గాంధీజీ 150వ జయంతి ముగింపు సందర్భంగా..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీపట్ల రాష్ట్రీయ స్వయంసేవక సంఘం దృష్టికోణం గురించి రాజకీయ రంగంలోనూ, విద్యారంగంలోనూ నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. మహాత్మ గాంధీకి, ఆయన ప్రవచించిన గాంధేయవాద దృక్పథానికి భారతీయ సామాజిక జీవనంలోనూ, రాజకీయ జీవనం లోనూ 1920 నుండి ప్రముఖ స్థానం ఉంది. స్వాతంత్రోద్యమ సందర్భంలో ఆయన అందరి కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించిన, అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు. స్వాతంత్య్రో ద్యమం మీద ఆయన వేసిన ముద్ర చెరగనిది. వలసపాలనలో ఉన్న భారతదేశంలో సిద్ధాంతా లను ఆధారం చేసికొని కాంగ్రెసు ద్వారా, కాంగ్రెసుకు బయటకూడా అనేక చిన్నా, పెద్దా ఉద్యమాలు ప్రభవించాయి. ఈ ఉద్యమాలన్నిం టికీ, తమదైన ఒక దృక్కోణం ఉంది. ఈ ఉద్యమాల ప్రారంభకుల దృక్పథం, సైద్ధాంతిక మైన గుర్తింపు, కార్యక్రమాలు ఆనాటి సామాజిక, రాజకీయ వాతావరణాలను కొద్దిగానో, గొప్పగానో ప్రభావితం చేశాయి.

ఈ ఉద్యమాలపట్ల, ఈ సంస్థలపట్ల, వాటిని నడిపించిన వ్యక్తులపట్ల మహాత్మా గాంధీకి ఎటు వంటి అభిప్రాయం ఉండేది? అలాగే గాంధీజీపట్ల ఆ ఉద్యమాలకూ, ఆ సంస్థలకూ ఎటువంటి దృక్కోణం ఉండేది? ఇది చాలా ప్రాధాన్యం గల్గిన విషయం. ఉదాహరణకు డా।। భీమ్‌రావు అంబేడ్కర్‌, ‌గాంధీజీల మధ్య సామాజిక, రాజకీయ సమస్యల గురించి సైద్ధాంతిక వివాదాలు, గాంధీజీ ఆర్థిక విధానాలపై, సామాజిక కట్టుబాట్లపై కమ్యూనిస్టుపార్టీ చేసిన సైద్ధాంతికమైన దాడులు, విప్లవకారుల పట్ల గాంధీజీకి సానుభూతి లేకపోవటం, సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌రాజకీయ కార్యకలాపాల పట్ల గాంధీజీకి ఉండిన వైముఖ్యం – ఇటువంటి విషయాల మీద అనేక పరిశోధనలు జరిగాయి, వాస్తవాలను వెలికితీశారు. కాని, సంఘం- మహాత్మగాంధీల మధ్య చోటు చేసుకున్న సమ్మతి- అసమ్మతి, సైద్ధాంతికమైన లేదా వ్యావహారికమైన అభిప్రాయ భేదాలు మొదలైన ప్రశ్నలు ఇప్పటికీ జవాబు దొరక్కుండా ఉండి పోయాయి. స్వాతంత్య్రానంతరం భారతీయ రాజకీయరంగంలో జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణేగాక, పదవీ రాజకీయ ఘర్షణలు కూడా దీనికి ఒక ముఖ్యమైన కారణం.

కాంగ్రెసులో ఉన్నవారిలో పండిత జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ సోషలిస్టు. పాశ్చాత్యమైన ఆలోచనలతో ప్రభావితుడైన వ్యక్తి. కాగా వల్లభభాయి పటేల్‌, ఇతర నాయకులు భారతీయతలో మునిగి తేలినవారు. సైద్ధాంతికమైన ఘర్షణలలో భారతదేశంలోని కమ్యూనిస్టు మేధావులు నెహ్రూకు సన్నిహితులు. రాజీ లేని పటేల్‌ ‌జాతీయవాదం కారణంగాను, స్వాతంత్య్రా నికి ముందు జరిగిన దేశ విభజన మొదలైన ఘటనలలో పాకిస్తాన్‌ ‌సమస్య, సంస్థానాల విలీనం సమస్య-ఇలా అనేక సందర్భాలలో వాస్తవికమైన అంచనాలతో వ్యవహరించిన కారణంగాను – కాంగ్రెసుకు బయట ఉన్న అనేక శక్తులు – పటేల్‌ను ప్రశంసిస్తూ ఉండేవి. వాటిలో సంఘం కూడా ఒకటి. కాబట్టి ఈ ఇరువురు జాతీయ స్థాయి నాయకులలో ఒకరిని ఎవరైనా – పార్టీ లోపలివారైనా, బయటి వారైనా సరే-సమర్థించినట్లయితే వారు రెండవ వారికి వ్యతిరేకులుగా పరిగణించేవారు. ఆ విధంగా ఆ ఇరువురూ ఉత్తర-దక్షిణ ధ్రువాల వంటి వారని, ఒకరికి సన్నిహితులైనవారు రెండవవారికి వ్యతిరేకులే అయి తీరాలని అనుకొంటూ ఉండేవారు. గాంధీజీతో పటేల్‌కు ఎంత సాన్నిహిత్యముందో, నెహ్రూకు అంతే సాన్నిహిత్యముంది. అయినప్పటికీ ప్రధానమంత్రి కావటం మూలంగాను, పాశ్చాత్య ఆలోచనారీతుల సమర్థకునిగాను, నెహ్రూకు పాశ్చాత్య ప్రపంచంలోనూ, ఆంగ్ల పత్రికలలోను, కమ్యూనిస్టులైన పాత్రికేయుల లోను విశేష ఆదరణ లభించింది.

ఈ దశలో విభజన జరిగి, కాలమేఘం కమ్మినట్లు విషాదంలో మునిగి ఉన్న ఖండిత హిందూస్థాన్‌ను మరో పిడుగుపాటు తాకింది. హిందూ మహాసభతో సంబంధాలున్న కొందరు హిందూ యువకులు మహాత్మాగాంధీని దేశవిభజనకు బాధ్యునిగానూ, పాకిస్తాన్‌ ‌శ్రేయోభిలాషిగానూ భావించుకొని, ఆయనను హత్య చేసేందుకు కుట్రపన్నారు. తదనుగుణంగా 1948 జనవరి 30న నాథూరాం గోడ్సే ప్రార్థనా సమావేశంలో పిస్తోలు ప్రేల్చి గాంధీజీని హత్య చేశాడు. ఏ వ్యక్తినైతే స్వాతంత్య్రానికి ముందు (జిన్నా, ముస్లింలీగ్‌కు చెందిన ఆయన సహచరులు మినహాగా) దేశమంతా ‘మహాత్మా’ అని ప్రేమగా పిలిచి గౌరవించుకుందో, ఆయన వివేకమే తమ వివేకమని ఎంచుకొని పల్లెత్తుమాట ఎదురాడక, ఆయన ఇచ్చిన కార్యక్రమాలలో కళ్లు మూసుకొని పాలుపంచుకొన్నదో ఆ వ్యక్తి హత్య కు గురికావడం యావత్తు దేశానికి తీవ్రమైన హృదయాఘాతమే. గోడ్సే పిచ్చితనంతో కూడిన చేష్టకు హిందూ మానసం నిస్సందేహంగా సిగ్గుతో తలవంచుకొనే స్థితిని అనుభవిస్తూ ఉంది.

తాను హత్యకు గురికావడానికి నాలుగు నెలల ముందు మహాత్మా గాంధీ ఢిల్లీలోని భంగీకాలనీలో సంఘ శిబిరానికి వచ్చారు. అక్కడ ఆయన ఉపన్యసించారు. స్వయంసేవకులతో ఏ విధమైన సంకోచం లేకుండా ప్రశ్నోత్తరాలు జరిగినవి. ఈ విధమైన నిస్సంకోచ వ్యవహారానికి గాంధీజీ సంతోషించారు. ఆనాటి భ్రమలతో కూడిన పరిస్థితుల మధ్య స్వయంసేవకులకూ గాంధీజీని ప్రత్యక్షంగా చూసి, అర్థం చేసికొనడానికి ఒక అవకాశం లభించింది. అయితే ఘోరమైన గాంధీ హత్యకు నేరుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని దోషిగా చిత్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం సంఘంపై నిషేధం విధించింది. ఈ సమస్య మీద కూడా ప్రధానమంత్రి జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ, హోంమంత్రి సర్దార్‌ ‌పటేళ్ల మధ్య ఏకీభావం లేదు. పటేల్‌ ‌నెహ్రూకి వ్రాసిన లేఖలో ఇలా స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘ఈ పనితో ఆర్‌ఎస్‌ఎస్‌కి ఏమీ సంబంధం లేదు. ఏవైనా ఇతర కృత్యాల గురించిన, తప్పుల గురించిన బాధ్యతను నిస్సందేహంగా సంఘంపై మోపవచ్చుగాని ఈ పనికి బాధ్యతను సంఘంపై మోపలేం’’.

1948 ఫిబ్రవరి 4న సంఘం మీద నిషేధం విధించినపుడు సాధారణ ప్రజానీకం సంఘం గాంధీజీకి వ్యతిరేకమే అయి ఉంటుందనే అభిప్రాయా నికి లోనుకావటం అసహజం కాదు. కాగా హత్య గురించి, దాని వెనుక కుట్ర గురించి, విచారణ జరిపిన రెండు కమిషన్లు కుట్రలో సంఘానికి ఏ విధమైన పాత్రా లేదని అభిప్రాయం వ్యక్తపరిచాయి. 1949 జులై 12న కేంద్ర ప్రభుత్వం సంఘంపై నిషేధాన్ని తొలగించింది. అయినప్పటికీ, ప్రజ లందరూ దైవసమానుడైన వ్యక్తిగా భావించి అభిమానిస్తున్న వ్యక్తిని హత్య చేశారన్న ఆరోపణ ప్రభుత్వం వైపు నుండి వచ్చిన కారణంగానూ, మార్క్సువాదులైన రచయితలు, మేధావులు తమ రచనల్లో ఈ విషయానికి ప్రచారమిచ్చి మేధోవర్గంలో ప్రవేశపెట్టిన కారణంగానూ సంఘం గాంధీజీకి వ్యతిరేకమని, హింసాత్మకమైనదని ఒక ముద్ర ఏర్పడిపోయింది. ఫలితంగా హెడ్గేవార్‌ ‌ప్రతిపాదిం చిన సంఘం ఆలోచనలు – గాంధీవాదం ఇవి రెండూ పరస్పరం వ్యతిరేకమైన ఆలోచనా విధానాలన్న తీరులో చూసే ఒక భ్రమ ఏర్పడిపోయింది.

సంఘాన్ని స్థాపించడానికి ముందు తర్వాత కూడా గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలలో పూర్తి నిబద్ధతతో డా।। హెడ్గేవార్‌ ‌పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో డా।। హెడ్గేవార్‌ ‌పాల్గొనటం ఆనాటి మధ్యప్రాంతాల తిలక్‌ ‌వాదుల అభిప్రాయాలకు వ్యతిరేకం. ఆయన రాష్ట్రీయ మండలి నుండి బయటకు వచ్చి ‘నాగ్‌పూర్‌ ‌నేషనల్‌ ‌యూనియన్‌’ అనే సంస్థను నెలకొల్పారు. దీని వెనుక ఉన్న కారణాలలో ఒకటి- మండలిలో ఉన్నవారికి గాంధీజీ పట్ల ఉన్న వ్యతిరేకత.

డా।। హెడ్గేవార్‌, ‌గాంధీజీల దృక్కోణాలలో ఒక పెద్ద తేడా ఉంది. గాంధీజీ దృష్టిలో స్వాతంత్య్రం కోసం చేసే ఉద్యమం అహింసా మార్గంలో నడవటమే సర్వోత్తమం. ఏ ఇతర మార్గాన్ని ఎవరు సూచించినా గాంధీజీకి నచ్చేది కాదు. విప్లవవీరుల ఉద్యమం పట్ల ఆయనకు ఏ మాత్రం సానుభూతి లేదు. డా।। హెడ్గేవార్‌ ‌స్వాతంత్య్ర సాధనకు గాంధీజీ సూచించిన మార్గం ఉత్తమమైనదని భావించేవారు, సహాయ నిరాకరణోద్యమంలోనూ, శాసనోల్లంఘన ఉద్యమ సందర్భంలోనూ ఆయన, అర్ధసైనిక శిక్షణను పోలిన శిక్షణను పొందిన స్వయంసేవకులూ గాంధీజీ ప్రవచించిన అహింసకు కట్టుబడి ఉంటామనే తమ ప్రతిజ్ఞను, ఉద్యమంలో పాటించవలసిన నియమ నిబంధనలనూ, మర్యాదలనూ తు.చ. తప్పకుండా నిలబెట్టుకొన్నారు. అయితే డా।। హెడ్గేవార్‌ ఒక విషయంలో గాంధీజీతో ఏనాడూ ఏకీభవించలేదు. ఇతర మార్గాలను అనుసరించే దేశభక్తులను గాని, వారు చేపట్టిన సాధనామార్గాల పవిత్రతనుగాని ప్రశ్నించటం డా।। హెడ్గేవార్‌కు అంగీకారంగా ఉండేదికాదు.

‘‘స్వాతంత్య్రం సాధించటం కోసం ఆంగ్లేయుల బూట్లకు పాలిష్‌ ‌చేయటం దగ్గరి నుండి ఆరంభించి, ఆ బూట్లనే వారి కాళ్ల నుండి లాగివేసి వాటితోనే నెత్తురు ధారలుగా కారేటట్లుగా చితకబాదటం వరకు అన్ని మార్గాలూ నా దృష్టిలో స్వాతంత్య్ర ప్రాప్తికి సాధనాలే. ఏ మార్గం పట్ల నా మనస్సులో తిరస్కార భావం లేదు. ఆంగ్లేయులను వెళ్లగొట్టి దేశానికి స్వాతంత్య్రం సంపాదించి తీరాలన్నదే నాకు తెలుసు’’ అని డా।। హెడ్గేవార్‌ అన్నారు.

ప్రజానీకంలో తెలివితేటలు, చదువు సంధ్యలూ, ఉన్నతాదర్శాలూ ఉండటంతో పాటు రాష్ట్రం శక్తిశాలి కావటంకూడా అవసరమని డా।। హెడ్గేవార్‌ అభిప్రాయం. వెనుక ‘బలం’ దృఢంగా నిలబడి వెన్ను కాచి ఉన్నపుడే ‘అహింస’ ఏదైనా సాధించగల్గుతుంది. ‘బలం’ అనటంలో ఆయన ఉద్దేశం రాష్ట్రీయ చైతన్యం, ప్రజల సంఘటిత శక్తి. ‘‘బలం లేకుండా సంరక్షణ జరగదు. బలం సంఘటనలోనే ఉంటుంది. విఘటనకు దూరంగా ఉంటూ, బయట నుండి వచ్చే ఆక్రమణలను ఎదుర్కొనే సామర్థ్యం సంఘటనకు ఉండాలి’’ అని అన్నారు.

ముస్లిం సమస్య

స్వాతంత్య్రోద్యమ దినాలలో క్షేత్ర స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకొనడానికి కాంగ్రెసు యత్నిస్తూ ఉండేది. జాతీయ సంస్థ ఏదైనా సరే, అలా యత్నించాలి కూడాను. అయితే ఆనాడు కాంగ్రెసు నాయకత్వం ఎదుర్కొనవలసి వచ్చిన ఒక జటిల సమస్య – మహమ్మదీయులు జాతీయోద్యమాలకు దూరంగా ఉండిపోవటం, కాంగ్రెసును హిందూ వాదుల పార్టీగా చిత్రీకరించి దానిని దూరంగా ఉంచటమున్నూ. కాంగ్రెసు ఈ దేశ జాతీయతకు, సంస్కృతికి సరియైన నిర్వచనమిచ్చి దాని ప్రకారం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఉన్నట్లయితే, మహమ్మదీయుల తటస్థ వైఖరి వేర్పాటువాదంగా మార్పు చెంది ఉండేది కాదు. వారిని దగ్గరకు తీసికోవాలని కాంగ్రెసు ఎంతగా యత్నిస్తూ ఉందో, ముస్లింలీగ్‌ ‌బేరసారాలశక్తి అంతగా పెరుగుతూ పోయింది. ముస్లిం సమాజాన్ని ఎలాగైనా జాతీయోద్యమంలో పాల్గొనేటట్లు చేయడానికై వారి కోరికలను, ఆకాంక్షలను, వారు విధించే షరతులను అంగీకరిస్తూ అన్నింటికి రాజీపడుతూ ఉండటమే తుష్టీకరణ విధానం. 1906లో ముస్లింలీగ్‌ ‌స్థాపనతో దేశ రాజకీయాలలో వేర్పాటువాదానికి పునాదిరాయి పడింది. ఉద్యమ కాలమంతటా ఒకే వాస్తవం వ్యక్తమ వుతూ వచ్చింది-భారతదేశ స్వాతంత్య్రం, మహమ్మదీ యుల అస్తిత్వం- ఇవి రెండూ వేరువేరు సమస్యలు.

హిందూ-ముస్లిం ఐకమత్యం నినాదాన్ని పదేపదే వల్లెవేయడాన్ని, దాని వెనుక దాగి ఉన్న మనస్తత్వాన్ని దోషభూయిష్టమైనవిగా డా।। హెడ్గేవార్‌ ‌భావించేవారు. వారు అడుగుతూ ఉండేవారు. ‘‘ఈ దేశంలో వేరే ఇతర మతాలవారు లేరా? మరి కేవలం హిందూ-ముస్లిం ఐకమత్యం గురించే ఎందుకు మాట్లాడు తున్నారు? అందరం కలసి ఉండాలని ఎందుకు మాట్లాడటం లేదు?’’ ధార్మికంగా వేరువేరు అభిమతాలను కలిగి ఉన్న ప్రజల జాతీయత గురించి వేరువేరు అభిప్రాయాలు ఉండరాదని ఆయన అభిప్రాయం. ఏ దేశంలోనైనా జాతీయత ఒక్కటే ఉంటుంది. కలగూరగంపగా ఉండదు. పంచకూళ్ల కషాయంగా ఉండదు. అతుకులు వేసినదిగా ఉండదు. 1935 డిసెంబరులో మధ్య ప్రాంతాలలోని వర్ధా జిల్లా ఆర్వీలో సంఘం శీతాకాల శిక్షణ శిబిరంలో డా।।హెడ్గేవార్‌ ఉపన్యసించారు. ఈ విషయంపై అందులో వారు వివరణ ఇచ్చారు. ‘‘గాంధీజీ హిందూ ముస్లిం ఐకమత్యం గురించి మాట్లాడు తున్నారు. నేనూ అదే కోరుతున్నాను. అయితే మన దృష్టికోణం వారికి కొంచెం తేడాగా ఉంది. ‘సగటు మహమ్మదీయుడు బెదిరించేవాడూ, గద్దించేవాడూ కాగా, సగటు హిందువు పిరికివాడు’ అని గాంధీజీ అంటున్నారు. మహమ్మదీయులను సంతృప్తిపరచే తుష్టీకరణ విధానం ద్వారా ఐకమత్యం సాధించాలని ఆయన కోరుకొంటున్నారు. నేను మహాభారతం నుండి ఒక శ్లోకం చెప్పదలచాను.

యయోరేవ సమం విత్తం యయోరేవ సమం బలమ్‌।

‌తయో ర్వివాహో మైత్రీచ నతు పుష్ట విపుష్టయోః।।

దీని అర్థమేమంటే సమానంగా శక్తి, ధనం గల్గిన సమఉజ్జీల మధ్యనే స్నేహం, వివాహం అర్థవంత మౌతాయి. అంతేగాని బలవంతునికి బలహీనునికి మధ్య కాదు. ఆ తర్వాత ఇంకా ఇలా చెప్పారు.

‘‘హిందువులతో పోల్చినపుడు తాము ఎక్కువగా సంఘటితులమై ఉన్నామని మహమ్మదీయులకు అనిపిస్తూ వారి మనసులలో ఆ భావం ఉన్నంతవరకూ ఐకమత్యం అనే ఆలోచనవారికి నచ్చదని నేను అభిప్రాయపడుతున్నాను. హిందువులు కూడా సంఘటితులై ఉన్నారని, వారు స్వాతంత్య్రం సంపాదించుకోగల సామర్థ్యం ఉన్నవారని వారికి అర్థమైన రోజున వారంతట వారే జాతీయ ప్రవాహంలో కలసిపోతారు’’.

1932 ఏప్రిల్‌ 16‌న బ్రిటిష్‌ ‌ప్రధానమంత్రి ‘కమ్యూనల్‌ అవార్డు’గా ప్రసిద్ధమైన మతాలవారీ నియోజకవర్గాల ఏర్పాటును ప్రకటించినపుడు డా।।హెడ్గేవార్‌ ‌దానిని వ్యతిరేకించారు. ‘‘కమ్యూనల్‌ అవార్డు పేరుతో ఈనాడు నాటిన ఈ వేర్పాటువాద విషబీజం ముందుముందు దేశవిభజనకు కారణమౌ తుంది.’’ హిందూ-ముస్లిం సంబంధాల సమస్యను రాజకీయం చేసే వలసపాలకుల యత్నాలను డా।। హెడ్గేవార్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించారు.

‘స్వాతంత్య్ర’ పత్రిక సంపాదకునిగా ఆయన ఇలా రాశారు. ‘‘భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యవాదం సమంజసమైనదే అంటూ సమర్థించేవారు చెప్పిన అంశాలలో హిందూ-ముస్లింల మధ్య భేదభావాలు ఒకటి. బ్రిటిషువారు ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయి నట్లయితే హిందువులు-ముస్లింలు తమలో తాము కొట్టుకొంటారు, తలలు నరుక్కుంటారు అని వారు చెప్తూ ఉంటారు. ఇదంతా తప్పు. బ్రిటిషు సామ్రాజ్యవాదం భారతదేశంలో పాగా వేయడానికి కారణం హిందూ-ముస్లింల మధ్య కలహాలు కారణం కాదు. అంతేకాదు, వారు వచ్చిన తర్వాతనే ఈ కలహాలు- తగాదాలు పెరిగాయి. ఒకవేళ హిందూ-మస్లింల మధ్య తగాదా ఉందని అనుకుంటే మాత్రం – అందులో జోక్యం చేసికొనే అధికారం బ్రిటిష్‌ ‌వారికి ఎవరిచ్చారు? యూరోప్‌లోని దేశాల్లో ఏ రెండు వర్గాలో కొట్టుకొంటూ ఉంటే- జోక్యం చేసికొనడానికి వారు వెళ్తారా? హిందువులు, ముస్లింలు తమ మధ్య ఉన్న సమస్యను స్వయంగానే పరిష్కరించుకొంటారు. మాతృభూమి పుత్రులైన వారి మధ్య హిందువు ఏ విధమైన భేదభావాన్ని చూపించటం లేదు. మంచి ముస్లింలు అందరూ అతని కార్యపరిధిలోకి వచ్చేవారే’’.

ఈ దేశంలోని హిందూ తదితర మతాలవారు ఏ జాతికి (Race) చెందినవారో, ఏ సంస్కృతి సభ్యతలకు చెందినవారో, భారతీయ ముస్లింలు కూడా చారిత్రకంగా ఆ జాతికి చెందినవారే. కాబట్టి సమానమైన నాగరికత, సంస్కృతి, ఒకే తెగ లేక జాతి (Race), చరిత్రలు కారణాలుగా భారతీయు లందరినీ ఒక జాతీయతకు చెందినవారుగా డా।। హెడ్గేవార్‌ ‌భావించేవారు. ఆ జాతీయతలో భాగస్వాములైన వారినే వారు ‘హిందూ రాష్ట్రం’ అనే పదంతో వ్యక్తీకరించారు.

డా।। హెడ్గేవార్‌ ఇలా రాశారు.‘‘స్వరాజ్యం గురించి పోరాటం ప్రారంభమైన నాటి నుండి, హిందువులకు మహమ్మదీయులకూ మధ్య దూరం పెరిగిపోయింది. నాయకులు ఐకమత్యాన్ని కూడగట్టటంకోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ, ప్రయోగాలు చేస్తూ వచ్చారు. కాని అవన్నీ వ్యర్థమని రుజువైనాయి. అప్పుడు వారికి ఒప్పందం ద్వారా ఐకమత్యం సాధించవచ్చునని తోచింది. బెంగాలు ఒప్పందం దాని పరిణామమే. స్వరాజ్య పార్టీవారు బెంగాలు విధాన మండలిలో అధికారి వర్గంతో తలపడినప్పుడు ఈ ఒప్పందం అర్థం ఏమిటి? ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహమ్మ దీయులు పోరాడేటట్లుగా చేయడానికి హిందువులు మహమ్మదీయులకు కొన్ని విశేష సదుపాయాలు చేసే షరతులను అంగీకరించి తీరాలనిగదా దీని అర్థం. మరి ఈ విషయంలో కొంచెం లోతుగా ఆలోచిద్దాం. స్వరాజ్యం కావలసింది ఒక్క హిందువులకేనా? ఇది వారికి మాత్రమే సంబంధించిన సమస్యా? కాదు గదా! ఈ సమస్య వాస్తవానికి దేశ ప్రజలందరిదీ- వారు ఏ కులంవారైనా, ఏ మతంవారైనా, ఇంకా ఏ ఇతర వర్గానికి చెందినవారైనా సరే. అలాంటప్పుడు మహమ్మదీయులు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడానికి షరతులు విధించటమేమిటి?….. స్వరాజ్యాన్ని గూర్చిన అవగాహన మనలో మనం ఏ సముదాయానికైనా విశేష సదుపాయాలను, కోరే కోర్కెలను తిరస్కరిస్తుంది’’.

సామ్రాజ్యవాదంతో తలపడి సంఘర్షణ సాగించటం అనే ప్రయత్నానికి ముందుగా మహమ్మ దీయుల సమస్యకు ప్రాధాన్యమివ్వాలనే ఆలోచనలను వదిలి పెట్టాలని డా।। హెడ్గేవార్‌ ‌భావించేవారు. ఆనాటి హింసాకాండ, మహిళలపై అత్యాచారాలు వంటి సమస్యల పరిష్కారానికి ఏదో హిందూ సైన్య సురక్షాదళం వంటి వాటిని ఏర్పరచడానికి బదులుగా హిందువులు స్వయంగా సంఘటితులై వాటిని నిరోధించాలని కోరేవారు. హిందువులు సంఘటితు లైనపుడు వారిపై ఆక్రమణ చేయాలనే ప్రవృత్తి దానంతట అదే పరిసమాప్తమైపోతుంది. హిందూ- ముస్లిం సమస్యపట్ల గాంధీజీ, డా।। హెడ్గేవార్‌, ‌డా।। ముంజేగార్ల దృష్టి కోణాలను ఈ విధంగా స్పష్టీకరించవచ్చు.

గాంధీజీ ముస్లింల వేర్పాటువాదాన్ని, స్వాతంత్య్ర సాధనపట్ల వారి తటస్థ వైఖరిని గమనించి వారిపట్ల ఉదారంగా, సర్దుబాట్లు- రాజీలతో కూడిన ఆచరణ ద్వారా వారి హృదయ పరివర్తన తీసికొని రావాలని కోరుతూ ఉండేవారు. డా।। ముంజే, హిందూ మహాసభలోని ఇతర నాయకులు అధికసంఖ్యాకవాదం, హిందూ ఉగ్రతలను వేర్పాటువాదానికి, స్వాతంత్య్ర సాధనపట్ల తటస్థవైఖరికి సమాధానాలుగా భావించే వారు. ఈ ఇరువురికి దూరంగా డా।।హెడ్గేవార్‌ ఈ ‌కీలకమైన సమస్యకు మౌలికమైన సమాధానాన్ని సూచించారు. హిందువులను సకారాత్మకంగా సంఘటితపరచటం, వారి మధ్య నెలకొని ఉన్న సామాజిక అసమానతలను రూపుమాపటం, జాతీయతపట్ల సమర్పణభావాన్ని పెంపొందించటం ఈ చర్యల సమాహారమే ముస్లింల మానసికతలో స్థిరంగా నిలిచే మార్పును తీసుకొచ్చే ఏకైకమార్గమని డా।। హెడ్గేవార్‌ ‌విశ్వసించారు.

(రాకేశ్‌ ‌సిన్హా ‘డా।। కేశవ బలీరామ్‌ ‌హెడ్గేవార్‌’ ‌నుండి)

By editor

Twitter
Instagram