భారత స్వాతంత్య్రోద్యమం, స్వరాజ్య సాధన ప్రపంచ చరిత్రలోనే మలుపు. స్వరాజ్యోద్యమంలో అగ్రతాంబూలం అందుకోగల నాయకుడు మోహన్‌దాస్‌ ‌కరంచంద్‌ ‌గాంధీ. స్వాతంత్య్ర సాధన అనేక సంస్థల, అనేక పంథాల, అనేకమంది నాయకుల కృషి, తాగ్యాల ఫలమే అయినా, అందులో గాంధీజీది నిరుపమాన స్థానం. అయితే, ఆగస్ట్ 14, 1947 అర్థరాత్రి బ్రిటిష్‌ ‌పతాకం దిగిపోయి, తన అభీష్టం మేరకే రూపొందిన త్రివర్ణ పతాకం ఎగరవేసే దృశ్యాన్ని గాంధీజీ వీక్షించ లేదు. ఒక పురాతన, సాంస్కృతిక దేశ చరిత్రలో, వేయేళ్ల దాస్యం తరువాత జరుగుతున్న తొలి ఉషస్సులో నమోదయిన ఆ ఘట్టంలో భాగస్వామి కావడానికి ఆయన అంగీకరించలేకపోయారన్న మాట కూడా ఉంది. ఆనాటి ఆయన క్షోభను అర్థం చేసుకుంటే తనే  ప్రధాని పదవికి సూచించిన పండిత్‌ ‌నెహ్రూ జాతీయ పతాకాన్ని ఎర్రకోట మీద ఎగరవేస్తున్న ఘట్టానికి ఎందుకు దూరంగా ఉండిపోయారో అర్థమవుతుంది. తను జీవితాంతం నమ్మిన అహింసా సిద్ధాంతం దేశ విభజన వేళ ఘోరంగా మోసపోయింది. ఒక స్వప్నం మరొక స్వప్నాన్ని రక్తపంకిలం చేసిన క్షణమది. భారత స్వాతంత్య్రోద్యమాన్ని గుర్తు చేసుకుంటే, నాటి విషాదం కూడా గుర్తుకు వస్తుంది. రెండు నుంచి ఇరవై లక్షల మంది చనిపోవడం.. కోటిమందికి పైగా నిరాశ్రయులు కావడం ఆ అహింసామూర్తి ఊహించని పరిణామమే. అహింసాయుత పంథాలో నడిచిన స్వాతంత్య్రోద్యమం, దానిని సాధించుకున్న క్షణంలో రక్తస్తికం కావడం ఒక చారిత్రక వైచిత్రి. ఇక భారత స్వాతంత్య్ర తొలి వార్షికోత్సవానికి గాంధీజీ భౌతికంగానే నిష్క్రమించారు. ఆగస్ట్ 30, 1948‌న నాథూరామ్‌ ‌గాడ్సే చేసిన హత్య ఫలితమది. ఆయన మీద అంత ప్రతికూలతను దట్టించుకున్న గాడ్సే కూడా చేతులెత్తి నమస్కరించి, ఆపైనే ఆయన గుండెలలో తూటాలు దింపాడు. ఊహకు కూడా అందని గాంధీజీ వ్యక్తిత్వం గురించి ఒక అంచనాకు రావడానికి గాడ్సే చర్య కొంచమయినా ఉపకరిస్తుంది.

1947 నాటి పరిస్థితులను బట్టి గాంధీజీ తనకు తాను విఫలమనోరథునిగా భావించుకున్నారేమో తెలియదు. కానీ ఆయన అహింసా సిద్ధాంతం తరువాత ప్రపంచంలో చాలా ఉద్యమాలకు చోదకశక్తిగా మారింది. మార్టిన్‌ ‌లూథర్‌కింగ్‌, ‌నెల్సన్‌ ‌మండేలా, డెస్మండ్‌ ‌టుటు వంటి ఎందరో గాంధీ అహింసామార్గంలో అనుకున్న రాజకీయ, సామాజిక, హక్కుల ఉద్యమాలు నిర్వహించారు. సఫలమయ్యారు. ఆయన అహింసా మార్గం అత్యుత్తమన్న సంగతి చరిత్ర రుజువు చేసింది. అణగారిన వర్గాలకు ఆయన సిద్ధాంతం పెద్ద గొంతునే ఇచ్చింది. అక్టోబర్‌ 2 (‌గాంధీ జయంతి) అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరపాలని ఐక్య  రాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించడం (జూన్‌ 15, 2007) ఇం‌దుకు ప్రబల నిదర్శనం.

గాంధీజీ మీద వివాదాలూ, విమర్శలు ఆయన జీవించి ఉండగానే కోకొల్లలు.  ఇప్పుడూ ఉన్నాయి. అయినా గాంధీజీ జాడ, ఆయన సిద్ధాంతాల నీడ ప్రపంచ చరిత్ర మీద సుదీర్ఘంగా పరుచుకుని ఉన్న వాస్తవాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. స్వాతంత్య్ర సాధనతో పాటే, నైతిక పరివర్తన కూడా ఉండాలన్న ఆశయం వారిది. రెండింటి కోసం ఏకకాలంలోనే తపించాలంటారాయన. పారతంత్య్రంలో విదేశీయుడు దోచుకుంటాడు. నైతిక విలువలు లేని స్వరాజ్యంలో నీవాడే నిన్ను దోచుకుంటాడు. ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అన్న నోళ్లే, ‘మాకొద్దీ నల్లదొరతనము’ అని కూడా ఆక్రోశించవలసి వచ్చింది అందుకే.

గాంధీజీ చరిత్రలో మరొక చారిత్రక వైచిత్రి- ఆయన వారసులమని చెప్పుకునే వ్యక్తులే ఆయన సిద్ధాంతాలకు బూజు పట్టించడం. గాంధేయవాదాన్ని నిజంగా ఆరాధించేవారిని గాడ్సే వారసులుగా చిత్రించడం కూడా అలాంటిదే. గాంధీజీకి ఎంతో ఇష్టమైన నిరాడంబరత ఎటో వెళ్లిపోయింది. ఆయన జీవిత పర్యంతం ద్వేషించిన మద్యం కొనుగోలుకు ఈ దేశంలో గాంధీజీ నవ్వుతూ కనిపించే నోటుతోనే సాధ్యం కావడం అతి పెద్ద విషాదం. బ్రిటిష్‌ ‌చక్రవర్తిని కలుసుకున్నా గాంధీజీ తన కౌపీనంతోనే వెళ్లారు. ఆయన దృష్టిలో ఆ వస్త్రధారణ ఈ దేశంలో దరిద్ర నారాయణుని పట్ల ఉండవలసిన స్పృహకు ప్రతీక. 1931లో గాంధీజీ ఐదో జార్జి చక్రవర్తిని కలుసుకోవడానికి వెళ్లారు. మొలకు అదే అంగవసస్త్రం. భుజాలపై కండువా. ఆ సమయంలో ఒక విలేకరి అడిగాడు, ‘గాంధీగారు! రాజుగారిని కలుసుకోవడానికి వెళుతున్న మీ ఒంటి మీద అందుకు తగిన దుస్తులు ఉన్నాయనే అనుకుంటున్నారా?’ ఇందుకు గాంధీ సమాధానం: ‘నా దుస్తుల గురించి మీరేం బాధపడకండి! నాకూ, ఆయనకీ కూడా సరిపోయినన్ని దుస్తులు రాజుగారి వంటి మీదే ఉన్నాయి’ అని. బ్రిటిష్‌ ‌పాలనలో భారతదేశం వట్టిపోయిన సంగతిని దాదాభాయ్‌ ‌నౌరోజీ ఒక మహా గ్రంథంలో (పావర్టీ అండ్‌ అన్‌ ‌బ్రిటిష్‌ ‌రూల్‌ ఇన్‌ ఇం‌డియా) చెప్పిన గొప్ప వాస్తవాన్ని గాంధీజీ ఈ ఒక్క మాటతోనే వెల్లడించలేదా? తను కోరుకున్నట్టే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దేశానికి తగ్గట్టే ఆయన జీవించారు. ‘మీరు ఎప్పుడు రైలు ప్రయాణం చేసినా థర్డ్ ‌క్లాస్‌నే ఎందుకు ఎంచుకుంటారు?’ అన్న మరొక విలేకరి ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిటి? ‘ఫోర్త్ ‌క్లాస్‌ ‌లేదుకదా!’ అనే. ఎంత క్లుప్తత? అదే సమయంలో ఎంత నైశిత్యం! అలాగే తన నిరాడంబరత మీద సరోజినీనాయుడు వంటి సాటి నేతలు చమత్కారాలు కురిపించినా ఆయన ఆస్వాదించారు. జంతుజాలం మీద పెరిగిపోతున్న క్రూరత్వానికి నిరసనగా గాంధీజీ కుటుంబం సహా ఆవు, గేదె పాలు త్యజించారు. వైద్యులు, కస్తూర్బా విన్నపం మేరకు మేకపాలు తీసుకోవడానికి అంగీకరించారు. ఆయన ఇంగ్లండ్‌ ‌వెళ్లినా రెండు మేకలు తీసుకుపోవాల్సి వచ్చేది. ఆ సందర్భంలోనే ‘గాంధీజీ పేద స్థితిని చూపించడం చాలా ఖర్చుతో కూడుకున్నది సుమ!’ అని సరోజిని చమత్కరించారు.

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర గాంధీజీకి ముందే కొన్ని పేజీలు కేటాయించిందనిపిస్తుంది. ఆయనను దక్షిణాఫ్రికా వదిలి భారత్‌కు రావలసిందిగా ఆహ్వానించిన గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ ఈ దేశంలో అడుగు పెట్టిన (1915) కొద్దికాలానికే కన్ను మూశారు. లాల్‌పాల్‌బాల్‌లలో లజపతిరాయ్‌ ‌కార్మికోద్యమం వైపు వెళ్లారు. బిపిన్‌పాల్‌ ‌తీవ్ర జాతీయోద్యమంలోకి మళ్లారు. ఆనాటికి తిరుగులేని నాయకునిగా ఉన్న బాలగంగాధర తిలక్‌ 1920‌లోనే గాంధీజీ  రాజకీయ ప్రస్థానానికి దారి వదిలేసి ఈ లోకం నుంచే నిష్క్రమించారు. వీర సావర్కర్‌ ‌కొన్ని పరిధులలో ఉండిపోయారు. జిన్నా నెమ్మదిగా ముస్లింలీగ్‌ ‌కబంధ హస్తాలలోకి వెళ్లిపోయారు. చివరికి కొన్ని దశాబ్దాల స్వరాజ్య భారత స్వప్నం గాంధీ నాయకత్వంలోనే నెరవేరింది.

ఒక దేశాన్ని వలస పాలన నుంచి విముక్తం చేసిన గాంధీజీకి నోబెల్‌ ‌పురస్కారం రాలేదు. ఐదుసార్లు ఆయన పేరు పరిశీలనలోకి అయితే వచ్చింది. ఆ తరువాత తీసుకున్న గ్రహీత గాంధీజీయే తనకు ప్రేరణ అని చెప్పడం మరొక చారిత్రక వైచిత్రి కదా!

స్వాతంత్య్ర సముపార్జన, సామాజిక పునరు జ్జీవనం సమ వేగంతో సాగాలన్న గాంధీజీ ఆలోచన ఎప్పటికీ శిరోధార్యమే. సమాజానికి గుదిబండగా తయారైన పాతను విసర్జించాల్సిందే. పాత నమ్మకాలు, అర్థం లేని పురాతన విలువలు, ఆలోచనలు స్వరాజ్యానికీ, కొత్త వ్యవస్థకీ మేలు చేసేవి కాదని ఆయన విశ్వసించారు. ఆయన హిందూ ముస్లిం ఐక్యత ఇందుకు పెద్ద ఉదాహరణ. కానీ  గాంధీజీ ఈ కలను ఘోరంగా విఫలం చేశారు.

గ్రామం ఆధారంగా, మహిళ ఆత్మ గౌరవం పునాదిగా, ఆధ్యాత్మిక చింతన ప్రాతిపదికగా గాంధీజీ ప్రవచించిన సూత్రాలకు నేటికీ ఆకర్షణ ఉంది. ఆయన అహింసా సిద్ధాంతాన్ని కాదనే ధైర్యం ఈ ప్రపంచానికి ఇప్పటికీ లేదు. దానికి ప్రత్యామ్నాం చూపే శక్తీ పుట్టలేదు. పాలకులే కాదు, పాలితులు కూడా ఎలా జీవించాలో సూత్రీకరించి పెట్టారు గాంధీజీ. సామాజిక, రాజకీయ జీవనంలో నిరాడంబరత, నైతికత, ఆత్మ పరిశీలన ఉండాలన్న గాంధీజీ ఆలోచనను దాటి రావడం ఇవాళ భారతదేశ రాజకీయ పక్షాలలో దాదాపు ఎవరికీ లేదు. కాబట్టి భారతీయతలో ఆయన ముద్రను భవిష్యత్‌ ‌తరాలు కూడా దర్శిస్తాయి. గడచిన సంవత్సరం గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వం ప్రకటించడంలోని ఉద్దేశం ఇదే.

– జాగృతి డెస్క్

By editor

Twitter
Instagram