ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ తన అద్భుతమైన దౌత్యనీతితో బ్రిక్స్ సదస్సును భారత్ నిర్వహించి అంతర్జాతీయంగా సంచలనమే సృష్టించింది. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ సదస్సుకు మన దేశం అధ్యక్షత వహించింది. దీంతో భారత్ ఒక ప్రాంతీయశక్తి మాత్రమే కాదని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. ప్రపంచంలో ఎలాంటి పెద్ద సంక్షోభాలనైనా దౌత్యపరంగా పరిష్కరించగల ‘భౌగోళిక శక్తి కేంద్రం’గా మనదేశం తన ఉనికిని చాటుకుంది. పశ్చిమ దేశాలకు, తూర్పు దేశాలకు మధ్య వారధిగా నిలిచింది. స్వప్రయోజనాలను పరిరక్షించుకునే సామర్థ్యం తనకు ఉందని నిరూపించుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియా(ఇరాన్) యుద్ధ పరిస్థితుల కారణంగా సభ్యదేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, 140 పేరాల న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుంది. ఈ డిక్లరేషన్‌లో ఏ ఒక్క దేశం పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ వాతావరణ విధానం, అంతర్జాతీయ ఉగ్రవాదం, బహుళ పక్ష సంస్కరణలపై బ్రిక్స్ సభ్యదేశాలను ఒకే తాటిపైకి తెచ్చింది.

ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం “రూల్-టేకర్స” (నిబంధనలు పాటించేవారు)గా కాకుండా “రూల్-షేపర్స” (నిబంధనలను రూపొందించేవారు)గా మారాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు తేవాలని, తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాధాన్యత దక్కాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది, గ్లోబల్ సౌత్ దేశాల లీడర్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.  ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మనదేశంలో పర్యటించారు. ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు స్థిరత్వం, వాణిజ్య అసమతుల్యతల పరిష్కారం, వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలు అంగీకరించడం ఈ సదస్సు వేదికగా భారత్ సాధించిన మరో అతిపెద్ద విజయం. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, తీవ్ర వైరం ఉన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్,  యూఏఈ  ప్రతినిధి ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ మధ్య న్యూఢిల్లీ వేదికగా అత్యున్నత స్థాయి చర్చలు జరిగేలా చూడడం భారత్ సాధించిన మరో దౌత్య మైలురాయిగా నిలిచింది.  పశ్చిమ దేశాల స్విఫ్ట్ వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, స్థానిక కరెన్సీల (రూపాయి వంటివి) ద్వారా వాణిజ్యం, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత్ ప్రతిపాదించిన వ్యూహాలకు బ్రిక్స్ దేశాల నుండి మంచి మద్దతు లభించింది. భారత దేశపు యూపీఐ సాంకేతికత, డిజిటల్ గవర్నెన్స్ నమూనాలను మిగతా బ్రిక్స్ దేశాల్లో కూడా విస్తరించడానికి సదస్సులో ప్రాధాన్యత కల్పించారు. కేవలం ప్రభుత్వాల మధ్యే కాకుండా, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి, యువజన మార్పిడి కోసం భారత్ ప్రారంభించిన ‘బ్రిక్స్ కనెక్ట’  వేదికకు సభ్యదేశాల నుంచి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. గ్లోబల్ గవర్నెన్స్ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఐఎంఎఫ్) ప్రస్తుత వ్యవస్థను “పిరమిడ్ ఆఫ్ ప్రివిలేజ” (కొందరికే పరిమితమైన ప్రత్యేక హక్కులవేదిక)గా మోదీ అభివర్ణించారు. దానిని మార్చేందుకు 10 వ్యూహాత్మక చర్యలతో కూడిన సంస్కరణల రోడ్‌మ్యాప్‌ను మనదేశం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు చైనా, రష్యాల సహా అన్ని సభ్యదేశాలు మద్దతు ప్రకటించడం భారత్ సాధించిన భారీ దౌత్య విజయం. తద్వారా  బ్రిక్స్‌ను అమెరికా లేదా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పనిచేసే “పాశ్చాత్య వ్యతిరేక” కూటమిగా మారకుండా అడ్డుకుంది.  పశ్చిమ దేశాలతో సత్సంబంధాలను కాపాడుకుంటూనే, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల  ప్రయోజనాలను కాపాడే అత్యంత నమ్మక మైన నాయకుడిగా  తన ప్రపంచ స్థాయి ప్రతిష్టను మన దేశం మరింత పెంచుకుంది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్య కారిడార్లలో వాణిజ్య నౌకలపై దాడులను అడ్డుకోవడానికి, అంతర్జాతీయ నౌకా కార్మికుల రక్షణ కోసం భారత్ ప్రతిపాదించిన “బ్రిక్స్ సీఫేరర్స్ నెట్‌వర్క” ఏర్పాటుకు కూటమి ఆమోదం తెలిపింది.

పాకిస్తాన్‌కు దక్కని చోటు

పాకిస్తాన్‌ను బ్రిక్స్ కూటమిలో చేర్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు భారతదేశం ‘వీటో’ కారణంగా ప్రస్తుతానికి పూర్తిగా నిలిచిపోయాయి.  సదస్సు ముగిసే సమయానికి కూడా పాకిస్తాన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం లభించలేదు. బ్రిక్స్ పూర్తిస్థాయి సభ్యత్వ విస్తరణను కాకుండా, కూటమిని బలోపేతం చేయడం, ‘భాగస్వామ్య దేశాల’ హోదా కల్పించడంపైనే ఈ సదస్సు ఎక్కువగా దృష్టి పెట్టింది. మలేషియా, థాయిలాండ్, వియత్నాం వంటి 10కి పైగా దేశాలకు ఈ భాగస్వామ్య హోదా లభించినప్పటికీ, మనదేశం ఒత్తిడి కారణంగా ఈ జాబితాలో కూడా పాకిస్తాన్‌కు చోటు దక్కలేదు.

న్యూఢిల్లీ డిక్లరేషన్

“రెసీలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టెíనబిలిటీ” (స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత) అనే ప్రధాన ఇతివృత్తంతో ఉమ్మడి ఢిల్లీ ప్రకటన (బ్రిక్స్ జాయింట్ డిక్లరేషన్) వెలువడింది. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో పెహల్గావ్ ఉగ్రదాడిని తీవ్ర పదజాలంతో ఆక్షేపించింది. సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతాలు కల్పించడాన్ని నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని సభ్యదేశాలు స్పష్టం చేశాయి.  ప్రపంచ జనాభా, ఆర్థిక బలానికి తగ్గట్టుగా అంతర్జాతీయ నిర్ణయాత్మక వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం పెరగాలని డిక్లరేషన్ పేర్కొంది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత్ చేసిన డిమాండ్‌కు బ్రిక్స్ దేశాలు మద్దతు తెలిపాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేలా, సభ్యదేశాల మధ్య పరస్పర వాణిజ్యానికి స్థానిక కరెన్సీల వినియోగాన్ని  క్రెడిట్ సదుపాయాలను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, గ్లోబల్ జీడీపీలో 40% వాటా కలిగిన బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక అడ్డంకులను తొలగించి వ్యాపార అవకాశాలను విస్తరించు కోవాలని పిలుపునిచ్చారు.

బ్రిక్స్ దేశాలతో వాణిజ్యం

ఆర్థికబలంతో బ్రిక్స్ కూటమిని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చైనా చూస్తున్నప్పటికీ, మనదేశం దీనిని సమర్థవంతంగా సమతుల్య పరిచింది.ఈ వాణిజ్య వ్యూహాల విజయానికి తక్షణ సంకేతంగా చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ – న్యూఢిల్లీ మధ్య డైరెక్ట్ ప్యాసింజర్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అసోచామ్ నివేదిక ప్రకారం, బ్రిక్స్ దేశాలతో భారత్ జరిపిన పరస్పర వాణిజ్యం గత ఐదేళ్లలో (2020-21లో 203 బిలియన్ డాలర్ల నుండి) 2025-26 నాటికి ఏకంగా 417 బిలియన్ డాలర్లకు చేరింది. రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. ఈ సదస్సు వ్యూహాల ద్వారా 2030 నాటికి బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులను 200 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా చేసుకుంది. ఆ  క్రమంలో ఇంజనీరింగ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్,  టెక్స్‌టైల్ రంగాలలో కొత్త ఒప్పందాలు కుదిరాయి. భారతదేశానికి చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), యూపీఐ (యపీఐ) సాంకేతికతను బ్రిక్స్ దేశాల క్రాస్-బోర్డర్ పేమెంట్స్ (సరిహద్దు చెల్లింపుల) నెట్‌వర్క్‌లో చేర్చడానికి సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. దీనివల్ల అంతర్జాతీయంగా భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత పటిష్ఠం కానుంది. పెద్దదేశాల మధ్య మాత్రమే జరిగే వాణిజ్య ఒప్పందాలకు, మోదీ ప్రతిపాదించిన 3 కీలక సంస్థాగత వేదికలకు బ్రిక్స్ ఆమోదం తెలిపింది. అవి వరుసగా బ్రిక్స్ ఇన్‌క్యుబేటర్ నెట్‌వర్క్,  బ్రిక్స్ ఎంఎసఎంఈ పోర్టల్,  బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌గా ఉన్నాయి. దీని ద్వారా భారతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, సరికొత్త స్టార్టప్‌లకు విస్తృతమైన అంతర్జాతీయ మార్కెట్, నిధులు లభిస్తాయి. చైనా లేదా పాశ్చాత్య దేశాలపై పూర్తిగా ఆధారపడకుండా, భవిష్యత్తు పరిశ్రమలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాలు, సెమీకండక్టర్లు, ఇంధన వనరుల సరఫరా గొలుసు దెబ్బతినకుండా దేశాల మధ్య ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంలో మనదేశం విజయం సాధించింది.  చైనాతో భారత్‌కు ఉన్న భారీ వాణిజ్య లోటును తగ్గించడానికి, చైనా మార్కెట్లలో మన ఫార్మా,  ఐటీ ఉత్పత్తులకు సమాన, ముందస్తుగా అంచనా వేయదగిన మార్కెట్ ప్రాప్యతను కల్పించాలని మన దేశం చేసిన డిమాండ్‌కు చైనా సానుకూలంగా స్పందించక తప్పలేదు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నడుమ భారత్ కేవలం వస్తువులను కొనుగోలు చేసే ‘వినియోగదారుల మార్కెట’ గానే కాకుండా, ప్రపంచ రవాణా, సరఫరా వ్యవస్థలో ఒక ప్రధాన ఉత్పత్తి దారుగా, ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఎదగడానికి సదస్సు వ్యూహాలు దోహదపడ్డాయి. సదస్సులో ‘స్థానిక కరెన్సీ చెల్లింపుల’కు లభించిన ఏకగ్రీవ ఆమోదం.. భారత రూపాయి అంతర్జాతీయీకరణ  దిశగా అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది. చైనా ప్రతిపాదిస్తున్న ఉమ్మడి ‘బ్రిక్స్ కరెన్సీ’ని భారత్ వ్యతిరేకించినప్పటికీ, దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి రూపాయిని ఉపయోగించే వ్యూహాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది.

రూపాయికి అంతర్జాతీయ గుర్తింపు

చైనా యువాన్‌తో పాటు భారత రూపాయిని కూడా భవిష్యత్తులో గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా మారడానికి అవకాశం ఉన్న కరెన్సీగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)ఇప్పటికే గుర్తించింది. విస్తరించిన 11దేశాల బ్రిక్స్ కూటమిలో రూపాయి ద్వారా చెల్లింపులు జరగడంవల్ల, ప్రపంచ మార్కెట్లలో రూపాయికి అంగీకారం, విశ్వసనీయత వేగంగా పెరుగుతాయి. మన దేశం ఇతర దేశాలతో  వ్యాపారం చేయాలంటే మొదట రూపాయిలను డాలర్లుగా మారుస్తుంది. ఆ తర్వాతి సంబంధిత దేశం కరెన్సీలోకి మారుస్తుంది. దీనికి భారీగా మార్పిడి రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. సదస్సు తాజా నిర్ణయంతో భారత్ నేరుగా రూపాయిల్లోనే ఇన్వాయిస్‌లు, చెల్లింపులు చేయవచ్చు. ఉదాహరణకు, రష్యాతో జరిగే చమురు వాణిజ్యంలో ప్రస్తుతం 95% పైగా లావాదేవీలు డాలర్లతో సంబంధం లేకుండా రూపాయి-రూబుల్స్‌లోనే విజయవంతంగా జరుగుతున్నాయి. రూపాయి అంతర్జాతీయీకరణ వ్యూహంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 22కి పైగా దేశాల బ్యాంకులు భారతదేశంలో ‘ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాల’ను  తెరిచాయి. రష్యా, యూఏఈలతో పాటు మరికొన్ని కొత్త భాగస్వామ్య దేశాలు కూడా రూపాయి నిల్వలను ఉంచుకోవడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయ మూలధన మార్కెట్లలో చరిత్రలో మొదటిసారిగా రూ.4,000 నుండి రూ.4,500 కోట్ల విలువైన ‘రూపాయి-బాండ్లను’ జారీ చేయడానికి ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక’ (బ్రిక్స్ బ్యాంక్) సిద్ధమైంది.  కేవలం నోట్ల రూపంలోనే కాకుండా, భారత్ తన సరికొత్త సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (ఈ-రూపీ లేదా సీబీడీసీ)ని బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీ నెట్‌వర్క్‌లతో అనుసంధానించాలని ప్రతిపాదించింది. యూపీఐని బ్రిక్స్ సరిహద్దు చెల్లింపుల వ్యవస్థతో  లింక్‌చేయడం ద్వారా డిజిటల్ రూపంలో రూపాయికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది.

భారత్-రష్యా భాగస్వామ్యం

బ్రిక్స్ సదస్సు వేదికగా భారత్-రష్యా సంబంధాలు సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఉభయదేశాలు అంగీకారానికి వచ్చాయి. రష్యా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షలు విధించాలని అమెరికా చూస్తున్నప్పటికీ, 140 కోట్ల ప్రజల ఇంధన అవసరాలకే తొలి ప్రాధాన్యమని మనదేశం తేల్చి చెప్పింది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం తదుపరి యూనిట్ల నిర్మాణంలో సాంకేతిక సహకారం పటిష్టతకు నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం డిమాండ్‌కు రష్యా మద్దతు ప్రకటించింది. రెండు దేశాల మధ్య దౌత్య బంధంతో పాటు సాంస్కృతిక మైత్రిని చాటుతూ, ప్రముఖ తమిళ కవి తిరువళ్లూవర్ రచించిన పురాతన గ్రంథం ‘తిరుక్కురళ’ రష్యన్ అనువాద ప్రతిని అధ్యక్షుడు పుతిన్‌కు ప్రత్యేక కానుకగా ప్రధాని మోదీ అందజేశారు.  మోదీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీలో ఎస్‌యు-57 ఫైటర్ జెట్లు, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలపై కీలకమైన చర్చలు జరిగాయి. రష్యా వీటిని సరసమైన ధరలకు ఇస్తామని ప్రకటించింది. కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలింది. భారతీయ ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో మన దేశంలో ఎస్-400 వ్యవస్థల నిర్వహణ, మరమ్మతు, సమగ్ర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా అంగీకరించింది. భారత వైమానిక దళంలో 84 సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు కీలకమైనవిగా ఉన్నాయి. వీటిని అత్యాధునిక రాడార్లు, ఏవియానిక్స్‌తో “సూపర్ సుఖోయ”గా ఉన్నతీకరించే దిశగా 1100 కోట్ల డాలర్ల ప్రాజెక్టుకు నడుం బిగించారు. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. ఎస్-400 వ్యవస్థలకు అవసరమైన అదనపు క్షిపణులు, సుఖోయ్ విమానాల కోసం సుదూర శ్రేణి ఆర్-37ఎమ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ దాదాపు రూ.10వేల కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎస్-500 ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌తో పంచుకుంటూ, ఉమ్మడిగా దీనిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది.

చైనాతో సానుకూలత

భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి ప్రస్తుతం అత్యంత సానుకూలమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిక్స్ సదస్సు ముగిసే నాటికి, సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గుదల, శాంతి పునరుద్ధరణకు  ఇరు దేశాలు కొన్ని కీలకమైన ముందడుగులు వేశాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీలో “సరిహద్దుల్లో పూర్తి శాంతి, స్థిరత్వం ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయి” అని మోదీ స్పష్టం చేశారు. 1993`1996 నాటి సరిహద్దు ద్వైపాక్షిక ఒప్పందాలను, నిబంధనలను ఇరుదేశాలు కచ్చితంగా పాటించాలని, ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చకూడదనే అంగీకారానికి నేతలిద్దరూ చేరుకున్నారు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో లోపాలను నివారించడానికి, తప్పుడు అంచనాలను అడ్డుకోవడానికి భారత్-చైనా సైన్యాల మధ్య కొత్త మిలిటరీ హాట్‌లైన్‌లను ఏర్పాటుచేశారు. సరిహద్దుల్లో తలెత్తే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించుకోవడానికి ఈశాన్య సెక్టార్ (అరుణాచల్ ప్రదేశ్), కేంద్ర సెక్టార్‌లలో రెండు కొత్త బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్లను ఏర్పాటుచేయడానికి ఒప్పందం కుదిరింది. కొత్త ఒప్పందం ప్రకారం, యాంగ్ట్సేలో చైనా సైన్యం గస్తీ చేపట్టడంలో కొన్ని ప్రత్యేక పరస్పర రాయితీలు కల్పించారు. ఘర్షణలను పూర్తిగా నివారించడానికి ఇక్కడ నిర్దేశిత పరిమితులు, నిఘాతో కూడిన గస్తీ లేదా పరస్పర అవగాహనతో కూడిన సమన్వయ గస్తీ పద్ధతిని అమలు చేస్తున్నారు. గత నాలుగైదేళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఘర్షణాత్మక పాయింట్ల  సంఖ్యను తగ్గించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ముఖ్యంగా యాంగ్ట్సే, సుబన్‌సిరిలోని అసఫిలాలో ఇరు సైన్యాలు తమ ముందస్తు దూకుడు వైఖరిని పక్కనబెట్టి, వెనక్కి తగ్గాయి. సరిహద్దు వివాదాల ఉపశమనంలో భాగంగానే, ఇరు దేశాల నదీ జలాల నిపుణుల కమిటీ ఇటీవల  సమావేశ మైంది. అంతర్-సరిహద్దు నదుల జలాల సమాచా రాన్ని పరస్పరం పంచుకోవడానికి అంగీకారం కుదిరింది. గతంలో బఫర్ జోన్లుగా మారిపోయిన ప్రాంతాలలో స్థానిక పశువుల కాపరులు తమ పశువులను మేపుకోవడానికి ఇరు దేశాలు అనుమతించాయి. అయితే ఈ ప్రక్రియ కూడా సరిహద్దు కమాండర్ల సమన్వయంతోనే జరుగుతుంది.

ఇరాన్‌తో వ్యూహాత్మక దౌత్యం

ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి మనదేశానికి వచ్చిన మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, పెజెష్కియాన్ చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా దౌత్య వర్గాల దృష్టిని ఆకర్షించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా పక్కనే నడుస్తుండగా చోటుచేసుకున్న ఈ అరుదైన సన్నివేశం భారతదేశ స్వతంత్ర వ్యూహాత్మక దౌత్య విధానాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్ తన వైఖరిని పునరుద్ఘాటిం చింది. యుద్ధాలు దేనికీ పరిష్కారం కావని, చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే శాంతి సాధ్యమని ఇరాన్ అధ్యక్షుడికి మోదీ స్పష్టంచేశారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పరిధిలో ఉన్న శాంతియుత అణు కేంద్రాలపై జరుగుతున్న దాడులకు ఉమ్మడి ప్రకటనలో సభ్యదేశాలన్నీ ఆందోళన వ్యక్తంచేశాయి. నేరుగా ఇరాన్ పేరు ప్రస్తావించనప్పటికీ, ఇరాన్ అణు కేంద్రాలపై దాడులను తప్పుబడుతూ ఇరాన్‌కు భారత్ దౌత్యపరంగా మద్దతు పలికినట్లయింది. సదస్సులో ఇరాన్ తన పాత దూకుడు వైఖరిని పక్కనపెట్టింది. పశ్చిమాసియా సంక్షోభంలో అత్యంత నమ్మకమైన శాంతి సంధానకర్తగా, దౌత్య భాగస్వామిగా మన దేశాన్ని గుర్తించింది. సదస్సు ముగిసిన అనంతరం పెజెష్కియాన్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయంగా భారత్ అవలంబిస్తున్న “సమతుల్య, నిర్మాణాత్మక వైఖరి”ని తాము అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్‌లను చేరడంలో చాబహార్ పోర్టు భారత్‌కు ఒక బంగారు వాకిలి లాంటిదని అరాగ్చీ అన్నారు. పోర్టు అభివృద్ధికి మనదేశం నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకాంక్షించారు.

 అమెరికా ‘కాట్సా’ ఆంక్షల ముప్పు

మనదేశం ఒకవేళ రష్యా నుండి అధునాతన ఎస్-500 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తే, అమెరికా విధించే కాట్సా(కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్) ఆంక్షల ముప్పు మళ్లీ తీవ్రంగా మారే అవకాశం ఉంది. 2017లో అమెరికా రూపొందించిన ఈ చట్టం ప్రకారం, రష్యా రక్షణ రంగ సంస్థలతో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపే ఏ దేశంపైనైనా ఆర్థిక, సాంకేతిక ఆంక్షలు విధించే హక్కు అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. దీనికింద ఆంక్షలు విధిస్తే, అమెరికా నుండి మనదేశానికి వచ్చే అత్యంత కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, క్లిష్టమైన సెమీకండక్టర్ చిప్స్, ఏరోస్పేస్ విడిభాగాల సరఫరా నిలిచి పోతుంది. ఇది భారత్-అమెరికాల మధ్య పెరుగుతున్న రక్షణ భాగస్వామ్యంపై, అలాగే చైనాను అడ్డుకోవడానికి ఏర్పడిన ‘క్వాడ’ కూటమిలోని పరస్పర సహకారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. డాలర్ల రూపంలో జరిగే అంతర్జాతీయ చెల్లింపులపై అమెరికా నిఘా, ఆంక్షలు పెరిగే అవకాశం ఉంటుంది. 2018లో మనదేశం రష్యాతో 5.43 బిలియన్ డాలర్ల విలువైన ఎస్-400 ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా అమెరికా ఇలాగే హెచ్చరించింది. అయితే, చైనాను అడ్డుకోవడంలో మనదేశం అత్యంత కీలకమైన భాగస్వామి కావడం వల్ల, అమెరికా కాంగ్రెస్ మనకు అనుకూలంగా ప్రత్యేక మినహాయింపు సవరణను ఆమోదించడంతో, అప్పట్లో ఆంక్షల నుండి మనం తప్పించు కోగలి గాము. ఒకే రకమైన రష్యన్ రక్షణ ఒప్పందాలకు అమెరికా పదే పదే మినహాయింపులు ఇవ్వకపోవచ్చు. కానీ చైనా, పాకిస్తాన్‌ల నుండి పొంచి ఉన్న ద్విముఖ ముప్పును ఎదుర్కోవడానికి ఎస్-500 వంటి ఐదవ తరం వ్యవస్థ అత్యంత అవసరమని భావిస్తే, అమెరికా ఒత్తిళ్లను అధిగమించి ముందుకు సాగేందుకు మనదేశం వెనకాడదు.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.