుద్ధి అవసరం అంటారు. బంగారు కంకణాలు ధరించడం వల్లనే చేతులకు అందం, గొప్పదనం రాదని, వందనం, దాతృత్వంతోనే అవి శోభిస్తాయని పెద్దలు చెబుతారు. వందనాన్ని స్వీకరించడమే కాదు చేయడానికి అవకాశం ఉండాలి. అందుకు పురాణ పురుషులను ఉదహరించవచ్చు. శ్రీకృష్ణుడు, మృత్యు ముఖంలో ఉన్న గురుపుత్రుడిని రక్షించి గురుదక్షిణగా సమర్పించుకుంటాడు. అందుకు కృతజ్ఞతగా నమస్కరించుకోవాలనుకున్న సాందీపునికి గురుస్థానం అడ్డువచ్చింది. శ్రీరాముడి విషయంలో విశ్వామిత్రుడి పరిస్థితి అదే. విశ్వామిత్ర, సాందీప తదితరులు అవతారపురుషులకు గురువులు అయినా లోకారాధ్యులకు వందనం చేసుకోలేకపోయారు.

తల్లిదండ్రులు, గురువుల• ప్రత్యక్ష దైవాలని, వారికి చేసే నమస్కారం సర్వదా శ్రేయోదాయకమని అంటారు. వినాయకుడు తల్లిదండ్రులకు చేసిన భక్తిపూర్వక నమస్కారంతోనే విఘ్నాధిపతి అయ్యాడు. ద్రోణుడిని గురువుగా భావించి ఆయన విగ్రహానికి నమస్కరించి ఏకలవ్యుడు ధనుర్విద్యను అభ్యసించ గలిగాడు. గురువులు, పెద్దల పట్ల అనురక్తులై నమస్కరించే వారికి ఆయుష్షు, విద్య, కీర్తి (యశస్సు), బలం కలుగుతాయని విదురునీతి చెబుతోంది. సన్యాసులు కూడా కొన్ని సందర్భాల్లో నమస్కరిస్తారు. వారు ఎవరికి నమస్కరించరాదనే సంప్రదాయం ఉన్నప్పటికీ మాతృమూర్తి విషయంలో మినహాయింపు ఉందట. అందుకే శంకరభగవత్పాదులు తల్లికి వందనం చేశారని పెద్దలు చెబుతారు. దీనిని బట్టి నమస్కారం విలువతో పాటు మాతృమూర్తి ఉన్నతి కూడా తెలుస్తోంది.

ఆధ్మాత్మిక వందనాలు

‘నమః’ అంటే వందనం. ‘స్తే’ అంటే మీకు. మీకు వందనం చేస్తున్నానని అర్థం. ప్రతి మనిషిలో దైవత్వం ఉందనుకుంటే నాలోని దైవత్వం నీ(మీ)లోని దైవత్వానికి అభివాదం చేస్తోందని భావన కలిగిస్తోంది. పరస్పర నమస్కారం సమానత్వాన్ని సూచిస్తుంది. భగవంతుడు వందనానికి బందీ అవుతాడని, యజ్ఞయాగాదులు, పూజాదులకు సమానమైనది వందనమని విజ్ఞులు చెబుతారు.

భగవంతుడికి పన్నెండు అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. ముఖ్యంగా హరిహరులకు అభేదం చెబుతున్నట్లు ఒక్కతీరుగానే నమస్కరించాలని పెద్దలు చెబుతారు. వారికి తప్ప ఇతరులకు శిరస్సు మీద చేతులు జోడించి నమస్కరించాలి. గురువుకు ముఖానికి నేరుగా చేతులు జోడించి, యోగులకు, మహానుభావులకు జోడించిన చేతులు వక్షస్థలం వద్ద ఉంచాలని, తండ్రికి, ఇతర పెద్దలకు నోటికి నేరుగా చేతులు జోడించి నమస్క రించాలని, త•ల్లికి నమస్కరించేటప్పుడు ఉదరానికి నేరుగా చేతులు జోడించాలని చెబుతారు.

సాష్టాంగ నమస్కారం= స+అష్ట+ అంగ.. అంటే ఎనిమిది అంగాలతో నమస్కరించడం. నుదురు, వక్షస్థలం, కళ్లు, చేతులు, కాళ్లు నేలకు అన్చి చేసేది. ఆలయాల్లో, పూజలు, వ్రతాల సందర్భాల్లోనూ, పూజ్యులు, గురువులు మహనీయులకు సాష్టాంగ పడడడం సహజం. భగవంతుని శరణాగతి చేస్తూ నిశ్చలభక్తితో సాష్టాంగ నమస్కారం చేసేవారికి అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని మహనీయుల మాట. సాష్టాంగ ప్రణామాన్ని పురుషులకు నిర్దేశించారు. మహిళలు పంచాంగ (మోకాళ్లు, మోచేతులు, నుదురు) నమస్కారం చేయాలని చెబుతారు. సాష్టాంగం చేయాలనుకుంటే ఉద•రం నేలకు తాకుతుందని, గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుందని, శరీర నిర్మాణాన్ని బట్టి ధర్మశాస్త్రం వారికి సాష్టాంగం నుంచి మినహాయింపునిచ్చిందని అంటారు.

నమస్కారం బాణం

ఇది ఒక నానుడి. నమస్కారంతో ఎదుటి వ్యక్తి మనస్సును జయించవచ్చు. ఆ అభివాద•ం ఎదుటి వారిని ప్రసన్నం చేస్తుందనే అర్థంలో ఇది పుట్టి ఉంటుంది. కోపంతో ఉన్నవారిని శాంతింప చేయవచ్చు. ‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమః’ అని నమస్కరిస్తే యోగక్షేమాలన్నీ పైవాడే చూసుకుంటాడు. కరిరాజు మకరి బారి నుంచి శరణాగతితోనే బయటపడ్డాడు. ఉగ్రనరసింహుడిని వందనంతోనే ప్రహ్లాదుడు శాంతపరచిగలిగాడు. విభీషణుడు నమస్కారంతోనే రామచంద్రుడి కృపకు పాత్రుడయ్యాడు. మంచిమాట మాదిరిగానే నమస్కారం కూడా ఎదుట వారిలో సానుకూలతను కలిగిస్తుంది. అంతగా సదాభిప్రాయం లేనివారు, ముఖ పరిచయం ఉన్నవారు తారసపడినప్పుడు చేసే అభివాదం వల్ల ఇరువురిలోనూ కొంతవరకు సానుకూలత ఏర్పడవచ్చని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. పురాణాల్లో వీరులు యుద్ధ సమయంలో తమకు గౌరవనీయులు ఎదిరి పక్షంలో ఉంటే నమస్కార ‘బాణం’తో పలుకరించి పోరుకు దిగినట్లు గాథలు ఉన్నాయి. రామాంజనేయ యుద్ధంలో హనుమ, ఉత్తర గోగ్రహణంలో, కురుపాండవ సంగ్రామంలో అర్జునుడిని అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. చట్టసభల్లో అధికారపక్ష నేతలు విపక్షీయలకు అభివాదం చేయడం చూస్తూనే ఉంటాం. అది సంస్కారం, సభామర్యాద. అహాన్ని తృప్తి (ఈగో శాటిస్‌ఫ్యాక్షన్‌) ‌పరచడానికి, తప్పును ఒప్పుకోవడానికి కూడా నమస్కారం ఉపకరిస్తుంది.

నమస్కారంలో శాస్ర్తీయత

చిరునవ్వుతో కళ్లలోకి చూస్తూ రెండు చేతులను జోడించినప్పుడు శరీరంలోని 72వేల నాడులు మేల్కొంటాయట. హృదయ చక్రం తెరచుకొని మనసంతా ప్రశాంతత ఆవరిస్తుందట. శరీరంలోని విద్యుత్తును ఏకోన్ముఖం చేసేలా రెండు చేతులు కలయికతో ఏర్పడిన నమస్కార ముద్ర మెదడులోని కుడి, ఎడమల ద్వంద్వభావాన్ని ఏకత్వం వైపునకు తీసుకెళుతుందట. ప్రపంచాన్ని వణికించిన ‘కోవిడ్‌-19’ (‌కరోనా) మరోసారి ‘వందనం’ విలువను చాటిచెప్పినట్లయింది. ఆ వైరస్‌ ‌నుంచి రక్షణపొందే క్రమంలో ‘కరచాలనం’ బదులు ‘నమస్కారం’ సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చింది. ఈ వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు ‘కరచాలనం వద్దు-నమస్కారం ముద్దు’ అన్న పిలుపు చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పవచ్చు. మన ఈ సంప్రదాయం విదేశీయులను సైతం మరోసారి ఆకర్షించింది. ఇజ్రాయెల్‌ ‌ప్రధాని నెతన్యాహూ కూడా ‘నమస్కారమే వైరస్‌ ‌వ్యాప్తికి హద్దు…’ అని ప్రకటించడం భారతీయ సంప్రదాయానికి ఉన్న విలువ మరోసారి విశ్వాన్ని అకర్షించినట్లయింది.

గౌరవం ఇచ్చిపుచ్చుకునే పక్రియలో ప్రథమ స్థానం పొందుతున్న ‘వందనం’కు అభివందనం.

– ఎ.ఎన్‌.‌రామానుజ కల్యాణ్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram