తరతరాలుగా, భారతీయులు జమ్మూ కశ్మీర్‌ను తొలిసారిగా వెండితెర ద్వారానే చూశారు. దాల్ సరస్సుపై నెమ్మదిగా కదిలే షికారాలు, మంచును కప్పుకున్న పర్వతాలు, రంగురంగుల కశ్మీరీ వస్త్రధారణ, గుల్మార్గ్, పెహల్గావ్‌లోని పచ్చిక బయళ్లు, ఉత్కంఠభరితమైన హిమాలయ ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించిన పాటలు భారతదేశ సామూహిక సినిమా స్మృతిలో భాగమయ్యాయి. హిందీ సినిమాలలో సుందరమైన విదేశీ ప్రాంతాలు సర్వసాధారణం కాకముందే, చిత్రనిర్మాతలకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా కశ్మీర్ ఉండేది. భారతీయ సినిమాలోని కొన్ని చిరస్మరణీయమైన పాటలు, చిత్రాలకు ఈ లోయ నేపథ్యంగా నిలిచింది. అయితే, 1990వ దశకంలో తీవ్రవాదం కారణంగా కశ్మీర్‌కు, సినిమాకు మధ్య ఉన్న ఈ సంబంధం తీవ్రంగా దెబ్బతింది. సినిమా హాళ్లను మూసివేశారు. థియేటర్లపై దాడులు చేసి బెదిరించారు. చిత్రసీమకు చెందిన నిర్మాణ బృందాలు క్రమంగా లోయకు రావడం మానేశాయి. ఈ చారిత్రక నేపథ్యంలో, 2026 సెప్టెంబర్ 7 నుండి 10 వరకు మొట్టమొదటసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆధునిక చిత్రాల చరిత్ర కంటే చాలా ముందుగానే కథ చెప్పడంలోనూ, నాటకరంగంతోనూ ఈ గడ్డకు అత్యంత పురాతన సంబంధం ఉంది. జమ్మూకర్‌కు సినిమాను తిరిగి తీసుకురావడంలో నాలుగు రోజుల చలనచిత్రోత్సవం మార్గదర్శిగా నిలిచింది.
కశ్మీర్‌లో కథాకథనం, ప్రదర్శన కళల ప్రాభవం సినిమా రాకతోనే మొదలైనది కాదు. రుషి కశ్యపునితో కశ్మీర్ నాగరికతా చరిత్ర సంప్రదాయబద్ధంగా ముడిపడి ఉంది. సతీదేవితో సంబంధం ఉన్న ‘సతీసర’ అనే పురాతన సరస్సు నుండే కశ్మీర్ ఆవిర్భ వించిందని ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయాలు పేర్కొంటాయి. కశ్మీర్ లోయను నివాసయోగ్యంగా మార్చడంలో రుషి కశ్యపుడు కీలక పాత్ర పోషించారు. కాలక్రమేణా, భారతీయ నాగరికతా సంప్రదాయంలో విద్య, తత్వశాస్త్రం, సాహిత్యాలకు సంబంధించిన ప్రధాన కేంద్రాలలో ఒకటిగా కశ్మీర్ విరాజిల్లింది.భారతదేశ మేధో, సాంస్కృతిక చరిత్రకు ఈ లోయ అందించిన సహకారంలో నాటకరంగానికి కూడా ఒక ముఖ్యమైన సంబంధం ఉంది. భరతముని రచించిన ‘నాట్యశాస్త్రం’ భారతీయ నాటకం, రంగస్థల కళ, నృత్యం, సంగీతాలకు సంబంధించిన ప్రాథమిక గ్రంథాలలో ఒకటిగా పేరొందింది. ఈ వారసత్వాన్ని పరిరక్షించడంలో, దానిని విశ్లేషించడంలో, విస్తరించడంలో కశ్మీర్ కీలక పాత్ర పోషించింది. ఈ సంప్రదాయానికి చెందిన గొప్ప పండితులలో అభినవగుప్తుడు ఒకరు. నాట్యశాస్త్రంపై అత్యంత ముఖ్యమైన వ్యాఖ్యానాలలో ఒకటైన ‘అభినవభారతి’ని ఆయన రచించారు. ఈ కోణంలో చూసినప్పుడు కశ్మీర్ కేవలం తర్వాతి కాలంలో చిత్రనిర్మాతలను ఆకర్షించిన సహజ సౌందర్య భూమి మాత్రమే కాదు. నాటకం, ప్రదర్శన, కళాత్మక వ్యక్తీకరణను అర్థం చేసుకునే భారతదేశపు సుదీర్ఘ మేధో సంప్రదాయంలో ఇది ఒక ముఖ్యమైన కేంద్రం కూడా. జ్ఞానంతో కశ్మీర్‌కు ఉన్న అనుబంధం, భారత ఉపఖండంలో చారిత్రాత్మకంగా, ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా ఆవిర్భవించిన శారదా పీఠం వంటి సంస్థలలో కూడా ప్రతిబింబించింది. కెమెరాలు, సినిమా రాకకు శతాబ్దాల ముందే, కథ చెప్పడం, ప్రదర్శనకు సంబంధించిన మేధోపరమైన అవగాహనను ప్రపంచానికి కలిగించడంలో కశ్మీర్ తన వంతు సహకారాన్ని అందించింది. మనదేశంలో సినిమా రంగం ఆవిర్భవించినప్పుడు, సహజసిద్ధమైన కశ్మీర్ భౌగోళిక స్వరూపం చిత్రనిర్మాతలకు అత్యంత ఆకర్షణీయమైనదిగా సాక్షాత్కరించింది. స్టూడియోలో సులభంగా పునఃసృష్టించలేని ప్రకృతి
దృశ్యాలను ఈ లోయ అందించింది. దాల్ సరస్సు, దాని షికారాలు, శ్రీనగర్ తోటలు, గుల్మార్గ్‌లో మంచును కప్పుకున్న ఎగుడు, దిగుడు ప్రాంతాలు, సోనామార్గ్ పర్వతాలు, పెహల్గావ్ పచ్చిక బయళ్ళు త్వరలోనే దేశం నలుమూలలా సినీ ప్రేక్షకులకు సుపరిచిత మయ్యాయి. లక్షలాది మంది ప్రజలకు కశ్మీర్ ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంలో హిందీ సినిమా ప్రధాన పాత్ర పోషించింది. చాలామంది భారతీయులకు కశ్మీర్ మొదటి దృశ్యరూపం సినిమాల ద్వారానే లభించింది. ఈ లోయ ప్రేమ, సంగీతం, ప్రకృతి సౌందర్యానికి పర్యాయపదంగా మారింది. ‘జంగ్లీ’, ‘కాశ్మీర్ కి కలి’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ వంటి చిత్రాలు కశ్మీర్‌ను భారతదేశంలో అత్యంత సుపరిచితమైన సినిమా ప్రదేశాలలో ఒకటిగా మార్చాయి. మంచులో ఒక శృంగార గీతం, దాల్ సరస్సుపై ఒక షికారాలో ప్రయాణించడం లేదా కశ్మీర్ పచ్చిక బయళ్ళలో నటీనటులు నడవడం వంటివి ప్రేక్షకులను తక్షణమే ఆ లోయకు తీసుకువెళ్ళగలిగేవి. కశ్మీర్ భారతదేశపు “స్విట్జర్లాండ” అనే ప్రసిద్ధ నానుడి ఈ సినిమా కల్పనను ప్రతిబింబిస్తుంది. సినిమా నిర్మాణాల కోసం విదేశాలు సులభంగా అందుబాటులోకి రాకముందు, ఒకప్పటి భారతీయ చిత్రనిర్మాతలు, ప్రేక్షకుల తరానికి, అసలైన కలల గమ్యస్థానంగా కశ్మీర్ ఉండేది. కశ్మీర్‌ను కేవలం చిత్రీకరణ ప్రదేశంగా మాత్రమే ఉపయోగించలేదు. ఈ లోయ సినిమాల గుర్తింపులో ఒక భాగమైంది. దీనికి అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ ‘కశ్మీర్ కి కలి’ సినిమా. ప్రేక్షకుల మనసుల్లో ఒక చిత్రాన్ని సృష్టించడానికి కశ్మీర్ అనే పేరు మాత్రమే సరిపోయింది. షమ్మీ కపూర్ ,షర్మిలా ఠాగూర్ నటించిన ఈ చిత్రం లోయకు చెందిన అత్యంత చిరస్మరణీయ చలనచిత్ర చిత్రణలలో ఒకటిగా నిలిచింది. కాలంతో పాటు కశ్మీర్‌ను సినిమా చూపించే విధానం మారింది. తొలినాటి సినిమాలు కశ్మీర్‌ను ఎక్కువగా ప్రేమ, సంగీతం, ప్రకృతి సౌందర్యం ద్వారా చూపించాయి. తర్వాతి సినిమాలు ఉగ్రవాదం, భద్రత, 1990ల నాటి హిందువుల వలసలను ఎక్కువగా అన్వేషించాయి. కశ్మీర్‌కు, సినిమాకు మధ్య సంబంధం ఎంతగా పెరిగిపోయిందంటే, ఒక సందర్భంలో ఒక సినిమా ఒక భౌగోళిక ప్రదేశానికి ప్రజాదరణ పొందిన గుర్తింపును ఇచ్చింది. పెహల్గావ్ సమీపంలోని ప్రసిద్ధ బేతాబ్ లోయకు, 1983లో అక్కడ చిత్రీకరణ జరుపుకున్న హిందీ చిత్రం ‘బేతాబ’ పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. ఈ చిత్రంలో సన్నీడియోల్, అమృతాసింగ్ నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సుందరమైన పచ్చిక బయళ్లను హజన్ లోయ అని పిలిచేవారు. దీనికి హగన్ లోయ అని మరో పేరు కూడా ఉంది. ‘బేతాబ’ విడుదల తర్వాత, ఈ ప్రదేశం ‘బేతాబ్ వ్యాలీ’గా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా పెహల్గావ్‌లో పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ప్రాంతాలలో ఒకటిగా ఇది అవతరించింది. కశ్మీర్ ప్రకృతి సౌందర్యానికి, సినిమాకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి బేతాబ్ వ్యాలీ ఒక నిదర్శనంగా నిలుస్తుంది. కశ్మీర్‌తో సంబంధం ఒక్క బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిత్రనిర్మాతలు, గాయకులు, కళాకారులు ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని కెమెరా కన్నుతో చూశారు. అద్భుతమైన దృశ్యకావ్యాలను వెండితెరపై వెలిగించారు. పంజాబీ సినిమా, పంజాబీ మ్యూజిక్ వీడియోలు కూడా కశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకున్నాయి. మంచును కప్పుకున్న పర్వతాలు, హిమాలయాల గుండా వెళ్లే రహదారులు, పచ్చిక బయళ్లు, సరస్సులు పాటలకు, చిత్రాలకు దృశ్యపరమైన నేపథ్యాన్ని అందించాయి. సినిమాతో కశ్మీర్‌కు సంబంధం కేవలం సినిమా షూటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ లోయలో సినిమా చూసే సంస్కృతి కూడా ఉండేది. శ్రీనగర్‌లో అనేక సినిమా హాళ్లు ఉండేవి. స్థానికులు క్రమం తప్పకుండా సినిమాలు చూసేవారు. సినిమాకు వెళ్లడం అనేది ఆ నగరపు సామాజిక, సాంస్కృతిక జీవనంలో ఒక భాగంగా ఉండేది. 1980ల చివరలో ఉగ్రవాదం పెరగడంతో ఇది నాటకీయంగా మారిపోయింది. ఉగ్రవాదం తీవ్రతరం కావడంతో, సినిమా హాళ్లు బెదిరింపులు ,దాడులను ఎక్కువగా ఎదుర్కొన్నాయి. తీవ్రవాద సంస్థలు సినిమా ప్రదర్శనలను వ్యతిరేకించాయి. ఇది థియేటర్లను నడపడాన్ని మరింత కష్టతరం చేసింది. 1990 నాటికి, లోయ అంతటా సినిమా హాళ్లు మూతపడ్డాయి. థియేటర్లలో సినిమాలు చూస్తూ పెరిగిన తరానికి, సినిమా హాళ్లు కనుమరుగవ్వడం ఒక పెద్ద సాంస్కృతిక విఘాతంగా మారింది.
సెప్టెంబర్ 24, 1999న, శ్రీనగర్‌లోని రీగల్ సినిమా తిరిగి తెరిచిన మొదటి రోజే, దాని తొలి షోపై గ్రెనేడ్‌తో దాడి జరిగింది. ఈ పేలుడులో ఒక పౌరుడు మరణించగా, సుమారు 12 మంది గాయపడ్డారు. దీంతో కశ్మీర్ లోయలో సినిమా థియేటర్లను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఉగ్రవాదం ప్రభావం సినీ పరిశ్రమపై కూడా స్పష్టంగా కనిపించింది. పరిస్థితి దిగజారడంతో, కశ్మీర్‌లో భారీస్థాయి షూటింగ్‌లు నిర్వహించడం చిత్రనిర్మాతలకు మరింత కష్టమైంది. నిర్మాణ బృందాలు క్రమంగా విదేశాలు సహా ఇతర ప్రదేశాలకు తరలివెళ్లాయి. సినిమాలలో కశ్మీర్ కనిపిస్తూనే ఉన్నప్పటికీ, వాస్తవ చిత్రీకరణ మాత్రం క్రమంగా ఇతర ప్రాంతాలలో జరిగింది. దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణలలో ఒకటిగా ‘రోజా’ సినిమా నిలిచింది. ఈ చిత్ర కథ కశ్మీర్‌తో, అక్కడి పరిస్థితులతో ముడిపడి ఉంది. అయితే, అక్కడి పరిస్థితుల కారణంగా కశ్మీర్‌లో చిత్రీకరణ కష్టమైంది. అందువల్ల అవసరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇతర ప్రదేశాలను ఉపయోగించారు. ఇది ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబించింది. భారతీయ చిత్రనిర్మాతల ఊహలలో కశ్మీర్ ఇంకా ఉన్నప్పటికీ, ఆ లోయ మాత్రం సాధారణ షూటింగ్ ప్రదేశంగా అందుబాటులో లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రేమ గీతాలకు, అవుట్‌డోర్ షూట్‌లకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం, క్రమంగా ఉగ్రవాద కథలతో ముడిపడిపోయింది. ఉగ్రవాదం పెరగడంతో, పర్యాటకం కూడా దెబ్బతింది. బహిరంగ ప్రదేశాలు ముప్పునకు గురయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారతదేశంలోని కొన్ని అతిపెద్ద చిత్ర నిర్మాణాలకు ఆతిథ్యం ఇచ్చిన అదే ప్రాంతంలో, చిత్రనిర్మాతలు, సినిమా ప్రదర్శకులు కార్యకలాపాలు నిర్వహించడం క్రమంగా మరింత కష్టంగా మారింది.జమ్మూ కశ్మీర్‌తో సినిమాకు ఉన్న సాంస్కృతిక అనుబంధం కేవలం లోయకే పరిమితం కాలేదు. జమ్మూకు చెందిన ధార్మికమైన, సాంస్కృతికపరమైన ప్రాంతాలు భారతీయ చలన చిత్రాలలో, జనాదరణ పొందిన నేపథ్య గాన సంగీతంలో కూడా ప్రాతినిధ్యం పొందాయి. మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం దశాబ్దాలుగా అనేక భక్తి చిత్రాలకు, భజనలకు, పాటలకు, వీడియో నిర్మాణాలకు స్ఫూర్తినిచ్చింది. ధార్మికపరమైన, జనాదరణ పొందిన దృశ్య, శ్రవణ మాధ్యమంతో కూడుకున్న సంస్కృతి ద్వారా తీర్థ యాత్ర, జమ్మూ ప్రాంతపు విస్తృతమైన ప్రకృతి సౌందర్యం ప్రేక్షకులకు సుపరిచితమయ్యాయి. ఈ విధంగా, కశ్మీర్‌లో మంచును కప్పుకున్న పర్వతాలు, సరస్సులు, పచ్చిక బయళ్ళు జనాదరణ పొందిన ప్రేమకథా చిత్రాలకు పర్యాయపదంగా మారగా, భారతీయ ధార్మిక సంస్కృతితో తనదైన అనుబంధాన్ని జమ్మూ పెంచుకుంది. ఈ విభిన్న ప్రకృతి దృశ్యాలు, సంప్రదాయాలు కలిసి జమ్మూకశ్మీర్‌ను చిత్రనిర్మాతలకు, కథకులకు ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా మార్చాయి. ఆగస్టు, 2019లో ఆర్టికల్ 35-ఎ రద్దు, ఆర్టికల్ 370 సవరణ తర్వాత, ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు. చలనచిత్ర షూటింగ్‌లను ప్రోత్సహించడం, చిత్ర పరిశ్రమకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం విధానాలను ప్రవేశపెట్టింది. క్రమంగా, చిత్ర నిర్మాణ బృందాలు తిరిగి రావడం ప్రారంభించాయి. 2022లో శ్రీనగర్‌లో ఒక మల్టీప్లెక్స్ ప్రారంభం కావడంతో, అక్కడ తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. సినిమా ప్రదర్శనల పునరుద్ధరణలో ఈ పరిణామం ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. అదే సమయంలో, మరెక్కడో చిత్రీకరించి దాన్ని సినిమాలలో జమ్మూ కశ్మీర్‌గా చూపించే సినిమా సంస్కృతికి తెరపడింది. అసలు సిసలు జమ్మూ కశ్మీర్‌ను భారతీయులు వెండితెరపై చూడటం ప్రారంభించారు. మళ్లీ సినిమా షూటింగ్‌లతో ఈ ప్రాంతంగా కళకళలాడసాగింది. చిత్ర నిర్మాణ బృందాలు ఈ లోయకు తిరిగి రాసాగాయి.ఈ చారిత్రక నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో, 1,100కు పైగా అంతర్జాతీయ దరఖాస్తుల నుండి ఎంపిక చేసిన 41 దేశాలకు చెందిన 135 చలనచిత్రాలను నిర్వాహకులు ప్రదర్శించారు. సుందరమైన షేర్-ఇ-కశ్మీర్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ ఉత్సవం, స్థానిక చలనచిత్ర సంస్కృతిని పునరుద్ధరించడం, యువతకు సాధికారత కల్పించడం , పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ, విదేశాలకు చెందిన చిత్రనిర్మాతలు, కళాకారులు, సినిమా ప్రియులు, ప్రేక్షకులను కూడా ఒకచోట చేర్చింది. ప్రదర్శనలు, చర్చల ద్వారా, ఇది ఫీచర్ సినిమాలు, డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు సహా వివిధ రకాల సినిమాలకు ఒక వేదికను అందించింది. దాల్ సరస్సుపై ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన తేలియాడే సినిమా థియేటర్ ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా ప్రేక్షకులు సాంప్రదాయ షికారాల నుండి ప్రదర్శనలను వీక్షించారు. స్థానిక చిత్రనిర్మాతలకు, యువ కళాకారులకు ఈ ప్రాంతం వెలుపలి చిత్రనిర్మాతలు, సినిమా సంప్రదాయాలతో మమేకమై, జమ్మూ కశ్మీర్ సొంత కథలను విస్తృత సినిమా చర్చలోకి తీసుకు రావడానికి ఒక అవకాశాన్ని కూడా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం కల్పించింది. దశాబ్దాలుగా, భారతీయ సినిమాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలలో ఒకటిగా కశ్మీర్ ఉండేది. ఆ తర్వాత ఒకానొక కాలంలో ఉగ్రవాదం సినిమా హాళ్లను మూసివేసి, చిత్రనిర్మాతలను లోయ నుండి వెళ్ళిపోయేలా చేసింది. నేడు సినిమా హాళ్లు తిరిగి తెరుచుకున్నాయి. సినిమాలు మళ్లీ ప్రదర్శిత మవుతున్నాయి. నిర్మాణ సంస్థలు క్రమంగా తిరిగి వస్తున్నాయి. ఈ పునరుజ్జీవనానికి మరో కోణాన్ని ఇటీవలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జోడించింది. సుదీర్ఘమైన జమÖ్మకశ్మీర్ సినీ ప్రస్థానంలో మరో మైలు రాయిగా నిలిచింది.
సినిమాకు నవోదయం
జమ్మూ కశ్మీర్ మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి తెరపడింది, కానీ అసలు కథ చప్పట్ల తర్వాతే మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు, సినిమా శ్రీనగర్‌ను సృజనాత్మకత, సంస్కృతి, భావజాలల సంగమ స్థలంగా మార్చింది. ఈ ఉత్సవం వినోదం మాత్రమే కాదు.ఇది ఒక సాంస్కృతిక ఆత్మవిశ్వాస ప్రకటన. ప్రతిభ, అవకాశం, దార్శనికత ఒకచోట కలిసినప్పుడు ఏమి జరగగలదో ఈ తొలి ఉత్సవం నిరూపించింది. ఒక చలన చిత్రోత్సవాన్ని కేవలం ప్రదర్శించిన చిత్రాల సంఖ్యతోనో లేదా హాజరైన ప్రముఖుల సంఖ్యతోనో అంచనా వేయలేము. కశ్మీర్‌కు చెందిన యువ చిత్రనిర్మాతకు ప్రోత్సాహం లభిస్తుందా? స్థానిక రచయితకు విస్తృత ప్రేక్షకాదరణ లభిస్తుందా? స్థానిక వర్ధమాన నటుడు సినిమాను ఒక ఆచరణీయమైన వృత్తిగా గుర్తిస్తాడా? ఇక్కడి మబ్బులో, మంచులో, మట్టిలో నుంచి సహజంగా పుట్టుకొచ్చిన కథలు ఇక్కడి పర్వతాలను దాటి ఆవలి ప్రపంచానికి చేరుకుంటాయా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంపైనే చిత్రోత్సవం నిజమైన విజయం ఆధారపడి ఉంటుంది. జమ్మూ కశ్మీర్ గురించిన దృక్పథాన్ని పునఃరూపకల్పన చేయడానికి కూడా ఈ ఉత్సవం ఒక అవకాశాన్ని అందిస్తుంది. దశాబ్దాలుగా, ఈ ప్రాంతాన్ని తరచుగా సంఘర్షణ అనే సంకుచిత దృక్కోణంతోనే చూశారు. జమÖ్మకశ్మీర్‌కు మాత్రమే పరిమితమైన మానవీయ కథలు, సాంస్కృతిక వైవిధ్యం, హాస్యం, సంగీతం, స్వప్నాలను వెండితెరపై ప్రదర్శించగల సినిమా ఈ ప్రాంతానికి మరింత సూక్ష్మమైన దృక్కోణాన్ని అందిస్తుంది. కశ్మీర్‌ను కేవలం ఒక ప్రదేశంగా కాకుండా, గొప్ప సృజనాత్మక ఆత్మ కలిగిన ఒక సజీవ సమాజంగా ప్రపంచం చూడటానికి ఇది వీలు కల్పిస్తుంది. కానీ ఈ ఉత్సవం ఒక్కసారి జరిగే వేడుకగా మిగిలిపోకూడదు. అసలైన సవాలు దానిని కొనసాగించడంలోనే ఉంటుంది. జమ్మూకశ్మీర్‌కు పటిష్టమైన చలనచిత్ర మౌలిక సదుపాయాలు, శిక్షణా సంస్థలు, నిర్మాణ మద్దతు, చిత్రనిర్మాతలకు ప్రోత్సాహకాలు, స్థానిక ప్రతిభ అభివృద్ధి, నిరంతర సాంస్కృతిక మార్పిడులు అవసరం. చలన చిత్రోత్స వాలు స్థానికులకు ఏడాదికి ఒకసారి అవకాశాలు కల్పించే వేదికలుగా అవతరించాలి. దీనికి సంబంధించిన ద్వారాన్ని ఇటీవలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం తెరిచి ఉంచింది. అలా తెరుచు కున్న తలుపు మÖతపడుకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇకపై జమ్మూకశ్మీర్ పై ఉంటుంది. అలాంటి ఒక బాధ్యతను దూరదృష్టితో, నిలకడతో నిర్వర్తిస్తే, సినిమా కేవలం ఒక సాంస్కృతిక వారధిగానే కాకుండా, ఉపాధి, పర్యాటకం, అంతర్జాతీయ గుర్తింపునకు మూలంగా కూడా మారగలదు. ఉత్సవం ముగిసింది. కానీ జమ్మూకశ్మీర్ చలనచిత్ర ప్రస్థానం ఇప్పుడే మొదలైంది.
శాంతికి మార్గం సుగమం
అంతర్జాతీయ జమ్మూకశ్మీర్ చలనచిత్రోత్సవం సినిమా వేడుక మాత్రమే కాదు. అది శాంతి, పర్యాటకం, సంస్కృతి, ఐక్యత, అభివృద్ధిని ఆకాంక్షించే స్థానికుల వేడుక. ఈ ఉత్సవం మొత్తం కేంద్రపాలిత ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. ఇది భారత దేశానికి, ప్రపంచానికి నూతనమైన, ఆత్మవిశ్వాసంతో కూడుకున్న జమ్మూకశ్మీర్‌ను పరిచయం చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా మారింది. దశాబ్దాలుగా, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదం ఇక్కడ శాంతికి భంగం కలిగించడానికి, వర్గాలను విభజించడానికి, ఈ ప్రాంతపు సామాజిక, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నించాయి. భయాన్ని సృష్టించడా నికి, కశ్మీర్ వక్రీకరించిన చిత్రాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడానికి వేర్పాటు వాదులు దుష్ప్రచారం చేశారు. కానీ ఇక్కడ ప్రజల ఎంపిక స్పష్టంగా ఉంది. వారు శాంతి, అభివృద్ధి, విద్య, ఉపాధి, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి ,తమ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటున్నారే తప్ప హింస, అతివాదం, ఉగ్రవాదాన్ని కాదు. పర్యాటకం, సాంస్కృతిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడం ఆ దిశగా మార్పునకు స్పష్టమైన సంకేతాలలో ఒకటిగా నిలిచింది. భారతదేశం నలుమూలల నుండి, విదేశాల నుండి వచ్చే సందర్శకులు కశ్మీర్ సౌందర్యాన్ని, ఆతిథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకుంటున్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రజలు ఆస్వాదిస్తు న్నారు. విద్య, ఉపాధి, సాధికారత కార్యక్రమాలలో మహిళలు ఎక్కువగా పాల్గొంటు న్నారు. క్రీడలు, వ్యవస్థాపకత, నైపుణ్యాభి వృద్ధి ద్వారా యువతీయువకులు కొత్త అవకాశాలను పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాల్సిన నవ కశ్మీర్ ఇది. పాకిస్తాన్ ప్రేరేపిత ప్రచారం, తీవ్రవాదం, అతివాదం, ఉగ్రవాదాన్ని తిరస్కరించడం ద్వారా జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా ఒక బలమైన సందేశాన్ని పంపారు. వారు హింస, ద్వేషానికి బదులుగా శాంతి, పురోగతి మార్గాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం విజయవంతం కావడం వారి ఎంపికను బలపరిం చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మహేష్ ధూళిపాళ్ళ