నేడు ‘అరుణాచలం’గా పేరుగాంచిన అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. సకల కోరికలు తీర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్ని లింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణమార్గపు మొత్తం చుట్టుకొలత 8 మైళ్లు సుమారు 14 కి.మీ. ఆనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు మూడు సంవత్సరాలపాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గమిది. ఈ దారిలో ఇప్పుడు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాల్లో కొన్నింటిని ఆ కాలంలో ఆయన నిర్మించినవే. వీటిలో దూర్వాస మహాముని ఆలయం నేటికి దర్శించ వచ్చు. అయితే ఈ అరుణాచల పుణ్యక్షేత్ర మహాత్యం తెలిపే ఒక ఆసక్తికరమైన కథ విశేష ప్రాచుర్యం పొందింది.

దూర్వాస మహాముని నిత్యమూ పరమ శివుని అర్చించేవాడు. అందుకోసమే ఒక అందమైన పూలవనం పెంచాడు. దానికి దగ్గరలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో గడుపుతుండేవాడు. ఒకనాడు ‘కళాధరుడు’, ‘కాంతిశాలి’ అనే గంధర్వులు ఆకాశమార్గాన వెళుతూ, ఆ పూలవనం చూసి, ఆనందంతో మనసు నిలవక అందులో ప్రవేశించారు. కళాధరుడు పూలను తుంచి వాసన చూసి, చెల్లా చెదురుగా విసిరేసాడు. కాంతిశాలి ఒళ్లు మరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగ సాగాడు. అలికిడికి కుటీరం నుంచి బయటకు వచ్చిన దూర్వాసుడు కోపంపట్టలేక వారిద్దరిని జంతువులుగా భూమిపై పుట్టమని శపించాడు. తెలియక జరిగిన తప్పిదమనీ, శాపవిమోచన మార్గం చెప్పండని గంధర్వులు కోరారు. వారి అభ్యర్ధనకు శాంతించిన దూర్వాసుడు, ‘అరుణగిరి’ ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందుతారని శాపవిమోచన మార్గం చెప్పాడు.
ఫలితంగా ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి (కస్తూరి మృగం) గాను, మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో అందంగా, బలీష్టమైన గుర్రంగాను జన్మించారు. ఆ దేశపు రాజైన వజ్రాంగదపాండ్యుడు గుర్రపు లక్షణాలకు ముచ్చటపడి తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు. ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగా కమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి రాజాశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు.
అప్పటికి ‘అరుణగిరి’ అనేక రకాల వృక్ష జాతులతో దట్టమైన ఆరణ్యంగా, వన్యప్రాణులు తప్ప మానవులు వెళ్లేందుకు వీలు లేని విధంగా ఉండేది. ఆ ప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు అడవి మృగాలకోసం వెదకసాగాడు. మధ్యాహ్నం దాటిపోయింది. అలసిపోయి వెనుదిరుగుదామనుకున్నంతలో ఒకపొద కదలికల వెనక మిలమిల మెరిసే కళ్ళతో దాగిన పునుగుపిల్లి అతని కంటబడింది. దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి, రాజు వల విసిరే లోపే ఆ పిల్లి, నేర్పుగా తప్పించుకుంది. కనిపించి కనుమరుగౌతూ గిరిని చుట్టు ముట్టి పరుగెత్త సాగింది. పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించాడు. ప్రదక్షిణం పూర్తి కావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. ఆశ్చర్యంతో ఆ రాజు అశ్వంపై నించి దిగడంతో అతని గుర్రం కూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి కాంతి రూపంలో ఇద్దరు గంధర్వులు బయటకు వచ్చారు. ఆ వెంటనే రత్నాలు పొదిగిన దేవవిమానం వారిని తీసుకుపోయేందుకు ఆకాశం నించి వచ్చి ఆగింది.
ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్య పురుషులను ఆపి, ‘‘సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసింద’’ని ప్రార్ధించాడు. వారు తమ శాపవృత్తాంతం అంతా చెప్పి, ‘‘రాజా! ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైంది. సాక్షాత్తూ ఆది దేవుడైన పరమేశ్వరుడే ఈ గిరి రూపంగా వెలిసాడు. భక్తితో తప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యంకాదు. బ్రహ్మాది దేవతలు సైతం రోజూ ఉదయానే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెళ్తుంటారు. అటువంటి గిరిని ప్రదక్షిణం చేసే భాగ్యం మాకు నీ కారణంగా కలిగి శాపవిమోచనమైంది’’ అని అన్నారు. వెంటనే రాజు అంజలి ఘటించి ‘‘మహిమాన్వితమైన ఈ గిరిని మీతోపాటే ప్రదక్షిణంచేసిన నాకు ఏ ఫలితమూ కలగని కారణమేమిటి? తెలుపమని’’ వినయంగా కోరాడు. అప్పుడు ‘‘రాజా! ఈ గిరిప్రదక్షిణాన్ని వాహనంతోగాని, పాదరక్షలతోగాని చేయ రాదు. నీవు అశ్వంపై ఉండిపోయావు. అలాకాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్యదిశలో కాలి నడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది, చివరికి ఇంద్రపదవినయినా పొందగలరు’’ అని వివరించి, గంధర్వులు విమానంలో తమలోకాలకు వెళ్ళిపోయారు.
ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు, ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించాడు. రాజ్యాన్ని వారసులకు అప్పగించి, రోజుకు మూడుసార్లు చొప్పున మూడు సంవత్సరాల పాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేశాడు. అతని దీక్షకు మెచ్చి ఒక రోజు అరుణగిరినాధుడు ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు. అప్పటికి ఎన్నోరోజులుగా ఆ జ్ఞాన తేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ వుండడం వల్ల రాజుకు ఆశలూ, భయాలూ ఎండుమట్టల్లా రాలిపోయి, ఇంద్రపదవి కూడా గడ్డిపరకలా తోచింది. తనకి అహంకార రహిత శాశ్వత సాన్నిధ్యం ప్రసాదించమని కోరి అరుణగిరిలో లీనమైపోయాడు.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram