పలికెడిది గాంధి కథయట…

గాంధీజీ 150వ జయంతి ముగింపు సందర్భంగా..

పారతంత్య్ర కుతంత్రాల్లో, బ్రిటిష్‌ ‌కుటిల దాస్య శృంఖలాల్లో భారతజాతి అలమటిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ 1919 సంవత్సరంలో ఉద్యమంలో ప్రవేశించాడు. అది జాతీయోద్యమం రెండో దశ. నీతినిజాయితీలకి నిలువెత్తు నిదర్శనమైన ఆయన వ్యక్తిత్వం అనతి కాలంలో నేతలనూ, జనసామాన్యాన్నీ గొప్పగా ఆకర్షించింది. త్రికరణ శుద్ధితో కూడిన ఆయన మాటలు మంత్రాల్లా ప్రజలను ప్రభావితం చేశాయి.  

గాంధీజీ ఆశయాలైన శాంతి, అహింస, సహనం, అస్పృశ్యతానిరసనం, మద్యపాన నిషేధం, స్వాతంత్య్ర కాంక్షలతో ప్రభావితులైన తెలుగు కవులు గొప్పగా స్పందించారు. కలం పట్టిన ప్రతి కవీ ఆయన వ్యక్తిత్వాన్నీ, తత్త్వాన్నీ ప్రశంసిస్తూ కవితలు రాశారంటే అతిశయోక్తి కాదు. మహాత్ముని ఆశయాల వ్యాప్తినీ, వ్యక్తిత్వ దీప్తినీ కీర్తిస్తూ కవితలు కోకొల్లలుగా రాశారు. కొందరు కవులు ఆయనను పారతంత్య్రం పోగొట్టేందుకు అవతరించిన అవతార పురుషుడిగా భావించారు. చెరుకువాడ నరసింహమూర్తి ‘‘గాంధీ మహాత్ముడు / కరుణసాంద్రుడు నిర్మల శీలుండు ధర్మస్వరూపి / భారతదేశపు పారతంత్య్రమ్ము బాప/ అవతరించె బాపూజీ గాంధీ’’ – అంటూ ప్రశంసించాడు.

తిరుపతివేంకట కవుల్లో ప్రముఖులైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ‘‘త్రికరణశుద్ధి గల ఆధునిక రుషి’’గా అభినుతించాడు. కొండపల్లి జగన్నాథదాసు ‘‘భూమాత  పాపభారాన్ని, పారతంత్య్ర ఘోరాన్ని’’ భరించలేక వేడుకొనగా విష్ణువే బాపూజీగా అవతరించాడని అవతార పురుషుడిగా అభివర్ణించాడు.

బసవరాజు అప్పారావు ‘‘పోరుబందరు కోమటింట పుట్టినాడోయ్‌/ ‌పురుషోత్తముండు జగతి మెట్టినాడోయ్‌ / ‌కొత్త యేసుక్రీస్తు అవతరించినాడోయ్‌/ ‌రాతి నాతి చేసిన శ్రీరాముడేనోయ్‌.’’ ‌మహాత్ముని పురుషోత్తమునిగా, కొత్త యేసుక్రీస్తుగా, శ్రీరామునిగా ఆయన సమతామూర్తిమత్వాన్ని గొప్పగా వర్ణించాడు. జాతీయోద్యమంలో ఈ గీతం ఎంతో ప్రచారం పొందింది.

మహాత్మా గాంధీ వ్యక్తిత్వంతో ప్రభావితుడైన దామరాజు పుండరీకాక్షుడు గాంధీజీ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ‘‘కత్తులు లేవు శూలమును గాండీవమున్‌ ‌మొదలే హుళక్కి  నో /రెత్తి ప్రచండ వాక్పటిమనేనియు జూపడు కోపతాపముల్‌ / ‌బొత్తిగ సున్న అట్టి వరమూర్తి మనోబలశాలి గాంధి చే / యెత్తి నమస్కరించి స్మరియించెద మెప్డు స్వరాజ్య సిద్ధికిన్‌’’- ‌గాంధీగారి నిరాయుధీకరణతో కూడిన అహింసాతత్త్వాన్ని, సహనశీలాన్ని, శాంతస్వభావాన్ని మనోధైర్యాన్ని కీర్తించి స్వరాజ్యసిద్ధికి ఆయనకు నమస్కరించెదమన్నాడు. ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని నిరంతరం స్మరిస్తామన్నాడు.

కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ భావుకతతో మహాత్మునిలో రాజ లక్షణాలను దర్శించి నుతించాడు. ‘‘నిలువనీడ లేని నిరుపేదల నిట్టూర్పులు వింజామరలనీ / పేదల కన్నీళ్లు వెల్లి గొడుగనీ / సంఘ దూషకుల దౌర్జన్యాన్ని నిరసించేవారి గుండె సభామండపమనీ’’ గాంధీజీ పేద జనోద్ధారణ, సంఘ సంస్కరణ తత్పరతలను ప్రశంసించాడు. స్వాతంత్య్ర సాధన కోసం ఆయన అనుభవించిన కారాగార వాసాన్ని ఆయనకు అలంకారప్రాయమైన కిరీటంగా వర్ణించడం ఆయన వ్యక్తిత్వానికి ఉత్కర్ష కలిగిస్తుంది.

మహాత్ముని ఆస్థానకవిగా ప్రసిద్ధి చెందిన తుమ్మల సీతారామమూర్తి ఆత్మకథ, మహాత్మకథ వంటి గ్రంథాలు రాశాడు. ఆయన మహాత్మకథలో పోతన భాగవతంలో ‘పలికెడిది భాగవతమట’ అనే పద్యశైలిలో ‘‘పలికెడిది గాంధి కథయట / పలికించెడివారు తెనుగు ప్రజలట దీనిం / బలికిన నూఱటయౌనట / పలికెదనిక నొండు మఱచి బాపు చరిత్రన్‌’’ అని స్తుతించాడు. తుమ్మల వారు గాంధీజీలో శ్రీరాముని సత్యగుణం, శ్రీకృష్ణునిలో ప్రేమ, బుద్ధునిలో కారుణ్యం గుణం ఉన్నాయని, దివ్యపురుషుల సుగుణ సమాహార స్వరూపమే మహాత్ముని మహోన్నత వ్యక్తిత్వమని వర్ణించాడు.

మరో సందర్భంలో గాంధీజీ గుణగణాలను రాట్నంతో పోల్చాడు. రాట్నాన్ని సుదర్శన చక్రంగా ఉపయోగించారు. స్వదేశీ వస్త్రాల ప్రోత్సాహానికి, దేశీయుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచేందుకు గాంధీజీ ‘ఏకులా’బడలపోయాడు. ఆర్తరక్షణ తత్పరతలో రాట్నపు ఆకులా సుడివడినాడు. పడుగులలో పేకలా ప్రజావళితో సూత్రమై కలసిపోయాడు. ఏ విపత్తు ప్రజలకు కలిగినా కదురులా జంకు లేక సాగిపోయే వాడని మహాత్ముని స్థైర్యాన్ని ప్రశంసించాడు. మహాత్ముని వ్యక్తిత్వానికి సేవాదృక్పథాన్ని జోడించి రాట్నంతో పోల్చి మనోజ్ఞంగా వర్ణించాడు. మహాత్ముని మరణంతో చలించి ‘అమరజ్యోతి’ స్మృతి కావ్యాన్ని ఆర్తితో రాశాడు.

బాపూజీ మానసపుత్రుడిగా చెప్పుకున్న జాషువ బాపూజీ స్మృతి కావ్యంలో ఆయనను గొప్పగా ప్రశంసించాడు. గాంధీజీ వ్యక్తిత్వం వజ్రాలరాశి కంటే గొప్పదన్నాడు. మూర్తీభవించిన త్రిమూర్తుల దయాగుణ స్వరూపుడిగా గాంధీజీని వర్ణించాడు. నిమ్నజాతుల కన్నీరు తుడిచేందుకు అవతరించిన నిరుపేద బాంధవుడిగా మతసామరస్య ప్రదాతగా మహాత్ముని ఔన్నత్యాన్ని కీర్తించాడు. ఆయన నిరాడంబర వ్యక్తిత్వాన్ని వివరిస్తూ

‘‘గోచిపాత గట్టుకొని జాతి మానంబు

నిలిపినట్టి ఖదరు నేతగాడు

విశ్వ సామరస్య విజ్ఞాన సంధాత

కామిత ప్రదాత గాంధితాత’’– గాంధీజీ నిరాడంబర వ్యక్తిత్వాన్ని, విజ్ఞాన ధురీణతను, విశ్వశాంతి కాముకతను సముచితంగా నుతించాడు.

 ప్రజలు మహాత్మునిలో క్రీస్తు, బుద్ధుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మహనీయుల, దివ్యపురుషుల సమాహార స్వరూపాన్ని దర్శిస్తున్నా రన్నారు- మంగిపూడి వేంకటశర్మ. యుగయుగాల వరకు గాంధీ పతాక సూర్యునిలా తేజోవంతంగా ప్రకాశించాలన్నారు.

కాళోజీ నారాయణరావు గాంధీ పట్ల అపారమైన గౌరవంతో గాంధీజీకి ఇష్టుడైన గుజరాతీ రచయిత నరసింహమెహతా అహింసా సిద్ధాంతాన్ని, వైష్ణవ భక్తిని ప్రశంసిస్తూ ‘వైష్ణవ జనతో తేనే’ అనే గుజరాతీ పాటను తెలుగులో అనువదించాడు. ‘‘పేదవాడి బాధను తన బాధగా గుర్తించేవాడే వైష్ణవుండంటూ’’ అనువదించాడు. ‘‘బానిసత్వము బాపి బ్రతుకగ / విత్తనాలను రూపుమాపగ / రక్తము చిందని మార్గము ఏర్పరచినాడ’’ని గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని, బానిసత్వాన్ని సమూలంగా రూపుమాపాలన్న సంకల్పాన్ని మెచ్చుకున్నాడు. మరో సందర్భంలో ‘అమాయకం’ అనే కవితలో ‘‘ఎవరెస్ట్ ‌శిఖరంపై పతాకనెత్తి / నిన్ను తలచుకుంటూ దిగుతుంటే / అడగడుగు మా అపరాధ హిమాలయాలు గోచరిస్తాయి’’ – అంటాడు. భారత స్వాతంత్య్రాన్ని సాధించి ఎవరెస్ట్‌పై భారత జాతీయ పతాకాన్ని ఎగరేయించిన ఘనత గాంధీజీదే. తర్వాత నాయకులు గాంధీజీ పట్ల గౌరవభావాన్ని చూపకపోవడంతో కాళోజీ ‘మా అపరాధ హిమాలయాలు’ గోచరిస్తవన్నాడు. కాళోజీ ప్రియమిత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గాంధీజీ గ్రామ పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు ఆయనను ప్రశంసిస్తూ ‘‘గాంధీజీ మాజీ కలలన్నీ / కల్లలు కథలైపోతే / కట్టాలింక మనం నడుం / భేష్‌ ‌భేష్‌ ‌పి.వి.భేష్‌’’ అం‌టూ మాజీ ప్రధానిని గాంధీజీ గ్రామ పునరుద్ధరణకు ప్రేరేపించాడు.

మహాకవి శ్రీశ్రీ గాంధీ జయంతి సందర్భంగా ‘గాంధీజీ’ కవితాఖండికలో

‘‘అవనీమాత పూర్ణ గర్భంలా ఆసియా ఖండం ఉప్పొంగింది’’- అంటాడు. గాంధీ జననంతో భూమాత పరిపూర్ణ గర్భంలా ఆసియా ఖండం ఉప్పొంగింది అనడంలో గాంధీజీ మూర్తిమత్వం ప్రపంచ ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. గాంధీజీ సంస్కరణలలో సర్వమానవ సమానత్వం, సమతాభావం వంటి వాటితో భారతదేశంలో / నవప్రపంచ ఆరంభమవు తుందనడం వాస్తవం. గాంధీ జయంతి సందర్భంగా దుఃఖాలకు, అసౌకర్యాలకు, వాగ్వాదాలకు తావు లేకుండా ఆహ్లాదంగా గడపాలంటాడు. డా।। సి.నారాయణరెడ్డి ‘బాపూ! నీ పుట్టినరోజు’ కవితా ఖండికలో గాంధీ జయంతి ప్రాశస్త్యాన్ని కవత్వీకరిస్తూ ‘‘భగవానుడు పుట్టినరోజు / ఒక రాముడు పుట్టినరోజు / ఒక రహీము పుట్టినరోజు / చావు పుట్టుకలేని / ‘సత్యమూర్తి పుట్టినరోజు’’ అంటూ, ‘‘గాంధీజీ దైవాంశ సంభూతు’’డని, ఆయన మూర్తిమత్వంలోని సమతా భావాన్ని చాటి చెప్పాడు. ధర్మం పారతంత్య్రాన్ని తొడగొట్టి సవాలు విసిరిన రోజుగా, కుత్సిత కులమతాల కోటలను కూల్చి బ్రద్ధలు కొట్టిన రోజుగా వర్ణించాడు. అహింసా సిద్ధాంతపు ఘనతవల్ల చురకత్తులు దించే హింసావాదుల గుండెల్లో చిరునవ్వులు పూయించాడన్నాడు.

‘‘దొరలకు శిరసొగ్గని రోజు / మరలకు మనసివ్వని రోజు / చరఖాతో భరతమాత / పరువు నిలిపిన రోజు’’- తెల్లదొరలకు లొంగక ఎదిరించిన మహాత్ముడు యాంత్రిక నాగరికతను నిరసిస్తూ విదేశీ వస్త్రదహనాన్ని ప్రోత్సహించాడు. ‘స్వదేశీ ఖాదీవస్త్రాలను చరఖాతో ప్రోత్సహించాడు. స్వదేశీ ఆత్మగౌరవాన్ని గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి చరఖాతో భరతమాత పరువు నిలిపాడని గాంధీజీ ఆశయాలను ప్రశంసించాడు. సత్యాగ్రహ మంత్రంతో భారతీయుల సంకెళ్లు ఛేదించి జాతీయోద్యమంలో జైళ్ల పాలయినవారిని విడిపించాడు. గాంధీజీ స్ఫూర్తితో నోరులేని పేదవారు తమకు జరిగిన అన్యాయాలను ఎదిరించడానికి సిద్ధపడ్డారు.

‘‘ఆలయాన దాగిన దేవుని, అస్పృశ్యులు ముట్టినరోజు / ‘హరి’-జనుడై పుట్టినరోజు / హరిజనుడే పుట్టినరోజు’’ – గాంధీజీ మహా సంకల్పం వల్ల అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. ‘హరి’- జన సామాన్యుడిగా అవతరించాడని, హరిజనుడే అవతరించాడని ‘హరిజన’ శబ్దంతో శ్లేష చమత్కారాన్ని అద్భుతంగా సాధించి గాంధీ జయంతి పరమార్థాన్ని గొప్పగా వర్ణించాడు.

కరుణశ్రీ గాంధీజీ ఘనతను వినుతిస్తూ

‘‘అతడొక పవిత్ర దేవాలయమ్ము

అతడొక విచిత్ర విశ్వవిద్యాలయమ్ము

ఆ మహాశక్తి అంతయింతంచు చూడ

జాల మతడొక పెద్ద హిమాలయమ్ము’’

మహాత్ముని మానసిక పవిత్రతను, విజ్ఞాన ధురీణతను, సముచితంగా వర్ణించి ఆయన అమేయమైన వ్యక్తిత్వాన్ని పెద్ద హిమాలయంతో పోల్చడం ఔచిత్యంగా ఉంది.

మహాకవి దాశరథి మహాత్ముని పాద చిహ్నాలు పవిత్రమైన ఆలయాలుగా భాసిస్తాయని, ఆయన చేతిగొడుగు అఖిల జగానికి ఆర్తిబాపగల అండనీ, ఆయన మార్గాలు అను సరణీయాలు, ఆచరణీయాలని ప్రశంసించాడు. అనిశెట్టి, ఆరుద్ర వంటి కవులు కూడా గాంధీజీ ఆశయాలను వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.

గాంధీజీ నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం ఎందరినో స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షించింది. ఆయన మహోన్నత వ్యక్తిత్వం విశ్వజనీనంగా ఆరాధ్యనీయమైంది. ఆయన ఆదర్శాలు మానవాళికి చిరకాలం అనుసరణీయాలు. అందుకే తెలుగు కవులంతా గొప్పగా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, సిద్ధాంతాలను సముచితంగా వర్ణించారు.

–  డా।। పి.వి.సుబ్బారావు 9849177594

రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram