సకల సౌభాగ్యాలకు అధిష్ఠాన దేవత మహాలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించే విశిష్ట పర్వదినం వరలక్షీ వ్రతం. ఇది, ఒకే పూజతో అష్టలక్ష్ముల అనుగ్రహం పొందే వ్రతరాజంగా ప్రసిద్ధమైంది. శ్రావణ శుక్రవారాలకు మకుటాయమానం. శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని ‘వ్రతరత్నాకరం’ పేర్కొంటోంది. ఆనాడు చిన్నపెద్ద, ధనికపేద భేదం లేకుండా ముత్తయిదువలు శక్తికొద్దీ అత్యంత భక్తిభావనతో ఈ వ్రతం చేసుకుంటారు.
శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలను పరమపవిత్రమైనవిగా భావిస్తారు. కన్యలు, కొత్తగా పెళ్లయిన వారు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరమట. అందులోనూ శ్రావణ శుక్రవారాలంటే మరింత ఇష్టమట. అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికిన వేళ శుక్రవారం నాడు అవతరించిన అమ్మవారిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది.
‘వరం’ అంటే శ్రేష్ఠమైన, ‘లక్ష్మి’ అంటే సకల శుభలక్షణాలుగల దేవత. ఆమె కరుణా కటాక్షాలతోనే సకల శుభాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. వాక్కు, సంపద, మంగళానికి అధిష్ఠానదేవతలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి విడదీయలేని, విడదీయరాని దివ్య శక్తులు. వారి సమ్మిళత శక్తి స్వరూపం వరలక్ష్మి వ్రతం బహుళార్ధ సాధకమని సూత మహర్షుల వంటి వారి ఉపదేశం.
స్త్రీ సౌభాగ్య, సంతానాభివృద్ధిని కాంక్షించిన పార్వతీదేవి, వాటి సుస్థిరత మార్గం ఉపదేశించ వలసిందిగా, పతి పరమేశ్వరుడిని ప్రార్థించగా, ఆయన వరలక్ష్మీ వ్రతాన్ని ప్రబోధించాడని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. నాటి మగధ రాజ్యంలోని కుండినంబి అనే పట్టణంలో చారుమతి అనే గృహిణి ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందిందని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. చారుమతి (మంచి బుద్ధి కలది) పేరకు తగినట్లే, నిర్మల స్వభావు రాలు. కుటుంబంపై అపార ప్రేమకలిగి, నిరంతరం లక్ష్మీదేవి నామస్మరణలో ఉండేది. శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరించే వారికి ప్రసన్నురాలనవుతానని అమ్మవారు ఆమెకు కలలో కనిపించి ఆశీర్వదిం చిందని, ఆమె కుటుంబ పెద్దలను సంప్రదించి, వారి ఆమోదంతో సాటి మహిళలతో వ్రతం ఆచరించినట్లు వ్రతకథ వివరిస్తోంది. అమ్మవారి ఆనతి మేరకు చారుమతి తోటి ముత్తయిదువులతో కలసి శ్రద్ధా భక్తులతో పూజించి, ఆత్మప్రదక్షిణకు ఉపక్రమించింది. మÖడు ప్రదక్షిణలకుగాను వారికి వరుసగా, బంగారు గజ్జెలు, హస్తకంకణాలు సహా సర్వాభరణాలూ లభించాయట. అడగకుండానే ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ‘అమ్మ’ను నిరంతరం పూజించాలన్న ఆకాంక్షే ‘వ్రతం’గా మారిందనీ అంటారు. ధనం, ధాన్యం, సౌభాగ్యం, సంతానం, కీర్తి, ఆయుష్షు లాంటి సకల సంపదలు లక్ష్మీదేవి ప్రతిరూపాలు. వాటిని సుస్థిరంగా కొనసాగించాలన్న తమ ఆకాంక్షలను వరలక్ష్మి అమ్మవారు సాకారం చేస్తారని స్త్రీ మూర్తుల విశ్వాసం.
‘వరలక్ష్మిని ఒక్కసారి పూజించడమే కాదు… జీవితాంతం వ్రతం ఆచరిస్తూనే ఉంటాను’ అని తొలిపూజనాడు చేసే ప్రమాణం కారణంగానే వరలక్ష్మీ ‘పూజ’ వరలక్ష్మీ ‘వ్రతం’గా మారిందని చెబుతారు.
వ్రతవిధానం
ఈ వ్రతం అమ్మవారి ధ్యాన ఆవాహనలతో ప్రారంభమై షోడశోపచార పూజ,అంగపూజ, అష్టోత్తరశత/సహస్ర) నామాలతో కొనసాగి, వ్రతకథతో పరిసమాప్తమవుతుంది. ఇది వ్రతం కనుక శాశ్వత విగ్రహం కాకుండా, పాత్ర (బిందె/కలశం) మీద కొబ్బరికాయను పెట్టి, ఆసీనురాలైన లక్ష్మీదేవిలా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. గణపతి /విష్వక్సేను లను పంచోపచారాలతో (స్నానం, అర్చన, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం) అర్చించి, అమ్మవారిని ఆ కలశంలోకి విధివిధా నాలతో అవాహనం చేస్తారు. సప్తమాతృకలను పూజిస్తూ (కౌమారి పూజ)వారిలో ఒకరైన స్కందమాతను ప్రధానంగా అర్చిస్తారు. వ్రతకర్తలు ముత్తయిదు వులకు…
‘ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ!
ఇందిరా తారికా ద్వాభ్యామ్ ఇందిరాయై నమో నమః’
(తోటి ముత్తయిదువా! ఈ వ్రత పరిసమాప్తితో మనిద్దరం లక్ష్ములమే. మనందరిలోనూ, మన చేతి తోరాల్లోనూ లక్ష్మి ఉందని గ్రహించాను. లక్ష్మీ స్వరూపిణీవై దీనిని స్వీకరించు) అని వాయనం ఇస్తారు. ఆషాఢంలో పుట్టినింట ఉండే నవవధువులు శ్రావణం ప్రవేశించాక, మొదటి మంగళవారం నోము పుట్టింటనే జరుపుకుని మెట్టినింట వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దీర్గ సుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వసిస్తారు.
కోరికలు తీర్చే సర్వభీష్టప్రదాయిని వరలక్ష్మీదేవి. అయితే ఆమె కరుణా కటాక్షాలు ఆయా వ్యక్తుల తీరుతెన్నులపై ఆధారపడి ఉంటాయట. సదాచారాపరాయణత, స్త్రీలు మన్ననలు అందుకునే చోటు, కన్నవారిని గౌరవించడం, బంధుప్రీతి, శుచీశుభ్రత పాటించడం, తులసీ తదితర మంగళకర వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, సర్వ దేవతలను అర్చించే స్వరం, ఆనందం, ఉత్సాహం, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలన వంటి లక్షణాలు కల ప్రదేశాలలో అమ్మవారు నివసిస్తారట.
‘సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణీ నమోస్తుతే’

– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్