శ్రీనగర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత దాల్ సరస్సు ఇటీవల సినిమా హాలును తలపించింది. ఇందులో జమ్మూకశ్మీర్‌లో మొట్టమొదటిసారిగా జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రధాన భూమిక పోషించింది. ఇది లోయలో మునుపెన్నడూ లేని విధంగా ఒక వినూత్న చలనచిత్ర అనుభూతిని అందించింది.
షేర్-ఎ – కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో, సరస్సు ప్రశాంత జలాలపై ఒక పెద్ద తేలియాడే తెరను (floating screen) నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేకమైన బహిరంగ థియేటర్‌లో, ప్రేక్షకులు ‘షికారా’ పడవల్లో కూర్చుని సినిమాలు చూశారు. తద్వారా ఆ సరస్సు ఒక సినిమా హాలుగా మారిపోయింది. ఈ అనుభవం కేవలం సినిమాలు చూసే ఒక కొత్త పద్ధతి మాత్రమే కాదు. ఇది హిందీ సినిమాతో కశ్మీర్‌కు ఉన్న సుదీర్ఘమైన, బలమైన అనుబంధాన్ని కూడా గుర్తుచేసింది. చుట్టూ నీరు ఉండగా, క్లాసిక్ సినిమాల్లోని సుపరిచితమైన పాటలు, సన్నివేశాలను చూస్తున్నప్పుడు, ఆ వాతావరణం ఒక ప్రత్యేకమైన మ్యాజిక్‌ను సృష్టిస్తోంది. 1961 నాటి అద్భుతమైన చిత్రం ‘జంగ్లీ’ ప్రదర్శనతో ఈ ఉత్సవం సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైంది. సరస్సు ఒడ్డున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు; నీటిపై మెరుస్తున్న ఆ తెర, దానికి నేపథ్యంగా నిలిచిన హౌస్‌బోట్లు అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించాయి. సెప్టెంబర్ 8వ తేదీన ‘అర్జున’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన షమ్మీ కపూర్, షర్మిలా ఠాగూర్ నటించిన ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ చిత్రం ‘కశ్మీర్ కీ కలి’ ప్రదర్శితమైంది. తరతరాలుగా ఆదరణ పొందుతున్న దీని పాటలు, సంగీతం, దాల్ సరస్సు నేపథ్యంలో మరింత కొత్త అందాన్ని సంతరించుకున్నట్లు అనిపించాయి. ఉత్సవం చివరి రోజైన సెప్టెంబర్ 10న, యశ్ చోప్రా రూపొందించిన చిరస్మరణీయ చిత్రం ‘కభీ కభీ’ ప్రదర్శితమైంది.
కశ్మీర్‌తో ఉన్న గాఢమైన అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాలను జాగ్రత్తగా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా, ఈ లోయలో ఎన్నో విజయవంతమైన హిందీ చిత్రాలను చిత్రీకరించారు. అలాగే, దాల్ సరస్సు, పెహల్గావ్ వంటి ప్రదేశాలు సినీ ప్రేక్షకుల స్మతి పథంపై చెరగని ముద్ర వేశాయి. ఈ తేలియాడే సినిమా (ఫ్లోటింగ్ సినిమా) ఆ అనుబంధానికి ఒక కొత్త కోణాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు కేవలం తెరపై కశ్మీర్‌ను చూడటమే కాకుండా, తరతరాలుగా చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిచ్చిన ప్రకృతి సౌందర్యం మధ్య ఉంటూ సినిమాను ఆస్వాదించారు. కానీ ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఉద్దేశ్యం కేవలం వినోదానికి పరిమితం కాదు. జమ్మూకశ్మీర్‌ను ప్రపంచానికి ఒక విభిన్న కోణంలో పరిచయం చేయడమే దీని లక్ష్యం.
కశ్మీర్‌ను ప్రకృతి సౌందర్యానికి అతీతంగా చూడాల్సిన అవసరాన్ని ఈ ఉత్సవానికి హాజరైన పలువురు చిత్రనిర్మాతలు కళాకారులు ప్రధానంగా ప్రస్తావించారు. అక్కడి ప్రజల కథలు, సంప్రదాయాలు, స్థానిక సంస్కృతిని తెరపైకి తీసుకురావాలని సూచించారు. దాల్ సరస్సులో సినిమా చూడటం స్థానికుడైన అనిల్ కౌల్‌కు ముందెన్నడూ పొందని అనుభవాన్ని ఇచ్చింది. “నేను నా జీవితంలో ఎన్నో సినిమాలు చూశాను. కానీ దాల్ సరస్సు దగ్గర, చుట్టూ నీటితో నిండిన ప్రదేశంలో కూర్చుని సినిమా చూడటం పూర్తిగా భిన్నమైన అనుభవం,” అని ఆయన అన్నారు. సినిమా అనుభవంలో ఆ సరస్సు ఒక అంతర్భాగంగా మారిందని కూడా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పర్యాటక రంగానికి కూడా ఊపునిస్తాయని మరో స్థానికుడు సందీప్ ధర్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ప్రజలు షికారా సవారీల కోసం దాల్ సరస్సుకు వస్తారని, కానీ ఈసారి ఆ సరస్సే ఒక సినిమా హాల్‌గా మారిందని, ఈ భావనను కశ్మీరీ కుటుంబాలు, యువత ఒకేలా ఆస్వాదించారని చెప్పారు.
సరస్సు చుట్టూ ఉన్న పర్వతాలు, హౌస్‌బోట్లు సాయంత్రం వేళ విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ, చలనచిత్ర ప్రదర్శనలకు అద్భుతమైన నేపథ్యాన్ని కల్పించాయి. 41 దేశాల నుండి 135 చిత్రాలతో కూడిన ఈ ఉత్సవం అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సంతరించుకుంది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే కాకుండా, స్థానిక ప్రజలతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరిచింది. ఈ లోయ చరిత్రలో, ఒక అంతర్జాతీయ చలనచిత్రోత్సవం బహిరంగ ప్రదేశంలో ప్రేక్షకులకు సినిమాలను అందించడం ఇదే మొదటిసారి.సినిమా సాంప్రదాయ ఆడిటోరియంల పరిధిని దాటి నేరుగా ప్రజల వద్దకు చేరింది. సాధారణంగా పర్యాటకం విహారయాత్రలతో ముడిపడి ఉండే ‘షికారాలు’ (పడవలు) సినిమా సీట్లుగా మారాయి. కళ, కశ్మీర్ ప్రకృతి సౌందర్యం ఎంత సహజంగా కలిసిపోగలవో ఇది నిరూపించింది. ఈ కార్యక్రమం కేవలం వరుస సినిమా ప్రదర్శనలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది సినిమాతో కశ్మీర్‌కు ఉన్న చిరకాల అనుబంధానికి, దాని గొప్ప సాంస్కృతిక వైభవానికి ఒక వేడుకగా నిలిచింది. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న ఆ తేలియాడే తెర దాని ముందు గుమిగూడిన షికారాల వరుస దృశ్యం వీక్షించిన వారి జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దాల్ సరస్సు కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని మరోసారి రుజువైంది. అది ఒక సజీవ గాథగా మిగిలిపోతుంది. సినిమా, సంస్కృతి, సృజనాత్మ కతలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన వేదికగా వెలిగిపోతుంది.